30, డిసెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4294

31-12-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చంద్రుఁ డుదయింప వికసించె సారసములు”
(లేదా...)
“శశి యుదయింప విచ్చుకొనె సారసముల్ ముకుళించెఁ గల్వలున్”

13 కామెంట్‌లు:


  1. విరహమందున కాగెడు వేళ సతికి
    ధవుని గాంచినయంత సంతసము నందు
    కనులలో కాంతి విరియగ కాంతు డనియె
    చంద్రుడుదయింప వికసించె సారసములు.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    ప్రకృతి మాతనుదుట బొట్టు వలెనమరఁగ
    సృష్టి చైతన్యమందంగ పుష్టినిడఁగ
    తూర్పుఱేడట పొడజూపి, తొలఁగ నింగిఁ
    జంద్రు, డుదయింప వికసించె సారసములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      ప్రశమనమందియున్ ప్రకృతి, పక్షులు రావములాలపింపఁగన్
      కుశలములందజేయ భువిఁ కొక్కొరొకోయన కుక్కుటమ్ములున్
      నిశలను జీల్చు తేజమున నింగిన సూర్యుడు, వీడిపోవగన్
      శశి, యుదయింప విచ్చుకొనె సారసముల్ ముకుళించెఁ గల్వలున్!

      తొలగించండి
  3. ఆటవెలది
    ఉత్పలమ్ము*చంద్రుఁడుదయింప వికసించె,
    సారసములు *మోడ్చె సరసులందు
    మలయ మారుతములు మందముగా వీచ
    సాంద్రముగను పర్వెచంద్రికలును.

    రిప్లయితొలగించండి

  4. నిసియను తామసిన్ దునిమి నింగిని తూర్పున రక్తవర్ణుడై
    వసుధకు కాంతిపుంజముల పంచు నెపమ్మున ధాత్రిలో దివౌ
    కసముల పిల్పునందుకుని ఖాంకుడు వెన్నెలనీని క్రుంగగా
    శశి , యుదయింప విచ్చుకొనె సారసముల్, ముకుళించెఁ గల్వలున్.

    రిప్లయితొలగించండి
  5. కపిలుడస్తమించుట గని కలువలలరె
    చంద్రుఁ డుదయింప ; వికసించె సారసములు
    దగ నొసగు సూర్య తేజస్సు తగిలి యుండ
    మైత్రి నిలుపుకొన నిదియె మార్గదర్శి

    రిప్లయితొలగించండి
  6. కొలను లో నెల కొని యున్న కుముదతతులు
    చంద్రు డుదయింప విక సించె :సారస ములు
    రవి వికాసము గాంచియు రమ్య ముగను
    కాంతు లీనుచు వికసించె కమ్ర మగుచు

    రిప్లయితొలగించండి
  7. ముదము గూర్చుచు జనులకు పుడమియందు
    కుముదములువికసించెను కొలనులోన
    చంద్రుఁ డుదయింప, వికసించె సారసములు
    గగనమందున నుదయింప కాకవెలుగు

    రిప్లయితొలగించండి
  8. నిశిగడిచెన్ వియత్తలము నీరజబంధుని రాకకోసమై
    వెసనము నొందెనోయనగ వెన్నెల కాంతులు వీగిపోయె, నా
    కసమున నబ్జబాంధవుఁడు కాంతులు నింపుచు, గుంకుచుండగా
    శశి, యుదయింప విచ్చుకొనె సారసముల్ ముకుళించెఁ గల్వలున్

    రిప్లయితొలగించండి
  9. అత్రి కడగంటి చూపుల నలరి నట్టి
    చంద్రుఁ డుదయింప విరిసెఁ గజ్జలము లింక
    నదితి పట్టి మారీచ వంశాబ్ధి పూర్ణ
    చంద్రుఁ డుదయింప వికసించె సారసములు

    భృశ మనుమానమే కలుగఁ బెద్దలు కొందఱు జ్ఞాన వృద్ధులే
    నిశితపు బుద్ధి గ్రాహకుల నేర్పును నేర వచింతు రివ్విధిన్
    విశదమ యెల్ల వారలకుఁ బృథ్విని వింత నెఱుంగ మిందులో
    శశి యుదయింప విచ్చుకొనె, సారసముల్ ముకుళించెఁ, గల్వలున్

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి.
    కువలయము వికసించును కొలను లోన
    చంద్రుడుదయింప,వికసించె సారసములు
    పద్మ పాణి తూర్పు దెసన బయలు వెడల
    ప్రకృతి లోని వింతను జూచి పరవ శించ
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  11. చంద్రుఁ డుదయింప వికసించె సారసములు?
    వింత బలుకుల నింకనే వినగ లేను
    చంద్రుఁ డుదయింప ముకుళించు సారసములు
    సూర్యుఁడుదయింప వికసించు నార్య!గాదె!

    రిప్లయితొలగించండి
  12. నిశి పసరించె నబ్జములు నీటను వ్రాలె నినుండు గ్రుంకగా
    విశదముగాగ వెన్నెల కవేలములొప్పుగ విచ్చె నెచ్చుచున్
    శశి యుదయింప; విచ్చుకొనె సారసముల్ ముకుళించెఁ గల్వలున్
    నిశిత మయూఖ చేతనుడు నీరజ బంధుడు మించ ప్రాగ్దిశన్

    రిప్లయితొలగించండి