3, జనవరి 2024, బుధవారం

సమస్య - 4635

4-1-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము”
(లేదా...)
“వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో”

19 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
ఋషులు తపమాచరించియు విషయమెఱిగి
వాజ్ఞ్మయమున దైవజ్ఞత వల్లె వేయ
భక్తి భావనన్ బొడఁజూప పరమగురుడు
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము

(పరమగురుడున్ + ఆస్తికునకు)

ఉత్పలమాల
మేదిని ధ్యానమున్ సలిపి మేధనెఱింగియుఁ జిన్మయున్ దగన్
జేదిరి జ్ఞానసంపదలఁ జేతనమంది ఋషీశ్వరాళి స
మ్మోదమునొంది విశ్వమునఁ బూర్ణ వివేకము పంచు కోశమౌ
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెనునాస్తికుం డహో!

(సేసెనున్ + ఆస్తికుండహో)

BMahalakshmi చెప్పారు...

నేతినేతియనునది
యనేర్చిఋషులు
చూపిరందునజనులకు శూన్య చిత్తు
హస్తిమ్రింగినవెలగగ నయ్యెనదియ
నాస్తికునకువేదమెప్రమాణమ్ము సుమ్ము

BMahalakshmi చెప్పారు...

న+ఇతి-నేతి, ఇదికాదనెడివాదము

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శస్తముగ బ్రతుకు నెఱప విస్తరముగ
సంప్రతించి వేదవిదుల, శాస్త్రములను
పుస్తకములను పరికించు బూటకంపు
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము

BMahalakshmi చెప్పారు...

వాదముసేసిరామునులు వల్లనుకానిదిజూచునాసతో
మోదమునందిరాయెడను మోగినగంటల నెత్తి విజ్ఞులై

లేదనెరంగువాసనలులీలలజూపుననంతుడాయెడన్
వేదమెసత్ప్రమాణమనిెల్లడిజేసెను నాస్తికుండహో

కరణం రాజే శ్వర రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వేదములన్న నేలిదము వేదవిదుండన వెర్రివాడు స
మ్మోదము గల్గునాడు మనమున్ బరమాత్ముని యందు నిల్పకన్
ఖేదము గల్గినంతట నికృష్టుడు వేదము నాశ్రయించి యా
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

దేవళ ము నందు గలడు మా దేవు డనె డు
మాట పై నమ్మ కము లేదు మహిని యండ్రు
నాస్తికునకు :: వేద మె ప్రమాణమ్ము సుమ్ము
దైవ భక్తిని గల్గిన ధా ర్మి కునకు

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...

భానుమతి యునికి నెఱంగు వాంఛతోడ
చెంత జేరిన వారితో జెప్పె నతడు
ధీవుని కను మార్గమ్మును తెలుపు వాడ
నాస్తికులకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము.

( వాడను + ఆస్తికులకు ....వాడనాస్తికులకు)


ఆదుకొనంగరాడు పరమాత్ముడు దీనుల నెంచి చూడగా
నాదరి జేరినన్ గలుష నాశనమై సకలార్థ సిద్ధియై
నీ దరి జేరు భాగ్యమని నిహ్నపు మాటల పల్కు స్వాములే
పేదల దోచుచుండ కడు వేదన జెందు గరీబు వారి ని
ర్వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో.

Sitharamayya Solasa చెప్పారు...

వేదమందలి విషయము విశదమవక
యన్నిట బొదలునది తానె యనుచు దలచి
వేరు దేవుడు లేడని పెల్లగ నను
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము

రామోక్తం చెప్పారు...

శాంతి సందేశమునుపంచి సకలజగతి
సర్వ ప్రాణుల సమతను చాటి చెప్పు
పరమ ధర్మముల నెరుక పరచె గాన
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము

రామోక్తం చెప్పారు...

నాధుడు లేనిలోకమను నైజము గూడిన భ్రాంతియందునే
మోదము బొందువాడు తన మూర్ఖపు వాదన పట్టు వీడియున్
శోధన చేత సత్యమును చూడగ తప్పునెరింగి సిగ్గుతో
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ జ్ఞాన రహితుఁడై మూఢుఁడై కాంచుచు నిహ
సుఖములు విరివిగఁ దుతకు సూక్ష్మ మిదని
తెలియఁ బడయ విరక్తినిఁ జెలఁగు చుండు
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము

ఉ॥ కాదని ధర్మ సంహితముఁ గాంచుచు నైహిక భోగభాగ్యముల్
మేదిని మూఢుఁడై చనఁగ మెల్లఁగ తోఁచెను సూక్ష్మ మెద్దియో
వేదన హెచ్చఁగన్ దుతకు వేగఁగ బాధలఁ దృప్తిలేమినిన్
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుండహో

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ముని వరేణ్య సంచయ సూక్తములు పవిత్ర
ములు సనాతనములు సత్యములు సతము ధ
రణిని వేదము లెన్న నెల్లరకుఁ దక్క
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము


చోదిత మేదినీ మనుజ శోధిత నిత్య నిరూపి తార్థ సం
వేదిత వీత సంశయ వివిక్త వివేక సమృద్ధ సర్వదా
వాద విహీన సర్వ జన భావ సమావృత పండితప్రజా
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో

[వేదము = జ్ఞానము]

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

ఆదరభావమొప్ప జనులందరు
సత్యము నొప్పుకోవలెన్
కాదన రాదు ధాత్రిపయి గల్గుచు
నుండెను మార్పులెన్నియో
సోదన మూలమే జరిగె, జూడు ని
జంబుగ శాస్త్ర సర్గమౌ
వేదమె సత్ప్రమాణమని వెల్లడి
సేసెను నాస్తికుండహో!

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తేటగీతి రెండవ పాదము “సుఖములు విరివిగఁ దుదకు సూక్ష్మ మిదని” గా చదుకొన వలయునని విన్నపము దుదకు తప్పుగా వ్రాసాను

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఉత్పలమాలలో కూడ ఈపొరపాటు పునరావృతమైనది మన్నించాలి. ఫోన్ మార్చిందేమో తెలియడము లేదండి

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

దేవుడెచటను లేడను భావముండు
నాస్తికునకు; వేదమె ప్రమాణమ్ము సుమ్ము
వేదములయందె వాస్తవ విషయముండు
మనుజ జీవితమున కవియె మార్గదర్శి
యనుచు వేదములఁ స్తుతించె
నా(ఆ)స్తికుండు.