28, జూన్ 2016, మంగళవారం

పద్యరచన - 1226

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

45 కామెంట్‌లు:

  1. దేశభాషలయందు తెలుగులెస్స యటంచు
    ననియె నాడు విజయనగర రాజు
    చూడముచ్చటనుండు సుందర తెలుగంచు
    కవనమల్లె తమిళ కవివరుండు
    తూర్పున నాభాష గొప్ప తెనుగటంచు
    తెలియజేసెను పర దేశి యొకడు
    తెలుగు గొప్పదనము తెలిపిరందరుజూడ
    తెలుగువారలెపుడు తెలియనగును

    సాహితీ లోకమున రాజసాన నిలిచి
    వెలుగు యవధానమున నొప్పి యలరు భాష
    సంస్కృతంబునకును సరిసాటిభాష
    దిగ్గజంబుగ వెలిగెడి తెలుగు భాష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      చక్కని పద్యం చెప్పారు. ‘తూర్పున నాభాష గొప్ప తెనుగటంచు’ అన్నచోట యతి తప్పింది. ‘తూరు పిటాలియన్ తోరంపు తెనుగంచు’ అందామా?
      ‘వెలుగు నవధానముల...’ అనండి.

      తొలగించండి
  2. తెలుగు లెస్సని రాయలు బలికె నపుడు
    సుంద రంబని మెచ్చెను సుబ్ర మ్మణ్య
    ఇటలి వారలు జెప్పెని టాలి నీస్టు
    విలువ మరచిన వారలు దెలుగు వారె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చిన్న పద్యంలో చక్కగా చెప్పారు.
      ‘సుబ్రమణ్యము మెచ్చెను సుందరమని
      యిటలివార లిటాయినా ఫీస్టనిరట...’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి

  3. తన భాష గొప్పదనమును
    గణగణ పొగుడును జిలేబి కమ్మగ నంతే !
    అనుదినము తా పలుకదుగ !
    చినదాని తెలుగు పలుకులు చిల్లర మాటల్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ ‘చిల్లర పలుకుల’ పద్యం బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  4. గతములో నేను తెలుగు వెలుగు పత్రికకు మరియు ఒక పోటీకి పంపిన (ప్రచురణ కాని) పద్యములు.
    తెలుగును వెలిగించు

    ఆటవెలది:
    సంస్కృతమ్ము నేర్వ చాదస్త మని యంద్రు
    తెలుగు మాటలాడ తెగులనంద్రు
    ఇంగిలీసు బలుక ' ఇంటలీజెం ' టంద్రు
    పుల్లకూర రుచియె పొరుగు దైన.

    ఆటవెలది:
    ఆంగ్ల భాష లోని "ఆల్ఫబెట్ల" న్నియు
    నాల్గు బడులు నేర్చి నడకతోనె
    ఆంధ్ర భాష కున్న యక్షరంబులు కొన్ని
    తొలగ జేసి మదిని తొలుతు వేల.

    ఆటవెలది:
    తెలుగు వెలుగు లీనె దేశంబు వెలుపల
    మసక చేయ బోకు ' మనదు ' యింట
    తెలుగునేల మరచి తిరుగు చుండెద విటుల
    విలువ గలదె నీకు తెలుగు నేల.

    కందము:
    ఘనమైన కవివరేణ్యులు
    తెనుగును వెలిగించినారు దేదీప్యముగా
    మనమే మన మన మనమున
    విను దీక్షను బూని మిగుల వెలుగీయ వలెన్.

    తెలుగు ' వాడ ' కూడదు
    ఆ.వె: శివుని డమరుకమ్ము చిత్రమ్ముగా మ్రోగ
    అక్షరమ్ము లన్ని యవని వెలసె
    శబ్ద భేద మరసి చక్కగా నన్నింటి
    నేర్వ వలయు వదల నేరమగును

    కం: అచ్చులు హల్లులు మొత్తము
    ముచ్చటగా నేబదారు, బుధ్ధియె లేకన్
    హెచ్చగునని సరి నేర్వక
    కచ్చగ తగ్గించినావు కఠినాత్ముడవే.
    ఆ.వె: తల్లి పోలిక గల తనయరా మన భాష
    తల్లి సంస్కృతమ్ము తనయ తెనుగు
    అన్య భాష జూడ నాలి వంటి దదియె
    బెల్ల మాయె తల్లి యల్ల మాయె.

    ఆ.వె అక్షరమ్ము లన్ని యక్కరగా నాల్గు
    బడులు నేర్వ వలయు, పదము లేమొ
    వ్రాయుటొకటి వాని పలుకు వేరొక్కటి
    బరువు తోచ లేదె పరుల భాష ?

    ఆ.వె: ' చావు ' ' చదువు ' లేమొ 'చావు ' ' చదువు ' లాయె
    ' జంకు ' ' జంట ' లాయె ' జంకు ' ' జంట '
    అక్షరమ్ము వ్రాయ నసలది లేకున్న
    వ్రాయుటెట్లు దాని పలుకుటెట్లు.

    తే.గీ: బడిని నేర్పగ గొప్పగా పరుల భాష
    ‘తెలుగు లెస్సన్న’ రోజులే తేలిపోయె
    వ్రాయ చదువగ నేర్వరే భావి యువత
    తెలుగు ‘ లెస్సాయె ’ భాషయే తెల్ల బోయె

    సీ: తెలుగు భాష రుచిని తెలియగా నిటులుండు
    అమ్మ పెట్టెడి "ళుళు ళాయి" ముద్ద
    వత్సరాదిన తిని మెచ్చు పచ్చడియును
    స్వామి రామ నవమి పానకమ్ము
    ముద్దపప్పు లోన మురిపించు గోంగూర
    అన్నమాయి ల లోన నావకాయ
    పుణ్య తిథులలోన బులిపించు పులిహోర
    భారత రుచిమించు గారె ముక్క

    ఆ.వె: అక్షరమ్ము వంపు లనిన నోటికి సొంపు
    చెవుల వినగ నింపు చవుల నింపు
    సంపదనుచు దీని చేయుమా మరి పెంపు
    విలువ గనని పనులు సలుప కంపు.

    సీ: నన్నయార్యుల నోట నాటలాడిన భాష
    తిక్కనెర్రన చేతి తీపి భాష
    శ్రీనాధ కవి దిద్దె సింగారముల భాష
    పోతన్న గంధంపు పూత భాష
    రాయలేలిన నాడు రాటుదేలిన భాష
    భువన విజయ మందు కవన భాష
    గిడుగు వారు మురిసి గొడుగు బట్టిన భాష
    విశ్వనాథుని కల్పవృక్ష భాష

    ఆ.వె: లాలి పాట పాడి లాలించి పాలించి
    అమ్మనేర్పినట్టి యమృత భాష
    తెలుగు జగతి లోన వెలుగొంద జేయగా
    చేయి తలను నిలిపి చేయి బాస.



    కం: పద్యం బవధానంబులు
    గద్యంబులు భావయుక్త గానము వినగా
    హృద్యంబగు శ్రోతలకే
    చోద్యంబగు తెనుగున'కవి' శోభను గూర్చున్

    ఆ.వె: తెలుగు ‘వాడలోన’ తెలుగు ‘వాడని’ వాడ !
    ‘తెలుగు వాడ’ ! నీకు తెలివి గలదె ?
    తెలుగు ‘వాడ’నీకు తెలుగు ‘వాడి’ని జూపి
    తెలుగు వాడి, పెంచు తెలుగు వాణి.

    ****----&&------****

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భేషుగ్గాయున్నాయ్ మీ పద్యములు. అభినందనలు.

      తొలగించండి
    2. హనుమచ్ఛాస్త్రి గారూ,
      చాలా మంచి ఖండకృతి. పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

    3. గోలి హనుమచ్చాస్త్రి వారివ్వాళ డబల్ ధమాకా పటాక !

      సెహభేషు !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  5. తెలుగు భాషను పరులిట దీరున గని
    తెలుగు వెలుగుల నెలమిని తొలుకరించె
    నిచట తెలుగున పలుకర దేమొగాని
    యరయ దెలుగు తెలుంగుల కంత వెగట?!



    రిప్లయితొలగించండి
  6. పక్షి జాతి పలికె పక్షుల భాషనే ;

    పసులు నేర్చె చూడు పసుల బాస;

    తెలుగు వాడు మరచె తేనె లూరెడు భాష.

    ఇంత కన్న వింత ఇలను గలదె;

    విద్వాన్, డాక్టర్, మూలె రామముని రెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.

    రిప్లయితొలగించండి
  7. పంచ దారను బోలిన భాష యగుట
    వివిధ దేశాల ప్రముఖులు ప్రేమ మీర
    లెస్స పలికిరి మనభాష లెస్స యనుచు
    గౌర వించుట మనవంతు కీరవాణి !

    రిప్లయితొలగించండి
  8. తరువోజ:
    కన్నడ రాయడు కమనీయ మనెను గౌరవమిచ్చి జగమునఁ దెనుగును
    మన్నన కెక్కిన మనసున్న ద్రవిడ మధుర కవీశుడు మన్నించె తెనుగుఁ
    గ్రన్నన నిటలీ పుర నివాసి తలచె రమ్యపు నిజభాష కరణి తెనుగును
    నెన్నడు మన్నించు నింపుగ తెలుగు నిద్ధర మనవాడు నెరుగంగ రాదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మూడవపాదం ఉత్తరార్థంలో యతి తప్పింది. ‘రమ్యపు స్వభాష కరణిని తెనుగును’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గార్కి వందనములు.
      “గ్రన్నన నిటలీ పుర నివాసి తలచె రమ్యపు నిజభాష కరణి తెనుగును”
      “గ్ర” లోని “గ” కి “కరణి తె” లోని “క” కు యతి గూర్చితినండి. సాధువే గదా.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గార్కి వందనములు. ఒకవేళ మూడు యతి స్థానములు పరస్పర యతి మైత్రి కలిగి యుండవలెనన్న నియమమున్న మీ సవరణ కు ధన్యవాదములు. నా సవరణను కూడ తిలకించండి.
      “గ్రన్నన నిటలీ పురనివాసి తలచె రమ్యపు నిజభాష రతినిఁ దెనుగును”

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      రెండు ద్విపద పాదాలు అన్న భావంతో నేను పొరపాటున తొందరపాటుతో వ్యాఖ్యానించాను. మన్నించండి.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గార్కి వందనములు. ఒకటి కంటె నెక్కువ యతులున్న పద్యములలోన యన్ని యతి స్థానములు పరస్పర యతి మైత్రి కలిగి యుండవలెనన్న నియమమున్నదా? సంశయము తీర్ప గోర్తాను.

      తొలగించండి
    6. కామేశ్వరరావుగారూ, సాంకేతికంగా పద్యపాదంలోని మొదటి అక్షరానికి యతి అని పేరు. పద్యలక్షణాన్ని అనుసరించి పద్యపాదంలోని మరి ఒకయొక నిర్దిష్టస్థానాన్ని యతిమైత్రిస్థానం‌ అనట‌ం జరుగుతుంది. యతిస్థానంలో ఉన్న అక్షరానికి యతిమైత్రిస్థానంలో ఉన్న అక్షరానికి అక్షరసామ్యతని చెల్లించాలి. పద్యపాదంలో ఒకటి కంటే యతిమైత్రిస్థానాలున్న సందర్భాల్లోనూ‌ యతిస్థానం అన్నది మాత్రం ఒకటే కాబట్టి దానితోనే అక్షరసామ్యతను ఆ యాస్థానాలన్ని చోట్లా యతిమైత్రి పాటించాలి. వాడుకలో‌యతిమైత్రిస్థానాన్ని యతిస్థానం‌ అనటం చేస్తున్నారు కాని సాకేతికంగా అది సరి కాదు. యతిమైత్రిస్థానాలన్నీ పరస్పరమైత్రి కలిగి ఉండటం‌ అవసరం కాదు, కాని తరచుగా అలా మైత్రి కలిగే ఉండటం‌ సంభవిస్తుంది.

      తొలగించండి
    7. శ్యామల రావు గారు నా సంశయమును తీర్చినారు. ధన్యవాదములు. యతి మైత్రి స్థానమును యతిస్థానమని యలవాటులో యన్నాను. ఇక్కడ మొదటి యక్షరము సంయుక్తాక్షరమయినది కాబట్టి యా సంశయము వచ్చినది.

      తొలగించండి
  9. తెలుగు లెస్స యనుచు తెలిపెను రాయలు
    --------------తెలుగుతీపిదనము తెలుసుగనుక
    సుబ్రమణ్య మనెను సుందర తెలుగని
    ----------------తమిళు డైన తెలుగు తత్వ మెరిగి
    ఇటలీ నికోలుయే యింపైనతెలుగు యి
    ------------టాలియన్ఆప్ది ఈష్టనుటనిజమె
    పరుల మెప్పుకొరకు ప్రాకులాడితెలుగు
    -------------------వెలుగుదగ్గె నదేల తెలుపుమన్న?
    అథితి రాగమనమునందించ కాఫీని
    సంతసించ గలడు|”చెంతనున్న
    పాలుబంచ ఫలమ?పట్ట డచట
    అన్నసామెతిచట నతుకుటాయె|”


    రిప్లయితొలగించండి
  10. తెలుగదేల యంచు చులకన జేయుచు
    న్నాంగ్ల భాష యొకటె యధిక మంచు
    మాతృ భాషపైన మమతనే వీడుచు
    పలుకు పరుల భాష తెలుగు వాడు

    పరులభాషలోని పండితు లెల్లరు
    తెలుగు భాషఘనత తెలుపు చుండ
    పట్ట దాయె నిచట బుట్టిన వాడికి
    పరుల భాష యొకటె శరణ మనిరి

    రిప్లయితొలగించండి
  11. తేనెలొలుకు తెలుగు భాష
    ====++++++++++++=====
    పలుకు పలుకు తేనెలొలుకు తెలుగు భాష మనది
    పదము పదము మకరందము చిందు భాష మనది పలుకు పలుకు

    మాటరాని లేగదూడ లంబా యని యరచునే
    మాటలోచ్చిన మనమైతే మమ్మీ యనవచ్చునా? పలుకు పలుకు

    దేశ భాష లందు తెలుగు లెస్సనుచు పొగడె కృష్ణ రాయలు''
    బ్రౌను దొర తీర్చి దిద్దిన భద్రమైన భాష తెలుగు పలుకు పలుకు

    అమ్మా యని పలికితే అమ్మమనసు పొంగదా!

    మమ్మీ మమ్మీ యని పిలిచితే మాత మనసు క్రుంగదా! పలుకు పలుకు

    మాతృ భాష మాతృభూమి మాత్రు మూర్తి మహిలోన ధన్యులు
    వారి సేవ చేయుటే వారి నాదరించుటే మన జన్మకు ధన్యము. పలుకు పలుకు

    విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.కడప జిల్లా.

    రిప్లయితొలగించండి
  12. అందగత్తె మోము అందరి కగుపించ
    మెచ్చుకొనిరి కాని”నచ్చినట్టి
    అంశ మేదియనెడి సంశయమట్లుగ
    తెలుగు భాష కున్న విలువలంతె|
    5.తేనెకున్న తీపి తెట్టెకు దెలియదు
    మల్లె వాసనున్న?మనసులేదు
    తెలుగు భాష యెంతతీపిని బంచునో
    అమ్మనాన్నదెలుప? కమ్మదనమె|

    రిప్లయితొలగించండి
  13. తెలుగు గరిమచాటె తెలుగుకావ్యమువ్రాసి
    కీర్తినందె గాదె కృష్ణవిభుడు
    యితర ప్రాంతపు ప్రజ లిష్టపడిరిగాని
    తెలుగు వార లెపుడు తెలియ గలరొ.

    2ఆ.వె: ఆంధ్ర భారతమ్ము నాదిగ రచియించి
    యాదికవిగ నన్నపార్యుడయ్యె
    తిక్కనాదు లెల్ల దిది తీర్చుచు బంచ
    తెలుగు వెలుగు తేట తెల్ల మయ్యె.
    అక్షరమాఖలను గూర్చితెలుగు భాషను గూర్చి 25పద్యాలు వ్రాశాను.ఇక్కడ పోస్ట్ చేయవచ్చా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      ‘విభుడు+ఇతర’ అన్నపుడు యడాగమం రాదు.
      మీ తెలుగును గురించి వ్రాసిన పద్యాలను నా మెయిల్ (shankarkandi@gmail.com)కు పంపండి. పరిశీలించి అవసరమైతే ‘ఖండకావ్యము’ శీర్షికలో ప్రకటిస్తాను.

      తొలగించండి
  14. తెలుగు వారికిలను లేదు తీపి రుచుల
    యమ్మ బాసపై తగు నాదరమ్మను నుడి
    దాట వలయు! తెనుగు నందె మాట లాడి
    తెలుప బూనుము జగతికి తెలుగు ఘనత!

    రిప్లయితొలగించండి
  15. దేశభాషలలోన తెలుగెలెస్సయనుచు
    ..........ఆంధ్రబోజుడు చాటి యాదరించె
    సుందరంబగు భాష సురభిలో తెలుగని
    ............తనివార శ్లాఘించె తమిళకవియె
    సాధించి తెలుగున శబ్దకోశము వ్రాసె
    ..........పాశ్చాత్యుడైనట్టి బ్రౌను దొరయె
    దేశదేశములన్ని తెలుగును వినుతింప
    .........తెలియు నెప్పుడునీకు తెలుగు వాడ!


    పలుకు తేనె పాలు పంచదారల బాష
    వేన వేల కవుల వెన్నపూస
    ఆది కవుల నోట నలరు కమ్మని భాష
    అమ్మ వంటి దయ్య నాంధ్రభాష!!!




    రిప్లయితొలగించండి
  16. శంకరయ్య గారూ! నమస్తే.

    పలుకు పలుకు తేనె లొలుకు తెలుగు భాష మనది

    పదము పదము మకరందము చిందు భాష మనది.

    ఇది గేయరూపం.

    రిప్లయితొలగించండి
  17. దోషసవరణలతో .......
    *******తెలుగు వెలిగించు*******
    ఆటవెలది:
    సంస్కృతమ్ము నేర్వ చాదస్త మని యంద్రు
    తెలుగు మాటలాడ తెగులనంద్రు
    ఇంగిలీసు బలుక ' ఇంటలీజెం ' టంద్రు
    పుల్లకూర రుచియె పొరుగు దైన.
    ఆటవెలది:
    ఆంగ్ల భాష లోని "ఆల్ఫబెట్ల" న్నియు
    నాల్గు బడులు నేర్చి నడకతోనె
    ఆంధ్ర భాష కున్న యక్షరంబులు కొన్ని
    తొలగ జేసి మదిని తొలుతు వేల.
    ఆటవెలది:
    తెలుగు వెలుగు లీనె దేశంబు వెలుపల
    మసక చేయ బోకు మంటి యిచట
    తెలుగునేల మరచి తిరుగు చుండెదవేల?
    విలువ గలదె నీకు తెలుగు నేల.
    కందము:
    ఘనమైన కవివరేణ్యులు
    తెనుగును వెలిగించినారు దేదీప్యముగా
    మనమే మన మన మనమున
    విను దీక్షను బూని మిగుల వెలుగీయ వలెన్.
    ****----&------****
    *********తెలుగు ' వాడ ' కూడదు******
    ఆటవెలది:
    శివుని డమరుకమ్ము చిత్రమ్ముగా మ్రోగ
    అక్షరమ్ము లన్ని యవని వెలసె
    శబ్ద భేద మరసి చక్కగా నన్నింటి
    నేర్వ వలయు వదల నేరమగును
    కందము:
    అచ్చులు హల్లులు మొత్తము
    ముచ్చటగా నేబదారు, బుధ్ధియె లేకన్
    హెచ్చగునని సరి నేర్వక
    కచ్చగ తగ్గించినావు కఠినాత్ముడవే.
    ఆటవెలది:
    తల్లి పోలిక గల తనయరా మన భాష
    తల్లి సంస్కృతమ్ము తనయ తెనుగు
    అన్య భాష జూడ నాలి వంటి దదియె
    బెల్ల మాయె తల్లి యల్ల మాయె.
    ఆటవెలది:
    అక్షరమ్ము లన్ని యక్కరగా నాల్గు
    బడులు నేర్వ వలయు, పదము లేమొ
    వ్రాయుటొకటి వాని పలుకు వేరొక్కటి
    బరువు తోచ లేదె పరుల భాష?
    ఆటవెలది:
    "చావు" "చదువు" లేమొ 'చావు' 'చదువు' లాయె
    "జంకు" "జంట" లాయె 'జంకు' 'జంట'
    అక్షరమ్ము వ్రాయ నసలది లేకున్న
    వ్రాయుటెట్లు దాని పలుకుటెట్లు.
    తేటగీతి:
    బడిని నేర్పగ గొప్పగా పరుల భాష
    ‘తెలుగు లెస్సన్న’ రోజులే తేలిపోయె
    వ్రాయ చదువగ నేర్వరే భావి యువత
    తెలుగు ‘లెస్సాయె’ భాషయే తెల్ల బోయె.
    సీసము:
    తెలుగు భాష రుచిని తెలియగా నిటులుండు
    అమ్మ పెట్టెడి "ళుళు ళాయి" ముద్ద
    వత్సరాదిన తిను పచ్చడి రుచియును
    స్వామి రామ నవమి పానకమ్ము
    ముద్దపప్పు గలుప మురిపించు గోంగూర
    అన్నమాయిలలోన నావకాయ
    పుణ్య తిథులలోన బులిపించు పులిహోర
    భారత రుచిమించు గారె ముక్క
    ఆటవెలది:
    అక్షరమ్మువంపు లనిననోటికి సొంపు
    చెవుల వినగ నింపు చవుల నింపు
    సంపదనుచు దీని శలుపుమా సరిపెంపు
    విలువ లేని పనులు విడుచు కంపు.
    సీసము:
    నన్నయార్యుల నోట నాటలాడిన భాష
    తిక్కనెర్రన చేతి తీపి భాష
    శ్రీనాథ కవి దిద్దె సింగారముల భాష
    పోతన్న గంధంపు పూత భాష
    రాయలేలిన నాడు రాటుదేలిన భాష
    భువన విజయ మందు కవన భాష
    గిడుగు వారు మురిసి గొడుగు బట్టిన భాష
    విశ్వనాథుని కల్పవృక్ష భాష
    ఆటవెలది:
    లాలి పాట పాడి లాలించి పాలించి
    అమ్మనేర్పినట్టి యమృత భాష
    తెలుగు జగతి లోన వెలుగొంద జేయగా
    చేయి తలను నిలిపి చేయి బాస.
    కందము:
    పద్యం బవధానంబులు
    గద్యంబులు భావయుక్త గానము వినగా
    హృద్యంబగు శ్రోతలకే
    చోద్యంబగు తెనుగున'కవి' శోభను గూర్చున్
    ఆటవెలది:
    తెలుగు వాడలోన తెలుగు వాడని వాడ!
    తెలుగు వాడ! నీకు తెలివి గలదె ?
    తెలుగు వాడనీకు తెలుగు వాడిని జూపి
    తెలుగు వాడి, పెంచు తెలుగు వాణి.
    ****----&------****

    రిప్లయితొలగించండి