6, జూన్ 2016, సోమవారం

నిన్నటి కవిసమ్మేళనంలో నేను సమర్పించిన పద్యాలు...

తెలంగాణ!

సీ.        ఎనలేని పాలనం బనయమ్ము వర్ధిల్లె
ననఁ గాకతీయుల ఘనత సాక్షి!
అసమాన సాహిత్య రసమాధురి కురిసె
నఁగఁ బోతన్న పద్యములు సాక్షి!
ప్రతిలేని శిల్పసంపదలు శోభిలె నని
పలుక రామప్ప దేవళము సాక్షి
సరిలేని పోరాటశక్తికి నెల విది
యన రాష్ట్రసాధనోద్యమము సాక్షి
తే.        యిట్టి బహుళప్రశస్తమై యెసఁగినట్టి
నా తెలంగాణ రాష్ట్రమ్ము నవ్యజాగృ
తీ సమారంభకృషిని సంధించి మించి
సర్వతోముఖప్రగతికై సాగు నింక.                                     (1)

కం.       శ్రీలకు తావలమై వి
ద్యా లలితకళలు, పరస్పరాత్మీయతలున్
మేలుగ వర్ధిల్లఁగ, మురి
పాల తెలంగాణ ప్రగతి పథమున సాగున్.             (2)

కం.       కోకిలవలె, మేఘమువలె,
కేకివలెన్, చిల్కవలెను, శ్రీకృష్ణుని వం
శీకృతనినాదగతి, మో
దాకర తెలఁగాణ కవిత యలరించు నిఁకన్.            (3)

సీ.        బతుకమ్మ బోనాల పాటలు ద్రాక్షాస
వంబయి తన్మయత్వంబు నిడఁగ
ముడాల యాదాద్రి కొమురెల్లి దేవుళ్ళ
కరుణామృతమ్ము మేల్గలుగఁ జేయ
రామప్ప లక్నవరమ్ము పాకాల త
టాకముల్ మేటిపంటల నొసంగ
నానాట వర్ధిల్లు నవ్యపరిశ్రమల్
జీవనోపాధికిఁ ద్రోవఁ జూప
తే.        సర్వరంగమ్ములందు ప్రశస్త వృద్ధి
నంది, కలలెల్ల సాకారమై చెలంగ,
ప్రజలు పాలకుల్ సత్సమన్వయము గలిగి
సాగ బంగారు తెలఁగాణ సాధ్య మగును.               (4)

తే.        పెక్కు పోరాటములఁ జేసి విక్రమించి
స్వంతరాష్ట్రమ్ము సాధింపఁ జాలినార
మన్ని రంగాలలో వృద్ధి నందగలము;
నా తెలంగాణ తల్లి వందనము నీకు!                                (5)
--oOo—

34 కామెంట్‌లు:

 1. గురుగారూ! కవిసత్కారాంచితముగా నున్నవి మీ కవితా ఝరులు. శంకరాభరణ రథసారధి పొందిన సముచిత సత్కారమునకు శ్రీ శంకరార్యులకు శతాదిక వందన పూర్వకాబినందనలు. ఈ గౌరవం మన బ్లాగు మిత్రులందరకూ మీద్వారా లభించినట్లు భావించుచున్నాను.

  రిప్లయితొలగించండి
 2. నాటి నుండి నేటి వరకు తెలంగానా గొప్పతనాన్ని చాటిన గురువర్యులకు నమస్సుమాంజలులు.

  రిప్లయితొలగించండి
 3. గురువుగారూ, మీ కవనపు శక్తికి శతసహస్ర కోటి వందనములు.

  రిప్లయితొలగించండి
 4. చక్కనిపద్యాలండీ.తెలంగాణాను చక్కగాఆవిష్కరించారు

  రిప్లయితొలగించండి
 5. గురువుగారికి నమస్కారములు.
  మీ పద్యములు కడు రమ్యముగా నున్నవి.

  రిప్లయితొలగించండి
 6. లక్షణమగు పద్యమ్ములు
  సాక్షిగ మా "కంది" నవిక శంకర సుకవీ!
  లక్షణమగు పద్యమ్ముల
  శిక్షకుడవు కనగనీకు చేత ను"సిరి"యే!

  రిప్లయితొలగించండి
 7. అందమైన పద్యములలో తెలంగాణ వైభవాన్ని ఘనంగా చాటిన గురువర్యులకు నమస్సులు.

  రిప్లయితొలగించండి
 8. గురువుగారూ! మీ పద్యములు తెలంగాన వైభవాన్ని గొప్పగా చాటాయి.

  రిప్లయితొలగించండి
 9. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ప్రత్యేకముగా మీరీ సదస్సు కొరకై వ్రాసి నట్లున్నారీ ఖండికను. మీరు కృతకృత్యు లయ్యారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు.
   నిజమే! తెలంగాణా అంశంతో నేను వ్రాసిన మొట్టమొదటి రచన ఇది. ఆహ్వాన పత్రికలో కేవలం తెలంగాణా సాహిత్యం, సంస్కృతి, రాష్ట్రోద్యమం, ప్రభుత్వ పథకాలపై పద్యాలు చదవాలని నిబంధన పెట్టారు. అందుకని ఆ సమ్మేళనం కోసమే ప్రత్యేకంగా ఆ పద్యాలను వ్రాశాను.

   తొలగించండి
 10. అద్భుతమైన పద్యప్రసూనములతో తెలంగాణ వైభవాన్ని తెలియజేసిన గురుదేవులకు ప్రణామములు...

  రిప్లయితొలగించండి

 11. శ్రీ కంది శంకరయ్య గురువుగారికి నమస్కారములు
  తెలంగాణ వైభవము గూర్చి వ్రాసిన మీ పద్యములు చాలా
  బాగున్నాయి అభినందనలు  రిప్లయితొలగించండి
 12. శ్రీగురువర్యులైనకందిశంకరయ్యగారికివందనాలతో
  కందిశంకరయ్యకవితలజండాను
  నేటి తెలగాణలో యెత్తి చాటునట్లు
  పంచరత్నాలు బంచినపండితార్య
  సంతసంబును బంచెలే సర్వులకును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు.
   మొదటిపాదం ఆటవెలది, తక్కినవి తేటగీతి అయ్యాయి.

   తొలగించండి
 13. గురువులకు ప్రణామములు
  మీ తెలంగాణ పద్యములు అద్భుతము గానున్నవి .అభినందనలు

  రిప్లయితొలగించండి
 14. గురుదేవుల పద్యములు తెలంగాణా ప్రజలకు మార్గప్రబోధకంగా యున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. గురువు గారికి నమస్కారములు పద్యములు చాలాబాగున్నాయి ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 16. మాననీయ మిత్రులు శంకరయ్య గారికి.స్వయముగా మీ పద్యామృతమును గ్రోలి, దానిని వీడియోలో బంధించే అదృష్టం కలిగినందుకు మహదానందభరితుడనైతిని.ఈ అవకాశం కలిగించిన మీకు,పోచిరాజు వారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆ సమావేశంలో మిమ్మల్ని, సుబ్బారావు గారిని కలవడం నాకు సంతోషాన్ని కలిగించింది.
   అడగని వరంగా మీరు వీడియో తీసి నాకు పంపి నన్ను సంభ్రమానందాల్లో ముంచారు. నేనే మీకు కృతజ్ఞుడను.

   తొలగించండి
  2. ఆరోజున వీడియో బాగానే వచ్చింది. కాని ఆడియో సుస్పష్టంగా రాకపోవటం కొంత అసంతృప్తిగా నున్నది. క్షమింపగలరు.
   """"""""----------------------""""""""""""
   నేను పనిచేసిన పాఠశాల1916లో స్థాపింపబడినది. 2016-జూన్25.నాటికి శతవసంతాలు పూర్తి చేసికొంటుంది.శతవసంతోత్సవాలు జరుపుకోబోతున్న సందర్భముగా
   మా అనుభవాలు, అనుభూతులు పంచుకొంటు కొన్ని పద్యాలు వ్రాశాను. గుణదోష విశ్లేషణ కొఱకు వానిని మీతో పంచుకుందామనుకొంటున్నాను.పరిశీలింపగోరెదను.

   తొలగించండి