5, జూన్ 2016, ఆదివారం

సమస్య - 2055 (కవితల్ వ్రాసి పఠించినంత...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?”
లేదా...
“కవితఁ జెప్పిన కవికి సత్కారమేల?”

70 కామెంట్‌లు:

  1. లలిత లావ ణ్యపదముల లాస్యమాడు
    శబ్ద సౌందర్య శోభిత సరస మున్న
    కవిత జెప్పిన కవికి సత్కారమేల?
    నార్తి నాచంద్ర తారార్క కీర్తి నొంద.

    రిప్లయితొలగించండి
  2. మనసు రంజింప జేసెడి మంచి భాష
    కవన మందున లీనమై కరుగు నటుల
    పరవ శించగ జనులంత పరమ ప్రీతి
    కవితఁ జెప్పిన కవికి సత్కార మేల ?

    రిప్లయితొలగించండి
  3. చెవిలో పుట్టిన నొప్పి తీరు, పొడవౌ చేంతాడు కావ్యమ్ములో
    భువిలో దుష్ట సమాస కష్ట పదముల్ పూరించి క్లిష్టంబుగన్
    నవ మార్గంబని జబ్బలంటి రసహీనంబైన పైత్యంబుతో
    కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?

    రిప్లయితొలగించండి
  4. హైదరాబాదు కవిసమ్మేళనానికి మిగితా కవిమిత్రులతో బయలుదేరుతున్నాను. ఈరోజు బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మిత్రులు దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  5. అలక పదములఁజెప్పిన నాటవెలది
    ప్రజల నాల్కపై నిత్యము ప్రబలుచుండె
    కవినిలచె ప్రజల హృదిని ఘనముగాను
    కవితచెప్పిన కవికి సత్కారమేల?

    రిప్లయితొలగించండి


  6. కవితఁ జెప్పిన కవికి సత్కార మేల
    యన్న చిన్నిపాప యనగ యతని మనసు
    చిగురు వేసి జూచినదంత చింత జేసి
    చక్క దనముల మనలకు చాల జెప్పు !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పూరణలో మీరు ఏం చెప్పదలచుకున్నారో అర్థం కాలేదు.దయచేసి వివరించండి.

      తొలగించండి
  7. కవిత జెప్పిన కవికి సత్కారమేల?
    సృజన గల బ్రహ్మ తేజస్సు ! స్థిరముఁ జేయ
    భాష భవితమ్ము విష్ణాంశ! వక్ర రీతు
    లణచు లయకార శక్తులన్ రంగరించ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహ కవి మిత్రులు సహదేవుడుగార్కి నమస్సులు. అన్యథా భావింపవలదు. విష్ణు+అంశ=విష్ణాంశ అని తెలుగు సంధి చేయరాదు. రెండును సంస్కృత పదములే. ఇది యణాదేశ సంధి. కనుక "విష్ణ్వంశ" అగును. మీ గణమేమీ దెబ్బతినలేదు. పదం మాత్రమే మార్చండి.

      తొలగించండి
    2. Tbs శర్మగారికి నమస్సులు మరియు ధన్యవాదములు.సవరించిన పద్యం పరిశీలించగలరు.
      కవిత జెప్పిన కవికి సత్కారమేల?
      సృజన గల బ్రహ్మ తేజస్సు ! స్థిరముఁ జేయ
      భాష భవితమ్ము విష్ణ్వంశ! వక్ర రీతు
      లణచు లయకార శక్తులన్ రంగరించ!

      తొలగించండి
  8. కవులు మేలును జేసేటి కవితలల్ల
    ముందు కెళ్ళదె సంఘంబు ముదముమీర!
    అడ్డ దిడ్డపు మాటల అడ్డగోలు
    కవిత, జెప్పిన కవికి సత్కారమేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...జేసేటి’ అన్నదానిని ‘జేసెడి’ అనండి.

      తొలగించండి
  9. అలతి పదముల బలితంపు నర్ధమిడుచు
    బలుక మధుధారవలె సాగి పల్లవించు
    కవిత జెప్పిన కవికి సత్కారమేల?
    ప్రజల హృదయాల తానిల్చి రహిని గాంచు!!!

    రిప్లయితొలగించండి
  10. సన్మానానికి ఎంపిక గాని ఒక కవి ఆక్రోశం...

    కవితకేమియు తెలియదు కవన రసము
    ఆమె బాబాయి కవియని యచటనిలిపె
    దండలతనికి వేయగ, బండ మోటు
    కవితఁ జెప్పిన కవికి సత్కార మేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తెలియవు కవనరీతు| లామె...’ అనండి.

      తొలగించండి
  11. అవనీశుల్ స్తుతిజేయు నెచ్చెలుల వయ్యారమ్మువర్ణించుటే
    స్తవనీయమ్మని యెంచి పేదల యవస్థల్ వీడి శృంగారమున్
    కవనమ్మందున నిల్పియున్ బడుగు లాకాంక్షించలేనట్టి యా
    కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?

    రిప్లయితొలగించండి
  12. కవిత జెప్పిన కవికి సత్కార మేల ?
    యనుట సరికాదుసత్కార మార్య !చేయ
    వలయు నువిధిగ నప్పుడే పండి తులకు
    సంత సమ్ములు గలుగుచు జదువ వ్రాతు
    రెన్నియో కావ్యములికను మిన్న గాను

    రిప్లయితొలగించండి
  13. నవ భావాయత ధర్మ వేద్యముగ సన్మార్గమ్ము బోధింపగన్
    శ్రవనానందముఁ గూర్చు శబ్దముల ప్రజ్ఞా పాట వాధిక్యతన్
    వివృతంబై మధురార్థ సంహితము గావింపంగఁ దానేర్వకన్
    కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?


    విష్ణు చరితముఁ గీర్తించు విద్య విద్య
    కన్ననింపుగ నుతియించు కవిత కవిత
    భక్తి మనమున నలరార ముక్తి కొఱకు
    కవితఁ జెప్పిన కవికి సత్కారమేల?

    రిప్లయితొలగించండి
  14. భక్తిమీఱగ శ్రీరామప్రభునిగూర్చి
    కవితఁ జెప్పిన కవికి సత్కారమేల
    జానకీనాథు కరుణయే చాలు గాక
    రామయోగికి లౌకిక మేమి వలయు

    రిప్లయితొలగించండి
  15. కవితల్వ్రాసి పఠించి నంత గవి సత్కా రమ్ముల న్బొందునే
    కవిత లవ్రాయడు నెప్పుడు న్నతడు సత్కారంబు లాశించి యు
    న్గవిత ల్బొందును గారవంబు లిల నా కావ్యంబు లొప్ప న్సరి
    న్గవితా ! నేర్వుము నీ వును న్సరిగ నా గావ్యంపు సోయంబులన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సోయంబునన్’ అన్నచోట ‘సౌందర్యమున్’ అనండి.

      తొలగించండి
  16. కవితల్ వ్రాసిపఠించినంత గవి సత్కారమ్ములన్ బొందునే?
    “శ్రవణానందముబంచు మార్గమున విశ్వాసాన విజ్ఞానమున్
    భవితాసక్తికి మార్గమై తగినసంభందాన సాహిత్యమున్
    కవనంబందున బంచుచున్ వలయు లక్ష్యంబందుజూపించగా”| {తప్పకపొందగలడు}
    2.కవితల్ వ్రాసి పఠించినంత గవి సత్కారమ్ములన్ బొందునే?
    “కవితాయుక్తియె మంత్రశక్తి వలె సంకల్పంబు గల్పించుచున్
    అవధానంబున ధారణా ప్రతిభయే నాశ్చర్యమై దోపగా?
    వివిదాలంకృత భూషణాభరణ ప్రావీణ్యంపుభావంబునన్”|
    3.కవిత జెప్పిన కవికి సత్కారమేల?
    “భవిత బాగోగు లెంచెడి బాధ్యుడగుచు
    నీతి నియమాలునిలిపెడి నిర్మలుండు
    నాటి సంస్కృతిమొలిపించి చాటుగాన”
    2.కవిత జెప్పిన కవికి సత్కార మేల?
    “విద్యవిలువల సంస్కృతి విశదబరచి
    మూడ తత్వంబు పైవ్రాసి దాడిజేసి
    మంచి మమతల మాధుర్యముంచి పంచు” {గనుక}
    3.కుసుమ హృదయాలవేదనా గోడు దెలిపి
    కరుణ శ్రీయన్న బిరుదును గట్టుకొన్న
    కవిత జెప్పిన కవికి సత్కారమేల?
    అనుట ననుచిత మౌన?నన్యాయమేగ?
    4.కవిత జెప్పిన కవికి సత్కార మేల?
    “కత్తి వంటిదె కవిగళ మెత్తినపుడు
    దుష్ట శక్తుల హృదయాన దూరిపోయి
    శిష్ట రక్షణ గావించ సిద్దబడగ”. “{తప్పక}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
      కొన్ని టైపు దోషాలున్నవి.

      తొలగించండి
  17. కవులైనన్ కవయిత్రులైన నిల సత్కావ్యమ్ము నందించక
    న్నవరోధమ్ముల దీర్చకన్ జనుల మూఢాంధత్వమున్ ద్రుంచకన్
    కవనమ్మందున స్త్రీలయందములు శృంగారమ్ములన్ గూర్చియున్
    కవితల్ వ్రాసి పఠించినంత గవి సత్కారమ్ములన్ బొందునే


    జనుల క్షేమమ్ము నాశించి చక్కనైన
    కవిత జెప్పిన కవికి సత్కారమేల?
    యెవని సన్మానమాశించి యిలన పికము
    మధురగానము జేయు నామనిన దాను


    కలికి యంగాంగ వర్ణనే కైతలంచు
    అధరము మధురమ్మని రదా యద్భుతమగు
    మిగుల శృంగారమును రాసి మిడిసి పడుతు
    కవితజెప్పిన కవికి సత్కార మేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘..యిలను... నామనిని దాను’ అనండి.

      తొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. నవ చైతన్యము గల్గజేయు కవితల్ నందించగా నేటి మా
    నవు లభ్యున్నతి జెంది సత్కవులను న్నాద్యంతమున్ గొల్వరే ?
    జవ సత్వంబులు గ్రుంకుదాక కుకవుల్ సంస్కార హీనమ్ములౌ
    కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?

    భావసంపద నవరస భరితమైన
    సరస సంగీత రసధుని సాగురీతి
    గాక , గంభీర పదములే కైత యనగ
    కవితఁ జెప్పిన కవికి సత్కారమేల?

    రిప్లయితొలగించండి
  20. పరుల రచనలెల్లభువిలోన భ్రష్టములని
    కవిత చెప్పిన కవికి సత్కారమేల?
    జనుల గుండెలోన జయగీతి పాడిన
    సత్కవులపొగడంగ నిట సాధ్యమౌన!

    రిప్లయితొలగించండి

  21. జనత క్షేమము కాంక్షించి జగమునందు
    కవితచెప్పిన కవికి సత్కారమేల
    వారి కరతాళ శబ్దాలె వన్నెదెచ్చు
    ననెడి పలుకుల సత్యము నరయు డయ్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపూరణ మూడపాదాల్లో గణదోషం. ‘భువిలో భ్రష్టములని... గుండెలో జయగీతమును పలికిన...పొగడగ నిట...’ అనండి.

      తొలగించండి
  22. కాంచితి కందిశంకరుల,కాంచితి గుండు కవీంద్రమిత్రులం
    గాంచితి భద్రవర్యులను,గాంచితి కృష్ణసమాను సోదరుం
    గాంచితి నంజనార్యులను,గాంచితి సోదర సత్కవీశులం
    గాంచితి పోచిరాజు వరు కమ్మని మానస సంతసంబునన్.

    రిప్లయితొలగించండి
  23. సంఘ శ్రేయస్సె కవితకు సాధననగ
    కవుల హృదయాలు పులకించి గమ్యమెంచి
    కవితజెప్పిన కవికిసత్కారమేల
    యీయరు?ఘనత మీరంగ నిలనుజూడ.

    రిప్లయితొలగించండి
  24. ఆధునిక తైల చిత్రాల యార్ద్రత వలె
    మాన్యుడౌ కవినైన సామాన్య రీతి
    చేర నోపని యొక భావ చిత్ర భరిత
    కవిత జెప్పిన కవికి సత్కారమేల?
    (ఆధునిక తైల చిత్రాలు = paintings of modern art)

    రిప్లయితొలగించండి
  25. భవసంద్రమ్మును దాటగన్ కవనసంపన్నాశ్రితామార్గమున్
    భువనైకాద్భుత భాగవత్కథల సద్బోధాక్రమంబున్ సదా
    సవనారీతిని పోతనా దులునవిశ్రాంతమ్ముగావింపగన్
    కవితల్ వ్రాసి పఠించినంతగవి సత్కారమ్ములన్ బొందునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు మీ పూరణ లో సంస్కృత సమాస దోషా లెక్కువగ నున్నవి.
      1. భవసంద్రమ్ము : దుష్ట సమాసము.
      2. ఆశ్రిత సాధువు. ఆశ్రితామార్గమ=ఆశ్రిత + అమార్గము వ్యతిరేకార్థము.
      3. భాగవత్ కాదు భగవత్
      4. “సద్బోధ”; “సవన” దీర్ఘముండదు.
      సమస్యాపరిష్కారము కూడ సందేహాస్పదమే.

      తొలగించండి
    2. తోపెల్ల వారూ,
      మీ పూరణ బాగున్నది. కామేశ్వర రావు గారి సూచనల ననుసరించి మీ పద్యానికి నా సవరణ....

      భవవారాశిని దాటగన్ కవనసంపన్నాశ్రితంబౌ గతిన్
      భువనైకాద్భుత సత్కథాభరిత సద్బోధక్రమంబున్ సదా
      సవనంబౌ విధి పోతనాదులు నవిశ్రాంతమ్ము గావింపగన్.
      కవితల్ వ్రాసి పఠించినంతగవి సత్కారమ్ములన్ బొందునే?

      తొలగించండి
    3. నాకోరిక మన్నించి దొసగులు తెల్పిన సుకవి మిత్రులు శ్రీకామేశ్వర రావుగారికి, వాటిని సరిదిద్ది అందముగా మార్చిన గురువులు శ్రీ శంకరార్యులకు శిరమువంచి నమస్కరించుచున్నాను.

      తొలగించండి
  26. కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?
    కవితల్ వ్రాయుచు కావ్య పోషకుల సత్కారమ్ములన్ బొందుమ
    న్న వికట్కవ్యని యమ్మజే వరము గొన్నట్టిన్ కవీంద్రోత్తముం
    డవనీశున్ కడనాశ్రయింబునకు వీడంగా సవిత్ర్యానతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      మూడవపాదం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. వికటకవి గా వర్థిల్లమని కాళికాదేవిచే వరప్రసాదితుడైన తెనాలి రామకృష్ణుడిని గూర్చి అలా రాశాను. నా తెలుగు లో దోషాలవల్ల అర్థం కాకపోయి ఉంటేమన్నించండి.

      తొలగించండి
    3. కవి+అని=కవియని; అని తెలుగు పదము కనుక యణాదేశ (సంస్కృత) సంధి రాదు.

      తొలగించండి
  27. జనుల చిత్తము నందున చక్కగాను
    కవిత చెప్పినకవికిసత్కారమేల
    నరసిచూడంగ వారల కవనములను
    పొగడవశమా కుకవులకు పుడమి యందు

    రిప్లయితొలగించండి
  28. రవికల్ కోకలు మెండుగా సచివు భార్యల్ కై కొనంగా వలెన్
    చెవులన్ దుద్దులు కంఠహారములు వాచీలన్నిడంగా వలెన్
    నివురన్ కాళ్ళను చల్లగా కడిగి పన్నీరమ్ము జల్లన్ వలెన్...
    కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?

    రిప్లయితొలగించండి