21, జూన్ 2016, మంగళవారం

సమస్య - 2066 (కరుణాసాగరుఁ డన్న నొప్పు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“కరుణాసాగరుఁ డన్న నొప్పు దశదుష్కంఠుండు చిత్రంబుగన్” 
(ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు)
లేదా...
“కరుణాపాథోనిధి దశకంఠుం డనఁగన్”

34 వ్యాఖ్యలు:

 1. కందము:
  వరుణుడె యాగక కురియన్
  అరుణ కిరణుడే యనలము యాపక విసరన్
  తరుణమతని హరు పూజకు
  కరుణా పాథో నిధి దశకంఠుండనగన్

  (నండూరి సుందరీ నాగమణి)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శుభోదయం!  శరణాగతి వలదు, వలదు
  కరుణాపాథోనిధి, దశకంఠుం డనఁగన్
  అరుణారుణి, రణరంగము
  న రుధిర వీణా స్వరమున నాధుని జేరున్ !


  సావేజిత
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శరణన్నన్ తన చెల్లిగోడు వినుచున్ సత్యంబు శోధింపకన్
  పరనారీమణి నీడ్చుకొచ్చి నిలిచెన్ పాపంబుగా నెంచకన్
  కరుణేగా మరి జంపకుండ విడువన్ కాదన్న తన్తమ్మునిన్
  కరుణాసాగరుఁ డన్న నొప్పు, దశదుష్కంఠుండు చిత్రంబుగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నిరతము వైరము తోడను
  దరిజేరెడు భక్తి జూప దానవుడంతన్!
  పరిమార్చె నైక్యమందగ
  కరుణా పాథోనిధి! దశకంఠుండనఁగన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ధరణిజ పతియగు రాముడు
  కరుణాపాథోనిధి! దశకంంఠుంండనగన్
  వరబల వినోది,యబలా
  హరణుంండు మిగుల పరాక్రమాన్వితుడయ్యున్ .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అరుపున శూర్పణఖ సభకు
  నరగుచు సోదరుని జేరి నన్నున్ గాంచుము
  నరులన్ జంపంగ వలయు
  కరుణా పాథో నిధి దశకంఠుం డనఁగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వరుణాదిత్య సమప్రభుండు నిజ సద్భ్రా తృశ్రియాఘ్నుండిలన్
   తరుణోద్రేక విమోహ కామ భర చిత్తక్షోభ తప్తాంగుడున్
   మరణం బన్నది లే దమానుషుల చే మత్తుండు దుష్టుండు ని
   ష్కరుణా సాగరు డన్న నొప్పు దశ దుష్కంఠుండు చిత్రంబుగన్

   ముందు మూడవ పాదాన్ని
   “మరణాజేయ వరప్రభావ బల దుర్మత్తుండు దుష్టుండు ని"
   యని వ్రాసి కానీ నరులచేతిలో మరణముందిగదా యని మార్చితిని.

   సుర ముని వందిత! భార్గవ
   విరామ! సీతాపహరణ విద్రోహి కనం
   బరమాసుర నీచుండిలఁ,
   గరుణాపాథోనిధి! దశకంఠుం డనఁగన్

   తొలగించు
  2. చిన్న సవరణతో మరియొక పూరణ:

   వరుణాదిత్య సమప్రభుండు నిజ సద్భ్రా తృశ్రియాఘ్నుండిలన్
   తరుణోద్రేక విమోహ కామ భర చిత్తక్షోభ తప్తాంగుడున్
   మరణామానుష సంఘ బాహ్య వర దుర్మత్తుండు దుష్టుండు ని
   ష్కరుణా సాగరు డన్న నొప్పు దశ దుష్కంఠుండు చిత్రంబుగన్

   తొలగించు
 8. ధరణిని ప్రభవించెను హరి
  కరుణా పా థోనిధి, దశకంఠుడనగన్
  వరలుచు లంకపతి శివుని
  వరముల బలమున చరించె వరదు నహితుడై

  ప్రత్యుత్తరంతొలగించు
 9. తరువది యశోక మనగను
  సరగున నట నునిచి యతడు సాధ్విని సీతన్
  వరముగ నిచ్చెను గడువును
  కరుణా పాధో నిధి దశ కంఠుండనగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరచాపమ్మును ద్రుంచి సీతను వివాహమ్మాడె యా ధీరుడే
   శరణమ్మన్నను చాలు బ్రోచునతడే సాకేత రాముండనే
   కరుణాసాగరుడన్న నొప్పు, దశదుష్కంఠుండు చిత్రంబుగన్
   పరభార్యన్ జెర బట్టెనా శివునికే భక్తుండనన్ చోద్యమే

   పురుషోత్తముడౌ రాముడు
   కరుణా పాధో నిధి, దశకంఠుం డనగన్
   న్నరిభంజనుండు నిరతము
   పరమేశుని గొల్చు లంక పాలకు డతడున్

   తొలగించు
 10. కరుణా సాగరుడన్న నొప్పు దశ దుష్కoఠుండు చిత్రంబుగ
  న్న రయన్ సత్యము రావణుండనగ మాహాత్మ్యుo డు గాదే భువిన్
  శరణున్గోరిన వారి కి న్నెపుడు దా సాహాయ్యమున్ జేసెఁగా
  కరుణా సాగరుడన్న నొప్పు దశ దుష్కoఠుండుసత్యంబుగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ధరపై సౌమ్య గుణాభిరాముడయి క్రోధావేశముల్ గానకన్
  దురితంబుల్ తెగటార్చి రాఘవుడు పాత్రుండాయె, సంప్రీతితో
  కరుణాసాగరుడన్న నొప్పు; దశ
  దుష్కంఠుండు చిత్రంబుగన్
  పరితాపంబుల గృంగె దుర్వ్యసన పాపౌఘంబు తా సాగగన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 12. చెర బట్టిన సీతను తా
  చెరపక వత్సరముపాటు చెరలోనుంచెన్
  దురహంకారండైనను
  గరుణాపాథోనిధి! దశకంఠుం డనఁగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 13. శరణాగతులకు రాముడె
  కరుణాపాథోనిధి! దశకంఠుండనగన్,
  పరసతిపై మోహముతో
  మరణము కొని తెచ్చుకొనిన మందమతియగున్!

  ప్రత్యుత్తరంతొలగించు
 14. కె. ఈశ్వరప్ప గారి పూరణలు....
  1)
  వరముల్ బంచెను భక్తియుక్తులకు భావంబున్న శ్రీ రాముడే|
  కరుణా సాగరుడన్న నొప్పు|”దశ దుష్కంఠుండు చిత్రంబుగన్
  పరుషంబందున పాపముల్ జరిపి సంపాదించ?దోషంబులే
  వరముల్ మ్రింగెను యుద్ధరంగమున నిష్పక్షాన నివృత్తిగా|
  2)
  వరముల నొసగెడి రాముడు
  కరుణా పాథోనిధి|”దశకంఠుండనగన్
  వరగర్వంబున పరమే
  శ్వర లింగముగొని నహమున శనినాశించెన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. కెంబాయి తిమ్మాజీ రావు గారి పూరణ....

  చెర బట్టిన సీతను తా
  చెరపక వత్సరముపాటు చెరలో నుంచెన్
  దురహంకారుండైనను
  గరుణాపాథోనిధి! దశకంఠుం డనఁగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 16. నండూరి నాగమణిగారి పద్యాన్ని కొంచెం చిత్రిక పట్టాలి. "వరుణుడె యాగక కురియన్| అరుణ కిరణుడే యనలము యాపక విసరన్| తరుణమతని హరు పూజకు| కరుణా పాథో నిధి దశకంఠుండనగన్" అన్నదానికి సవరణగా "వరుణుండాగక కురియగ| నరుణకిరణు డాపకుండ ననలము విసరన్| తరుణంబట హరు గొల్వగ। కరుణాపాథోనిధి దశకంఠుండనగన్" అన్న పాఠాన్ని పరిశీలించండి. కురియన్+అరుణ అన్నచోట కురియనరుణ అవుతోంది కాబట్టి ఒక ముఖ్యమైన మార్పు. రెండవపాదంలో నడకకోసం మరొకటి. పద్య లక్షణవిచారం సరే. అన్వయం నాకు స్ఫుటంగా 'దశకంఠుడు కరుణాపాధోనిధియే' అంటున్నట్లే ఉంది కాని ఎందుకూ అన్న సమర్థన లోపం.

  తాతాఫణిగారి పూరణలో ఈడ్చుకొచ్చి అన్నది గ్రామ్యత. ఈడ్చి తెచ్చి అనటం ఉచితం. మూడవపాదంలోనూ కరుణేగా అని గ్రామ్యం ఉంది. పాదాన్నే మార్చాలిక్కడ. "కరుణేగా మరి జంపకుండ విడువన్ కాదన్న తన్తమ్మునిన్" అన్నది కాస్తా "కరుణించెంగద చంపకుండ ననుజున్ కష్టోక్తులం బల్కినన్ " అని మారుద్దాము. లక్షణపరిష్కారం అటుంచి, సమస్యకు పూరణ బలంగా లేదు.

  సహదేవుడిగారి కందంలో మొదటిమూడుపాదాలూ బాగున్నా సమస్యాపాదానికి సరిగా అన్వయం కావటంలేదు. పద్యభావానికి మరలా కొత్తపద్యం చెబుదాం "హరి రామునిగా వచ్చెను| కరుణాపాధోనిధి; దశకంఠుడనగన్| పరమాత్మ కొరకు వేచెను | తరణోపాయంబు స్వామి దండనమనుచున్". కొంచెం పౌలస్యహృదయం ధోరణి అన్నమాట.

  పొన్నెకంటివారు ధరణిజపతి అన్నారు కాని ధరణిజాపతి అన్నదే సాధువు. మొదటిపాదాన్ని 'ధరణిజ పెనిమిటి రాముడు' అని మార్చండి, పద్యం హృధ్యంగా ఉంది.

  టేకుమళ్ళవారి పూరణ చూదాం. శూర్పనఖ దృష్టిలో రావణుడు కరుణాపాధోనిధి అన్న సమర్ఘన చక్కగా ఉంది. కాని అన్వయం శుధ్ధంగా రాలేదండి. 'అరచుచు శూర్పనఖ సభకు| నరగి నిజాగ్రజుని గాంచి యను మరి నరులన్|విరచవె నెఱనమ్మితి నే | కరుణా పాథో నిధి దశకంఠుం డనఁగన్' అని ఆ పద్యాన్ని కొంచెం సవరిద్దాం అన్వయం కోసం.

  పోచిరాజు వారి పూరణావృత్తంలో పూర్వభాగం సంస్కృతసమాసాడంబరంతో ధాటీగా బాగా నడిచింది. పిదప తెలుగులోనికి గభాలున దూకటంతో కొంచెం ధార దెబ్బతింది.వారు మూడవపాదాన్ని కావలస్తే సంస్కృతభూయిష్టంగా 'సురయక్షోరగకిన్నరాదిగణసంక్షోభుండు దుష్టుండు ని ' అని వ్రాయవచ్చును. అదటుంచి, నిష్కరుణాసాగరుడన్నది అంత ఒప్పుదలగా లేదు నాకు. సాగరోపమం చేయటం ప్రాశస్త్యాన్ని ఉగ్గడించటం కోసం. వైభవాతిశయత్వాన్ని నిరూపించటం కోసం. కాని సాగరశబ్దం నీచోపమితమైతే అది ఉచితంగా అనిపించక పోవటం వలన ఇబ్బంది కలుగుతున్నది. కాని పోచిరాజుగారి కందంలో భావం బాగుంది. కాని పద్యం అంతగా కళగా అనిపించలేదు క్షమించాలి. అన్వయదోషమే కారణం. నా ప్రయత్నం విన్నవిస్తాను. 'సురముని గణములు పొగడును| పరమాత్నుడ వనుచు రామవల్లభ నిన్నున్| మరి తామసియై తిట్టును| కరుణాపాథోనిధి! దశకంఠుం డనఁగన్'

  సత్యనారాయణ రెడ్డిగారు లంకపతి అన్నారు కాని లంకాపతి అనక తప్పదు. వారి పద్యం కొద్దిగా సవరిద్దాము 'హరవరబలగర్వితుడై| దురాత్ముడై సాధుజనుల ద్రొక్కె నదయుడై' అని అందాం. నాలుగవపాదం జగణంతో మొదలు కావటంలో మంచి సొగసుంది. జగణానిది ఎదురునడక రావణుడి ధోరణికూడా సముదాచారానికి ఎదురునడకయే ఐనట్లుగానే. అలాగే అట్టివాడై ఇట్టివాడై అంటూ ముమ్మారు రావణుణ్ణి ఈసడించటంలోనూ సొగసు ఉందికదా. ఆలోచించండి. వీలు చూసుకొని ఇలాంటి సొగసులు అద్దవచ్చును పద్యాల్లో. ఇదొక పద్యశిల్పం అన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నమస్సులు అండీ శ్యామలీయం గారూ... మీ సూచనలు పాటిస్తాను.

   తొలగించు
 17. సుబ్బారావుగారు వ్యంగ్యాత్మకంగా మంచి కందం చెప్పారు. వారి వృత్తంలో 'మాహాత్మ్యుండు' అన్నారు అది సరైన మాట కాదు. మహాత్ముడే సరైనది. కాని అది గణాల్లో ఇరకదాయె.

  విరించి గారి పద్యంలో 'వివాహమ్మాడె యా ధీరుడే' అని కాక 'వివాహమ్మాడె నా ధీరుడే' అని ఉండాలి. తెలుసుకోవటం సులభమే వివాహమాడెను అంటాం కదా? 'సాకేతరాముండనే కరుణాసాగరుడన్న నొప్పు' అన్నారు. అక్కడ రాముండనే అన్నది సరికాదు రామునే అవుతుందంతే. అందుచేత సాకేతసామ్రాట్టునే అందాం. పద్యం చివరి పాదంలో 'జెర బట్టెనా శివునికే ' అన్నది ఒప్పదు కాబట్టి 'జెరబట్టినన్ శివునకున్ ' అనవలసి ఉంటుంది.

  తిమ్మాజీరావు గారి కందం రెండవపాదంలో 'వత్సరముపాటు' సరికాదు. 'నొక వత్సరమ్ము' అంటే బాగుంటుంది. అన్వయం సాధించారు సులువుగానే. వ్యంగ్యోక్తిగా సరిపోతుంది. పోనీ ధర్మాత్ముండనో మరో మాటో వాడండి. కాని పద్యంలో పాదమే పునరుక్తం మరియు సరసత పూజ్యం అనిపించాయండి. వ్యంగ్యం అంటే సరే కాని, అది సరిగా పండలేదు.

  శిష్ట్లా వారు మంచి పద్యం చెప్పారు. కొన్ని పదాలను కొంచెం మార్చితే మరింత బాగుండ వచ్చును. 'క్రోధావేశముల్ గానకన్' బదులు 'క్రోధావేశముల్ చెందకన్' అనీ తెగటార్చి బదులు హరియించి అనీ మార్చటం బాగుంటుంది. తెగటార్చటం అన్నది వ్యక్తులకే అన్వయించాలి కదా. పద్యాంతపాదం 'దురితానేకప్రతారితాసుడగుచున్ దోగెన్ రణం బందునన్' అనటం సముచితం. రావణుడికి పరితాపం ఎన్నడు కలిగింది కనుక?

  శ్రీధరరావుగారి కందం సులభగ్రాహ్యంగా ఉంది. ముగింపులో 'మందమతి కదా' అంటే ఇంకా బాగుంటుందేమో అనుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ప్రత్యుత్తరాలు
  1. మొబైల్ మీద టైప్ చేస్తే అంత అందంగా పడింది. 'విశోషితాసుడగుచున్' అంటే బాగుంటుందని వ్రాయబోతే అయ్యవారిని చేయబోతే కోతి ఐనట్లయ్యింది! మన్నించాలి.

   తొలగించు
 19. 1.తరణికులోద్భవుడాతడు
  కరుణాపాతోనిధి,దశకంఠుండనగన్
  దురితములొనరించుచుతా
  వరము బలిమిచే సతతము వనితల బట్టున్.

  2.పరమపురుషుండురాముడు
  కరుణాపాతోనిధి,దశకంఠుండనగన్
  దురహంకారము తో కని
  కరమనునది లేకదాచె కమలన యనలన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఉమాదేవిగారి పద్యాలు బాగున్నాయి. ధారవిషయం గమనించుకోవలసింది ఆద్యంతమూ ఒకేరీతిగా నడిపితేబాగుంటాయి పద్యాలు. పదాలను గణాల్లో పొదిగినట్లైతే ధారకుంటుబడుతుంది. బాగా అభ్యాసం చేయగా ఈ‌ ఇబ్బంది తొలగుతుంది.

   తొలగించు
 20. విద్వత్కవులు"శ్యామలీయం"గారికి నమస్సులు.మీ విలువైన సవరణలకు కృతజ్ఞతలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. తగు రీతిని సూచించిన సత్కవులు శ్యామలీయం గారికి కృతఙ్ఞతలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. పెద్దలు శ్యామలీయం గారి సవరణలకు ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ప్రత్యుత్తరాలు
  1. ఇలా సవరిస్తే సరిపోతుందంటారా, శ్యామలీయం గారూ! దయతో పరిశీలించ ప్రార్థన:

   పరిమార్చె నైక్యమందగ
   కరుణా పాథోనిధి! దశకంఠుండనఁగన్
   నిరతము వైరము తోడను
   దరిజేరెడు భక్తి జూపు దానవుడనుచున్!

   తొలగించు
  2. ఇలా సవరిస్తే సరిపోతుందంటారా, శ్యామలీయం గారూ! దయతో పరిశీలించ ప్రార్థన:

   పరిమార్చె నైక్యమందగ
   కరుణా పాథోనిధి! దశకంఠుండనఁగన్
   నిరతము వైరము తోడను
   దరిజేరెడు భక్తి జూపు దానవుడనుచున్!

   తొలగించు