28, జూన్ 2016, మంగళవారం

సమస్య - 2073 (భైరవుఁ డిచ్చుచుండు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భైరవుఁ డిచ్చుచుండు నశుభంబులు నమ్మిన భక్తకోటికిన్”
లేదా...
“భైరవుం డిచ్చు నశుభముల్ భక్తులకును”

59 కామెంట్‌లు:

  1. తీరని బాధలెక్కుడయి తృప్తి నెఱుంగని జీవినై ధరన్
    తారణ మార్గమున్ గనక దైవమె దిక్కని దోచి చిత్తమున్
    జేరితి నిప్పుడీగుడికిఁ జెప్పుము సత్యము నర్చకోత్తమా
    భైరవుఁ డిచ్చుచుండున శుభంబులు నమ్మిన భక్తకోటికిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ గారూ,
      వహ్వా! ఆరంభంలోనే అద్భుతమైన పూరణ చదివి మహదానందం చెందాను. నిశ్చయార్థక వాక్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చి మీరు చేసిన పూరణ ఔత్సాహికులకు మార్గదర్శకం. ఇంక చక్కని పూరణ నిచ్చిన మీకు అభినందనలు, ధన్యవాదాలు.
      ‘దిక్కని తోచి’ అనండి. అక్కడ దిక్కని అన్న తరువాత గసడదవాదేశానికి కాని, సరళాదేశానికి కాని అవకాశం లేదు.

      తొలగించండి
    2. గురువు గారూ,
      అనేక ధన్యవాదములు.

      "దిక్కని తోచి - దిక్కని అన్న తరువాత గసడదవాదేశానికి కాని, సరళాదేశానికి కాని అవకాశం లేదు. "
      మన్నించండి.
      ఇదే విషయం గతం లో మీరు రెండు సార్లు, డా.విష్ణునందన్ గారు ఒక మారు చెప్పినారు. ఇకపై మరింత జాగ్రత్తవహించి - వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
      సత్యము నర్చకోత్తమా అనవలెనా - సత్యము యర్చకోత్తమా అనవలెనా అని చాలాసేపు ఆలోచించినాను కానీయండి ఏది సరైనదో తెలియలేదు.

      భవదీయుడు

      తొలగించండి
  2. చేరగ కాశిపట్ట ణము చేతన మొందుచు భక్తి మీరగన్
    భారపు జీవనం బునను పాపము లెన్నియొ సంచితం బుగన్
    నీరము నందునన్ గలిపి నేరుగ నీశుని మ్రొక్కినం తనే
    భైరవుఁ డిచ్చుచుండు న ? శుభంబులు నమ్మిన భక్త కోటికిన్
    -----------------------------------------
    క్షమించాలి
    10ది,15ను , రోజులుగా నాకంప్యుటర్ పనిచెయ్యటల్లేదు .మన శంకరాభరణమునకు దూరమై పోయాను అన్నబాధతో ఈరోజు ఎలాగో కుస్తీ పట్టాను .నావి+ కంప్యూటరువి ఎన్ని తప్పులు ఉన్నాయో ? గురువులకు శ్రమ కలిగించి నందులకు క్షంతవ్యు రాలను .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      కంటి ఆపరేషన్ కారణంగా నేనూ కొద్దిరోజులు బ్లాగును చూడలేదు. అయితే మీ లోపాన్ని గుర్తించాను. ఆరోగ్యపరమైన ఇబ్బందులేమైనా వచ్చాయేమో అనుకున్నా! అయితే అనారోగ్యం మీకు కాదు, కంప్యూటరుకు అని తెలిసి సంతోషిస్తున్నాను.
      మీరు కూడా ఊకదంపుడు గారి మార్గంలో సమస్యను ప్రశ్నార్థకంగా మార్చి చక్కని పూరణ నిచ్చారు. బాగుంది. నిర్దోషం! అభినందనలు.

      తొలగించండి
  3. పరుల మెప్పును బొందగ భక్తి జూపి
    భూరి విరాళము లంది భోగ మందు
    మునిగి తేలెడు మోసపు మునుల కంట
    భైరవుం డిచ్చున ? శుభముల్ భక్తు లకును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ రెండవ పూరణకూడా బాగుంది. అభినందనలు.
      రెండవపాదంలో గణదోషం ‘భూరిగ విరాళముల నంది భోగములను/ భూరి దానమ్ము లందుచు భోగములను’ అనండి.

      తొలగించండి
    2. శంకరార్యుల సవరణ బాగుంది. నా మార్గంలో - అంటే - దేశిఃఛందాల్లో గణాలమీద పదాలు వీలైనంతగా విరిగే విధానంలో అన్నమాట - సవరణ 'భూరి వితరణంబుల బొంది భోగములను' అనే వాడినేమో!

      ఏదైనా సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన పూరణలు బాగున్నాయి.

      తొలగించండి

  4. కోరిన వరము లిచ్చును కొంచమైన
    యోచనను జేయకను సరియో యని తలు
    వక, జిలేబి వినుము నీదు వసది యనుచు
    భైరవుం డిచ్చు నశుభముల్ భక్తులకును !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      కొంత అన్వయలోపం, సందిగ్ధత ఉన్నాయి.
      ‘వసది’...? ‘నీదు వాగు డనుచు’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  5. చేరగ కాశికా పురము శ్రీకర దర్శన ధన్యభాగ్యమున్
    ధారుణి ధాతయే పగిది దారుణ కర్మఫలంబునిచ్చునో
    దారిని జూపునెవ్వరికి దక్షుని మామయు కష్టకాలమున్
    భైరవుఁ డిచ్చుచుండు, నశుభంబులు, నమ్మిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      పూరణ బాగున్నది. కాని కొంత అన్వయక్లేశం ఉన్నట్టుంది.

      తొలగించండి
  6. చిత్తమందున భక్తిని విత్తలేక
    సత్తు గనలేము గాదె ప్రపత్తిలేక
    తప్పుజేయుచు నీశుని మెప్పుగోర
    భైరవుండిచ్చున? శుభముల్ భక్తులకును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      ప్రశ్నార్థకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. భైర వుండి చ్చునశు భము ల్భ క్తులకును
    ననుట నాయమె మీకిది యార్య !చెపుమ
    భైర వుండి చ్చుశుభములు వరదు డగుట
    భక్త కోటిని రక్షించి రక్తి తోడ

    రిప్లయితొలగించండి
  8. బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ....

    సారెకు మోసగించుచును సంపదలెన్నియొ కూడబెట్టి తా
    నేరుగ కాశికిన్ చనియు నేమము తోడుత పూజచేయు సం
    స్కారము మెచ్చబోక మన సంపదలన్నియు నాశమవ్వగా
    భైరవు డిచ్చుచుండు నశుభంబులు నమ్మిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంజయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. 'నాశమవ్వగా' అన్నది ఒప్పదండీ. నాశమైచనన్ అంటే బాగుంటుంది, రాబోయే పాదానికి చక్కగా అతుకుతుంది కూడా.

      తొలగించండి
    3. శ్యామల రావు గారూ,
      మీ సూచన బాగున్నది. ధన్యవాదాలు.

      తొలగించండి
  9. భారము గాగనాబ్రదుకు భార్యను బిల్లలు జూడకుండు రీ
    ధారుణి నెట్లుగా మనుచు దారణ జేయుదు జీవనంబు నున్
    వారము వారము న్భజన బాగుగ జేయుచు నుండగానిక న్
    భైరవు డిచ్చు చుండు నశుభంబులు నమ్మిన భక్త కోటికిన్ ?

    రిప్లయితొలగించండి
  10. కోరిన కోరకున్న జతగూర్చును నెవ్వడు కర్మబంధముల్?
    ఘోరవికార కార్యములకున్ ఫలితంబులజూడ నెట్టివో?
    సారమతింబరాత్పరుడు సత్కృప నెవ్వరికండనుండునో?
    భైరవుడిచ్చుచుండు;నశుభంబులు;నమ్మిన భక్తకోటికిన్.

    ఇలను కర్మానుభవముల నెవడొసంగు?
    దుష్టకార్యాలకేమేమి స్పష్టమగును?
    హృదయమేరికి నిరతంబు సదయమగును?
    భైరవుండిచ్చు;నశుభముల్;భక్తులకును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి వారూ,
      క్రమాలంకారంలో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. మాన్యులు శంకరయ్య గారికి... మీరనుమతినిస్తే ధూళిపూడి శతవసంతోత్సవ అనుభవాలను ఖండకావ్యములో పెడదామనుకుంటున్నాను.దోషాలను పరిష్కరించగోరెదను.

      తొలగించండి
    3. తప్పకుండా నా మెయిల్ చిరునామాకు పంపించండి. పరిశీలిస్తాను.
      shankarkandi@gmail.com

      తొలగించండి
  11. నీతి నియమములను మదినెంచ మనుచు
    పరుల హింసకు గురిచేసి పాప మంద,
    చిత్రముగ, శివ పూజలు చేసి నంత
    భైరవుండిచ్చున శుభముల్! భక్తులకును!

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. క్షీరసముద్ర సంభవము కీలనికాశ హలాహలమ్మునున్
      నీరము భంగి కంఠమున నేర్పునఁ బెట్టి భయార్త దీనుల
      న్నారితిఁ దీర్చి గాచిన దయామయు నివ్విధిఁ జెప్ప నొప్పునే
      భైరవుఁ డిచ్చుచుండు నశుభంబులు నమ్మిన భక్తకోటికిన్
      [భైరవుడు = శివుడు]

      రాక్షసులు భీమ కాయులు రౌద్రు లవనిఁ
      గ్రూరు లెంచ విష్ణ్వారాధకుల సహింప
      నోర్వ రెన్నడు మునులకు నుద్భటముగ
      భైరవుం డిచ్చు నశుభముల్ భక్తులకును
      [భైరవుడు = భయంకరుడు]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణలో కొంత అన్వయలోపం... భైరవునకు పైన మీరిచ్చిన విశేషణాలన్నీ బహువచనంలో ఉన్నాయి. నా సవరణ...
      రాక్షుసుఁడు భీమకాయుఁడు రౌద్రుఁ డవనిఁ
      గ్రూరుఁ డెంచ విష్ణ్వారాధకుల సహింప
      నోర్వఁ డెన్నఁడు మునులకు నుద్భటముగ
      భైరవుం డిచ్చు నశుభముల్ భక్తులకును.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గార్కి వందనములు. మీసవరణకు మిక్కిలి ధన్యవాదములు. పూర్వార్థమున రాక్షసుల సామాన్య స్వభావాన్ని ప్రస్తావించితిని. ఓర్వరని యా వాక్యము పూర్తి చేశాను గదా యనుకొన్నాను. నాకుకూడా యాయనుమానము వచ్చినది.

      తొలగించండి
  13. కారణ మాశచేత తమకాంక్షల కై తగుపాప కార్యముల్
    తీరిక చేత జేయగల దీక్షనుబూని తపస్సు జేయగా
    బైరవుడిచ్చు చుండు నశుభంబులు నమ్మిన భక్త కోటికిన్
    బేరములాడు భక్తులకు భీతిని బంచును నీతిమాలినన్
    2.మంచి మనసున్న భక్తునికుంచు సుఖము
    నెంచి పాపాలుజేసెడి వంచకులకు
    బైరవుండిచ్చునశుభముల్ భక్తులకును
    దైవ శక్తిని వంచించ?తరుగుబలము|


    రిప్లయితొలగించండి
  14. కోరిన జాలు భక్త జన కోర్కెల దీర్చెడు వేల్పులెవ్వరీ
    ధారుణి యందునన్నని సదాతల పోయుచు నుందురే యిలన్
    శ్రీరఘు రామడా? యనఘ శ్రీహరియా? విధిరాణివాణియా?
    భైరవుడిచ్చుచుండున? శుభంబులు నమ్మిన భక్తకోటికిన్

    ఎవడెవండిల భక్తుల యీప్సితముల
    దీర్చి బ్రోచెడు వేలుపో తెలుపు మంటి
    రాముడా? పద్మ నాభుడా? బ్రహ్మ యౌన
    భైరవుండిచ్చున? శుభముల్ భక్తులకును.

    రిప్లయితొలగించండి
  15. భారము హెచ్చె పాపముల, బంగరు వెండి యుపాయనంబులున్
    భూరి విరాళముల్లొసగె భూతులనాథునికే నివేదనం
    బేరముగాదె దేవునితొ, వెక్కసమీ స్థితి యిట్టివారకూ
    భైరవుడిచ్చుచుండున శుభంబులు? నమ్మిన భక్తకోటికిన్॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘విరాలముల్+ఒసగె’ అన్నపుడు లకార ద్విత్వం రాదు. అది కేవలం నకారానికే పరిమితం. ‘విరాళమున్+ఒసగె= విరాళము న్నొసగె’ అవుతుంది. ‘నివేదనం’ అని ముప్రత్యయం స్థానంలో అనుస్వారం ఉంచారు. ‘తో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘వారకూ’ అనడం గ్రామ్యం. ‘వారికిన్’ అనండి.

      తొలగించండి
  16. నీతినియమమ్ము వీడిన పాతకులకు
    భైరవుండిచ్చు నశుభముల్, భక్తులకును
    చిత్తశుద్ధిని గలిగి బూజించి సతము
    శరణు వేడిన కరుణించి వరములిడును!!!

    రిప్లయితొలగించండి
  17. భైరవుండిచ్చునశుభములు భక్తులకును
    యనెడి మాట సరియు కాదు నాభవుండు..
    భక్త వత్సలుడు సతము భయమునుడిపి
    భోగభాగ్యముల నొసగి బ్రోచు చుండు .

    రిప్లయితొలగించండి
  18. నిన్నటి పద్యమోసారి చూడండి
    యుద్ధము నందున పార్థుడు
    బద్దలు గొట్టెను రిపులను బాణంబులచే
    సద్దును చేయుచు నవియును
    మద్దెలలె మ్రోగె గగన మధ్యము నందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘భక్తులకును+అనెడి’ అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  19. భారము వేసి వేడినను వైభవ భాగ్యము నీతి వర్తనన్
    భైరవుఁ డిచ్చుచుండు, నశుభంబులు నమ్మిన భక్తకోటికిన్
    దూరము జేయు, పాపములు దుష్కృత కార్యమొనర్చు వారలన్
    ధారుణి యందు హింసకుల తప్పక ద్రుంచు త్రి శూలధారలన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. కారణమేదొమానసముగాంచకవేదన జెందుచుండగా
    ప్రేరణపొందినీశ్వరుని ప్రీతిగ పూజలు చేయబూనుచున్
    కోరితిపాదపద్మముల కూరిమివేగమెమేలుచేయగా భైరవుడిచ్చుచుండున, శుభంబులు నమ్మిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరాం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ప్రేరణ పొంది యీశ్వరుని...’ అనండి.

      తొలగించండి
  21. భూసారపు నర్సయ్య గారి పూరణ...

    కర్మ వలననే జీవులు గలుగుచుంద్రు
    కాలగమనమ్మునందునఁ గలియుచున్న
    కాని కాల మెప్పుడు కర్త కాదు, కాల
    భైరవుం డిచ్చున శుభముల్ భక్తులకును?

    రిప్లయితొలగించండి
  22. చిత్తుగా త్రాగి కలిగిన మత్తుతోడ
    దైవ దూషణ చేసిన కావరమున,
    భైరవుండిచ్చు నశుభముల్, భక్తులకును
    ముక్తి నిడుసదా సత్పథ ముఁబయనించ

    రిప్లయితొలగించండి
  23. ఓ భక్తుని అనుమానం:

    చేరి శివాలయమ్మునకు శ్రీధరుఁ, బార్వతి, వారి సంతతిన్
    భారములెన్నొ దీర్చుమని భక్తి ప్రపత్తుల సేవఁజేసి, యే
    మాఱుచు కాలభైరవుని మాత్రము మ్రొక్కక పాపినైతినే
    భైరవుడిచ్చు చుండున శుభమ్ములు నిత్యము భక్తకోటికిన్?

    రిప్లయితొలగించండి
  24. పోరగ లోక్ సభన్ మురిసి బొత్తిగ ఢిల్లిని క్షౌరమాయెనా?
    చేరుము రాజ్ సభందునను చెన్నుగ వేడుచు దొడ్డిదారినిన్
    కోరగ కోర్కెలన్ తెలియ గోరుచు భక్తిని నప్పుడప్పుడున్
    భైరవుఁ డిచ్చుచుండు నశుభంబులు నమ్మిన భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి