6, ఏప్రిల్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 278 (ఖరమె మన కొసంగు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఖరమె మన కొసంగు ఘనసుఖములు.
ఈ సమస్యను సూచించిన మందాకిని గారికి ధన్యవాదాలు.

11 కామెంట్‌లు:

 1. గాడిదల మీద పద్యాలు వ్రాయ లేక తలప్రాణం తోక కొస్తోంది.మిస్సన్నగారూ ఏదైనా ఉపాయం చెప్పండి!
  ఖరము పైని పద్య సరళి వ్రాయగనౌర
  ఖరమె మన కొసంగు ఘనసుఖములఁ
  దలచితి నిపుడెట్లు తప్పునీ నరకము
  ఖరము లెన్నొ వచ్చి కలలు నింపె!

  రిప్లయితొలగించండి
 2. శ్రీశైల శిఖరం దృష్ట్వా, పునర్జన్మ న విద్యతే!

  శ్రీగిరిన్వసించు శ్రీమల్లికార్జును
  దర్శ నంబొ సంగు తృప్తి, నంది
  శృంగ మధ్య మములఁ జూడ శ్రీశైల శి
  ఖరమె మన కొసంగు ఘనసుఖములు!

  రిప్లయితొలగించండి
 3. అరువ దేండ్ల ఫలము నత్యంత భారము
  వహన శీలి గార్ధభమ్ము ననగ
  శుభము లెన్నొ దెచ్చి సుజనులు మెచ్చగా
  ఖరమె మన కొసంగు ఘన సుఖములు !

  రిప్లయితొలగించండి
 4. వరదలు, కరవులు, చేటులు
  ఖరమున కలుగును యనుచును కలవర మేలా?
  సరి! యనుకూలము నెంచుము!
  ఖరమె మనకొసంగు ఘన సుఖములు!

  రిప్లయితొలగించండి
 5. ఆది కాల మందు నార్యులు కాల గ
  మనము జూచి జేచి, మనన గొరకు
  నామకరణ ! ముందు నిలచె శ్రీఖరము యా
  ఖరమె మన కొసంగు ఘనసుఖములు.

  రిప్లయితొలగించండి
 6. దీన రక్షకుండు, దివ్య స్వరూపుండు,
  పావనుండు,లోక పాలకుండు ,
  శ్రీనివాసుడుండు శ్రీవేంకట గిరి శి
  ఖరమె, మనకొసంగు ఘన సుఖములు!

  రిప్లయితొలగించండి
 7. మిత్రులందరి పూరణలు బావున్నాయి శ్రీ చంద్ర శేఖర్ గారన్నట్లు గాడిదల మీద పూరణలు ఎక్కువైనట్లే అనిపిస్తున్నాయి .
  శాస్త్రి గారు, మీ పూరణలో నాలుగవ పాదంలో చివర "త్వరలో" తగిలించండి అందమైన కంద పద్యం అవుతుంది .

  రిప్లయితొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01)
  ____________________________________

  సకల శుభము నిచ్చు - సద్బుద్ధి నిచ్చును
  శాంతి నిచ్చు నమిత - సంప దిచ్చు !
  ముక్తి నివ్వ గలుగు - శక్తి , శ్రీశైల శి
  ఖరమె మన కొసంగు - ఘన సుఖములు!
  _____________________________________

  రిప్లయితొలగించండి
 9. శంకరయ్య గారు, క్రొత్త సమస్యకి "నిద్ర యలసట మాంద్యమ్ము నీడు తెలివి" పరిశీలించగలరు.

  రిప్లయితొలగించండి
 10. చంద్రశేఖర్ గారూ,
  ఖర బాధితుణ్ణి అంటూనే చక్కని పూరణలు పంపారు. మీ "శ్రీశైల శిఖర" దర్శన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ కందపద్య పూరణ బాగుంది. పద్యం చివర "సుఖములు" అని కాకుండా "సుఖము లను శాస్త్రీ" అంటే సరి!

  వరప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ,
  ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.

  వసంత్ కిశోర్ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  సకల శుభము "ని"చ్చు ... అక్కడ "లి" ఉండాలి కదా. టైపాటు కాబోలు.

  రిప్లయితొలగించండి
 11. మాస్టరు గారూ!పీతాంబర్ గారూ! నేను చేసిన పొరబాటును ఎత్తి చూపక తగిన సవరణ సూచించినందులకు ధన్యవాదములు.ఆఫీసుకు వెళ్తూ హడావుడిగా పూరించి వెళ్ళాను.మరల ఇప్పుడే చూస్తున్నాను.సమస్యను కందంగానే మార్చి సవరించి పూరిస్తున్నాను గమనించగలరు.
  -----------------------------------------------------------------------------
  వరదలు, కరవులు, చేటులు
  ఖరమున కలుగును యనుచును కలవర మేలా?
  సరి! యనుకూలము నెంచుము!
  ఖరమొసగును సుఖము శాంతి ఘనముగ చూడన్!

  రిప్లయితొలగించండి