7, ఏప్రిల్ 2011, గురువారం

సమస్యా పూరణం - 279 (నిద్ర బద్ధకము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

12 కామెంట్‌లు:

  1. నిద్ర బద్దకము నొసంగు నీకు, సిరులు
    గలుగ నేరవు, సుఖములు గాన రావు!
    నిద్ర మత్తును వీడిన నీకు గలుగు
    శుభము,శాంతియు , విజయపు సూత్ర మిదియె!

    రిప్లయితొలగించండి
  2. సమయ పాలన, తగినంత శ్రమయు,శాంతి,
    ఆత్మ, పరమాత్మ విశ్వాస మాది గలుగ!
    విడగ కోపమసూయలు,వీడ నతిగ
    నిద్ర బద్ధకము! లొసంగు నీకు సిరులు.

    రిప్లయితొలగించండి
  3. చక్కటి సమస్యగా కూర్చినందులకు శంకరయ్య మాస్టారికి ధన్యవాదాలు. శ్రీకృష్ణ పాండవీయంలో లక్క-ఇల్లు-మత్తువదలరా సీను గుర్తుకొచ్చింది.
    నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు
    భీమ సేనా!నిను౦గని పెట్టు కొనెడి
    బావ కృష్ణయ్య నమ్మిన బంటు వోలె
    తనదు కన్మోడ్పు విడచి తరలి రాగ!

    కన్మోడ్పు=నిద్ర.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    మత్తు వదలరా నిద్దుర - మత్తు వదలు !
    నిద్ర బద్ధకము లొసంగు ! - నీకు సిరులు
    కలుగు శ్రమశక్తి చేతనే ! - కష్ట పడిన
    ఆత్మ విశ్వాస మెక్కుడౌ - యలసు లార !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  5. తే : నిద్ర బద్దకము లొసంగు నీకు సిరులు
    యన్న వట్టి మాటలు, నవి దున్న పాలు
    నిచ్చు నట్టి సత్యము సుమీ , నిత్య సత్య
    మేమియన గట్టి వ్యాయామమేను భామ !

    అందరికీ వందనములు !

    రిప్లయితొలగించండి
  6. నరుడు: హే భగవన్, ధన్యుణ్ణి. నీ పాదసన్నిధికి చేరు వఱకు భూలోకమున నిశ్చింతగ కాలము గడుపు రహస్యమును తెలియజేయుము తండ్రీ
    భగవంతుడు: ఓ వ్యాయామశాల స్థాపించవోయ్ నరుడా, కావలసినంత ధనమబ్బి, చీకూ చింతా లేని బ్రతుకు నీ స్వంతమగును.
    నరుడు: (ప్రశ్నార్థక ముఖంతో అవాక్కై) ????
    భగవంతుడు:
    కలియుగ నరులు భోజ్యపూజ్యు లుదర పరి
    పోషకులు స్థూల కాయత్వ మొంది కుందు
    చుండ పల్ జిమ్ము లుద్భవించు మనుజాళి
    నిద్ర బధ్ధకము లొసంగు నీకు సిరులు

    నరుడు మర్మము తెలుసుకుని వేగిరమే జిమ్మోనరుడయ్యెను.

    (జిమ్ము: gym)

    రిప్లయితొలగించండి
  7. నాల్గవ పాదంలో గణదోషం తొలగించి:
    నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు
    భీమ సేనా!నిను౦గని పెట్టు కొనెడి
    బావ కృష్ణయ్య నమ్మిన బంటు వోలె
    తనదు కన్మోడ్పు విడచియు తరలి రాగ!

    రిప్లయితొలగించండి
  8. పీతాంబర్ గారూ,
    విజయసూత్రాన్ని చక్కగా వివరించారు. బాగుంది.
    కాని నేను "నిద్ర, బద్దకములు" అంటే, మీరు "నిద్ర బద్దకమును" అన్నారు.

    హనుమచ్ఛాస్త్రి గారూ,
    అర్థవంతమైన పూరణ. చాలా బాగుంది.

    చంద్రశేఖర్ గారూ,
    కృష్ణుడు తోడుంటే నిద్ర, బద్దకములు సిరుల నిస్తాయంటారు. బాగుంది.
    నాల్గవ పాదం గురించి చెప్పబోయి క్రిందికి చూస్తే మీ సవరణ కనిపించింది.

    వసంత్ కిశోర్ గారూ,
    పద్యం బాగుంది. కాని "నిద్ర బద్దకములు" అన్వయం కుదరడం లేదు.

    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    "సిరులు + అన్న" అన్నప్పుడు యడాగమం రాదు. "సిరులన్న" అవుతుంది. "సిరు లటన్న" అంటే సరి.

    గిరి గారూ,
    హాస్యస్ఫోరకమైన మీ పూరణ మిస్సన్న గారు చెప్పినట్లు ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పలికె కుంభ కర్ణుని తోడ పవన సూతి
    "నీకు యుద్ధమెందులకోయి నిదురఁ బోక?
    నీల వర్ణుడు చంపడు నిద్రనున్న
    నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు"

    రిప్లయితొలగించండి
  10. సత్యనారాయణ గారూ,
    హనుమంతుని నోట చక్కగా పలికించారు. అద్భుతమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీకృష్ణ రాయబారం సీను: అందులో పద్యాలు అనర్గళంగా పాడిన బాల్యం గుర్తుకుతెచ్చుకొంటూ:
    కపట నాటక కంసారి కృతక మాయ
    నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు
    పార్ధ!వడ్డించువాడు నీవాడు గాన
    నేదరి చతికిలబడిన నేమి? చూచు
    నతడు మొదలునిన్నె, సకలమనువు జేయ!

    మాయ+నిద్ర -మాయనిద్ర -కలిపి చదవండి.
    సకలము + అనువు జేయ=సకలమనువు జేయ (యడాగమము రాదనుకొంటున్నాను).

    రిప్లయితొలగించండి