8, ఏప్రిల్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 280 (అంధుఁ డానందమున)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు.
ఈ సమస్యను సూచించిన కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

 1. అరటి పండ్లను కొనబోగ నతివ యొకతె
  అచట చూచెను తుంటరి,ఆకతాయి
  కామ భావన గప్పిన కళ్ళు తెరచి
  అంధు దానందమున మెచ్చె నతివ సొగసు.

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)
  __________________________________

  బాట దాటను వేచిన - పాంథునొకని
  చేయి పట్టుక నడిపించె - క్షేమముగను
  మంచి మనసున్న సొగసైన - మగువ యొకతె !
  అంధు డానందమున మెచ్చె - నతివ సొగసు !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 3. ఆత్మబంధువు భర్త తానంధుడైన
  కనుట యేలని గాంధారి కట్టె కనులు
  అంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు
  పతిననుసరించుటయె గదా సతికి సొగసు

  రిప్లయితొలగించండి
 4. 02)
  ___________________________________

  మూడు రోజులు గడచిన - తిండి లేక
  మూర్చ గొనియున్న అదవయౌ - పురుషు గాంచి
  అన్న పానము నిడినట్టి - యామె జూచి
  అంధు డానందమున మెచ్చె - నతివ సొగసు !
  ___________________________________
  అదవ = అనాథ

  రిప్లయితొలగించండి
 5. 03)
  _____________________________________

  పిల్ల లందరు రాళ్ళను - వేయుచుండ
  పిచ్చి పిచ్చిగ పరుగెత్తు - పిచ్చి వాని
  రమణి ,పిల్లల నదిలించి - రక్ష జేయ
  అంధు డానందమున మెచ్చె - నతివ సొగసు !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 6. వలచిన పొలతి కరమంది పరవశంబుఁ
  గౌగిలించి తన్మోహంబు కనులుఁ గప్ప
  పైదలి సుమధురాధరపానమత్తు
  డంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు.

  రిప్లయితొలగించండి
 7. 04)
  __________________________________

  పతుల తోడను గుట్టుగా - పరుల పంచ
  మెలగు చున్నట్టి పాంచాలి - మించు గాంచి
  ముండరౌ కీచ కుండంత- మోహ మెక్కి;
  అంధు డానందమున మెచ్చె - నతివ సొగసు !
  __________________________________

  ముండరి = వ్యభిచారి

  రిప్లయితొలగించండి
 8. 05)
  ____________________________________

  భర్త లోపంబు మదినెంచి; - భావ్య మనుచు
  అంధకారము స్వయముగ - నాదరించు
  భార్య గాంధారి తనకిల - భాగ్యమనుచు
  అంధు డానందమున మెచ్చె - నతివ సొగసు !
  ____________________________________

  రిప్లయితొలగించండి
 9. సమర మందున శ్రీతోడ సత్య భామ
  నరకునుని జంపిన బిదప నీర జాక్షు
  నియదలో స్థానమును బొంద , నాతి పైన
  నంధు డానందమున మెచ్చె నతివ సొగసు !
  గురువు గారికి మరియు అందరికీ వందనములు,అందరి పూరణలూ భాగున్నవి !

  రిప్లయితొలగించండి
 10. చిత్ర నాయికలకు నేడు సిగ్గు లేదు
  చీరలంతరించి మిగిలె చిన్ని గౌన్లు
  పేలికలె వస్త్రములు కాగ ప్రీతిఁ గని మ
  దాంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు!!

  రిప్లయితొలగించండి
 11. హనుమచ్ఛాస్త్రి గారూ,
  కళ్ళుండీ గుడ్డివాడయిన ఆకతాయిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  వసంత్ కిశోర్ గారూ,
  మీ పూరణల పంచరత్నాల వెలుగులో అంధులకు జ్ఞానజ్యోతులు కనిపిస్తాయి. అయిదు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  రెండవ పూరణ మొదటి పాదమో యతి తప్పింది. "తిండి"ని "భుక్తి"గా మార్చితే సరి.
  నాల్గవ పూరణలో "ముండరి + ఔ" అన్నప్పుడు యడాగమం వస్తుంది. "ముండరి యగు కీచకు డంత- మోహ మెక్కి" అంటే ఎలా ఉంటుంది?

  ఫణి ప్రసన్న కుమార్ గారూ,
  ఇంతకు ముందే "తురుపుముక్క" మిమ్మల్ని ప్రశంసించి ఇప్పు డీ పూరణ చుసాను. ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రవి గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  వరప్రసాద్ గారూ,
  మంచి ప్రయతనం. గణాలు సరిపోయాయి. కాని 2, 4 పాదాలలో యతి తప్పింది. (బ్రాకెట్లో) నా సవరణలు.....
  సమర మందు (కృష్ణుని)తోడ సత్య భామ
  నరకు జంపిన (తరువాత సరసి)జాక్షు
  (నెదను) స్థానము బొంద(గ నిం)తి పైన
  నంధు డానందమున మెచ్చె నతివ సొగసు !

  సత్యనారాయణ గారూ,
  మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. కపట సన్న్యాసి దూషించి గరళ కంఠు,
  మెచ్చ పార్వతి యందమున్ నెచ్చెలి యనె:
  "శంభు దూరెడి మొరటుడు సారెకును, మ-
  దాంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు."

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా !
  మీ సూచనలకు
  సవరణలకు
  ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 14. మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  అయితే మొదటి రెండు పాదాల్లో అన్వయం కుదరడం లేదు.
  "కపట సన్యాసి దూషించె గరళ కంఠు" లేదా "కపట సన్యాసి దూషింప గరళ కంఠు" అంటే అన్వయం కుదురుతుందేమో చూడండి.

  రిప్లయితొలగించండి
 15. అతను బాహ్య సౌందర్యమ్మునరయ లేడు,
  మనుసు పొరలను చదివిన మౌని గాన
  యాత్మ సౌందర్య వీక్షణ యతను జేసి
  అంధు డానందమున మెచ్చె - నతివ సొగసు !

  రిప్లయితొలగించండి
 16. పీతాంబర్ గారూ,
  ఆత్మసౌందర్యాన్ని ఆవిష్కరించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ, అంటే యతి వేషంలో ఉన్న శివుడు పార్వతి దగ్గరకు వచ్చి
  శంభుని దూషించి, పార్వతి అందాన్ని మెచ్చుకున్నాడు. అప్పుడు పార్వతి
  చెలికత్తె యిలా అన్నది అని నా భావం.

  రిప్లయితొలగించండి