9, ఏప్రిల్ 2011, శనివారం

సమస్యా పూరణం - 281 (పరుని పైన సాధ్వి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పరుని పైన సాధ్వి మరులు గొనెను.

24 కామెంట్‌లు:

 1. సిరియు భీష్మకునకు వరపుత్రికగ పుట్టె
  విష్ణుడిలను బుట్ట కృష్ణుడగుచు
  శౌరి లీలలెల్ల సభలందు విని పరా
  త్పరుని పైన సాధ్వి మరులు గొనెను

  రిప్లయితొలగించండి
 2. ఫణి గారూ !
  మీ పూరణ ప్రశస్తముగా నున్నది !

  రవీజీ !
  మీ పూరణ మనోఙ్ఞముగా నున్నది !
  చేట కనులు
  చిరుత ప్రాయం
  సింహ సంహననుడు
  మీన ధ్వజా పరుడు

  వీటిని కొంచెం వివరించ గలరా !

  రిప్లయితొలగించండి
 3. కంటనీరు బెట్ట కలుములు గలుగవు!
  మహిళ లన్న మహిని మాతృ సములు!
  అన్న భావనున్న ఆత్మనాధు! దయా
  పరుని పైన! సాధ్వి మరులు గొనెను.

  రిప్లయితొలగించండి
 4. మూడు ముళ్ల వేళ ముగ్ద రీతిగ నుండె
  ప్రథమ రాత్రి వేళ పతినిఁ జేరె
  సిగ్గు విడుయు వేళ శృంగార భావ త
  త్పరుని పైన సాధ్వి మరులు గొనెను!!

  రిప్లయితొలగించండి
 5. కపట వేషధారి కాముకుడై జేర
  మోస మెఱుగని సతి మోహితాత్ము
  చెంగట లలినిల్చె చెలువము మీఱగ
  పరుని పైన సాధ్వి మరులు గొనెను

  రిప్లయితొలగించండి
 6. నిష్ఠ తోడ నిలిచె నియమముగ నహల్య
  గడప దాటి వెళ్లె గౌతముండు
  చేటు కాలము తన చెంత చేరిన వేళ
  పరుని పైన సాధ్వి మరులు గొనెను!!

  రిప్లయితొలగించండి
 7. సత్యనారాయణ గారూ పద్యం చాలా స్మూత్ గ ఉంది. చేయితిరిగిన వారాయె మరి.
  "నిష్ఠ తోడ నిలిచె నియమముగ నహల్య
  గడప దాటి వెళ్లె గౌతముండు"

  రిప్లయితొలగించండి
 8. కవుల పూరణలన్నీ అద్భుతంగా ఉన్నాయి.

  వసంత్ కిషోర్ గారూ,
  చేట కనులు = పెద్ద కళ్ళు (ప్రయోగం చూశాను కానీ గుర్తులేదు)
  చిరుత ప్రాయం = నవయవ్వనుడు
  సింహ సంహననుడు = సింహము వంటి నడుము గలవాడు
  మీన ధ్వజా పరుడు = మీనధ్వజుడంటే మన్మథుడు. మీనధ్వజ అపరుడు అంటే మన్మథుడికి సరిపోలినవాడు.

  శంకరాభరణం బ్లాగులో నాకు ఛప్పున తోచినది రాశాను, రాస్తున్నాను, తప్పులు ఒప్పులు చూసుకోకుండా. ఎలాగూ తప్పులు ఉంటే గురువులు దిద్దుతారు, కొత్తవిషయాలు తెలుస్తాయి అన్న ఆలోచనతో.

  రిప్లయితొలగించండి
 9. ఫణిప్రసన్న కుమార్ గారూ,
  రుక్మిణి పరాత్పరునిపై మరులుగొన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రవి గారూ,
  మీ అపర మన్మథుని పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  హనుమచ్ఛాస్త్రి గారూ,
  దయాపరుడైన భర్త మీద మరులు గొన్న సాధ్విపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  సత్యనారాయణ గారూ,
  శృంగార భావ తత్పరునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
  "సిగ్గు విడుచు/వీడు" అంటే బాగుంటుందేమో?

  గిరి గారూ,
  మీరు పరోక్షంగా ప్రస్తావించింది అహల్యావృత్తాంతమే కదా? పూరణ బాగుంది. అభినందనలు.

  రావు గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 10. సత్యనారాయణ గారూ,
  అహల్యావృత్తాంతంతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. కలను నైన తలపుఁ గలుగంగ నీయదు
  పరుని పైన సాధ్వి! మరులు గొనెను
  దుష్ట రావణుండు తొయ్యలి సీతపై,
  పరుని కాంతఁ వలచి ఫలము నొందె.

  రిప్లయితొలగించండి
 12. రవిజీ !
  ఓపికతో వివరించినందులకు
  ధన్యవాదములు !
  నా ఉద్దేశ్యం
  తప్పులు పట్టడం
  ఎంతమాత్రం కానేకాదు !
  సందేహాలు తీర్చుకోవడం కోసం మాత్రమే !
  దయచేసి గమనించ గలరు !

  రిప్లయితొలగించండి
 13. రవీజీ !
  మీ పూరణలో నాయకుడు మన్మథుడు కాదా ?
  మన్మథుని సరిపోలిన వాడంటున్నారు !!!
  సంహననము = శరీరము ----(ఆంధ్రభారతి)
  సింహసంహననుడు = సర్వాంగ సుందరుడు---(ఆంధ్రభారతి)
  మీరు చెప్పే అర్థం ఎక్కడిది ?

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా !
  ఇవి కొంచెం వివరించండి !
  చేట కనులు = పెద్ద కనులు
  (నాకీ ప్రయోగం కొత్తగా ఉంది మరీ చేటంత కనులా ???)
  చిరుత ప్రాయం = నవయవ్వనుడు
  (ఇది కూడా వింతగా ఉంది ! బాల్యమనే భావన నాది)
  మీనధ్వజాపరుడు = మీనధ్వజ + అపరుడు
  (అపరుడు అనే పదమే నా కెక్కడా దొరకలేదు)

  మకరధ్వజుడు అన్నప్పుడు చేప అనే అర్థమే
  తీసుకోవాలా ?
  (నేను మొసలి అనుకునే వాడిని )

  రిప్లయితొలగించండి
 15. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01)
  ____________________________________

  అమల కీర్తి కరుని - ఆజాను బాహుని
  చిఱుత నగవు మొగము - చిందు వాని
  విక్రమంబు తోడ - విల్లు విరచువాని
  పరుని పైన సాధ్వి - మరులు గొనెను !
  ____________________________________
  పరుడు = పరమాత్ముడు = శ్రీరాముడు

  రిప్లయితొలగించండి
 16. శంకరయ్య గారు, మీరు ఊహించినది నిజమే

  రిప్లయితొలగించండి
 17. 02)
  ______________________________________

  కబురు పంప గానె - కరుణ కాదనకుండ
  రథము పైన వచ్చి - రయము గాను
  కరము నందు కొనిన - కమలాక్షు దయగాంచి
  పరుని పైన సాధ్వి - మరులు గొనెను !
  ______________________________________
  పరుడు = పరమాత్ముడు = శ్రీ కృష్ణుడు

  రిప్లయితొలగించండి
 18. 03)
  ______________________________________

  పెద్ద లంద రెదుట - పేరోలగము నందు
  చిన్నబుచ్చినట్టి - చెడ్డ వాని
  బవర మందు గెలువ; - పవన సుతుని,శక్తి
  పరుని పైన సాధ్వి - మరులు గొనెను !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,
  మనోహరమైన పూరణ. అభినందనలు.

  వసత్ కిశోర్ గారూ,
  మీ అభ్యంతరాలలో మొదటి రెండిటితో నేను ఏకీభవిస్తున్నాను.
  మన్మథుణ్ణి మకరధ్వజుడు, మీనధ్వజుడు అంటారు. "మకర" శబ్దానికి మొసలి రూఢ్యర్థం. పెద్ద చేప అనే అర్థాన్ని కూడా నిఘంటువు చెప్తున్నది.
  ఇక మీ మూడు పూరణలూ బాగున్నాయి. "పరుడు" శబ్దానికి ఉన్న పరమాత్ముడనే అర్థాన్ని చక్కగా వినియోగించుకున్నారు. ఇక మూడవ పూరణ తలమానికమే. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. మిస్సన్న మహాశయా !
  మీ పూరణ మహత్తరముగా నున్నది !
  కాని - చిన్న అభ్యంతరం !

  "పరుని కాంత వలచి - ఫలము నొందె"
  అంటే వ్యతిరేక ఫలము పొందాడన్న మీ భావం సుస్పష్టం !
  అయినా అనుకూల ఫలము పొందినట్లని పిస్తుంది కూడానూ !
  (రామాయణం తెలియని వారికి)
  ఏతావాతా
  "పరుని కాంత వలచి - మరణ మొందె "
  అంటే ఎలా వుంటుందంటారు ?

  రిప్లయితొలగించండి
 21. "పరుని కాంత వలచి - మరణ మొందె "
  వసంత కిశోర్ గారూ పద్య పాద సవరణ బ్రహ్మాండంగా ఉంది. మిస్సన్న గారికి నచ్చు తుందని అనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 22. కిశోర మహోదయా మీ సవరణతో ఏకీభవిస్తున్నాను.

  రిప్లయితొలగించండి