11, ఏప్రిల్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 283 (పిండి తక్కువైనను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె.
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. చూడ పిల్లల జేర్చగ స్కూల్స్ కొన్ని
    దృష్టి పెట్టెను డబ్బులు దోచుటందు
    చదువు తగ్గెను ప్రకటన పెద్దదయ్యె
    పిండి తక్కు వైనను దోసె పెద్దదయ్యె!

    రిప్లయితొలగించండి
  2. పద్య పాదముఁజూడఁగఁ భయము లేదు
    కొలది యోచనెఁజాలును గొప్పగాను
    తగిన పూరణఁజేయఁగఁ ధైర్య మబ్బె
    పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె

    రిప్లయితొలగించండి
  3. పిల్ల వాడికి పాలను పట్ట కుండ
    పరుగులిడు పడతియు ; కుటుంబమును పగలు
    జూడని పతియు నుండగ జగతి యందు
    పిండి తక్కువైయెను, దోసె పెద్ద దయ్యె !

    { పిండి = వ్యాయామము , దోసె = రోగము }

    రిప్లయితొలగించండి
  4. దేవుడు, గురువు, పెద్దలు దయ్య మైరి
    కుక్క మూతి పిందెలు హెచ్చు కలియుగంలొ
    గౌరవము గాడిదలకివ్వ , గజము జెప్పె
    పిండి తక్కువైనను- దోసె పెద్దదయ్యె !



    { గజము = నిమ్మధస్తుడు, పిండి = తెలివి , దోసె = పదవి }

    రిప్లయితొలగించండి
  5. నీటినైజమ్ము నెఱిగిన చేటివలన
    కొలదియైనను మాయింటకొదవలేదు
    పొదుగులెండినన్ బాల్ పొంగి పొరలుచుండె
    పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె

    రిప్లయితొలగించండి
  6. మూడవ పాదంలోని యతి కలవనందున సవరణజేయుచున్నాను.

    చూడ పిల్లల జేర్చగ స్కూల్సు కొన్ని
    దృష్టి పెట్టెను డబ్బులు దోచుటందు
    మూర చదువుకు ప్రకటన బారెడయ్యె
    పిండి తక్కువైనను దోసె పెద్దదయ్యె!

    రిప్లయితొలగించండి
  7. కొంచె మిచ్చిరి లబ్ధికై లంచములను
    గనులు సొత్తాయె, భూములు ఖాయ మయ్యె,
    ఫ్లాట్లు చౌకాయె, స్పెక్ట్రమ్ము కోట్ల నిచ్చె
    పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె

    రిప్లయితొలగించండి
  8. మొద్దు పెనము పై నాకును మోజు పోయె
    కొంటి నాన్ స్టిక్కు పెనమును కొర్కెఁ గల్గ
    అట్టు పలచగ పోసితి నంటకుండ
    పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె!!

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    ____________________________________

    అన్న మనసున పుట్టిన - చిన్ని యూహ
    దండి యాత్ర వలె ప్రబలి - దండ యాత్ర
    అఖిల భారత దేశము - నావహించి
    మోదమును గూర్చె ప్రజలకు; - మోక్ష మిడగ
    లోక పాలక బిల్లుకు - లోక సభను
    నిర్ణ యించెను సర్కారు; - నిశ్చయముగ
    తప్పదింక నీచులకును - ముప్పు ముందు
    పిండి తక్కువైనను దోసె - పెద్ద దయ్యె !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  10. వసంత కిశోర్ గారూ పూరణ బాగుంది. రెండవ పాదం లో మూడవ గణం ప్రబలె అంటే సరిపోతున్దంటారా. "దండి యాత్ర వలె ప్రబలె - దండ యాత్ర" అంటే ఇంకా బాగుంటుందేమో అని. తప్పుంటే క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు. అమ్మ కటాక్షము పొందిన ఘను లందఱికీ నమస్కారములు.
    మిత్రు లందఱూ పసందైన దోసెలు వేస్తున్నారు. హనుమఛ్ఛాస్త్రి గారి పాఠశాలల ప్రస్తావన బాగుంది. గిరి గారి పూరణ అద్భుతము. మిస్సన్న గారూ రాజకీయ నాయకుల వద్ద ఉన్నవి మఱ్ఱి విత్తనాలు ! నిజమైన దోస శ్రీ జిగురు సత్యనారాయణ గారే వేసారు !అది నాన్ స్టిక్ అంటున్నారు ! మందాకిని గారు చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. కిశోర్ జీ కవితా ప్రవాహము బ్రహ్మాండము!


    మిత్రులు చంద్రశేఖరులు యిదివరలో నాకు జాతకము చెప్పారు, తక్కువ కష్టముతో ఎక్కువ ఫలితాలు లభిస్తాయని. అందుకే నా తేలిక దోస !


    శారదమ్మకు ప్రణమిల్ల చదువు నొసగె
    భుక్తి గలిగెను భూమిపై, ముక్తి కోర
    భాగవతమును జూపెను భక్తిఁ జదువ
    పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె !

    రిప్లయితొలగించండి
  12. హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    అల్పజ్ఞానమనే పిండితో అనల్పపద్య మనే దోసెను తయారు చేసారు. బాగుంది. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    పద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.

    గిరి గారూ,
    పొదుపు వల్ల లాభాన్ని చక్కగా తెలిపారు మీ పూరణలో. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    "కొద్ది లంచం, పెద్ద లాభం" అనే క్రొత్త సామెతను పుట్టించారు మీ పూరణతో. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    ________________________________

    మూర్తిజీ !
    ధన్యవాదములు !
    రావు గారూ
    ధన్యవాదములు !
    రావుగారి సూచన పై
    చిన్న మార్పు

    01అ )
    ____________________________________

    అన్న మనసున పుట్టిన - చిన్ని యూహ
    దండి యాత్ర వలె ప్రబలె- దండ యాత్ర
    అఖిల భారత దేశము - నావహించి
    మోదమును గూర్చె ప్రజలకు; - మోక్ష మిడగ
    లోక పాలక బిల్లుకు - లోక సభను
    నిర్ణ యించెను సర్కారు; - నిశ్చయముగ
    తప్పదింక నీచులకును - ముప్పు ముందు
    పిండి తక్కువైనను దోసె - పెద్ద దయ్యె !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  14. సత్యనారాయణ గారూ,
    మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    అన్నా హజారే మొదలు పెట్టిన చిన్ని ఉద్యమం ప్రజలకు పెద్ద ప్రయోజనాన్ని కలిగించిన వైనాన్ని చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు.

    నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    కవిమిత్రుల పూరణలను ప్రశంసించిన సహృదయతకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి