18, ఏప్రిల్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 289 (నారాయణ యనినవాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ.
సమస్యను పంపిన అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

 1. (భూకైలాస్ లో అక్కినేని నారదుని పాత్ర అద్భుతంగా చేశారు..అది అంశం)

  నారాయణ యని అనుచును
  నారదుడుగ పాత్ర వేసె నాగేశ్వర్రావ్ !
  'బోరని ' యెవడే మన్నను
  'నారాయణ!'యనిన వాడు నవ్వుల పాలౌ !

  రిప్లయితొలగించండి
 2. నారాయణ యను వాడే
  నారాయణునికడఁజేరనౌనిది నిజమే!
  నారాయణ! పూరింపుము-
  "నారాయణ యనినవాడు నవ్వుల పాలౌ"

  జేరనౌను+ఇది

  రిప్లయితొలగించండి
 3. స్వారాజ్యముఁ బొందును సరి
  నారాయణ యనినవాఁడు, నవ్వుల పాలౌ
  దారా పుత్రుల బంధన
  వారాశిన్ దాటలేక భారకుడగుచున్!
  మనవి: శ్రీమదాంధ్ర భాగవతము షష్ఠ స్కంధములోని అజామిళోపాఖ్యానం స్ఫూర్తి.

  రిప్లయితొలగించండి
 4. ఘోరమయినభక్తి,పరమ
  వీరావేశమున, వినరు, విష్ణుపదమహో!
  పోరాడజాలను, కేశవ!
  నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ.

  రిప్లయితొలగించండి
 5. నారాయణునిగఁ దననే
  యారాధనజేయుమంచు యానాడొకచో
  మారాజొకడున్ "నేనే
  నారాయణ" యనిన,వాడు నవ్వుల పాలౌ

  రిప్లయితొలగించండి
 6. హనుమచ్ఛాస్త్రి గారూ,
  నిజమే. ఆ కళాఖండాలు ఈతరం వాళ్ళకు "బోరే!" ఎప్పుడైనా ఆ సీడీ వేసికొని చూడాలంటే ఇప్పటివాళ్ళముందు మనమూ నవ్వుల పాలౌతున్నాము.
  మంచి విషయాన్ని ఎన్నుకొని సమస్యను సార్థకం చేసారు. ధన్యవాదాలు.

  మందాకిని గారూ,
  హన్నా! సమస్యను సమస్య గానే పూరించారే. భేష్! బాగుంది.
  మీ రెండవ పూరణ ఇంకా బాగుంది. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  అజామిళుడి ప్రస్తావనతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

  వెంకటప్పయ్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం ఉంది. "పోరాడజాల కేశవ!" అంటే సరి.

  రిప్లయితొలగించండి
 7. ఏరోము నందు నుండగ
  నారోమను పాట పాడ, ననుచితమెట్లౌ ?
  నేరుగ నలుగురి పాటుగ
  నారాయణ యనని వాడు నవ్వుల పాలౌ!

  రిప్లయితొలగించండి
 8. పీతాంబర్ గారూ,
  పద్యం చాలా బాగుంది. కాని మీరు సమస్యనే మార్చారు కదా. సమస్యలోని "అనిన" మీ పూరణలో "అనని" అయింది.

  రిప్లయితొలగించండి
 9. చేరెన్ వైకుంఠము సుతు
  నారాయణ యనినవాఁడు; నవ్వుల పాలౌ-
  లేరా రమ్మను హరినన
  నారాయణు డసురు జంపె నరసింహుండై.

  రిప్లయితొలగించండి
 10. పేరేమి నీదని యడిగె
  నారి యొకతి , పేరు "సత్య నారాయణ"; తా
  నోరు తిరగకయె "తత్తి
  న్నారాయణ" యనిన, వాఁడు నవ్వుల పాలౌ!!

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  _____________________________________

  మా ఊళ్ళో ఎప్పుడూ సారా తాగే నారాయణను
  అందరూ "సారాయణ "అని పిలుస్తారు !
  పొరపాటుగా ఎవరైనా "నారాయణా" అంటే
  విన్న జనం విరగబడి నవ్వుతారు !

  01)
  _____________________________________

  జారుడు భీరుడు చోరుడు
  సారా ద్రాగుచు దిరిగెడు - సన్నపు వాడే
  సారాయణంద్రు వానిని !
  నారాయణ యనిన వాడు - నవ్వుల పాలౌ !
  _____________________________________
  సన్నపు వాడు = అల్పుడు

  రిప్లయితొలగించండి
 12. హరి ఎక్కడ ?
  శ్రీ హరి ఎక్కడ ?
  నారాయణు డెక్కడ ?
  అంటూ ద్వేషంతో రగిలే
  హిరణ్య కశిపుని వధ :

  02)
  _____________________________________

  ఓరీ ! డింభక చూపెద
  వా , రాడున శ్రీహరి ? యన - భక్తుడు జూపన్ !
  క్రూరముగ మడిసె; "హరి -హరి
  నారాయణ " యనిన వాడు ! - నవ్వుల పాలౌ !
  _____________________________________
  రాడు = స్తంభము

  రిప్లయితొలగించండి
 13. 03)
  ______________________________________
  నారాయణ నామమునే
  పారాయణ జేయ గలుగు - పరమ పదంబే !
  ఘోరమురా , కలి కాలము
  నారాయణ యనిన వాడు - నవ్వుల పాలౌ !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 14. గురువుగారు మీ వ్యాఖ్య చుసిన తర్వాతగాని నా పొరపాటును గమనించనేలేదు .మన్నించండి.

  హిరణ్య కశిపుడు నారదునితో ఇలా అంటున్నాడు.

  నారాయణ పారాయణ
  నారద నీనోట తగదు ! నా నామమ్మే
  నోరారగ పలుక తగును ,
  నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ.

  రిప్లయితొలగించండి
 15. కవి మిత్రుల పూరణలతో నారాయణ నామము పారాయణ జరుగుచున్నది.
  అందరకూ అభినందనలు.
  సత్యనారాయణ గారూ!నోరు తిరగని వారి తో జాగ్రత్త.

  రిప్లయితొలగించండి
 16. నా పూరణ .......

  "ధీరతఁ గమ్యూనిస్టై
  పోరాడెడివాఁడు భక్తిఁ బూజించు సదా
  శ్రీరాముని సీపీయై
  నారాయణ" యనిన వాడు నవ్వుల పాలౌ.

  ఈ పూరణకు "క్లూ" చెప్పిన కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. మిస్సన్న గారూ,
  మా పూరణ చాలా బాగుంది. "నార - పీచు" కథను గుర్తుకు తెచ్చారు. అభినందనలు.

  సత్యనారాయణ గారూ,
  నోరు తిరగని వాడు నవ్వులపాలైన విధానాన్ని చక్కగ పూరణలో చెప్పారు. అభినందనలు.

  వసంత్ కిశోర్ గారూ,
  మీ మూడు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా మీ "సారాయణ" పద్యం అలరించింది. అభినందనలు.

  పీతాంబర్ గారూ,
  మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. మాస్టరు గారూ! విలక్షణ పూరణ నందించారు.అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. శంకరార్యా !
  ధన్యవాదములు !
  సి పి ఐ నారాయణ మీద పూరణ
  చాలా బావుంది !

  రిప్లయితొలగించండి
 20. ఈ రాష్ట్రమందు సినిమా
  వారందరిలోఁ బొడవగు వ్యక్తినిఁ దెలుపన్
  నేరక ఠక్కున నెమ్మెస్
  నారాయణ యనినవాఁడు నవ్వులపాలౌన్

  రిప్లయితొలగించండి
 21. నోరూరగ "గీతాంజలి"
  తీరుగ "జనగణమన"యును దీటుగ "గోరా",
  "చారూ" రచయిత "ఆర్. కే.
  నారాయణ" యనినవాఁడు నవ్వుల పాలౌ

  రిప్లయితొలగించండి
 22. జోరుగ నాస్తికమొల్లుచు
  పోరుచు మతములను రోజు ప్రొద్దున రాత్రిన్
  తీరా చావెదురవగనె
  నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ

  రిప్లయితొలగించండి


 23. పేరును గాంచు జిలేబీ
  "నారాయణ" యనినవాఁడు; నవ్వుల పాలౌ
  "నారా" యనయనిన సుమా
  హేరాళముగనెలుగెత్తు యిందీవరుడిన్


  జిలేబి

  రిప్లయితొలగించండి