27, ఏప్రిల్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 321 (ఆవకాయ రుచుల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఆవకాయ రుచుల నతివ రోసె.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  01)
  _______________________________

  ఆరు నెలల క్రింద - ఆమె పెళ్ళి జరిగె
  వింత మార్పు వచ్చె - వెలది లోన
  వెక్కసంబు తిండి - వేవిళ్ళు మొదలాయె !
  ఆవకాయ రుచుల - నతివ రోసె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 2. 02)
  _______________________________

  ధరలు పెరిగె నవని - ధాన్యంబు , కూరలు
  తిండి గింజ లయ్యొ - మండి పోయె
  దినపు బత్తె మునకు - తిండి గింజలు రాక
  ఆవకాయ రుచుల - నతివ రోసె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 3. ఆవకాయ పెడుదు నత్తగారికి పోటి!
  చూడు డనుచు పెట్టి,చూచె రుచిని
  మొదట తాను;నాడు మొదలు ముట్టననుచు
  ఆవకాయ రుచుల నతివ రోసె!

  రిప్లయితొలగించండి
 4. 03)

  _______________________________


  కూరగాయ ధరలు - ఘోరంబుగా మార
  ఆరు నెలల నుండి - ఆవ కాయె !
  తినగ తినగ వెగటు - తిండి మీదే పుట్టె !
  ఆవకాయ రుచుల - నతివ రోసె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 5. 04)
  _______________________________

  పుట్టె కడుపు లోన - పుండు కేన్సరొ యేమొ
  టెష్టు జేసి నపుడె - స్పష్ట మగును !
  అంత దనుక నాపు - ఆవకాయని జెప్ప
  ఆవకాయ రుచుల - నతివ రోసె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 6. 05)
  _______________________________

  వేడి నీళ్ళ తోడు - గూడు చల్లని నీళ్ళు !
  మగని నాదు కొనగ - మగువ దలచి
  అమ్మసాగె నామె - ఆవకాయను బెట్టి !
  ఆవకాయ రుచుల - నతివ రోసె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 7. ఎన్నో రకాలుగా ఆవకాయ రుచులు చూపిస్తున్న కిశోర్ గారికి అభినందనలు.

  ఆంధ్ర పడుచు వచ్చె నమెరికా నుండిటు
  అత్త గారి గ్రామ మచట జూడ
  ఆవకాయ రుచుల, నతివరో!సెహబాసు
  ఆహ!ఆహ! యనుచు నారగించె!

  రిప్లయితొలగించండి
 8. గురువుగారూ ఆ సమస్యలను సూచించే ఆయనకు చెప్పండి.
  చూడ్డానికి కాస్త బాగుండే సమస్యలను సూచించమని.
  ఆవకాయ చూసి రోసింది, చింతకాయ చూసి చిందులేసింది,
  తొక్కు పచ్చడి చూసి తైతక్క లాడింది, యివా సమస్యలు?

  రిప్లయితొలగించండి
 9. ఐసు క్రీము దినగ నలవాటు పడెనేమొ,
  నావకాయ రుచుల నతివ రోసె,
  ఆంధ్ర నావ కాయ నవనిలో మేటిరా,
  దాని దినిన జన్మ ధన్య మగును !

  రిప్లయితొలగించండి
 10. పీతాంబర్ గారి పద్యం చదవండి, ఆవకాయ మహిమ తెలుస్తుంది. సమస్యలు చూడ్డానికి భాగుండకూడదు, పూరించటానికి బాగుండాలి. చూశారా, మా ఆవకాయ గంటలో డజను పైన పద్యాలు వ్రాయించింది కవి మిత్రులచేత.

  రిప్లయితొలగించండి
 11. కార సరకుల మమకారము భర్తకు
  వివిధ చట్ని రుచులు వింగడించె
  పప్పు పులుసు లేక పాయస మెరుగక
  ఆవకాయ రుచుల నతివ రోసె.

  (వింగడించె: వేరుగా, ప్రత్యేకముగా చేయుట)

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులకు ధన్యవాదాలు. ఆవకాయ రుచి అంత తొందరగా విడవలేము. దేశాంతరాలల్లో వున్నా మొదట తెలుగువారి నోట వచ్చేది ఆవకాయే.
  గున్న మావి కాయ గుంటూరి కారము
  మెట్ట యావ పిండి మెంతులేసి
  పప్పునూనె వేసి పాళ్ళలో గలప,నే
  యావ కాయ రుచుల నతివ రోసె?

  మావూరి శాంతమ్మగారి మాటల్లో, "చచ్చిన జిహ్వ లేచి వస్తుందండీ ఆవకాయ తినగానే", అందుకోండి:
  బండ బారె జిహ్వ బర్గరు పిజ్జాలు
  తినగ,తిరిగి వచ్చె తీరుగ తిన
  నావకాయ రుచుల, నతివ రోసెనువింత
  తిండ్లు వెలయు రీతి తెలుగు నాట!

  మనవి:"కాదేది కవిత కనర్హము"

  రిప్లయితొలగించండి
 13. అయితే అయింది కానీ బలేగా సంజాయిషీ చెప్పించాను. :))

  రిప్లయితొలగించండి
 14. ఎన్నతరమె నాకు ఎలనాగ నీ వంట
  చారుఁ జేయుటందు జాణవీవు
  ఆవకాయ రుచుల నతివరో సెహబాసు
  పప్పుఁ బెట్టుటందు ఫస్టు నీవు

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోర్ గారూ,
  మీ ఐదు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా 3వ, 4వ పూరణలు అద్భుతంగా ఉన్నాయి. రోజూ ఒకటే తింటే ఎవరికైనా అసహ్యమే. ఇక కడుపులో కాన్సరో, అల్సరో వచ్చి ఆవకాయ మనడం మంచి ఆలోచన. బాగున్నాయి. అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి.
  పాపం! కొత్తకోడలి అవస్థను చక్కగా వర్ణించారు.
  "అతివరో! సెహబాసు" అనడం అద్భుతంగా ఉంది.
  బాగుంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  చంద్రశేఖర్ గారు "ఇది ఆవకాయ సీజను కదా! తత్సంబంధమైన సమస్య ఏదైన ఇస్తే బాగుంటుందని "క్రొత్త ఆవకాయ (రుచులు) కోరి విడిచె" ను సమస్యగ ఇవ్వమని సూచించారు. కాలానుగుణంగా ఉంటుందని భావించి దానిని నేను కొద్దిగా సవరించి ప్రకటించాను.
  చూసారు కదా! ఎన్ని మంచి పూరణలు వచ్చాయో! ముఖ్యంగా "ఆవకాయ రుచుల నతివరో! సెహబాసు" అనడంలోని చమత్కారాన్ని, కవి ప్రతిభను గమనించండి.
  మీరు హాస్యానికి చెప్పినా క్రింది వాటిని సమస్యలుగా ప్రకటించడానికి స్వీకరిస్తున్నాను (మీరు అనుమతిస్తేనే) :-)
  1. చింతకాయఁ జూచి చిందులేసె.
  2. తొక్కు పచ్చడి మెసఁగి తైతక్క లాడె.

  రిప్లయితొలగించండి
 16. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు,
  పచ్చళ్ళకు అలవాటు పడ్డ మగని వల్ల అతివ కష్ట పడిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  ఇచ్చిన సమస్యను సమర్థించుకుంటూ మీరు చేసిన పూరణలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

  ఫణి ప్రసన్న కుమార్ గారూ,
  మీరూ శాస్త్రి గారి బాటనే పట్టారు. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ మీరు యిలా దెబ్బ కొట్టేస్తారని కలలో గూడ ఊహించలేదు.
  కానీండి మీ చిత్తం వచ్చినట్లే.
  చంద్ర శేఖర్ గారు మీ వ్యాఖ్య చూసి ఇంట్లో సెలెబ్రేట్ చేసేసుకొని ఉంటారు.

  రిప్లయితొలగించండి
 18. మాస్టరు గారూ! ధన్యవాదములు.మీరు పెడుతున్న 'సాన ' ప్రభావమే అది.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ శంకరయ్యగార్కి..వందనములు సమస్యాపూరణ నిర్వహణ,
  వారి వారి పూరణలు బహుబాగు....గోలివారు అతివరొ!సెహబాసనడం
  చాలా బాగుంది...పాల్గొన్నవారందరూ అభినందనీయులు...మీరుకూడా..

  రిప్లయితొలగించండి
 20. హనుమంత రావు గారూ,
  "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.

  రిప్లయితొలగించండి