3, ఏప్రిల్ 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (కారము గన్నులం బడిన)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
కారము గన్నులం బడినఁ
గల్గును మోదము మానవాళికిన్.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

  1. చేరియు వేంకటాద్రి, దరిశించియు దేవళమందు భక్తితో
    శ్రీరమ ప్రాణ వల్లభుని శ్రీపద యుగ్మము, ధన్య జీవనా
    ధార కటాక్షమందుటకు తా మరుదెంచుచు, దారియందె ప్రా
    కారము గన్నులం బడిన గల్గును మోదము మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  2. కోరగ తెచ్చె కప్పు మన కూరిమి ధోని క్రికెట్టునందు, నా
    భారత జట్టు గెల్చె, మది భారము తగ్గెను జూచినంతటన్,
    వీరము జూపె వారు, బహుకాల విలంబనమైన స్వప్న సా
    కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్!!

    రిప్లయితొలగించండి
  3. మూడవ పాద యతి సవరణతో...

    కోరగ తెచ్చె కప్పు మన కూరిమి ధోని క్రికెట్టునందు, నా
    భారత జట్టు గెల్చె, మది భారము తగ్గెను జూచినంతటన్,
    గౌరవమొప్పె నేడు, బహుకాల విలంబనమైన స్వప్న సా
    కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్!!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ రమ సీతగాగ మరి శ్రీ పతి తానిక రాఘవుండెగా!
    కోరిన శిష్ట మానవుల కోర్కెల దీర్చును! భద్ర శైలమం
    దారయ రామ! రామ! యన ,ఆలయమందలి దివ్య మోహనా
    కారము గన్నులంబడిన, గల్గును మోదము మానవాళికిన్!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ రమణీ లలామ ; అతసీ సుమ సన్నిభ చారు సీమ ; వి
    స్తార కృపా విలోకన సుధా ప్రసరత్ నయనాభిరామ ; ల
    క్ష్మీ రుచిర స్వరూపమిదె ; సిద్ధము కోవెల లోన నియ్యలం
    కారము గన్నులం బడినఁగల్గును మోదము మానవాళికిన్ !!!

    రిప్లయితొలగించండి
  6. దూరము లెక్క చేయక సుదూరపు భక్తులు పాదచారులై
    చేరగ వేంకటాద్రి దరి, చింతలు వీడగ సంతసించుచున్
    "భారము నీదె" యంచు నట వత్తురు ; దైవము వేంకటేశు నా
    కారము గన్నులం బడిన గల్గును మోదము మానవాళికిన్ !

    రిప్లయితొలగించండి
  7. కవి మిత్రు లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    ధన్యజీవనాధారమైన శ్రీనివాసుని కటాక్షాన్ని మా మీద ప్రసరింప జేసారు. ధన్యవాదాలు.
    మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    స్వప్న సాకారాన్ని చూపించారు. చక్కని పూరణ. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మోహనాకారం పద్య రూపాన్ని దాల్చినట్లుగా మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    డా. విష్ణు నందన్ గారూ,
    లక్ష్మీ రుచిర స్వరూపాన్ని నా బ్లాగుకు అలంకారం చేసారు. ధన్యవాదాలు.

    నాగరాజు రవీందర్ గారూ,
    ఆ దివ్య మంగళాకారమును చూచి మోద మందని వారెవ్వరు? ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. కోరను సంపదల్ సిరులు,కోరను యెన్నడు నాకవాసముల్,
    కోరుదు నీదు పాదములఁగొల్చెడి భాగ్యము, భక్తిభావముల్
    నేరము లెంచకన్ భవము నిక్కముఁ ద్రుంచగఁనీదు మోహనా
    కారము గన్నులం బడిన గల్గును మోదము మానవాళికిన్ !

    రిప్లయితొలగించండి
  9. మందాకిని గారూ,
    పద్యరచనా నైపుణ్యం కూడ మీ స్వంత మయింది. చాలా సంతోషం. పూరణ బాగుంది. అభినందనలు.
    "కోరను + ఎన్నడు" అన్నప్పుడు యడాగమం రాదు. "కోర నవెన్నడు" అందాం.

    రిప్లయితొలగించండి
  10. మందాకినీ గారూ "కోరను సంపదల్ సిరులు," పద్యం చాలా మృదువుగా సాగిపోతూ బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. సారవిహీనజీవితము,సాధన చేయని విద్య, భక్త మం
    దారుడు లేని మందిరము,ధర్మము దప్పిన నీతియున్,శుభా
    కారత గూర్చవెన్నడును, గాంచుము,కోమల రామమోహనా
    కారము గన్నులంబడగ గల్గును మోదము మానవాళికిన్!

    రిప్లయితొలగించండి
  12. కందుల వరప్రసాద్ గారి పూరణ .....

    యాంత్రిక జీవనమ్ము మన కెవ్వరి తోడును చిక్కనీయదే
    కాదది కాలకూటము నొకానొక యోగము తోడ నిక్కమై
    యందరి యాప్తుడై మెలగ ను జను లందరి శ్రీకరం బదే
    కారము గన్నులం బడిన గల్గును మోదము మానవాలికిన్.

    రిప్లయితొలగించండి
  13. మంద పీతాంబర్ గారూ,
    మనోహరమైన పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. క్రూర బలాఢ్యమత్త మదఘూర్ణితచిత్త దురాత్ము డస్సుబే
    దారుడు గ్రామవాసుల నితాంత విఘాతపథంబునన్ బలా
    త్కార విధిన్ వెలార్ప కులకాంతలు మిర్చిమసాల జిమ్మి పో
    పోర నికృష్టుడా యనిరి,పోరు భయంబున పారువానికిన్
    కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్

    మిర్చ్ మసాల చిత్రపు విశేషాలు ఈ లంకెలో చూడండి
    http://en.wikipedia.org/wiki/Mirch_Masala

    రిప్లయితొలగించండి
  15. గిరి గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    "మిర్చ్ మసాలా" చిత్రాన్ని ఇప్పటికి రెండు సార్లు చూసాను. చాలా గొప్ప చిత్రం. స్మితాపాటిల్, నసీరుద్దిన్ షా తదితరుల నటన అద్భుతం. అంత మంచి చిత్రాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. మారమదెన్ని జన్మలను మానవులై జననంబునందినా
    కోరము ముక్తిరాజ్యమును కోరెదమీ ఇహలోక సంపదల్
    వారిశుఁరూపమున్ విడిచి పైడిమెరుంగుల మించు భౌతికా
    కారము గన్నులం బడిన గల్గును మోదము మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  17. ప్రసన్న కుమార్ గారూ బాగుంది వర్ణన
    "పైడిమెరుంగుల మించు భౌతికా
    కారము గన్నులం బడిన గల్గును మోదము మానవాళికిన్"

    రిప్లయితొలగించండి
  18. ఫణిప్రసన్న కుమార్ గారూ,
    రావు గారి ప్రశంసకు పాత్రమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రావు గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందరి పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి.
    ముఖ్యంగా డా.ఆచార్య ఫణీంద్ర, డా. విష్ణు నందన్ గార్ల
    పూరణలు హృదయ రంజకంగా సాహితీ విలువలు గుబాళిస్తున్నాయి.
    మిగిలన మిత్రుల పూరణలు వేటికవే తీసిపోని విధంగా ప్రకాశిస్తున్నాయి.

    నా పూరణలు చిత్తగించండి.

    ౧. శ్రీ రఘు రాము సన్నిధికిఁ జేరెడు వేళను త్రోవఁ, జిన్నగా
    దూరమునుండి గోపురము తొల్తను, పిమ్మట నిర్మలమ్ముగా
    పారెడు గౌతమీ నదియు, భద్ర గిరీశుని దేవళంపు ప్రా-
    కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్.

    ౨.పూరణలో పటుత్వమును, స్ఫూర్తి రగిల్చెడు భావుకత్వమున్,
    తీరగు ఛందమున్, నడక, తేటగు భావము హాయి గూర్చగా
    హారమునందు రత్నమటు లందము నద్దు మనోజ్ఞమౌ న-
    కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    అయ్యా ! నేటి పరిస్థితిది !

    01)
    ____________________________________________

    తీరగు నాట్యమున్ సలిపి - తేకువ బొందిరి పూర్వ భామినుల్ !
    తీరులు మారె నేడు ! పలు - తెక్కర మొల్కెడు నాట్య భావనల్
    తారలు కుమ్మరింప,మది - తాపము బెంచెడు,బోటి,మన్మథా
    కారము కన్నులం బడిన - గల్గును మోదము మాన వాళికిన్ !
    ____________________________________________
    తేకువ = గౌరవము
    తెక్కరము= ఒయ్యారము
    తారలు = నటీమణులు

    రిప్లయితొలగించండి
  21. వసంత కిశోర్ గారూ సున్నితమైన భావాన్ని చక్కగా చెప్పారు:
    "తాపము బెంచెడు,బోటి,మన్మథా
    కారము కన్నులం బడిన - గల్గును మోదము మాన వాళికిన్ !"

    రిప్లయితొలగించండి
  22. 02)
    ____________________________________________

    భారము లైన వస్త్ర ముల - భస్మము జేసిన జ్యోతిలక్ష్మియో
    మారుని భార్యయే యనగ - మాన్యత గాంచిన హేమమాలినో
    ధారుణి సుందరీ మణుల - దందడి బొందిన మించుబోడి,యా
    కారము కన్నులం బడిన - గల్గును మోదము మాన వాళికిన్ !
    ____________________________________________
    దందడి = అగ్రత

    రిప్లయితొలగించండి
  23. మిస్సన్న గారూ,
    మొదటి పూరణలో భద్రాచల దర్శనం చేయించారు. అద్భుతం. ధన్యవాదాలు.
    రెండవ పూరణ మూడవ పాదం చివరి అక్షరాన్ని టైపు చేయలేదు. దానితో సమస్యా పరిష్కారం తెలియడం లేదు.
    కాని సమస్యను పూరించిన పద్యం ఎలా ఉండాలో వివరించిన తీరు ప్రశంసార్హం. బాగుంది.

    రిప్లయితొలగించండి
  24. వసంత్ కిశోర్ గారూ,
    మనోజ్ఞమైన పూరణ. అద్భుతంగా ఉంది. అభినందనలు.
    "మన్మథాకారము" అన్నప్పుడు మన్మథుని వంటి ఆకారము అనే అర్థం స్త్రీకి వర్తించదు. మనస్సును మథించే ఆకారం అనే అర్థాన్ని గ్రహించడం సబబు.
    (ఈ వివరణ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే ఇంతకుముందే వరంగల్ నుండి మా మిత్రుడు ఫోన్ చేసి మన్మథాకారం స్త్రీకి ఎట్లా వర్తిస్తుందని ప్రశ్నించాడు)

    రిప్లయితొలగించండి
  25. వసంత్ కిశోర్ గారూ,
    జ్యోతిలక్ష్మి, హేమమాలిని ప్రస్తావనతో మీ పూరణ మనోల్లాసకరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారూ టైపాటుకు చింతిస్తున్నాను.
    ధన్య వాదాలు.

    సవరించిన నా పద్యం:

    ౨.పూరణలో పటుత్వమును, స్ఫూర్తి రగిల్చెడు భావుకత్వమున్,
    తీరగు ఛందమున్, నడక, తేటగు భావము హాయి గూర్చగా
    హారమునందు రత్నమటు లందము నద్దు మనోజ్ఞమౌ నలం-
    కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్.

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా !
    మీకూ , మీ వరంగల్లు మిత్రునికీ
    ధన్యవాదములు !
    ఆ సందేహం నాకు కూడా కలిగింది !
    రెండవపద్యం రెండవ పాదం కూడా
    "మారుని మారుపేరనగ - మాన్యత గాంచిన హేమమాలినో "
    అని మొదట వ్రాసుకొని తరువాత మార్చాను !

    మన్మథాకారము = అందమైన రూపము
    అని భావించ వచ్చని అలాగే ఉంచాను !
    మనస్సును మథించే ఆకారం అన్న మీ భావన
    ఇంకా ఉన్నతంగా యున్నది !

    అయినా సందేహాలకు తావులేని విధముగా
    మొదటి పద్యానికి నా సవరణ :


    01అ)
    ____________________________________________

    తీరగు నాట్యమున్ సలిపి - తేకువ బొందిరి పూర్వ భామినుల్ !
    తీరులు మారె నేడు ! పలు - తెక్కర మొల్కెడు నాట్య భావనల్
    తారలు కుమ్మరింప,మది - తాపము బెంచెడు,బోటి,సుందరా
    కారము కన్నులం బడిన - గల్గును మోదము మాన వాళికిన్ !
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  28. హమ్మయ్య !
    మిస్సన్న మహాశయులు గుట్టు విప్పారు !
    నకారము ను - అలంకారము చేసి !
    ఇప్పుడు మనోఙ్ఞముగా నున్నది !

    రిప్లయితొలగించండి
  29. చేరగ వంగ దేశమున చెన్నుగ నౌకరి చేయబూనుచున్
    తీరుగ నావకాయగొన త్రిప్పలు బడ్చును స్వీట్ల రాష్ట్రమున్
    భోరున నేడ్చుచున్ తెలుగు భూమికి రాగను మిర్చి బజ్జిలన్
    కారము గన్నులం బడినఁగల్గును మోదము మానవాళికిన్

    రిప్లయితొలగించండి