21, ఏప్రిల్ 2011, గురువారం

సమస్యా పూరణం - 292 (చందమామఁ గన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చందమామఁ గన నసహ్య మయ్యె.
సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. ఆదిదంపతులకు మోదంబు కలిగింప
    పాదపూజజేయు పారవశ్యు
    మందగమను నాగమనమును గని నగు
    చందమామ గన నసహ్యమయ్యె

    రిప్లయితొలగించండి
  2. ఆవు పాలు తాగ అలసిన కన్నయ్య
    పాడి యావు జేరి పాలు బిదుక
    చవతి సోము జూడ చక్కగ పాలను
    చందమామ గన నసహ్యమయ్యె

    రిప్లయితొలగించండి
  3. గుట్క,ఖైని నమల గొంతు క్యాన్సరొచ్చె
    మాను మనిన మంచి మాట వినక!
    ఆసుపత్రి జేరి అలమటించు శర
    చ్చందమామ గన నసహ్య మయ్యె!!

    రిప్లయితొలగించండి
  4. చూడ కన్నులేమొ సూర్య చంద్రులాయె
    మోము వెలుగు బోల్చ నేమి లేదు!
    అమ్మవారి ముందు నంబరమందలి
    చందమామ గన నసహ్య మయ్యె!!

    రిప్లయితొలగించండి
  5. గిరి గారూ!మందగమను జూచి నవ్విన చందురుని అసహ్యించుకున్నారు బాగుంది.
    వెంకటప్పయ్య గారూ!నల్లనయ్య,వెన్నలయ్య జూసిన వెన్నెలయ్యను అసహ్యించుకున్నారు.బాగుంది.
    ఉభయులకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పంచమాతలనుచు నెంచగాఁ దొల్దొల్త
    నెన్నదగినదైన నెలఁతనుఁ దన
    గురువు లేని నాఁడు గురుపత్నితోఁ గూడు
    చందమామఁ గన నసహ్యమయ్యె!

    రిప్లయితొలగించండి
  7. చందురుండునెంతొ చల్లని వాడొకొ,
    యందమైనవాఁడు; యాకసమున
    కెగుర నేర్చినందుకేమొఁచిత్రంబుగ
    చందమామఁ గన నసహ్యమయ్యె!


    చంద్రయానం చేసి ఫోటోలు తెస్తారు . అవి చూసినవాళ్ళకు అలా అనిపిస్తుందని నా ఉద్దేశ్యం.
    రాజేశ్వరి అక్కయ్య గారీ మధ్య కనుపించడం లేదు. విదేశీ యాత్రలకు వెళ్ళారేమో!

    రిప్లయితొలగించండి
  8. రాఘవా !
    ఒక్కుమ్మడి గా ఈ సమస్యల మీద
    దండయాత్ర బావుంది !

    ఈ పంచ మాతలెవరు బాబూ !
    కొంచెం వివరిస్తావా ?

    రిప్లయితొలగించండి
  9. వసంతకిశోర్ గారూ,

    గురుపత్ని, రాణి, వదినె, అత్తగారు, కన్నతల్లి -- ఈ ఐదుగురూ పంచజననులండీ. :)

    రిప్లయితొలగించండి
  10. రాఘవా !
    ధన్యవాదములు !
    ఈ మధ్య పంచ కన్యల మీద చర్చ జరిగి
    అందులో ఉన్నది వాలి భార్య తారని చెప్పారు !
    పంచ మాత లనగనే అది గుర్తొచ్చింది !

    నువ్వు నన్ను
    కిశోర్ బాబాయ్
    అని ఏక వచనంలో పిలుచు కోవచ్చు
    చక్కగా !

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    __________________________________

    ముద్దు భార్య యందె - మోహంబు జూపెడి
    చందమామ గన న - సహ్య మయ్యె !
    క్షయము జెందు మీవు - క్షయ రోగివై యంచు
    మామ పలికె గని - మారు మామ !
    __________________________________

    ముద్దు భార్య = రోహిణి
    మామ = చంద్రుని మామ = దక్షుడు
    మారు మామ = చంద్రుడు

    రిప్లయితొలగించండి
  12. 01అ)
    __________________________________

    ముద్దు భార్య యందె - మోహంబు జూపెడి
    చందమామ గన న - సహ్య మయ్యె !
    క్షయము జెందు మీవు - క్షయ రోగివై యంచు
    మారు మామను గని - మామ పలికె !
    __________________________________

    రిప్లయితొలగించండి
  13. కండ బలుపు తేగకాడల దోరగ
    కాల్చి ముందు మెదడు దొల్చి పైని
    ఈనులన్ని తీసి ఇఛ్ఛతో కొఱుకగా
    చందమామ గన నసహ్య మయ్యె

    (తేగలో చందమామను నాకు చూపించిన రాఘవకి నెనరులతో)

    రిప్లయితొలగించండి
  14. రాఘవ గారూ! గురుపత్నిని గూడిన చంద మామను అసహ్యించుకున్నారు.బాగుంది.
    మందాకిని గారూ! చేతికందిన చంద మామ(ఫొటొను) అసహ్యించుకున్నారు.బాగుంది.
    కిశోర్ గారూ! దక్షుడి చేత చంద మామను అసహ్యించుకునేట్టు చేశారు.బాగుంది.
    గిరి గారూ! తేగ లోని చంద మామను అసహ్యించుకున్నారు. విలక్షణంగా ఉంది.
    అందరకూ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గిరిగారూ, తేగలోని చందమామ విషయం చదివి నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకొన్నాను. పూరణకూడా విలక్షణంగా వుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. శాస్త్రిగారూ,
    మీ పూరణ మాత్రం? అమ్మవారి గురించి వ్రాశారు. ఆ పూరణ ఈవేళ్టి పూరణలకే హైలైట్.
    రాఘవ గారి పూరణ యోచన నా మనసులో వచ్చినా రాయటం కుదరక వేరే రాశాను.
    మీరు చెప్పినట్టు అందరి పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  17. సుందరములైన భావాలతో అందరి పూరణలు
    చందమామలా ప్రకాశిస్తున్నాయి.

    గిరి గారి స్ఫూర్తితో :

    గోరిటాకు తోడ కూతురు చేతికి
    చందమామ నుంచె చక్క నమ్మ
    ఈస డించె గాంచి యీర్ష్యతో తారమ్మ
    ' చందమామఁ గన నసహ్య మయ్యె.'

    రిప్లయితొలగించండి
  18. అందరికీ నమస్కృతులు.
    ఈరోజు కూడ నన్ను మన్నించాలి.
    అందరి పూరణలూ వైవిధ్యంగా అలరించాయి.
    పూరణలు పంపిన గిరి, టేకుమళ్ళ వెంకటప్పయ్య, గోలి హనుమచ్ఛాస్త్రి, రాఘవ, మందాకిని, వసంత కిశోర్, మిస్సన్న గారలకు అభినందనలు.
    పూరణల గుణదోష విచారణలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. మాస్టరు గారూ! ధన్యవాదములు.
    మందాకిని గారూ! ధన్యవాదములు.
    మిస్సన్నగారూ!అరచేతిలొ పూచిన చందమామ ఊహ బాగుందండీ.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.
    గురువుగారూ దూరంగా ఉన్న లోటును భర్తీ చేస్తున్నారు.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. బండి నెక్కి రాడు బంతి పూలు తేడు,
    కొండ నుండి తేడు గోగు పూలు ,
    తార చుట్టు రోజు తారాడు గగనాన
    చందమామఁ గన నసహ్యమయ్యె!

    రిప్లయితొలగించండి
  22. మంద పీతాంబర్ గారూ,
    "చందమామ రావే, జాబిల్లి రావే" అని పాడినా ఏమీ తేకుంటే కోపంతో పాటు అసహ్యం పుట్టించారు. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి