21, మార్చి 2017, మంగళవారం

సమస్య - 2314 (కందము వ్రాయంగలేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్"
లేదా...
"కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

65 కామెంట్‌లు:

seethadevi gurram చెప్పారు...

విందున తన మిత్రులతో
పందెము గాయగ చతురత పద్యము వ్రాయ
న్నందమగు మగువ రమ కో
కందము వ్రాయంగ లేని కవి పూజ్యుండగున్!

కోకందము= చీర యందము

ఊకదంపుడు చెప్పారు...

చిందర వందర పదములు
గందర గోళపు దరువులఁ గలసి వెలువడన్
నందియె దక్కిన దినమునఁ
గందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
vsnmhari చెప్పారు...

వందనములు కొనలే డిల
కందము వ్రాయంగలేని కవి, పూజ్యు డగున్
సుందరముగ నలవోకగ
వందలు వేలైన సభను పలికిన యెడలన్.

వందన మందలే డిలను పండితమండలిలోన నెచ్చటన్
కందము వ్రాయలేని కవి, గణ్యత కెక్కును కీర్తినందుచున్
సుందర శబ్దభావముల శోభిలున ట్లలవోకగా సభన్
వందలు వేలు చెప్పగలవాడన సందియ మేల చూడగన్.

హ.వేం.స.నా.మూర్తి

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
అందరు టెన్నిసు యాటకు
ఎందుకురా వలయు నొకటి యేర్పడ బరువం
చెందుకనరు? వచనముగని
కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్!?

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
గందరగోళపు క్రైస్తవ
స్పందనతో వచన కవిగ ప్రార్థన గనరా!
ఎందుకు గుడి ,ఛందస్సది
కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్1?

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
ఎందరికోపిక గలదీ
ఛందస్సును వీడు పదపు చాలన చాలున్
అందము లేని సతిని గొనె
కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
పొందుగ జెప్ప లేదనక పోయెరు సుమ్మిది బ్రహ్మవాక్కు వే
ఛాందసు లుద్భవించెదరు ఛం"దము"(అభిప్రాయము) చాలును "దస్సు" వీడగా
అందరునాలకించెదరు హాయిగ మేధయె నిద్రబోవ నా
కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకు నమస్సులు!

[1]
ముందు గతించిన దినములఁ
గందము వ్రాయఁ గలవాఁడె కవియనఁ బఱఁగెన్!
డెందము మండఁగ నిప్పుడు
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్!

[2]
ముందు గతించినట్టి దినముల్ గణుతించుచుఁ జూడ, నప్పుడున్
గందము వ్రాయఁగల్గు కవి గణ్యత కెక్కియుఁ గీర్తిఁ గాంచె! నా
డెందము మండుచుండఁగను దీవన లందుచు నౌర యిప్పుడున్
గందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్!"

స్వస్తి

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చందమునకందమందమ
నందుము కవియేల నంది యదివ్రాయనిచో
నందుము 'పూజ్యము ' శూన్యమె
కందము వ్రాయంగలేని కవి "పూజ్యుఁ" డగున్.

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
వైవిధ్యంగా పూరించడానికి ప్రయత్నించారు. ప్రశంసనీయం. కాని 'కోక+అందము' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

అంధుడు ఛందము తెలిసియు
కందము వ్రాయంగలేని కవి; పూజ్యుఁ డగు
న్నందమ్ముగ సుమతుల కా
నందము నిడు బద్దెనవలె నరవరుడిలలో!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

ఛందము లన్నియు తెలిసియు
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగు
న్చందమ్మది యెట్లన్నన్
కుందేలు నడవగ లేదు కొట్టిన తిట్టన్ ;)

sailaja చెప్పారు...

పొందునె యశంబునిలలో
కందము వ్రాయంగ లేనికవి,పూజ్యుఁడగున్
సుందర భావమ్ములతో
నందరు మెచ్చెడి కవితల నల్లు ఘనుండే!!!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

అందము జూడగ మదిలో
స్పందన గలుగుట సహజము సత్కవికిలలో
నందునునకు పాలిడు రవి
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁడగున్

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Zilebi చెప్పారు...



విందారగించి హృద్యపు
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగు
న్నందరి లోన జిలేబీ ?
ఛందస్సుల మత్తునందు జవ్వాడవలెన్ :)

జిలేబి

కంది శంకరయ్య చెప్పారు...

ప్రభాకర శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డెంద మలరంగ భక్తిని
నంద వరాత్మజ సుకీర్తనలఁ బరవశులై
చిందులు వేయు నృపులపై
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్


డెందము పొంగ శిష్యులకు ఠేవగ మంత్రము చేత సంగరం
బందునఁ బ్రాణ హీనులగు నందఱి కింపుగ నిచ్చు జీవముల్
సుందరమైన సంస్కృతము శోభిలఁ జేయును దెన్గు నందు నే
కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్

[కవి = శుక్రుడు]

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

seethadevi gurram చెప్పారు...

సంధులలో సదా విఫలము విచారకరము!
ముఖ్యంగా తెలుగు సంధుల యందు!😟😟

గురుదేవులకు ధన్యవాదములు!

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ కొంత అగమ్యంగా ఉంది. 'ఇలలో నందునునకు...'...?

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం మీకు బాగా ఒంటబట్టినట్టుంది!

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు హృద్యంగా ఉన్నవి. అభినందనలు.

seethadevi gurram చెప్పారు...

ఛందము నందము గానము
బంధమ్మది భావములను ప్రకటించంగన్
విందగు వచన కవితతో
కందము వ్రాయంగలేని కవి పూజ్యుండగున్!

subbarao చెప్పారు...

చందా నగరపు పౌరుడు
విందున నొకచోటబలికెవెటకా రముగా
నందరు వినుడీ మాటను
కందము వ్రాయంగ లేని కవి పూజ్యుడగున్

A.Satyanarayana Reddy చెప్పారు...

పొందడు మనమున తృప్తిని
కందము వ్రాయంగలేని కవి , పూజ్యుండౌ
సుందరమగు పద్యమ్ముల
ఛందము లన్నింటిలోన చక్కగ వ్రాయన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. 22/1/2017 నాటి నా సందేహమునకు పరిష్కారము నీ విధముగా నూహించ వచ్చునను కుంటాను. పరిశీలించండి.

అ – ద్యః లకు (సద్యోగర్భములోని) యతి మైత్రి:
సద్యః + గర్భము = సద్యోగర్భము.

లుప్తవిసర్గకస్వరయతి ప్రకారము దాసః+అహం, తమః+అర్క మొదలైన చోట్ల అకారం తరువాతి విసర్గకు అకారం పరమైనపుడు విసర్గ, దాని ముందువెనుకల అకారాల స్థానంలో ఓకారం ఆదేశమై దాసోహమ్, తమోర్క అవుతుంది. ఇక్కడ ఉత్తరపాదాది అకారానికే యతి చెల్లుతుంది.

ఇందు విసర్గ తరువాత “అ” కారము లేదు. హల్లు కలదు. ద్యః – ద్యో గా మారినది. కానీ ఉత్తరపదమైన గ అందులో విలీనమవ్వ లేదు. యతి మైత్రి స్తానములో “ద్యో” ఉన్నది. కనుక “ద్యో” కి మాత్రమే యతి వేయాలి.
ఉదా:
పురుషుండే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా పు – భో సమస్య పాదము.
భూమింగ్రుంకకిన నింగి బ్రాకిన మహాంభోరాశిలో జొచ్చినన్ భూ – భో భాగ. దశ. 1526.

అదే అ ఉన్న ఓ లో గర్భితము. కనుక ఉత్తర పదమైన “అ” కు యతి వేయాలి.
*అపరిమితానురాగసుమ*నోలసమై చిగురాకు జేతులం (*అపరిమిత.... సుమనః+*అలసమై) [మనుచ. ౩.౨౭]
అక్కడు మనోజ్ఞ ఉంటే యతి చెల్లదని నా యభిప్రాయము. .

ఈ సమర్థన తో అ – ద్యః లకు (సద్యోగర్భములోని) యతి మైత్రి చెల్లదని భావిస్తున్నాను. మీ యభిప్రాయము తెలుప గోర్తాను.

subbarao చెప్పారు...

కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్
వందన మాచరింతు నిక పండితు డాతడు నిజ్జగంబునన్
కందమువ్రాయగా దగును కష్టమి కించుక బడ్డచోధరన్
ఛందము సాక్షిగా నతడు సత్కృతిజేయును నెల్లవే ళలన్

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఛందమున సొబగు గానము" అంటే బాగుంటుందేమో?

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వర రావు గారూ,
ఏదైనా సందేహం కలిగితే అది తీరేదాకా మీకు మనశ్శాంతి, తృప్తి ఉండవనుకుంటాను. బాగానే శ్రమ పడ్డారు. మీ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. స్వస్తి!

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
'కష్ట మొకించుక' అనండి. 'కష్టము + ఇక + ఇంచుక' లో దోషం లేదు. కాని కర్ణపేయంగా లేదని...

seethadevi gurram చెప్పారు...

🙏🙏🙏🙏🙏🙏

Unknown చెప్పారు...

.” కందము కవితాగంధము
కందము వ్రాయంగ” లేనికవి పూజ్యుడగున్
కందము కందముయతిగణ
ఛందస్సును గూర్చి భావసంపద నింపన్.
2.కందము లందచందముల కల్పనలే యతిప్రాస బంధమై
కందము వ్రాయ?”లేనికవిగణ్యత కెక్కునుకీర్తి నందుచున్
పొందికచేత గద్యమున పొత్తముగూర్చ?కవిత్వమున్నచో
అందరి మెప్పుబొందుటగు యద్భుతమౌరచనాంశమైనచో”|

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

Bhagavatula Krishna Rao చెప్పారు...

కందము మా కందమ్ముగ
నందించెను తిక్క నార్యు డాదిని ; నేడో
సుందరమగు ఛందము గల
కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్

ముందుగ తిక్కన దలచక
కందుచునె భ జ స న ల గ గ గణముల కొరకున్
కుందుచు మా కందమ్మను
కందము వ్రాయంగ లేని కవి పూజ్యుడగున్
( నకారాత్మక ప్రయోగము )

నిన్నటి సమస్యకు నా పూరణ

గంగా దేవికి పుత్రుడె
గాంగేయుండన్న ;నెవడు గంగా పతియే
సంగరమున పాశువతము
నుంగొను మన పొందెననగ నుర్వి యెరుగదే !

Unknown చెప్పారు...

1.చిందరవందర కవితలు
గందరగోళముగ వ్రాసి ఘనుడ నటంచున్
ఛందము తిరస్కరించుచు
కందము వ్రాయంగ లేని కవి పూజ్యు డగున్
2.మందాకిని మురుగంచును
స్కందుండోడెను రణమున శహబాషనుచున్
నిందించుచు దేవతలన్
కందము వ్రాయంగ లేని కవి పూజ్యు డగున్

Unknown చెప్పారు...

కందమనంగ నీరదము కందము మేలగు దుంప కాదొకో!
కందమనంగ మూపుగద కందమనంగ వ్రణమ్ము తల్పగా
కందము వ్రాయనేల కృతికార్యము చాలదె సత్కవీంద్రుకున్?
కందము వ్రాయలేని కవి గణ్యతకెక్కును కీర్తి నందుచున్

Sistla Sharma చెప్పారు...

అందంబై పద బంధపు
విందొనరెడి గతుల గూడి ప్రీతిం గొనెడిన్
ఛందం బమరంగ, నెటుల
కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్?!

sailaja చెప్పారు...

ధన్యవాదములు గురువుగారు.....

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

9493846984 డా.బల్లూరి ఉమాదేవి .
ఛందో రీతుల నరయక
కందము వ్రాయంగ లేని కవి పూజ్యండౌ
నందురు కొందరు ముదమున
నందంబుగ వచన కవిత లల్లగ భువిలో.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

కందమె సర్వోత్తమమగు
ఛందముగద చూడ పద్యశాస్త్రమునందున్
సుందరవదనా! ఎవ్విధి
కందము వ్రాయంగలేని కవి పూజ్యుడగున్

విరించి చెప్పారు...

సుందరమగు కావ్యాలకు
అందమునే గూర్చునట్టి యద్భుత ఛందో
బంధము గలిగిన పద్యము
కందము వ్రాయంగలేని కవిపూజ్యుడగున్ ?

ఛందములోన పట్టు గల సత్కవు లందున గాంచ యుండరే
కందము వ్రాయలేనికవి, గణ్యత కెక్కును కీర్తినందుచున్
బంధకవిత్వమున్ మిగుల పాటవమందు రచించు పండితుల్
ముందుగ విజ్ఞులైన జన మోదము నొందెడు వారలే గదా!

gurram.jana@gmail.com చెప్పారు...

డెందము నలరించునుగా
కందము వ్రాసిన యతండె కవి యనిరి గదా!
అందము చిందగ; నెవ్విధి
"కందము వ్రాయంగలేని కవి పూజ్యుఁ డగున్"?

కంది శంకరయ్య చెప్పారు...

ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కృష్ణారావు గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

నేమాని వారూ, (మీ పూర్తి పేరు తెల్పండి)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

నేమాని వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

జనార్దన రావు గారూ,
బహుకాల దర్శనం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

అయ్యా నమస్తే. నా పూర్తి పేరు నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు. పాశ్చాత్యదేశంలో స్థిరపడ్డ తరువాత దాన్ని చిన్నదిగా చేయాల్సింది, ఇక్కడ వాళ్లకి పలకడం కోసం కాస్త సులభతరం చేద్దామని.

కంది శంకరయ్య చెప్పారు...

సంతోషం! గురువర్యులు పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు మీకు ఏమవుతారు?

Bhagavatula Krishna Rao చెప్పారు...

శక్తిగ సృష్టించి ముగుర
రక్తిగ పదునాల్గు లోకరక్షణకై , వై
యక్తికముగ సృష్టి సలుపు
భక్తుని పూజింప వచ్చె భారతి తానే

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

తొందర తొంద్రగా కవిత ధూముగ ధాముగ వ్రాయగోరుచున్
ముందును వెన్కనున్ గనని మూర్ఖుడు నైనను లజ్జ వీడుచున్
ఛందము శంకరాభరణ శంకరు కొల్వును జేరి నేర్వగా
కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్