24, మార్చి 2018, శనివారం

సమస్య - 2632 (చంద్రునిం గాంచి యేడ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు"
(లేదా...)
"చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై"

86 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ

    మరింతగా సహాయం చేయలేకపోతున్నాననే తపనతో....

    ఇందరి మేలుకొల్పనుదయించితి, చేతనతాప్రబుద్ధులై...
    రందరు , జీవకోటికి సహాయమొనర్చితిఁ దోయజాళికా..
    నందము గూర్చియుంటినిక నయ్యెను గ్రుంకెడువేళ , యంచు దా
    చందురుఁ జూచి యేడ్చెనదె సారసమిత్రుడు పశ్చిమాద్రిపై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సాంద్ర సుధాంశు సంయుత విశాల జగమ్ము సుషుప్తినొందు , ని...
      స్తంద్రతఁ బెచ్చరిల్లును నిశాచర వృత్తి , జనాళి గావ రా..
      త్రీంద్రుని శక్తి చాలదు , భరింపగ గల్గుదురే ? యటంచు దా
      చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
    4. సాంద్ర సుధాంశులెల్ల పలుచంబడి క్రుంగి కృశించుచుండగా
      చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై !
      తంద్రత మత్తునొందు జనతన్ గని యస్తమయమ్మునొందుచున్
      చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై !!

      భావము...

      పూర్వార్థం....

      సూర్యోదయం అవుతోంది.. చంద్రప్రభలు తరిగిపోతూ ఉండగా పశ్చిమదిక్కున చంద్రాస్తమయాన్ని చూచి భానుడు యేడ్చాడు....

      సూర్యాస్తమయం పశ్చిమదిక్కున అగుచుండగా... జనులు నిస్తేజంతో మత్తులో ఉన్నందున చంద్రోదయాన్ని చూచి భానుడు యేడ్చాడు...

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  2. "నన్ను జూడగ లేరుగ కన్నులెత్తి
    ప్రియులు పారిపోదురుగద క్రియలు వీడి"...
    చక్కనయ్యగ నవ్వెడి చుక్కలందు
    చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు

    రిప్లయితొలగించండి
  3. ప్రమద మందె చకోరకమమితముగను
    చందురున్ గాంచి, యేడ్చె గంజాత హితుడు
    వీడె నంచు పద్మములట విరహ బాధ
    తాళలేమంచు, యామిని తరుణమందు.

    రిప్లయితొలగించండి
  4. నాదు రాకతో వసుధన మోద మొంద
    నైతిరి ప్రజ, వెతలు బడి నన్ను తిట్టు
    చుంటిరి, భయపడి ముఖము చూడ కుండె
    నీదు రాకతో పులకించి నీకు పలుకు
    చుండినారు స్వాగతములన్ శుభ్ర కరుడ,
    ఏమి చేతు, గ్రీష్మముగదా యిది యనుచు
    "చందురున్ గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వసుధను.... యిది యటంచు" అనండి.

      తొలగించండి
  5. నాదు కిరణములను పొంది నావు నీవు
    చల్లనై వెల్గు రాజుగా జగతిలోన
    పేరుఁగాంచితివనుచు శపించు రీతి
    చందురునిఁగాంచి యేడ్చె కంజాతహితుడు

    రిప్లయితొలగించండి
  6. "అందము పొంగులెత్త దరహాసపుకాంతులు సాగుచుండగా
    నెందులకిట్లు వచ్చితివి వెన్నెలరాయడ! వెల్గులెంతలే ;
    వందురమారిజీవితము ; వాడకతప్పదు పూట"కంచు నా
    చంద్రుని గాంచి యేడ్చెనదె సారసమిత్రుడు పశ్చిమాద్రిపై .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ఆలి తోసరాగములాడ, నాంగిరసుడు
    చంద్రునిం గాంచి యేడ్చెఁ, గంజాతహితుఁడు
    వెలుగునిచ్చుచు జగతికి వేలుపయ్యె
    వసుధ కాధార భూతుడై వరలుచుండె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  8. తే.గీ.
    విశ్వమునకు ఘనంబుగా వెలుగునిస్తు
    ఆలినొక్కరిని మరి నేనేలుచుంటె
    నా వెలుగుకు మెరియు శశి నన్ను మీఱి
    కులుకుచుండె కడు సతులు కలిగి యనుచు
    చంద్రునిన్ గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇస్తు, ఏలుచుంటె' అన్నవి వ్యావహారికాలు. "వెలుగు నిచ్చి... నేనేలుచుండ" అనండి.

      తొలగించండి
  9. తారల నడుమ సరసంపు ధన్య జీవి
    వలపు వెన్నెల వెలుగుల కులుకు మదిని
    కలువ భామల కౌగిలి కరుగు నట్టి
    చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాత హితుడు

    రిప్లయితొలగించండి
  10. రాష్ట్ర విభజన సమయాన రయము గాగ
    నాదు కొందు మ ట oచును హామి లొస గి
    మాట తప్ప నవి శ్వాస మంత్ర మేయు
    చందు రు న్ గాంచి యేడ్ చె గం జా త హితుడు

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2632
    సమస్య :: *చంద్రుని గాంచి యేడ్చె గద సారసమిత్రుడు పశ్చిమాదిరిపై.*
    సందర్భం :: ఒకరోజు సాయంకాలం వినాయకుడు కడుపునిండా తిని భుక్తాయాసంతో తన తండ్రియైన పరమశివుని సేవించేందుకు సిద్ధమయ్యాడు. సేవ చేయలేక అవస్థ పడుతున్న వినాయకుని జూచి చంద్రుడు నవ్వినాడు. అందుకు కోపగించుకొన్న పార్వతీదేవి ‘’*చంద్రుని చూచిన వారికి అపనిందలు కలుగుతాయి*’’ అని శాపం ఇచ్చింది. ఇక తనను ఎవ్వరూ చూడరు కదా అని చంద్రుడు బాధపడుతూ ఉంటే చూచి సూర్యుడు బాధపడుతూ విలపించాడు.
    మహా విష్ణువునకు ఎడమ కన్ను చంద్రుడు, కుడికన్ను సూర్యుడు. ఎడమ కంటికి బాధ కలిగితే కుడి కన్ను కూడా తప్పనిసరిగా బాధపడుతుంది అని విశదీకరించే సందర్భం.

    తంద్రత కుక్షి నిండ దిని తల్లడమంద వినాయకుం డటన్
    చంద్రుడు నవ్వె వాని గని, శాప మొసంగెను గౌరి కిన్కతో
    ‘’చంద్రుని జూడ నింద లగు సర్వుల’’ కంచు ప్రదోషవేళ , నా
    *చంద్రుని గాంచి యేడ్చె గద సారసమిత్రుడు పశ్చిమాద్రిపై.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (24-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. *ఈనాటి నా పద్యానికి శ్రీ చిటితోటి విజయకుమార్ గారి అనువాదం - సంస్కృత శ్లోకం*

      పశ్యన్ పర్యహసత్ విధుర్గణపతిం తంద్రం చ కుక్షింభరిం
      “యస్త్వాం పశ్యతి నిశ్చయం స మనుజః ప్రాప్నోతు నిన్దామితి” ।
      గ్లావం క్రోధవతీ శశాప గిరిజా మాతా ప్రదోషే తతః
      దృష్ట్వా శీతకరం రురోద చరమే శైలే సరోజ ప్రియః ।।
      రచన :: చిటితోటి విజయకుమార్ నాగపూర్.

      తొలగించండి
  12. అని ప్రతాపమునందు దహనుని బోలు
    శరణు వేడువారి యెడల కరుణ జూపు
    యేక కాలమునందున నెన్నగాను
    వెలుగు వెన్నెలలొసగెడి వేడ్క రామ
    చంద్రునిం గాంచి యేడ్చె గంజాత హితుడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా! తాను వెలుగు మాత్రమే ఇవ్వగలడు. రామచంద్రుడు వెలుగు వెన్నెల రెండూ యివ్వగలడని అసూయతో యేడ్చినట్లు భావన!
      మైలవరపువారి వంటి కవులు ఈ భావనకు మంచి రూపమివ్వగలరు!🙏🙏🙏🙏

      తొలగించండి
    2. రాముడు రవిచంద్ర నేత్రుడుగదా!

      తొలగించండి
    3. ఇంద్రుజయించు థీరుడని నేయగ కంజుని యస్త్రమొక్కటిన్
      చంద్రుని ధిక్కరించు తనచక్కని తమ్ముడు మూర్ఛనొందగా
      సంద్రపు రీతిగా నడలు సారసనేత్రుని
      రాఘవున్ దయా
      చంద్రుని గాంచి యేడ్చెనదె సారసమిత్రుడు పశ్చిమాద్రిపై!

      తొలగించండి
    4. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "కరుణ జూపు । నేకకాలము..." ఆనండి.

      తొలగించండి
    5. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!

      సహదేవుని గారి సందేహమే నాకు కూడ గలుగు చున్నది ప్రాస విషయమున!
      రెండు రకములుగ మైలవరపుగారు పూరించి యున్నారు! సందేహ నివృత్తిజేయ ప్రార్ధన! 🙏🙏🙏🙏

      తొలగించండి
    6. సమస్యా పదమును మార్చవచ్చునా?
      చంద్రుని చందురునిగ!?

      తొలగించండి
    7. ముందుగా సమస్యను 'చందురునిఁ గాంచి...., చందురుఁ గాంచి...' అని ఇవ్వడం జరిగింది. ఆ తరువాత కొంత సౌలభ్యం కోసం సమస్యను "చంద్రునిం గాంచి...., చంద్రునిఁ గాంచి..." మార్చడం జరిగింది. అప్పటికే కొందరు మిత్రులు మొదటి సమస్యకు పూరణలు పంపారు. అందువల్ల ఈ సందిగ్ధత ఏర్పడింది.
      ఇప్పుడు "చంద్రుని" అన్న పాఠాన్నే తీసికొని పూరణలు చేయండి.

      తొలగించండి

  13. బుచికీ వారి పూరణ

    కేంద్ర మన నేమనుకొనెను ? కేక వేయ
    పనులగునను కొనెన? మా సపర్య లెల్ల
    చేయ వలెనుగదర! పొమ్మ! చెంకవేసి
    చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు!

    *కంజాతహితుడు - అరుణుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుచికీ వారి అల్లరికి అంతు లేదు....

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      చంద్రబాబు, అరుణ్ జైట్లీల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. సర్వ సంఘటనలకూ సాక్షీభూతుడైన సూర్యుడు సతీవియోగంతో దుఃఖితుడైన రాముణ్ణి చూసి....

    రావణు డపహరించెను, లంక జేర్చె
    సీతను; తన సతిని బాసి ఖేద పడుచు
    నా వనమున దిరుగు పావనాత్ముఁ, రామ
    "చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పావనాత్ము' తరువాత అరసున్న అవసరం లేదు.

      తొలగించండి
  15. జనుల వాక్యము మన్నించి మనమునందు
    జానకినిబంప దలచుచు కానలకును
    మదిని బాధను దిగమ్రింగు మాన్య రామ
    చంద్రునిం గాంచి యేడ్చెఁగంజాతహితుఁడు

    రిప్లయితొలగించండి
  16. ఇలను పసిడికి గలభోగ మినుము కేది?
    తళుకు బెళుకుల కెప్డు ప్రాధాన్యతుండు
    హితుని కన్నను హిమధాము డెక్కువయ్యె
    ననుచును కవియె వాపోవ నక్కజమ్మె?
    "చంద్రునిం గాంచి యేడ్చెఁగంజాతహితుఁడు"
    (నిత్యజీవితంలో యినుముపయోగ పడినంతగా పసిడి ఉపయోగపడదు కద! అయినా బంగారు కే ప్రాధాన్యత!సూర్యుడు చేసే మేలులో చంద్రుడు చేసే మేలు సహస్రాంశం కన్న తక్కువే కద! అయినా కవనంలో చంద్రనికే అధికాధిక ప్రాధాన్యత!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా! చంద్రుడు సస్యాలకు , ఓషథులకు అధిపతి! ఆయన లేనిదే అన్న, ఔషధములు లేవు! పైగా “చంద్రమా మనసోజాతః “ .
      లోకోపకారమున సూర్యచంద్రు లిరువురూ సములే!🙏🙏🙏

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఇనుమున కేది" అనడం సాధువు. 'ప్రాధాన్యత + ఉండు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  17. అందగ కాంతి పుంజములు హాయిగ వెల్గుచు నాదు శక్తిచే
    పొందుచు కీర్తి నేల, ననబోడులు కేళిని సల్పు వేళలన్
    విందును చేయు నందముల వీనికి పట్టెను భాగ్యమంచు,తాన్
    *జందురుఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  18. ఫాల నేత్రునికేల నా పైన కినుక
    శీత భానుని తానేల సిగను దురిమె
    గురువు పత్నిని దోచిన క్రూరు డతని
    శీర్ష ముననిల్పె శివుడేల సిగ్గు పడక
    పాపు లన్నను పడిచచ్చు పరమ శివుడు
    వాని భాగ్యమ్ము నేమందు బాగు! బాగు!
    *చందురున్ గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  19. తేటగీతి
    చెన్నకేశవు వరమున గన్న సుతుడు
    వధువు మంచాల బనుపున కదనమేగి
    నాటి యభిమన్యు వలెఁగూల మేటి బాల
    చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.
      'మంచాల' కాదు... "మాంచాల".

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో
      తేటగీతి
      చెన్నకేశవు వరమున గన్న సుతుడు
      వధువు మాంచాల బనుపున కదనమేగి
      నాటి యభిమన్యు వలెఁగూల మేటి బాల
      చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు!

      తొలగించండి
  20. సంద్రపు లోతులం తెలియ సఖ్యత తోచెడు నాటుపోట్లగన్
    మంద్రపు పిల్లగాలులన మందపు రీతుల జంటలం గనన్
    సాంద్రత గాచియే కమల సంగుడు దారిని మార్చడే నిశీ
    చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై
    (UTPALAMAALA)

    DR VARALAKSHMI H
    ANANTHA CHANDHAM GROUP

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆటుపోట్లగన్'...? "ఆటుపోటులన్" అందామా?

      తొలగించండి
  21. రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. చంద్రునిఁ జూచు నప్పు డెల్ల బృహస్పతి శోకించు సందర్భము:

    గురువునకు ద్రోహ మొనరించె గురు రిపుండు
    నాదు తారను మోహించె నీ దురాత్ముఁ
    డితఁడు గగనపుఁ తారల పతియు నంచుఁ
    జంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు

    [కంజాత హితుఁడు = బ్రహ్మ దేవునికి మిత్రుఁడు, బృహస్పతి]


    సంద్రము నుండి పుట్టెఁ బురశాసను నౌదల నెక్కె వ్యోమ తా
    రేంద్రుఁడు పూర్ణిమా తిధియు నేగె గ్రమంబునఁ జూడఁ బాప మీ
    సాంద్ర మయూఖ దేహ మిఁక సన్నన యౌనని దక్ష శప్తుఁడౌ
    చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      కంజాత హితుడు = బృహస్పతి... ఎట్లా వస్తాయండీ మీ కీ విలక్షణపు టాలోచనలు! నమస్సులు.

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావుగారికి నమఃపూర్వక అభినందనలు! కంజాతహిత పదాన్ని బృహస్పతి పరంగా అద్భుతంగా పూరించారు! 🙏🙏🙏🙏

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      బృహస్పతి సతి తారకు బుధుఁ డుదయించ బాలుని యందమునకు ముగ్ధుఁడై తన కొడుకే యని తలచి యడుగ భార్య జవా బివ్వదు. బ్రహ్మ గారు వచ్చి బృహస్పతి చంద్రులను సమాధాన పఱచి తార నడిగినను బలుకదు. అప్పు డేకాంతమున ననునయముగ నడుగ జంద్రుని సుతుఁ డని చెప్పును. మధ్యవర్తిత్వము వహించిన బ్రహ్మ గారు మఱి మిత్రుఁడే కదా! – భాగవతము.
      డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
  23. కారుమేఘాలు గ్రమ్మగ?కాంతి లేక
    కదులు చున్నట్టి సూర్యుని కన్ను గొట్ట?
    చంద్రునింగాంచి యేడ్చె గంజాతహితుడు
    యన్నరీతిగ చిరుజల్లులందు కొనెను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హితుడు + అన్న' అన్నపుడు యడాగమం రాదు. "..హితు డ।టన్న రీతిగ..." అనండి.

      తొలగించండి
  24. అరుణ వర్ణము తనదని యడచిపడుచు
    ఉదయ సంధ్యలందు పొసగె నొఱపు గాను
    పూర్ణ గ్రహణమందు విరియు పూర్ణ రక్త
    చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాతహితుఁడు

    రిప్లయితొలగించండి
  25. సాంద్రయశో విరాజమగు చక్కదనంపు పురమ్ము నీ భువిన్
    ఆంధ్రుల రాజధానిని సదాశయ చిత్తము తోడ కట్టగన్
    కేంద్రము ముందుసయ్యనగ కీర్తిని బొందుచు వెల్గ బోయెడిన్
    చంద్రుని గాంచి యేడ్చెనదె సారస మిత్రుడు పశ్చిమాద్రిపై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భువిన్ ఆంధ్రుల' అని విసంధిగా వ్రాయరాదు. "భూమిపై। నాంధ్రుల..." అనండి.

      తొలగించండి
  26. ఛత్రములనడ్డు బెట్టుకు జనులు నన్ను
    చాటు గానైన చూడక సాగుచుంద్రు
    కనులు మాత్రము వదలుచు కర్పటమున
    ముఖము నంతట మగువలు మూసుకొంద్రు
    నాదు వేడికి తాళక నరులు నన్ను
    తిట్టుకొందురు కద యాటపట్టులందు
    గ్రీష్మకాలము నందున కేలుసాచి
    దండమైనను పెట్టరే ధరణిలోన
    యెపుడు పోదునో యునుచును సెకనులన్ని
    లెక్క వేయుచు నుందురు నుక్కతోడ
    నిన్ను జూచిన తరుణాన నెమ్మితోడ
    హాయి గాచంటిబిడ్డలు నాడుకొంద్రు
    కర్మసాక్షిని నాకింత ఖర్మమేల?
    నీవు చేసిన భాగ్యమ్ము నేమి టనుచు?
    చంద్రునిం గాంచి యేడ్చెగంజాతహితుడు!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధరణిలోన।నెపుడు... భాగ్య మ్మదేమిటనుచు..." అనండి.

      తొలగించండి
  27. రోహిణీ పరిష్వంగపు మహిమ యేమొ
    హిమకరుండామె మోహమున మన మేలు
    దల్చడని దక్కిన సతులు తామసమున
    "చంద్రునిం గాంచి యేడ్చెఁ; గంజాతహితుఁడు"
    ఛండకరుని ప్రియము మీర ఛాయ గొల్చె
    సంజ్ఞ రూపున న్నాసతి సబబుగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది.

      తొలగించండి


  28. నింగిలోని తారకలెల్ల నెమ్మి తోడ

    పరవశించె నును సిగ్గుతో పలుమార్లు

    చంద్రునిం గాంచి, యేడ్చెఁ గంజాతహితుఁడు
    ధరను తనకది లేదంచు తల్లడిల్లె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పలుమార్లు' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!


    ఇంద్రకుమారుఁ డత్తఱి దినేశకుమారుని యుద్ధమందు ని
    స్తంద్ర పరాక్రముండగుచుఁ జంపఁగఁ, గాంచియుఁ, జంద్రవంశధా
    త్రీంద్రులు పాండు పుత్రుల ప్రతీపుఁడు సచ్చె నటంచు నవ్వు నా
    చంద్రునిఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై!

    రిప్లయితొలగించండి
  30. *ఈనాటి నా పద్యానికి శ్రీ చిటితోటి విజయకుమార్ గారి అనువాదం - సంస్కృత శ్లోకం*

    పశ్యన్ పర్యహసత్ విధుర్గణపతిం తంద్రం చ కుక్షింభరిం
    “యస్త్వాం పశ్యతి నిశ్చయం స మనుజః ప్రాప్నోతు నిన్దామితి” ।
    గ్లావం క్రోధవతీ శశాప గిరిజా మాతా ప్రదోషే తతః
    దృష్ట్వా శీతకరం రురోద చరమే శైలే సరోజ ప్రియః ।।
    రచన :: శ్రీ చిటితోటి విజయకుమార్ నాగపూర్.

    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టా సత్యనారాయణ
    తంద్రిత వ్యొమగామికి నితాంత కృపా కిరణాభిదానమున్
    మంద్ర వికీర్ణ శోభనిడ" మామ"గ నెంచిరి యోషధీశు నా
    సంద్రజు ,నా నిశాచరుని జాలగ మెచ్చిరి:కర్మసాక్షినౌ
    ఇంద్రుని(ఒక ఆదిత్యుడు,శ.ర)ప్రక్క జంద్రుకిడు యీ విభవంబున కర్థముండునే?
    చంద్రుని గాంచి యేడ్చెనదె సారస మిత్రుడు పశ్చిమాద్రిపై!

    రిప్లయితొలగించండి
  32. డా.పిట్టా సత్యనారాయణ
    నిండు వెన్నెల రాజు వితండ వాద
    మందుకొని కేంద్రమున కొక్క మచ్చదేగ
    మూడు నామాల వర్గమున్ మొనసి బట్ట
    చంద్రునిం గాంచి యేడ్చె కంజాత హితుడు!

    రిప్లయితొలగించండి
  33. ఉత్పలమాల
    చంద్రికలయ్యెడిన్ వెలుగు చాటున ఇచ్చుటలోని హాయియే
    సంద్ర సమానమై తరణి సంతస మందుచు రాహు శాపమై
    చంద్రుని కడ్డుగా గ్రహణ జాలము నుండగ నీయ జాలడై
    చంద్రుని గాంచి యేడ్చె నదెసారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై!

    రిప్లయితొలగించండి
  34. *24-3-18* సమస్య
    *"చంద్రునిన్ గాంచి యేడ్చెఁ*
    *గంజాత హితుఁడు"*

    *జ్ఞాన నేత్రం*

    సందర్భము: పగలు సూర్యుని సామ్రాజ్యం. రాత్రి చంద్రుని కొలువు. ఐనా రాత్రి మాత్రమే కాదు. పగటి పూట కూడ కామాన్ని ప్రేరేపించగలడు చంద్రుడు. (మనసుకు అధిదేవత చంద్రుడు.) కాబట్టి చంద్రుని కొకసారి గర్వం పెల్లుబికింది. నన్ను మించిన మొనగాడు లే డనుకున్నాడు.
    సూర్యుని కాంతిలో పగటిపూట లౌకిక కార్యాలు చేసుకుంటారు జనాలు. రాత్రి పూట అసలే చేయలేరు. కాబట్టి సూర్యుని క దొక చిన్నతనం.
    పరమేశ్వరునికి సూర్య చం ద్రాగ్నులు మూడు కన్నులు. సూర్యుడు అసూయతో యేడ్చినా చంద్రుడు మిడిసిపడి యవహేళన చేసినా మూడవ కన్ను మాత్రం నిశ్చింతగా వుంది. అది జ్ఞానం నేత్రం కదా! నవ్వదు. ఏడువదు. కష్ట సుఖాలకూ.. ద్వంద్వాలకూ
    అతీతంగా వెలుగుతూ రెండు కన్నుల వరుసలో కాకుండా *పైభాగంలో* వుంటుంది.
    ~~~~~~~~~~~~~
    పగలును కామంబు రగిలించు చంద్రుండు;
    లౌకిక కృత్యాల రాత్రి వేళఁ
    జేయింపగా లేను న్యాయంబుగా నే న
    టంచు నెంచెను రవి; యమృత కరుడు
    "నన్ను మించిన వాడు నున్నాడె మొనగాడు!
    వంచింతు మనసులఁ బవలు రేలు"
    నంచు భావించె న య్యగ్ని "కష్ట సుఖాల
    నన్నింటి దహియింతు నంచు నెంచె...

    చంద్రునిన్ గాంచి యేడ్చెఁ గంజాత హితుఁడు..
    హి..హి..హి.. యని నవ్వె రవిఁ జూచి
    హిమకరుండు..
    మూడవది శంకరుని నేత్ర మేడువ దయె..
    నవ్వదయె పైది జ్ఞానాగ్ని నయన మయ్యె...

    2 వ పూరణము:---

    సందర్భము: సీతా దేవిని రావణు డపహరించిన పిమ్మట శ్రీ రామ చంద్రుడు కన్నీరు మున్నీరుగా విలపించినాడు.
    కర్మ సాక్షియైన సూర్య భగవానుడు సైతం రామ చంద్రుని దైన్యావస్థను గాంచి విలపించినాడు. దూరానికి నీటి యలలవోలె కనిపించే యెండ మావులు సూర్యుడు యేడుస్తుంటే రాలుతున్న కన్నీటి జాలులాగా కనిపిస్తున్నవి.
    ~~~~~~~~~
    ఇంతి హృదయేశ్వరిని వీడి యేడ్చు రామ

    చంద్రునిన్ గాంచి యేడ్చెఁ

    గంజాత హితుఁడు...

    రాలుచున్నట్టి కన్నీటి జా లనంగ

    నెండమావులు దూరాన మెండుకొనియె..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  35. సుందర రూపుడై వెలసి చుక్కల మధ్యన కొల్వుదీరుచున్
    వందలు వేల జంటలకు భాసము లిచ్చుచు చల్లచల్లగా
    గందర గోళ క్రీడలకు కమ్మగ తోడుత నిచ్చు పున్నమిన్
    జందురుఁ గాంచి యేడ్చె నదె సారసమిత్రుఁడు పశ్చిమాద్రిపై...

    రిప్లయితొలగించండి