ది. 24-1-2019,
శ్రీ మాచవోలు శ్రీధర రావు గారి గృహంలో, మదీనాగూడ, హైదరాబాదు
అవధాని : శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారు
సంచాలకులు : శ్రీ కంది శంకరయ్య గారు.
1. నిషిద్ధాక్షరి: శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి
(సాహిత్య ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ పద్యం చెప్పండి)
శ్రీ(న)క(ర)మ(ద)లా(న)ల(మ)య(-)ద(య)త్త
మ్మైకా(మ)వ్య(ప)ంబై(-)స(ర)త(త)మ్ముమా(క)ధు (ర)క(-) మ(త)గు(-)చున్
లోక(మ)వి(న)ధీ(య)తి(న)య(గ)న(ద)ంగా
(వ)పాక(మ)ంబై వ(ర) న(ర)జ(భ)మ(ద)య్యెవా(క)ణీ(క)నీ(క)చేన్.
శ్రీకమలాలయదత్త
మ్మై కావ్యంబై సతమ్ము మాధుకమగుచున్
లోకవిధీతి యనంగా
పాకంబై వనజమయ్యె వాణీ నీచేన్.
2. సమస్య: శ్రీ చండ్రపాటి రామ్మోహన్
(కులపిచ్చియె సంతతమ్ము కూర్చును చెలిమిన్)
పొలమున కలుపును తీయుచు
నలసటగా తోచినప్పు నందరు గూడన్
కిలకిల నగుచు తమల పా
కులపిచ్చియె సంతతమ్ము కూర్చును చెలిమిన్
3. దత్తపది: శ్రీ కామవరపు కామేశ్వర రావు
(రంభ – ఊర్వసి – మేనక – తిలోత్తమ పదాలను ఉపయోగిస్తూ బ్రహ్మచర్యం గూర్చి)
వీడె సంరంభమును తాను విద్యకొరకు
కనుల ముందర నూర్వశి కాన బడిన
మేన కంపర మేమియు పూన కుండ
నా తిలోత్తమ నైన తా నంటబోడు
4. వర్ణన: శ్రీ క్రొవ్విడి వెంకట రాజా రావు
(వసంత ఋతు వర్ణన ఉత్పల మాలలో)
పచ్చగ వృక్షరాజములు భాసిలుచుండగ గొప్ప శోభతో
వెచ్చని పిల్లవాయువులు వీయుచు నుండగ మత్తకోకిలల్
పొచ్చెము లేక కూయుచును మోదము గల్గగ జేయుచుండగా
వచ్చె వసంత లక్ష్మి కడు వైభవ మొప్పగ వత్సరాదిలో
5. ఆశువు: శ్రీ కవిశ్రీ సత్తి బాబు
(శ్రీ మాచవోలు శ్రీధర్ రావు, నాగలక్షి దంపతుల గురించి ఆశువుగా పద్యం)
నిండు నూరేండ్లు చల్లగా నుండగాను
నాగలక్ష్మి శ్రీధరులకు భోగ మొసగ
హరిహరాదుల వేడియు ననవరతము
కోరుచున్నారు మిత్రులు కూర్మితోడ.
6. ఛందోభాషణము : శ్రీ మాచవోలు శ్రీధర్ రావు
"స్వాగత మిదె యంజయ్యకు"
"మీ గృహమున పొందినాను మెప్పగు విందున్"
"బాగున్నద ఆతిథ్యము?"
"వాగీశ్వరి కరుణ చేత భాసిల్లె కవీ!"
7. వారగణన: ముద్దు రాజయ్య గారు.
8. అప్రస్తుత ప్రశంస: భమిడిపాటి వెంకటేశ్వర రావు
అవధానానంతరం కవిశ్రీ సత్తిబాబు గారి స్పందన....
1: కం. పుట్టె నవధాని యొక్కడు
పట్టము గట్టగ కవితకు వాగ్దేవి కృపన్
గట్టిగ శ్రీధరు నింటను
పట్టుదలగ నంజయ తన ప్రతిభను చూపెన్ .
2: ఉ. శ్రీధర మాచవోలు మరి శ్రీమతియౌ ఘన నాగలక్ష్మియున్
మోదము నొందగన్ కవి సమూహము బిల్చిరి విందుకోసమై
హ్లాదన మొంది మేము దరహాసము చిందగ మోమునందునన్
గాదిలి వంటకంబునయగారము నొప్ప భుజించి తీరమే !
కంది శంకరయ్య గారి స్పందన....
శ్రీ యంజయ్య వధానము
మా యందరి యెదలలో మహానందమ్మున్
హాయిగఁ గల్గించె నటం
చీ యవసర మందు మెప్పులే యందింతున్.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి స్పందన....
కడు ముదమ్మున నంజయ్య గౌడు చెప్పి
పద్యముల నద్భుతమ్ముగ వరలె తాను
క్రొత్త యష్టావధానియై కూడె వాణి
యితని గరుణతో దీవింప నిచ్చతోడ.
అవధాని అంజయ్య గౌడు గారి స్పందన...
చూత ఫలమ్ముకన్న మనసున్ మురిపించు జిలేబి కన్న సం
ప్రీతిని గూర్చు లడ్డు మృదు ఫేణిక ఖర్జూర నారికేళముల్
నేతిమిఠాయి గారెలును నే దిను వేళను పొందనైతి నీ
భ్రాతలతో వధానము శుభంబుగ సాగెను వాణి సత్కృపన్.