22, డిసెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4623

23-12-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... (ఛందో గోపనము)
“కుంజరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్”
(లేదా...)
“కుంజరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా”
(ఈ సమస్యను పంపిన బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు)

17 కామెంట్‌లు:

  1. కందం
    చరణముల క్రిందఁ ద్రొక్కఁ బి
    తరుండు కనుమూయ కపిశ ధాటిగఁ దొలిచెన్
    గరముఁ జని కసి, సమసెఁ గుం
    జరము, కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్

    చంపకమాల
    చరణము గ్రిందఁ ద్రొక్కి పిత చావుకు కారణయయ్యె నంచు వే
    గిరమె పిపీలికమ్మొకటి ఖిన్నయనన్ గసిఁ దొల్చె దూరుచున్
    గరమును ,ఘీంకరించుచు వగన్ గిరి మోదియు గూలినంతఁ గుం
    జరము, కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి

  2. కురుకుల వృద్ధుండట సం
    గరమున యస్త్రముల వీడి కవ్వడి చేతన్
    శరశయ్యను జేరుచు కుం
    జరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్.



    కురుకులమున్ నృపుంగవుడు కోమలి గంగ సుతుండతండు సం
    గరమున మేటి వీరుడు శిఖండిని గాంచుచు నస్త్రముల్ విడన్
    శరములు వేయక్రీడి శరశయ్యను జేర నదీజు గాంచ కుం
    జరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా.

    రిప్లయితొలగించండి
  3. అరయగ కుశయను దీవికి
    పరదేశీయులొ క కరిని పట్టుకు రాగన్
    పరుగులిడి వచ్చి యాకుం
    జరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్

    రిప్లయితొలగించండి
  4. విరివిగ దర్భల పొదలే
    పెరుగగ మశకమ్ములకవి పృష్టంబాయెన్
    పరిశీలింప మశక కుం
    జరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్

    విరివిగ దర్భలే పెరిగెఁ వేగమె నచ్చట చెర్వు చెంతనన్
    బెరిగెను దోమలా నెలవు వృద్ధికి వ్యాప్తికి మారుపేరుగా
    కురిసిన వానలే సడల క్రొత్తగ చేరిన తీక్ష్ణతుండ కుం
    జరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  5. చం.

    నిరతము భద్రమౌ పురము నిత్యము పుణ్యము శక్తిమంతమై
    సురలకుఁ బ్రీతి పాత్రమగు సుందర తీర్థము వారణాసియే
    ధరణిని విశ్వనాథ కృప దన్నుగ శూలముపై మనంగ *కుం*
    *జరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా!*

    రిప్లయితొలగించండి
  6. అరుదుగ గారడీడు తన యద్భుత విద్యలు జూపె నత్తరిన్
    కరమున జూపి పావురము క్రన్నన మాయము జేసె పిమ్మటన్
    బిరబిర ప్రాకు పన్నగము పింగళమై కనువిందు చోసె కుం
    జరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  7. పురమున తాంత్రికుడొక్కఁడు
    కరమున పావురముఁజూపి క్షణమున దానిన్
    మరుగొనరించె భళిర! కుం
    జరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్

    రిప్లయితొలగించండి
  8. కం॥ అరయఁగ విధి నెదురించఁగ
    మరువకు యెవరి వశమగును మహిలోఁ గనఁగన్
    గరుమము దప్పున ఘన కుం
    జరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్

    చం॥ అరయఁగ ధాత్రిలో విధికి యందరు బానిసలయ్య చూడఁగన్
    గరుమము దప్ప దెవ్వరికిఁ గాంచఁగ మానవ చింత యేలొకో
    మరువకు సత్యమియ్యది సమానము గాద జనాళి కెల్ల కుం
    జరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా

    ఏనుగు దర్భ కొస పైన నిద్దుర పోయినదంటే పరిస్థితులకు సర్దుకొనడము అనే ఉద్దేశముతో పూరించానండి

    రిప్లయితొలగించండి
  9. తరమే పల్కగ నేరికి
    బరువుగ నున్న కరికెటు ల పలుచని కుశ యన్
    పరుపున నుండి యు నే కుం
    జరము కు శా గ్రమున నిదుర చక్క గ బోయె న్?

    రిప్లయితొలగించండి
  10. అరుణుడి తాపము నోపక
    సరసున జలకమ్ములాడి చల్లబడినదై
    దరినొక నగఛాయను కుం
    జరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్

    కుశాగ్రము : నీటి అంచున అనే అర్థంలో (కుశము అంటే నీరు అనే పర్యాయ పద నిఘంటువుననుసరించి)

    రిప్లయితొలగించండి
  11. మెఱయుచుపార్థుండనిలో
    కరమొప్పుచుతాతగదిసెకరవాలముతో
    వెరగునభీష్ముండాకుం
    జరముకుశాగ్రముననిదురచక్కగబోయెన్

    రిప్లయితొలగించండి
  12. సిరిగలవాడై యున్నను
    మురాసురుని సంహరించ మునుగుహ దూరెన్
    హరి ఏమందునకట కుం
    జరము కుశాగ్రమున నిదుర చక్కగఁ బోయెన్

    అందరికీ ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలు 🙏

    రిప్లయితొలగించండి
  13. శ్రీమహావిష్ణువు మురాసురునితో యుద్ధం చేస్తూ , సింహవతి అనే గుహలో సేదతీరిన వృత్తాంతం.

    రిప్లయితొలగించండి
  14. తిరుగుచుదోమయొక్కటియు దిక్కలనెల్ల క్షుధార్తి తోడతా
    ధరణిననాశగాగనుచుదర్పముతోడనునొక్కపెద్దకుం
    *“జరము కుశాగ్ర భాగమునఁ జక్కగ నిద్దుర వోయెఁ జూడుమా”*
    స్థిరమగు వాసమొక్కటి టచిక్కె నటంచును చింత వీడుచున్

    రిప్లయితొలగించండి