23, డిసెంబర్ 2023, శనివారం

సమస్య - 4624

24-12-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా”
(లేదా...)
“రణము లనేకముల్ గద వరంబులుగా లభియించు నిచ్చలున్”
(ఈ సమస్యను పంపిన శిష్ట్లా వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలు)

13 కామెంట్‌లు:

 1. రణమునకేగి యచట నరి
  గణముల గూల్చెదనటంచు గదిలితివే ర
  క్షణకై ధరించుమిది, వా
  రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా.


  మణులవి యెన్నియున్నను మట్టిని దున్ను కుటుంబి తాను క
  ర్షణమును చేయకున్న తరి ప్రాణుల జీవన మెట్లు సాగు , భూ
  షణములవేల గాంచ గిరిసారము వైనను రైతు హస్త కా
  రణము లనేకముల్ గద వరంబులుగా లభియించు నిచ్చలున్.

  కారణము = పనిముట్టు.

  రిప్లయితొలగించండి
 2. పాలకులపై ఎన్నికలెదుర్కొనబోయే ప్రతిపక్షాల భావన:

  కందం
  అణగారిన వర్గమున ప
  రిణతి, నిరుద్యోగులకసి, ఋణబాధలు, పా
  లనపై విముఖతలవె కా
  రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా!

  చంపకమాల
  అణగిన వర్గముల్ దెలియ ఆగడమెంచిన దోపిడీలవే
  సణగి యుపాధికై కొలువు సంధిలఁ జేయగలేని పాలనన్
  ఋణముల మోతలున్ దొలయ, రేగి విపక్షములెంచనొప్పు కా
  రణము లనేకముల్ గద వరంబులుగా లభియించు నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 3. ధణి తాను జేయుదానిని
  తృణముగ దలచి తగినట్టి దీనుల కొరకై
  పణము నిడుటకయి యొసగు క
  రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా

  రిప్లయితొలగించండి
 4. చం.

  తృణములు దిగ్గజంబులకుఁ దెచ్చు మహాబలమున్ భరించెడిన్
  పణముల మధ్య బొందలము వాడుక వీరుల రక్షఁజేసెడిన్
  క్షణికము ప్రాణధారణము క్షాత్రము దిద్దెఁ బురాతనంబు, వా
  *రణము లనేకముల్ గద వరంబులుగా లభియించు నిచ్చలున్.*

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. పణమొక కారణమైనను
   గుణహీనునిపాలనమిడు ప్రతిపక్షముకున్
   క్షణమున గెలుచు బలిమి కా
   రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా

   అణకువ నాదరమ్ము జనులందరి కాంక్షలు గెల్పొసంగు దా
   రుణమగుపాలనంబిడిన రూఢియగున్ ప్రతిపక్ష గెల్పులే
   పణమొక కారణంబగును పల్వురి నేతలు గెల్పు వెన్క కా
   రణము లనేకముల్ గద వరంబులుగా లభియించు నిచ్చలున్

   తొలగించండి
 6. అణు వ ణు వున న ణ గియు దా
  క్షణ క్షణ మును జనుల ను. జక్కగ. జూచు న్
  ఘనుడై పలు రూ పుల కా
  రణము లనే కం బులు గ వరంబు. లగు గదా!

  రిప్లయితొలగించండి
 7. వినయమ్ము విధేయతలను
  గుణములు మనుజాళి మనికిఁ గుశలముగూర్చున్
  ఘనముగ దుష్కర్మ నివా
  రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా

  రిప్లయితొలగించండి
 8. అణకువ గల్గి మెలంగుచు
  మణిపూసల వంటివైన మర్యాదయు స
  ధ్గుణ సచ్ఛీలముల అనుస
  రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా

  రిప్లయితొలగించండి
 9. వినయ విధేయతల్ గలిగి పెక్కురు మెచ్చెడు సత్ప్రవర్తనా
  ధననివహమ్ముతో నలరు ధన్యులు మాన్యులు నిక్కువమ్ముగన్
  క్షణికములైన సౌఖ్యములకై వెరపందక సత్యనిష్ఠ కా
  రణము లనేకముల్ గద వరంబులుగా లభియించునిచ్చలున్

  రిప్లయితొలగించండి
 10. కం॥ గణుతికి యెగసిన వారల
  గుణముల నభ్యుపగమించి గురువుగ నెంచన్
  గణనన్ జేయఁ బడయు ప్రే
  రణము లనేకంబులుగ వరంబు లగుఁ గదా!

  చం॥ ప్రణతుల తోడ గణ్యులను రంజిలఁ జేసి మినమ్రుఁడై యటుల్
  గుణములఁ గాంచి విద్యలను గొప్పగ నేర్వఁగ వారి స్ఫూర్తితో
  గణనను జేయ సాధ్యమును గాని విధమ్ముగఁ బొందఁ గల్గు ప్రే
  రణము లనేకముల్ గద వరంబులుగా లభియించు నిచ్చలున్

  రిప్లయితొలగించండి

 11. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  అనయము బోధన చేయుచు
  వినయము,విజ్ఞానములను విద్యార్థులకున్
  ఘనముగ నా గురువుల ప్రే
  రణము లనేకంబులుగ వరంబులగు గదా!

  రిప్లయితొలగించండి
 12. క్షణమును వ్యర్థపర్చక సుకావ్యము వ్రాయగ నెంచి నంతనే
  గణములు ప్రాసలెల్లయును కమ్మగ పద్యము నందు చేరగన్
  ప్రణవమెనాదమైమదినిభక్తియుపొంగ నపార దైవ ప్రే
  రణములనేకముల్గదవరంబులుగాలభియించునిచ్చలున్

  రిప్లయితొలగించండి