5, ఏప్రిల్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 277 (ధాత వ్రాసిన వ్రాతలె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ధాత వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె.

9 కామెంట్‌లు:

  1. చిట్టి బుడతడు తా చిరంజీవి యయ్యె,
    సత్యవంతుడు జూడగ చచ్చి లేచె,
    శివుడు, శ్రీమాత, భక్తుల చెంత నుండ
    ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.

    రిప్లయితొలగించండి
  2. కాలఁ దన్నఁగఁ యముడను కదలె శివుఁడు;
    వరము లొసగిన యమరాజు వనిత పతికి
    మరల జీవన మిచ్చిఁదాఁమరలి పోయె ;
    ధాత వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె

    రిప్లయితొలగించండి
  3. గీత జూపిన మార్గమే గీటు రాయి
    పనుల బట్టియే వచ్చును ఫలిత మెపుడు
    వ్రాత యుండిన చాలదు చేత లేక
    ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.

    రిప్లయితొలగించండి
  4. 'తాత' వ్రాయుమ నంగను 'దాత' వ్రాసె!
    'దాత' వ్రాయవే యన్నను తాను వ్రాసె
    'ధాత'! వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె
    తమ్ము డౌటను కుర్రడు తగదు తిట్టఁ.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    భక్తి గలిగి యుండ - భయములే దిలలోన !
    స్థిరము , యశము గొనెను - చిరుత యొకడు
    సకల పాప హరుడు - శంభునే మదిగొల్చి !
    ధాత వ్రాసిన వ్రాతలె - తప్పు లయ్యె !
    ______________________________________
    చిరుత = చిన్ని మార్కండేయుడు

    రిప్లయితొలగించండి
  6. తప్పక జరిగి తీరును ధాత చేతి
    వ్రాత, నిజమిది తెలియును పండితులకు
    ధాత వ్రాసిన వ్రాతలె, తప్పు లయ్యె
    ప్రీతిగఁ గన కంప్యూటరు జాతకమ్మె!!

    రిప్లయితొలగించండి
  7. సర్వుల లలాట లిఖితంబు లుర్విఁ బనుప
    ధాత వ్రాసిన వ్రాతలె, తప్పు లయ్యె
    ననుచు తృప్తి జెందకుము, కన౦గ నగునె
    కార్య కారణ బంధమ్ము కట్టె దుటను?

    రిప్లయితొలగించండి
  8. కవి మిత్రులకు నమస్కృతులు.
    అందరి పూరణలూ బాగున్నాయి. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    మా అత్తగారి దశదిన కర్మకాండ కోసం వరంగల్ వెళ్తున్నాను. రేపూ అక్కడే. అందువల్ల మీ పూరణలకు వెంటనే స్పందించలేకున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి