14, ఏప్రిల్ 2011, గురువారం

సమస్యా పూరణం - 285 (మగని మోసగించు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మగని మోసగించు మగువ సాధ్వి.

27 కామెంట్‌లు:

  1. మగడు దూర దేశ మందు తానుండంగ
    కాముకుండు జేరి కథలు జెప్ప!
    లొంగి పోక తాను లోగుట్టు, కపట ప్రే
    మగని! మోసగించు మగువ సాధ్వి!

    రిప్లయితొలగించండి
  2. మూడవపాదంలో చిన్న సవరణతో...

    మగడు దూర దేశ మందు తానుండంగ
    కాముకుండు జేరి కథలు జెప్ప!
    లొంగి పోక వాని లోగుట్టు, దొంగ ప్రే
    మగని! మోసగించు మగువ సాధ్వి!

    రిప్లయితొలగించండి
  3. రిత్త నెయ్యమూని ప్రేమ మభినయించి
    మగని మోసగించు మగువ సాధ్వి
    యౌనె తత్ప్రవర్త నానువర్తనుడైన
    నరుని సత్పురుషుడనంగ జనునె

    రిప్లయితొలగించండి
  4. i find both the attempts are very good with different methods and expecting some more attempts from other participants also

    thanking you
    srinivas
    hyderabad

    రిప్లయితొలగించండి
  5. వార కాంత కపట వలపుల కురిపించి
    వగల నభిన యించి మగని మోస-
    గించు; మగువ సాధ్వి యంచు మన్నన లొందు
    భర్త కనుగుణముగ బ్రతుక గలుగ.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    ______________________________________

    మగని మోసగించు - మగువ సాధ్వి
    యన్న శక్యమె విన ? - నవని మీద !
    మనసు వాక్కు కర్మ - మగనినే తలచెడి
    పడతి పుడమి యగును - పరమ సాధ్వి !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  7. 02)
    ______________________________________

    ధర్మ మెంచ కుండ - తమ్ముని భార్యను
    తస్కరించె వాలి; - తప్పు గాదె !
    అన్న జేరి కులికె - నానాడు తారయే !
    మగని మోసగించు - మగువ సాధ్వి
    ______________________________________

    రిప్లయితొలగించండి
  8. దాన వీర శూర కర్ణ సినిమా
    ఆధారంగా :
    (మనసులోని కోరిక చెప్పమంటే - కర్ణుని
    ఆరవ భర్తగా పొందాలనుందని శ్రీకృష్ణునికి
    రహస్యంగా చెబుతుంది !)
    03)
    _______________________________________

    పంచ పతులు గలరు - పాంచాలి , కైనను
    మరులు గొనెను కర్ణు - మనసు లోన !
    ఇంత కన్న వింత - ఇలలోన గలదయ్య !
    మగని మోసగించు - మగువ సాధ్వి !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  9. 04)
    _______________________________________

    భర్త బయటి కేగ - భయ మన్నదే లేక
    ఇంద్రు గలిసె నంత; - చంద్ర వదన !
    భర్త రూపు గొనిన - పరుడని నెరుగదొ ?
    మగని మోసగించు - మగువ సాధ్వి !
    _______________________________________

    రిప్లయితొలగించండి
  10. 02అ)
    ______________________________________

    ధర్మ మెంచ కుండ - తమ్ముని భార్యను
    తస్కరించె వాలి; - తప్పు గాదె !
    అన్న జేరి కులికె - నానాడు రుమయంత !
    మగని మోసగించు - మగువ సాధ్వి
    ______________________________________

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా !
    చిన్న సందేహం !
    వాలి అపహరించిన సుగ్రీవుని భార్య
    తారయా ? రుమయా ?
    అంగదుని తల్లి ఎవరు ?
    వివరించండి !

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారు, రెండవ పూరణలో మూడవ పాదము (అన్న జేరి కులికె - నానాడు తారయే ) లో మీ ఆంతర్యమేమిటో కాస్త వివరించండి. తారకి వాలి అన్న కాడు, వాలి మరణానికి పూర్వము సుగ్రీవుడి భార్య తార కాదు.

    రిప్లయితొలగించండి
  13. ముని పత్నులపై మోహము పెంచుకొని తన కోరిక నెర వేరదని యెఱిగి దేహ త్యాగానికి ఒడిగట్టిన జాతవేదుడిని రక్షించుకొనుటకు స్వాహా దేవి ముని పత్నుల రూపములో అతడి కామము తీరుస్తొంది. ఈ కధ కిశోర్ జీ చెబుతారనుకొన్నాను.

    పరుల భార్య లందు మరులు గొనగ నగ్ని
    తృప్తి పరచె వాని దేవి వారి
    రూప మందు , భర్త పాపమ్ము తను మోసె
    మగని మోసగించు మగువ సాధ్వి !

    రిప్లయితొలగించండి
  14. వసంత్ కిశోర్ గారు,
    ముమ్మాటికి రుమయే..మార్చిన పాదము కూడా పద్యముతో పొసిగినట్టు లేదు, గమనించండి

    నరసింహమూర్తి గారు,
    మీ పూరణ చాల బావుంది. మరులు గొనగ నగ్ని కి బదులు 'మరులు గొన్న జ్వలుని' లేక 'మరులు గొన్న యనలు' అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  15. హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.

    గిరి గారూ,
    ఉత్తమ మైన పూరణ మీది. చక్కని పదసంపదతో అలరిస్తున్నది. అభినందనలు.

    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.

    మిస్సన్న గారూ,
    సమస్య పాదాన్ని పద్యాంతర్గతం చేసిన విధానం ప్రశంసనీయం. మనోహరంగా ఉంది పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. వసంత మహోదయా మీ పద్యాలు చాల బాగున్నాయి.
    కానీ, మీ ఉద్దేశం ఏదైనా ద్రౌపది, అహల్య లపై అభాండం
    వేస్తూ వ్రాయడం ఆవేదన కలిగిస్తోంది.
    ఎవరో పెడర్థాలు తీస్తే దాన్ని మనం .........
    న్యాయమా?

    రిప్లయితొలగించండి
  17. వసంత్ కిశోర్ గారూ,
    మీ నాలుగు పూరణలూ వైవిధ్యంగా, మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "పుడమి యగును" అనికాక "పుడమి నగును" అని ఉండాలి.
    రెండవ పూరణలో గిరి గారు చెప్పినట్లు అపార్థానికి అవకాశం ఉంది. రుమకు వాలి "బావ" కదా. "బావఁ జేరి కులికె భామ యా రుమ నాడు" అందాం.
    మూడవ పూరణ బాగుంది. కాని ఆ కథ కల్పిత మైనది. వ్యాస భారతంలో లేని ఘట్టం. ఇలాంటి పుక్కిటి కథలు రామాయణ, భారతాలలో చాలా చేరాయి. కొన్ని విన్నప్పుడు బాధ కలుగుతుంది. అందులో ఒకటి ఈ ద్రౌపది కోరిక.
    నాల్గవ పూరణ అత్యుత్తమంగా ఉంది. "పరుడని నెరుగదో" అన్నదాన్ని "పరుడని యెరుగదో" అందాం.

    రిప్లయితొలగించండి
  18. గిరి గారూ మీ సూచనకు ధన్యవాదములు 1

    పరుల భార్య లందు మరులు గొన్న ననలుఁ
    దృప్తి పరచె వాని దేవి వారి
    రూప మందు , భర్త పాపమ్ము తను మోసె
    మగని మోసగించు మగువ సాధ్వి !

    రిప్లయితొలగించండి
  19. నరసింహ మూర్తి గారూ,
    మంచి ఘట్టాన్ని ఎన్నుకొని చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గిరిగారికి
    ధన్యవాదములు !
    సుగ్రీవుని అన్న అని నా భావం !
    మొదట తారనుకొని తరువాత రుమగా మార్చాను !
    అయినా అపార్థం కలుగుతున్నది !
    గురువుగారు సరిచేశారు గదా !

    మూర్తిగారికి ధన్యవాదములు !
    నేను మరచినా మీరు పట్టుకున్నారుగదా !
    ధన్యవాదములు !

    మిస్సన్న మహాశయులకు
    ధన్యవాదములు !
    నాకూ ఇబ్బంది అనిపించింది వ్రాసేటప్పుడు !
    ఏదో పూరణకోసం పడ్డ తాపత్రయమే గాని
    వాళ్ళను తప్పు పట్టాలని కాదు !
    అందుకే ద్రుపది గురించి వివరణ కూడా ఇచ్చాను !
    ఆ భావాలు నావి కావని !
    మన్నించండి !

    శంకరార్యా !
    మీ వివరణకు సవరణకూ
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  21. అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా,
    పంచ కన్యా: స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్.

    రిప్లయితొలగించండి
  22. చంద్ర శేఖరా !
    ధన్యవాదములు !
    ఇందులో తార బృహస్పతి భార్య గదూ !

    మిస్సన్న మహాశయా !
    నా ఉద్దేశ్యం ఇదే !
    పంచ కన్యలమీద వ్రాయాలనుకున్నాను !
    తార విషయంలో సందిగ్ధం కలిగింది !
    సీతా , మండోదరి గురించి ఏ పుక్కిటి పురాణమూ
    గుర్తు రాలేదు !
    చిన్న చిన్న తప్పులున్నా వీళ్ళు కన్యలూ , సాధ్వులూ
    అనే నా అసలు ఉద్దేశ్యం !

    రిప్లయితొలగించండి
  23. ఈ శ్లోకం లో తార వాలి భార్యయే, సందేహం లేదు. బృహస్పతి భార్య కాదు. వాలి భార్య తార యొక్క పాతివ్రత్యం గురించి శ్రీ వాల్మీకి రామాయణం - కిష్కింధకాండ చదవమని మనవి. శ్రీరాముడే మెచ్చుకొంటాడు ఆవిడని.
    మనవి: ఈ ఐదుగురిని కన్యలనటానికి చాలా ఉదాత్తమైన నేపధ్యం వుంది. దానవీరశూరకర్ణ డైలాగ్లు వ్రాసిన కొండవీటి కవియొక్క దౌర్భాగ్యం, ముప్పాళ రంగనాయకమ్మ మూర్ఖత్వం, ఈ మధ్య ద్రౌపది గురించి అవాకులు చెవాకులూ పేలిన వాళ్ళ రాతలు మనలని ఇంకా వెన్నాడుతున్నాయి. భ్రష్టస్యకావాగతి: అన్న కాళిదాసు వాక్యం నిజమే.

    రిప్లయితొలగించండి
  24. గురువుగారూ ధన్య వాదాలు.

    కిశోర మహోదయా నా హృదయ శల్యం తొలగి పోయింది. ధన్య వాదాలు.

    చంద్ర శేఖరా మీ వివరణ సమగ్రంగా ఉంది. ధన్యవాదాలు.

    అహల్య విషయంలో కూడా ఆమె తప్పు లేదని అంటారు.
    నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలుతుంది.
    కాబట్టి ఆమె ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది.
    విజ్ఞులెవరైనా, గురువులు,చంద్రసేఖరుల వంటి వారు
    వివరిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  25. చంద్రశేఖరా !
    మీ చక్కని వివరణకు
    ధన్యవాదములు !

    మిస్సన్న మహాశయా !
    మీ హృదయ శల్యం తొలగించగలిగినందుకు
    చాలా ఆనందంగా ఉంది !

    నిన్నంతా కొన్ని బ్లాగుల్లో
    రామగోపాలవర్మ పిచ్చి ప్రశ్నలూ
    చివరిలో ఇవి నావి కావు
    విషవృక్షంలో రంగనాయకమ్మవి
    అన్న వార్తలూ
    టీవీ లో కూడా పెద్దపెద్ద అక్షరాల్లో మళ్ళీ
    అవే ప్రశ్నలూ చదివి చదివి చూసి చూసి
    ఆ వరదలో కొట్టుకు పోయి
    ......................................
    అదీ నేపథ్యం !

    రిప్లయితొలగించండి
  26. గిరీజీ !
    వాలి మరణానికి ముందు
    అంటే వాలి బిలములో ప్రవేశించి
    ఎంతకూ బైటికి రాకపోతే
    చనిపోయాడనుకొని బిల ద్వారం మూసివేసి
    కిష్కింధా రాజ్యమునూ తారనూ
    సుగ్రీవుడు చేబడతాడు గదా !
    భర్త చనిపోతే మరదిని చేసుకోవడం వాళ్ళ
    ఆచారమనీ అందువల్ల తార తప్పులేదనీ
    ఎక్కడో చదివాను !

    రిప్లయితొలగించండి