16, ఏప్రిల్ 2011, శనివారం

సమస్యా పూరణం - 287 (నిను నిను నిను నిన్ను నిన్ను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

32 కామెంట్‌లు:

  1. కృష్ణకు నిండు సభలో అవమానం జరిగే సందర్భంలో
    పెద్దల నుద్దేశించి వికర్ణు డిలా అన్నాడు:

    వినుడీ ద్రౌపది కెగ్గును
    కనులుండీ చూడకున్న కాదిది ధర్మం-
    బనరే రేపీ జనులున్
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    రిప్లయితొలగించండి
  2. (ఆకాశంలో సప్తర్షి మండలం అమరిక గాలిపటం లా అనిప్పిస్తుంది)

    వినువీధుల వెదకితి మిము
    కనుగొన;సప్తర్షులార! గాలి పటములా
    ఘనముగ నుండగ జూచితి
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!

    రిప్లయితొలగించండి
  3. నిను నే నననో నానీ!
    నిను నే ననఁ నైన! నిన్ను నననే నీనా!
    నను నూనెను నానో, నిను,
    నిను, నిను, నిను, నిన్ను, నిన్ను, నిన్నును నిన్నున్.

    (గతంలో ఒక సమస్యకు పీతాంబర్ గారనుకొంటా యిలాంటి పూరణ చేశారు.
    ఆ స్ఫూర్తి తో. ఏమైనా అర్థం అవుతోందంటారా?)

    రిప్లయితొలగించండి
  4. ననునను ననున న్నన గను,
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
    యని కులుకులాడి పిలచిన,
    తన్నరములు జివ్వు మనుట తధ్యము కుమతీ!

    రిప్లయితొలగించండి
  5. నాల్గవ పాదం సవరణతో:
    ననునను ననున న్నన గను,
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
    యని కులుకులాడి పిలచిన,
    నానరములు జివ్వు మనుట నరకము కుమతీ!

    రిప్లయితొలగించండి
  6. ధనమే పరమావదిగా
    జనులను హింసించ, నిన్ను, జగదీశ్వరుడే
    దునుమును నేవేడున్నను
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నుని నిన్నున్!

    రిప్లయితొలగించండి
  7. హనుమచ్ఛాస్త్రి గారి సప్తర్షి పూరణ లెక్కకు సరిగ్గాసరిపోయింది.

    రిప్లయితొలగించండి
  8. జనతా! జగనా! కిరణా!
    ఘనమగు బాబూ! తెరాస! కమ్యూనిస్టా!
    కొణిదల! వదలరు జనులిక
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ!చంద్రశేఖర్ గారూ!పీతాంబర్ గారూ!జీ యస్ యన్ గారూ! మీ మీ పూరణలు బాగున్నవి.
    మిము మిము మిమ్ము మిమ్ము ... అభినందించుచున్నాను.

    రిప్లయితొలగించండి
  10. గణపతి! కరుణా సింధో!
    ననుగనవా! కావఁరాననకుమా! మరువక
    ననుదిన మూనే గొల్చితి!
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    గణదోషము ఏదో ఉన్నట్టుంది. కానీ తెలియటం లేదు.

    రిప్లయితొలగించండి
  11. సప్త రుషి మండలాన్ని సందర్శింప జేసిన శాస్త్రిగారి పూరణ,మిస్సన్న గారి రెండు పూరణలు, ముఖ్యంగా ఏకాక్షర పూరణ నేను లోగడ చేసిన పూరణను గుర్తుకు జేసింది ,జిఎస్ యెన్ హెచ్చరిక పూరణ లు బాగున్నాయి .మీకు అభినందనలు

    నా పూరణలో మూడవ పాదంలో చిన్న టైపాటు దొర్లింది , "దునుమును నీవేడున్నను ''సరియైనది .

    రిప్లయితొలగించండి
  12. మందాకిని గారు,
    కంద పద్యంలో 2 మరియు 4 పాదాలు గురువుతో అంతమవ్వాలి. అనగా "సగణము" కాని "గగ" కాని రావాలి. మీ పద్యములో రెండవ పాదములో, ఆ నియమము తప్పినది.

    రిప్లయితొలగించండి
  13. కనిఁసతు లయలుకఁ కృష్ణుఁడు
    వినుమని పలికెన్, "మనంబుఁ వెలితిని విడుమా!
    తననూ నేఁ ప్రే మింతును
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    ధన్యవాదాలు సత్యనారాయణ గారూ!
    ఇప్పుడు సరిదిద్దాను.

    గణపతి! కరుణా సింధో!
    ననుగనవా! కావఁరాననకుమా! దేవా!
    ననుదిన మూనే గొల్చితి!
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారూ,
    ప్రశంసనీయమైన పూరణలు. అభినందనలు.
    పద్యంలో "కనులుండియు", "జనులే" అంటే ఇంకా బాగుంటుంది కదా.
    మీ ఏకాక్షర పూరణ చాలా బాగుంది. కాకపోతే పూర్తిగా అర్థం చేసికొనలేని మంద బుద్ధిని. కాస్తా వివరిస్తారా?

    హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    సవరించిన తర్వాత కూడా గణదోషం ఏర్పడింది. పాదాద్యక్షరం గురు వయింది. పైన లఘువు లున్నాయి.
    "తన నరములు జివ్వు మనుట తధ్యము కుమతీ!" అనడమే సబబు.

    పీతంబర్ గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    "మిమ్ము, జగదీశ్వరుడే
    దునుమును మీ రేడున్నను" అంటే ఇంకా బాగుంటుందేమో?

    సత్యనారాయణ గారూ,
    రాజకీయాలను కడిగేసారు. మంచి పూరణ. అభినందనలు.

    మందాకిని గారూ,
    "కృష్ణప్రమ"ను చక్కగా ఆవిష్కరించారు. పూరణ బాగుంది. అభినందనలు.
    "తననూ నేఁ ప్రే మింతును" లో "నూ" అభ్యంతరం. "మనసారగ ప్రేమితును" అందాం.
    రెండవ పూరణ కూడా బాగుంది. కాని "అనుదిన మూనే గొల్చితి" అన్నప్పుడు కూడా "మూ" అభ్యంతరమే. "అనుదినమును నే గొల్చితి!" అంటే సరి.

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    సీత జాడ నరయక
    "హా సీతా " యని పిచ్చి వానివలె
    పరితపించుచూ అడవిలో
    శ్రీరాముడు :

    01)
    _____________________________________

    తనసతి జాడను కనుగొన
    కనుపించిన పక్షి , జంతు - గణముల నడిగెన్ !
    వనమున చెట్టును పుట్టను
    నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  16. పొదల మాటున దాగిన
    వెన్న దొంగను
    వెతుకుతూ రాధ :

    02)
    ______________________________________

    కనిపించని గోపాలుని
    వనమున వృక్షముల కెల్ల - ప్రణతిడి యడిగెన్ !
    వినయము , యమునా తటినే
    నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  17. *** అష్ట లక్ష్ముల కథ ***

    అనగా అనగా ఒకనాడు
    ఒక రాజు మీద అలిగిన అష్ట లక్ష్ములు
    ఒక్కొక్కరూ ఆ రాజుతో చెప్పి వెళ్ళిపో
    సాగారట !
    "అలాగే తల్లీ నీ దయ " అని చెప్పి
    ఏడుగురిని సాగనంపిన

    ఆ నృపుడు , దైర్య లక్ష్మిని మాత్రం
    " తల్లీ నీవున్నావన్న ధైర్యం తోనే అందరినీ
    వదలు కున్నాను ! నువ్వు కూడా వెళ్ళి పోతే ఎలాగు "!
    అని , ఆమెను ప్రార్థించి వెళ్ళకుండా ఆపుకున్నాడట !
    ఆమె సంతోషించి వెనుతిరిగి లోనికి వెళ్ళిందట !

    ఆమె వెనుకే మిగిలిన ఏడుగురూ కూడా తిరిగి వచ్చారట !
    వెళ్ళి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం
    విస్తుబోయి చూస్తున్న భూపాలునితో
    " మహారాజా దైర్య లక్ష్మి ఉన్న చోటే మేమూ ఉంటాం !
    ఆమెను విడచి మేము కూడా ఉండలేము !
    అందుకే తిరిగి వచ్చాము " అని చెప్పి
    అష్ట లక్ష్ములూ లోనికి వెళ్ళి పోయారట !
    అదీ సంగతి !

    03)
    ________________________________________

    తనకిక ధైర్యమె దిక్కని
    నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
    వినయాంజలి తోడ విడిన
    మనుజేంద్రుని వెంట మీరు - మరలిరి శుభులై !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  18. కన్ను గానని కామము తో
    ఒళ్ళు తెలియని మోహము తో
    విరటుని కొలువు కూటం వరకూ
    ద్రౌపది వెంటబడి వేధించిన కీచకుని
    బారినుండి రక్షించు వారు లేరా యని
    సభాసదులను ప్రార్థించిన సందర్భం :

    04)
    _________________________________________

    కను గానని కామము తో
    మనసాయెను నిను గని యని - మదవతి దరుమన్ !
    వినుతించె కృష్ణ యంతట
    నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  19. 05)
    _________________________________________

    ఘనతర మగు కవనముతో
    మన వాడగు గరికి పాటి - మనసులు దోచెన్ !
    తన యవధానంబున ,నను
    నిను ,నిను ,నిను ,నిన్ను ,నిన్ను - నిన్నును, నిన్నున్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  20. నా మొదటి పూరణకు ప్రేరణ ఈ పద్యం !
    ఇది అన్నగారు సావిత్రి నటించిన "దేవత " సినిమా లోనిది !
    చివరి రెండు పాదాలూ youtube వీడియో లో cut అయిపోయినవి !
    గాన గంధర్వుడు ఘంటసాల వారు ఎంతో ఆర్ద్రత తో పాడారు !
    ఎంత అంటే --ఆకాశ మంత ! చెప్పలేం వినాలి మరి !
    వింటేనే తెలుస్తుంది !
    _______________________________________

    *సీ*
    జగమెల్ల పరికించు - చల్లని జాబిల్లి
    సుదతి సీతను నీవు - చూడ లేద !

    ప్రతి చరా చరముల - పయనించు చిరు గాలి
    జానకి నెట నైన - కాన లేద

    కరుణతో విశ్వమ్ము - భరియించు భూమాత
    చెలి జాడ నీవై న - తెలుపరాద

    తరులార గిరులార - మెరయు తారక లార
    పడతి ఏమయ్యెనో - పలుక రాద

    తే*గీ
    ఏది వైదేహి ? జానకి - ఏది ? సీత
    లేనిదే, రాముడే లేడూ - లేడ టంచు


    [కరకు గుండెలు **** - మారు మోగ
    ఎలుగెత్తి పిలిచె నా రాఘవుండు
    హా సీతా ---------హా సీతా--------]

    రిప్లయితొలగించండి
  21. నా పూరణలు .......
    (1)
    (కౌరవసభలో శ్రీకృష్ణుఁని హెచ్చరిక .....)
    వినుఁడు సుయోధన దుశ్శా
    సన కర్ణా ధ్యఘవిచార శాలుర మిమ్మున్
    ఘన పాండవాగ్ని కాల్చును
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    (2)
    చని క్రీడా మైదానం
    బున నాడెడివారి నెల్లఁ బొడగని యంటిన్
    "మన `కోచు` పిలిచె మీలో
    నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్."

    రిప్లయితొలగించండి
  22. మాస్టరు గారూ!ధన్యవాదములు. మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  23. వసంత్ కిశోర్ గారూ,
    మీ ఐదు పూరణలూ పంచరత్నాలై శోభిస్తున్నాయి.
    మొదటి పూరణలో రాముడు, రెండవ పూరణలో రాధ, నాల్గవ పూరణలో ద్రౌపది ప్రస్తావన బాగుంది.
    మూడవ పూరణ అద్భుతంగా ఉంది.
    ఇక ఐదవ పూరణ ఉత్తమోత్తమం. అందులో "నను" చేర్చిన విధానం బాగుంది.
    వేసుకొండి "ఐదు వీరతాళ్ళు" మూడవ పూరణకు మూడు, ఐదవ పూరణకు రెండు .......

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యా !
    ధన్యవాదములు !
    మీ రెండు పూరణలూ బహు చక్కగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  25. వసంత మహోదయా మీ పూరణముల న్నియును రత్నముల వలె ప్రకాశించు చున్నవి.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారూ భయ పడ్డంతా అయింది.
    ఏది జరగ కూడదను కొన్నానో అదే జరింగింది.
    క్లిష్టమైన పద్యాలకు అర్థం చెప్పమంటే ఎలాగండీ (నవ్వుతూ).
    మీరే మంద బుద్ధులైతే మాలాటి మందమంద బుద్ధుల గతేంటి?
    ఏదో బానే ఉంది కదా అని పద్యం వ్రాసేశా నంతే............

    అయినా నా భావాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను.

    నాకూ, నానిగాడికీ, నైనాకూ, నీనాకూ నానో కారంటే చాలా ఇష్టమై పోయింది.
    వాళ్ళకా విషయం చెప్తూ నానో మోజులో పడ్డారని నేను మిమ్మల్ని ఏమీ అనను. నన్నూ, మిమ్మల్నీ కూడా నానో పడేసింది అని చెప్పాను అంతే.
    సింపుల్.

    ఏం బాలేదా సారూ?

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్న గారూ ఇప్పటికి నా బుర్రలో లైటు వెలిగింది. ఈ నానీ కవితలేమీ అర్ధం కావటల్లా. ఇప్పటికి ఒకటి అర్ధమయింది చెవి నలిపి చెపితే.

    రిప్లయితొలగించండి
  28. లక్కరాజు వారూ బుర్ర మండి పోయేలా తెగ గోకేసు కొంటేనే కానీ
    ఆ పద్యం వ్రాయ లేక పోయాను. మీరు చెవి నలిపేసు కోవడంలో వింత ఏముంది? ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. మిస్సన్న మహాశయా !
    ధన్యవాదములు !

    నానో గుట్టు విడి పోయింది !
    హమ్మయ్య ! ధన్యులం !

    రిప్లయితొలగించండి