16, జనవరి 2019, బుధవారం

అష్టావధానం

ది. 13-1-2019
వేదిక : ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి
అవధాని : పాలడుగు శ్రీచరణ్ గారు, U. S. A.
అధ్యక్షులు : శ్రీ మేడసాని మోహన్ గారు
******
1. నిషిద్ధాక్షరి : ఆముదాల మురళి గారు.
(బ్రహ్మవిద్యను గురించి వివరిస్తూ పద్యం)
శ్రీ(శ) మ(త) ద్వా(స) క్ప(త)ద(మ) గో(మ) పున్
సామ(జ) గ(మ) తో(య) షున్(x) ప(వ) ర(మ) శి(వ) రు జ(న) డ(ల) భి(ర) త్తున్(x) నే
[రెండు పాదాలకే నిషేధం. కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. (X) చిహ్నం నిషేధం లేదు]
శ్రీమద్వాక్పదగోపున్
సామగతోషున్ పరశిరు జడభిత్తున్ నే
ఓమఖిలైక మటంచును
నీమంబున గొల్తు బ్రహ్మ నిష్ఠావిద్యన్.
******
2. సమస్య : కంది శంకరయ్య
(వడఁకెను మేడసాని కవి వర్యుఁడు సేయు మనన్ వధానమున్)
అడుగుటయే నిదానమఁట యాశుఝరీ పరిపుష్టిఁబొందఁగన్
నడకలు హంసరీతులను న్యాయము దప్పక పల్కువారికిన్
జడధులు పొంగు రీతిగను సారపు ధర్మ విలాస తంతులన్
వడఁకెను మేడసాని కవి వర్యుఁడు సేయుమనన్ వధానమున్.
******
3. దత్తపది : డా. మన్నవ గంగాధర ప్రసాద్ గారు
(తెలుఁగు, వెలుగు, జిలుఁగు, కలుఁగు పదాలతో సంక్రాంతి లక్ష్మి యొక్క వర్ణన చంపకమాలలో)
తెలుఁగుల తేట పొంగఁగను ధీరవి సంక్రమణంబు తేజమై
వెలుగులు విశ్వరూపమున వృద్ధినిఁ జెందఁ దమోధి నక్రమున్
జిలుగుల చేలముం గొనుచు శ్రీశుఁడు విక్రమ మొందఁగా భువిన్
కలుగును సర్వ సౌఖ్యములు జ్ఞాన బలోద్ధతి శాంతి నొందఁగన్.
******
4. వర్ణన : మల్లిశెట్టి శివప్రసాద్ గారు
(జన్మస్థలంలో అవధానం చేస్తున్న మీ అనుభూతిని మత్తేభంలో వర్ణించాలి)
కవి రత్నాకరమైన శ్రీనగమునం గాత్యాయనీ నాథుడే
దివిషట్కోటులు కింకరుల్ గనఁగ వేదీ మధ్యమున్ దుర్గ తాన్
సవనం బూనెడి వేదభూమి సకల జ్ఞానార్థ ధాత్రిన్ సదా
నివసింపంగ నిధానమై వెలయు శ్రీనీలేశు ధామంబునన్.
******
5. న్యస్తాక్షరి : కట్టా నరసింహం గారు
(శ్రీ వెంకటేశ్వర స్వామి వర్ణన - మొదటి పాదం 1వ అక్షరం 'శ్రీ'; రెండవ పాదం యతిస్థానంలో 'చ'; మూడవ పాదం యతిస్థానంలో 'ర'; నాల్గవ పాదం చివరి అక్షరం 'ణ')
శ్రీ రమానాథుఁ గలియుగ చిద్విలాసు
జనన మరణ చక్రాంతక చక్రధారి
లలిత శృంగారమూర్తికి రక్ష కొరకు
నంజలించెద పద్య విద్యార్థి చరణ.
******
6. ఆశువు : డా. వి. కృష్ణవేణి గారు
అ) ట్రంపు ఇంటిముందు సంక్రాంతి సంబరాలు జరిగితే ఎలా ఉంటుంది?
అతని కుట్రంపు కూతలె యంతరించు
సకల సౌభాగ్యముల్ మీరి ప్రకటమయ్యు
పశ్చిమంబున సంక్రాంతి వరవిధాత్రి
భోగి భోగేంద్రశయనుని పూర్ణకృపను.
ఆ) బ్రహ్మనాయుడు, నాగమ్మ ఇప్పుడు కోడిపందాలలో పాల్గొంటే ఎలా ఉంటుంది?
బ్రహ్మకైనను తప్పదు పంతమందు
వాగ్ధనుష్కోటి సంధింప ప్రణవమూని
నాగ యజ్ఞోపవీతుని నయముగాను
ప్రథమ పూజన్ జయంబును బడయగాను.
******
7. పురాణపఠనం : ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారు నిర్వహించారు.
అ) ఓ పుణ్యాత్మకులార... (భాగవతం)
ఆ) బహువనపాదపాబ్ధి కుల... (భారతం)
******
8. అప్రస్తుత ప్రసంగం : డా. ఇ.జి. హేమంతకుమార్ గారు నిర్వహించారు. 

3 కామెంట్‌లు: