30, ఏప్రిల్ 2021, శుక్రవారం

సమస్య - 3709

1-5-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జింకలు దినెఁ బొలసు గడ్డి సింహము మేసెన్”
(లేదా...)
“జింకలు మాంసముం దినెను సింహము గడ్డిని మేసెఁ బ్రీతితోన్”

47 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    అంకితమైన కాననము నందున జంతువు లన్ని యెప్పుడున్
    శంకయె లేక జీవనము సల్పుచు నుండియుఁ, బోఁకు మేయుచున్
    జింకలు, మాంసముం దినెను సింహము, గడ్డిని మేసెఁ బ్రీతితోన్
    రంకువు లెల్లెడం దిరిగి మ్రాఁకుల నీడఁ బరుండె నప్పుడే!

    రిప్లయితొలగించండి
  2. పొంకములు మారి మృగముల
    కొంకక నాహార మందు కోర్కె లు జూడన్
    జంకక నటునిటు కాగా
    జింకలు దినె బొలుసు గడ్డి సింహము మేసెన్

    రిప్లయితొలగించండి
  3. వంకరదారులబంటులు
    జంకునులేకనుధనమునుసంపాదింపన్
    పంకమునంటెనురాజుకు
    జింకలుదినెఁబోలసుగడ్డిసింహముమేసెన్

    రిప్లయితొలగించండి
  4. బింకము జూపుచు నేనొక
    పెంకెకు జంతువు లతిండి విషయము దెలుపన్
    బొంకుచు నీరీ తి పలికె
    “జింకలు దినెఁ బొలసు , గడ్డి సింహము మేసెన్”

    రిప్లయితొలగించండి
  5. శంకనుమానిరాట్సుతుడుసామమువీడుచురాజ్యకాంక్షతో
    వంకరదారులన్ఘనులుపాండునిపుత్రులకానకంపెగా
    పెంకెతనమ్మునాయెడనుపెన్నిధినందెనురాజరాజుగా
    జింకలుమాంసముందినెనుసింహముగడ్డినిమేసెఁబ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  6. పొంకముమీర జంతుతతి భూరిగ బెంచెడు రక్షకుండు
    దా
    శంకలు లేకయే సతము చక్కగ బంచగ తిండి నాకులన్
    జింకలు, మాంసముం దినెను సింహము ,మేసెను గడ్డి బ్రీతితోన్
    గొంకక నాలమంద మరి కోతులు కొబ్బరి కాయలన్ దినెన్

    రిప్లయితొలగించండి
  7. అంకమ్మా యటు చూడుడు
    శంకరుడను మాంత్రికుడొక సభలో చూపెన్
    పంకజము విరిసె చెట్టుకు
    జింకలు దినెఁ బొలుసు గడ్డి సింహము మేసెన్.

    రిప్లయితొలగించండి
  8. కంకర రాయినే పనస కాయగ మార్చిన మాంత్రికుండటన్
    మంకెన పూలనాతడట మామిడి పండ్లుగ చేసి చూపగా
    వంకర పప్పు గాసెనట పాదపముల్ కడు చిత్రమేమనన్
    జింకలు మాంసముందినెను సింహము గడ్డిని మేసెఁ బ్రీతితోన్.

    రిప్లయితొలగించండి
  9. కుంకలు కూళులున్ ప్రభుల కాళ్ళను బట్టుచు వంత పాడుచున్
    పంచన జేరి తంత్రముగ పణ్యము మేయగ మాయ పన్నుచున్
    లెంకల దృష్టిలోన సరిలేరన నిల్చుట చూడ చందమౌ
    జింకలు మాంసముం దినెను సింహము గడ్డిని మేసె బ్రీతితోన్

    జంకును లేక వన్య మృగ జాతులు మేయుట చూడ పచ్చికన్
    జింకలు; మాంసముం దినెను సింహము; గడ్డిని మేసె బ్రీతితోన్
    బింకము వీడి యశ్వములు బేడిగ లేకయె ధర్మబుద్ధిచే,
    కుంకలు నీచ మానవులు కుడ్తురు రెండును సిగ్గులేక ఛీ !

    బేడిగ = పన్ను

    రిప్లయితొలగించండి
  10. ఉ:

    వంకలు లేని జీవితము వాసిగ పేరు గడింప ముఖ్యుడై
    శంకను గూర్చు తప్పిదము చాలని లోకులు ఛీత్కరించనై
    లంకెలుగట్ట నా విభుఁడు లంపట మెంచి తలంచె నివ్విధిన్
    జింకలు మాంసముందినెను సింహము గడ్డిని మేసె బ్రీతితోన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 2వ ప్రయత్నము :

      ఉ:

      రంకెలు వేయుచున్నొకడు రంగము సిద్ధ మటంచు నెన్నికన్
      డొంకలు దిర్గు దారులును డొల్లగు మాటలు, మోసగించనై
      వంకయె లేదనన్ గెలుపు వద్దని ఓటరు ఛీత్కరించగన్
      జింకలు మాంసముందినెను సింహము గడ్డిని మేసె బ్రీ తితోన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  11. బింకముతోడ పర్విడెను
    భీతిని సింగముగాంచి వేగమే,
    యంకిలితోడ జీల్చియట
    నాత్రుత రేగ వనాంతరమ్మునన్,
    శంకను వీడి యాడుచును
    సాధుమృగాళి తటాక తీరమున్,
    జింకలు; మాంసముం దినెను సింహము; గడ్డిని మేసెఁ బ్రీతితోన్!

    రిప్లయితొలగించండి
  12. సమస్య :
    జింకలు మాంసముం దినెను
    సింహము గడ్డిని మేసె బ్రీతితోన్

    ( బాలనాగమ్మతో తన ప్రతాపాన్ని చెబుతున్న మాయల మరాటి )

    ఉత్పలమాల
    .................

    ఇంకను నమ్మవేమె గను
    మిచ్చటి మాయల బాలనాగమా !
    జంకక మంత్రదండమున
    జాతుల తిండ్లను మార్చినాడనే !
    జింకలు మాంసముం దినెను ;
    సింహము గడ్డిని మేసె బ్రీతితోన్ ;
    వంకలు మానవే ! యెదురు
    పల్కుల నాపవె ! కౌగిలింపవే !

    రిప్లయితొలగించండి
  13. శంకలు మదిలో మెదిలెను
    వంక దరి దొరికిన జింక వంక, బెదురుచున్
    "సంకటము గల్గు నేమో
    జింకలు దినెఁ బొలసు గడ్డి", సింహము మేసెన్

    bolasu=polluted(mOsamu)

    రిప్లయితొలగించండి

  14. శ్రీ గురుభ్యోనమః

    కం.
    వంకరటింకర మాయా
    యంకము లందున కలిగిన యా'కలి' యుగమున్
    పొంకము గానము రమణీ
    జింకలు దినెఁ బొలుసు గడ్డి సింహము మేసెన్

    రిప్లయితొలగించండి
  15. అంకిలినొందుచు కలలో
    వంకలు వాగులు వనములబడి నేబోవన్
    జంకక విపినమునందున
    జింకలు దినెఁ బొలసు గడ్డి సింహము మేసెన్

    రిప్లయితొలగించండి
  16. వంకల కల్పనన్ సలిపి వన్య మృగమ్ముల జంతుశాలలో
    సంకటముల్ ఘటిల్ల నటు సాకుచు నుండగ, ఆకులన్ దినన్
    జింకలు, మాంసముం దినెను సింహము, గడ్డిని మేసెఁ బ్రీతితోన్
    రంకెలు వేయుచున్ వృషభ రాజము లచ్చట చెంగలించుచున్

    రిప్లయితొలగించండి
  17. కం||
    లెంకలుగొట్టుచు పొలమున
    జింకలు దినె బొలుసు గడ్డి, సింహముమేసెన్
    జింకల పీడయుబాయగ
    సంకటపడినట్టిరైతు సంబరమందెన్.

    రిప్లయితొలగించండి
  18. జంకును విడి పరుగిడె నట
    బింకముతోవెంటబడుచువేగము గానే
    శంకయు లేక ముదమ్మున
    జింకలు ,దినె బొలసు గడ్డి సింహము మేసెన్
    (క్రమాలం కారంలో)

    రిప్లయితొలగించండి
  19. జంకడు దానావంతయు
    బొంకులె బల్కును నిరతము పొల్లుదనంబున్
    వంకరమాటలె గానెట
    జింకలు దినెఁ బొలసు గడ్డి సింహము మేసెన్

    రిప్లయితొలగించండి
  20. కందం
    జింకవలె నుత్తరుఁడదర
    నంకితమయ్యె విజయము బృహన్నల సింహ
    మ్మంకముగెల్వ సభఁ జెదర
    జింకలు దినెఁ బొలసు గడ్డి సింహము మేసెన్

    ఉత్పలమాల
    బింకముఁ జూపు ఫల్గుణుఁడు వీర కిశోరము స్త్రీ స్వభావుఁడై
    వొంకము వీడి భీత మృగమున్ వలె నుత్తరుఁడాజినందునన్
    జంకక పార్థుడున్గెలిచి సాగఁగ వార్తలు తారుమారయెన్
    జింకలు మాంసముం దినెను సింహము గడ్డిని మేసెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  21. వెంకాయమ్మయె యిట్లనె
    జింకలు దినెబొలసు,గడ్డిసింహము మేసెన్
    వంకర నోరును గలుగుట
    జంకనునదిలేక పలికె జతురత లేమిన్

    రిప్లయితొలగించండి
  22. సుంకము చెల్లింపఁ గలవు
    జింకలు సింహంపుఁ గంటఁ జేటునఁ పడినన్
    జంకక యచ్చట గడ్డిని
    జింకలు దినెఁ, బొలసు గడ్డి సింహము మేసెన్

    [పొలసు కడ్డి = మాంసపు కఱ్ఱ (బొమిక)]


    వంకలు వాగులం దిరిగి పర్వులు వెట్టుచు నింక దుమ్కుచున్
    బింకము మీఱఁ జేరినవి పెన్నడవిం దమి నక్కజమ్ముగా
    నంకమునన్ మృగేంద్రుఁ గని యచ్చట కేఁగక భీతిఁ జాటుగా
    జింకలు, మాంసముం దినెను సింహము, గడ్డిని మేసెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  23. జింకలు మాంసముందినెను సింహము గడ్డినిమేసె బ్రీతిగన్
    వంకర మాటలాడగను భావ్యమె నీకిది పాడియే రమా!
    జింకలు గడ్డినిన్ దినును సింహము మాంసము నారగించుగా
    బొంకులు బల్కగాదగునె? బుద్ధిగ దెల్విగ మాటలాడుమా

    రిప్లయితొలగించండి
  24. పంకజలోచనా వినుముబంగరు స్వప్నముగంటి నందులో
    శంకయొకింతలేక నొకచామరిపైవిను వీధి బోవుచున్
    వంకలు వాగులన్ గడచివావిరి గాంచితి కాననంబునన్
    జింకలు మాంసముం దినెనుసింహము గడ్డిని మేసెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  25. కొంకక తీరు తీరుగల గొప్ప
    పదార్థములన్ని దెచ్చియున్
    బింకముతోడ నేనుగులు బిల్చె
    ను విందుకు జంతు జాలమున్
    వంకర కొమ్ములిర్రి మరి బంగరు
    వన్నెల యందమైన యా
    జింకలు , మాంసముందినెను
    సింహము, మేసెను గడ్డి ప్రీతితో

    రిప్లయితొలగించండి