24, మార్చి 2024, ఆదివారం

సమస్య - 4715

25-3-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరినిఁ బెండ్లియాడె గిరితనూజ”
(లేదా...)
“హరిని వివాహమాడె ధవళాచలపుత్రి సురల్ నుతింపఁగన్”
(బులుసు అపర్ణ గారి రాయగడ శతావధానం సమస్య)

35 కామెంట్‌లు:

 1. పరిపరి తెలిపినను పలుకుచుంటివిటుల
  "హరినిఁ బెండ్లియాడె గిరితనూజ"
  నెయ్యముంచి దాన్ని నేర్వకుండిన నాకు
  చెప్పి మరల జెప్ప చేతకాదు

  రిప్లయితొలగించండి
 2. ఆటవెలది
  ఆదియోగినొంద నాశించి సేవించి
  భక్తితత్పరత నపర్ణయనఁగ
  హరుఁడు మెచ్చినంత నాశీస్సులడుగుచున్
  హరినిఁ, బెండ్లియాడె గిరితనూజ

  చంపకమాల
  సరసిజనేత్రయై వలచి శంభుని సేవ నపర్ణ నిల్వఁగన్
  మరుఁడు శరంబులన్ బనిచి మాడిన మీదననంగు జేయుచున్
  హరుఁడు కుమారసంభవపు నాశయమొప్పగ, గారవించుచున్
  హరిని, వివాహమాడె ధవళాచలపుత్రి సురల్ నుతింపఁగన్

  రిప్లయితొలగించండి
 3. పాల సంద్ర మందు ప్రభవించియా లక్ష్మి
  హరిని బెండ్లి యాడె :: గిరి తనూజ
  గొప్ప తపము జేసి మెప్పును బొందియు
  హరుని పత్ని య గుచు హర్ష మందె

  రిప్లయితొలగించండి
 4. పాలసంద్రమందు ప్రభవించిన సిరితా
  *“హరినిఁ బెండ్లియాడె గిరితనూజ”*
  కఠిన తపము చేసి కంతుహరుని కోరి
  పెద్దలనుమతించ పెండ్లి యాడె

  రిప్లయితొలగించండి
 5. హరునికి దార కాదలచినద్రిజ ఘోర తపమ్ము సల్పె నా
  మరుడును తుంటరై శివుని మైపయి కోలలనేసి బూడిదై
  యిరపయి కూలి జీవుడయెనీశ్వరి చేనట కామదేవు సం
  హరిని వివాహమాడె ధవళాచలపుత్రి సురల్ నుతింపగన్

  రిప్లయితొలగించండి
 6. చంద్రశేఖరుండు శ్యామకంఠుడు వాడె
  పాంశు చందనుడను పతిగ గోరి
  ఘోరతపమొనర్చి కోకనదుని మార
  హరినిఁ బెండ్లియాడె గిరితనూజ.


  పరిఖ మధించు పాళమున వార్నిధి నుండి జనించినట్టి యా
  తరుణి జలేంద్ర పుత్రికయె తామరకంటి యురుక్రముండె యౌ
  విరజుని చక్రచక్రజుని పృథ్విని ధర్మము నిల్పునట్టి శ్రీ
  హరిని వివాహమాడె , ధవళాచలపుత్రి , సురల్ , నుతింపఁగన్.

  రిప్లయితొలగించండి
 7. దిరిసేన పువ్వు బోలు బహుదివ్యశరీరి మహానలమధ్యన నిల్చి యెండలో,
  మరువగలేక శంకరుని, మారరిపున్, బరమేశు, నంత భీ
  కర తపమాచరించి, తుద కారణకారుడైన హాహలా
  హరిని వివాహమాడె ధవళాచలపుత్రి సురల్ నుతింపఁగన్.  హాహలము -విషము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి, మూడవ పాదాలలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   ఆటవెలదిలో "సురలు వంప/పంప" అనండి. "పేరడెచె మదను" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదాలు గురూజీ 🙏

   సూచించిన సవరణలతో.....

   గిరిజ పెండ్లి కోరె పరమ శివునితోడ
   మరుడు వచ్చెనటకు సురలు పంప
   వేడికంటిమంట పేరడెచె మదను
   హరినిఁ బెండ్లియాడె గిరితనూజ

   పరిణయమాడనెంచినది పర్వత పుత్రిక ఫాలనేత్రునిన్
   శరములువైచెమన్మథుడు శర్వుని చిత్తము చంచలించగా
   విరువిలుకాని పేరడచె విచ్చిన చిచ్చర కంటిచూపులే
   హరిని వివాహమాడె ధవళాచలపుత్రి సురల్ నుతింపఁగన్

   హరి = శివుడు [సూర్యరాయాంధ్ర నిఘంటువు]

   తొలగించండి
 9. పరమశివుండొకండె తన భర్తయటంచు మదిన్ దలంచి భ్రా
  మరి తపమాచరించినది, మారుని బూడిదగా నొనర్చిశం
  కరుఁడు ప్రసన్నుడై మరల కంతుని గాఁచెను, తుష్టుఁ జేయుచున్
  హరిని, వివాహమాడె ధవళాచలపుత్రి సురల్ నుతింపఁగన్

  రిప్లయితొలగించండి
 10. ఆ॥ క్షీర జలధి తనయ శ్రీలక్ష్మి యనఘుఁడా
  హరిని బెండ్లియాడె, గిరితనూజ
  వలచి చెంత నిలచి వరుని సమ్మతిఁ గని
  హరుని బెండ్లియాడె హరుషమొదవి

  (కుమార సంభవము 6వ సర్గము, పాఠ్యాంశముగా వచ్చింది, పార్వతి సఖితో శివుని వద్దకు వెళ్ళి తన తండ్రిని అడిగి పెళ్ళి చేసుకొన మని సఖిద్వారా తెలియజేస్తుందండి)

  చం॥ సురలటు క్షీర సాగరము శోభగఁ జిల్కఁగఁ బుట్టి పద్మినే
  హరిని వివాహమాడె, ధవళాచల పుత్రి సురల్ నుతింపఁగన్
  వర సుతుఁడుద్భవించు తమ పాటులుఁ దప్పు నటంచు నింపుగన్
  హరుని వివాహమాడె తగు హర్షముఁ గాంచుచుఁ గోరి యాతనిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "లక్ష్మియే హరిని..." అనండి. (పద్మిని+ఏ అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది)

   తొలగించండి
  2. ధన్యవాదములండి. ఈఇత్వ సంధి మరీ కఠినమండి.

   తొలగించండి
 11. పాల సంద్ర మందు లీలగఁ బ్రభవించి
  పరవశమ్ము సెంది పద్మ నేత్రు
  వింటి వమ్మ! తమ్మి కంటి లక్ష్మీ దేవి
  హరినిఁ బెండ్లియాడె గిరితనూజ!


  మరు మరణమ్ముఁ గాంచి వెత మానిని పార్వతి నిశ్చయాత్మయై
  గురుతర భక్తి నిష్ఠను సుఘోర తపమ్ము నొనర్చి యద్రినిన్
  హరుని వరించి క్షీర విమలాంబుధి సంజనితంపు శ్రీ సుధా
  హరిని వివాహమాడె ధవ ళాచల పుత్రి సురల్ నుతింపఁగన్

  [శ్రీ సుధా హరిని = విష మనెడు నమృతమును హరించిన వానిని]

  రిప్లయితొలగించండి
 12. ఆ.వె:తన ప్రతాపముననె దక్కును హరుడంచు
  నహము బూని నంత నంగజుండు
  వాని యహమునెల్ల బాపనా కామసం
  హరినిఁ బెండ్లియాడె గిరితనూజ”

  రిప్లయితొలగించండి
 13. హరు నఖిలాండకోటి గురు నక్షరు నుత్తరు నాగహారు నీ
  శ్వరుని హిరణ్యరేతసుని చంద్రకళాధరునా జటాధరున్
  వరునిగ నెంచి గొల్చి గనె భర్తగ నద్రిజ గాని నెవ్విధిన్
  హరిని వివాహమాడె ధవళాచలపుత్రి సురల్ నుతింపఁగన్

  రిప్లయితొలగించండి
 14. పాలకడలి పట్టి పరిణయమాడెను
  హరినిఁ, బెండ్లియాడె గిరితనూజ
  హరుని పాపహరుని హాలహలధరుని
  శివము గూర్చ సకల జీవములకు

  రిప్లయితొలగించండి

 15. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  పాల కడలి యందు ప్రభవమొందిన లక్ష్మి
  హరినిఁ బెండ్లియాడె; గిరితనూజ
  తాను ఘోరమైన తపము చేసి శివుని
  పెండ్లియాడ సురలు విరులు ౙల్లె.

  రిప్లయితొలగించండి
 16. శమనరిపుని భూరి చంద్రార్థమౌళిని
  స్మరుని మదమడచిన యురగ ధరుని
  ఆదిబిక్షుని నిటలాక్షుని కిల్బిష
  హరినిఁ బెండ్లియాడె గిరితనూజ

  రిప్లయితొలగించండి