10, ఆగస్టు 2017, గురువారం

సమస్య - 2434 (జారులఁ జూచి భక్త...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో"
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

69 కామెంట్‌లు:

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

కారుణికత్వదైవమగు కాంచనచేలుడు శ్రీనివాసునిన్
కోరిక మీర దర్శనము కొండపయిన్ దనపత్నియున్ పరీ
వారము తోడ జేసి,తనివారగ స్వామికి సేవజేయు పూ
జారుల జూచి భక్తజనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో.

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !

బంజారుల భక్తి కూటము :

01)
_____________________________
భోరున వానదే కురియ - బోధనబాదున నాగినట్టి యా
కారున బోవుచున్న నొక - కార్మిక బృందము; దైవ సేవలో
జోరు నిమగ్నమైన పరి - శుద్ధుల సంహృతి భక్తి మెచ్చి, బం
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________

Sistla Sharma చెప్పారు...



ధీర గభీర మూర్తి వెత
దీరిచి లోకము లేలు ఱేడు చె
ల్వారుచు నేడు కొండల వి
రాజిలు వేంకట నాథు నిత్యమున్
కోరి భజించి సేవలిడ
కూరిమితో నట జేరి గొల్చు పూ
జారులఁ జూచి భక్త జన
సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దారులు మారిపో యినవి దారుణ సంస్కృతి తాండవిం చగా
మీరిన నాగరీ కమున మేలని కోర్కెల దాహమం దునన్
చోరులు మిన్నగా పెరిగి చోద్యమ నంగధ నాశతోడ పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో

వసంత కిశోర్ చెప్పారు...

భక్తులకు చావే , ముక్తి గదా !!!???

02)
_____________________________

వేరొక దారి లేని తరి - విష్ణువు గొల్చెడి భక్త బృంద మా
దారుణ మానవారి, ఘన - దైత్య పరాశరు, డుగ్ర మూర్తి యున్
వీరుడు, క్రూరుడు న్నయిన - వింశతిబాహుని బంట్ల చేతి, కై
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________

జిగురు సత్యనారాయణ చెప్పారు...

జార విరోధ వర్తనులు, జారని వారలు, భక్తి భావ సం
చారులు, వేద చారులు, నిశాచర శాత్రవ పాద సేవనా
చార విచార విజ్ఞులును, సారమతుల్, ఘన శిష్టులైన పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో!!

వసంత కిశోర్ చెప్పారు...

వార నిరాహార దీక్షా వ్రతం చేసిన భక్తులు :

03)
_____________________________

నీరము మాత్రమే కుడిచి - నీరజనాభుని, శ్రద్ధ, భక్తి మై
వారము వారమంతయును - ప్రస్తుతి జేయుచు నాట్యమాడుచున్
సారము గోలుపోయి, మన, - శక్తి విహీనత; మూర్ఛ గొన్న, బే
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
మను = నిల్చు
బేజారు = అలసట, నీరసం

BVVHBPrasadarao చెప్పారు...

సారెకు వాడవాడల దిశాపరిపూర్ణతలేక భుక్తికై
చారణులైనవారిఁగని జాలి పొసంగెను పేదవారి పిం
జారులఁజూచి; భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
సారసలోచనున్,వినుత సద్గుణసాంద్రుని,వేంకటేశ్వరున్.
పింజారి=A certain tribe of gypsies

Zilebi చెప్పారు...



నేరము జేయు వాని దరి నెక్కొను ధారణి గాద నాతడౌ
సోరణి దివ్వియల్ నడుమ శోభిలు చీకటి లోన కార్యమున్
నేరుపుగాన దీర్చు ! భళి! నేర్వదగున్ ప్రణిధిన్నటంచు, యా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో!

ஜிலேபி

వసంత కిశోర్ చెప్పారు...

పూర్వము తిరుపతి కొండ పై కెక్కేభక్తులు :

04)
_____________________________

దారుణ మైన మార్గ మది - దండుగ జేరిన పశ్యతోహరుల్
దారుణ మారణంబులను - తామరనేత్రల మాన మోషమున్
క్రూరము జేయు పూర్వమున; - కొండకు జేరెడు సుంత లోన , పిం
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
పశ్యతోహరుడు = దొంగ
పింజారీ = దుష్టుడు, రౌడి(బందిపోటు,దోపిడిదొంగ)

వసంత కిశోర్ చెప్పారు...

పూజారులకే జారు లెదురైతే :

05)
_____________________________

సారపు వేదమున్ స్ఫురణ - సాధ్యులు పూజ్యులు నిత్య సత్య సం
చారులు భక్తి భావ పరి - జ్ఞానులు, నిత్యపు దేవతార్చకున్
జోరున బోవుచుండ కొని - సోమము బిందెల; తారసిల్లు నా
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________

vsnmhari చెప్పారు...

పౌర జనాళి కార్తికపు పౌర్ణమి రోజున భక్తియుక్తులై
కోరిక మీర శంకరుని గొల్చి దళంబుల దన్మయంబుతో
నూరను ద్రిప్పుచుండెడి మహోత్సవ మద్భుతమై చెలంగ బా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో.

హ.వేం.స.నా.మూర్తి.

వసంత కిశోర్ చెప్పారు...

6)
_____________________________

తీరతమందునన్ మిగుల - తీవ్రతరంబగు పూనికన్ వడిన్
దారుల రెండు, చే కొనుచు - తద్దయు శక్తిని శ్రద్ధ భక్తులన్
వీరపు నార్భటిన్ మిగుల - వీనుల విందుగ వాచునట్టి , రుం
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________
తీరతము = దేవోత్సవము
దారుడు = కర్ర
రుంజ = వాద్యవిశేషము(పెద్ద డోలు-దైవ కార్యాలకే వాయిస్తారు)
(చాలా గట్టిగా చెవులు పగిలి పోతాయేమో ననిపించేటంత శబ్దం వచ్చేలా
పూనక మొచ్చినట్టు వాయిస్తారు శ్రావ్యంగా)
ఆరు = కలుగు
రుంజ+ఆరు = రుంజారులు (రుంజలు కలిగిన వారు)

మంజూషిక చెప్పారు...

కారణభూతుడాడ్యుడు,వికార విదూరుడు సర్వకార్య నా
ధారుడు,నార్తరక్షగుణధాముడు,సోముడు,వేద వాఙ్ఞయా
చోరుమనమ్ము క్రూరుడు,నుషోదయకారుడు,దేవదేవుపూ
జారుల జూచి భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో

కంది శంకరయ్య చెప్పారు...

బాపూజీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

వసంత కిశోర్ గారూ,
మీ ఆరు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.
ఐదవ పూరణలో 'పరిజ్ఞానులు' అన్నదానిని "భావముల జ్ఞానులు" అందామా?

కంది శంకరయ్య చెప్పారు...

శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రసాద రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ప్రణిధిన్నటంచు నా జారుల...' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వసంత కిశోర్ చెప్పారు...

శంకరార్యా ! ధన్యవాదములు !

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాట్సప్ సమూహంలో సూచించిన సవరణలను గమనించండి.

BVVHBPrasadarao చెప్పారు...

ధన్యవాదాలు

వసంత కిశోర్ చెప్పారు...

శంకరార్యులకు ధన్యవాదములతో

పూజారులకే జారు లెదురైతే
ముట్టుకోకండిరా బాబూ మీకు దణ్ణం అంటూ :

05అ)
_____________________________

సారపు వేదమున్ స్ఫురణ - సాధ్యులు పూజ్యులు నిత్య సత్య సం
చారులు భక్తి భావముల - జ్ఞానులు, నిత్యపు దేవతార్చకున్
జోరున బోవుచుండ కొని - సోమము బిందెల; తారసిల్లు నా
జారులఁ జూచి భక్త జన - సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో !
_____________________________

Unknown చెప్పారు...

కోరిక లన్ని దీర్చు ఘ న కొంగు పసి oడిగ వెల్గు దే వు ని న్
నేరుగగాంచనెంచి యు ను నిశ్చల చిత్త ము తోడ యాత్రికుల్
చేరి యు దేవ ళ మ్మున ను చేల్వు గ పూ జ లొ న ర్చు నట్టి పూ
జారుల జూ చి భక్త జ న సంఘ ము మొక్కేను మోక్ష కాంక్ష తో

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

pks kumar చెప్పారు...

ధారణు యాలయంబుకడ దర్శన భాగ్యముకై నిరీక్షణల్
పౌరులు చేయుచున్న దరి, ప్రాగ్దిశలో రవి సంభవించగా
దారము లన్నియుం దెరువ దర్శనమిచ్చె చతుర్ముఖుండు,కం
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో

pks kumar చెప్పారు...

పుష్కర ము లోని బ్రహ్మఆలయము లో బ్రహ్మ దర్శనము కోసరము భక్తులు నిరీక్షిస్తున్న సమయంలో బ్రహ్మ సూర్యుల దర్శనము ఒకే సమయము భక్తులు చేసెనను భావన

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

దారకు పట్టె దయ్యమని తాపము దీరుట యెట్లటంచు వే
సారచు శోక నాశక ' కసాపుర ' పావని యాలయమ్మునన్
దీరిచి దుష్ట శక్తులకు దెబ్బల వేయగ నున్న స్వామి పై
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
(పై జారు = పాదరక్ష)


Bhagavatula Krishna Rao చెప్పారు...

క్రూరుల కోర్కెలన్నిటిని కూర్మిని దీర్చెడి దేవుడంచు నా
నేరము చేయువార లనునిత్యము మ్రొక్కులుదీర్చు చుండ, సం
చారులు మౌని వర్యులును సద్గుణ వర్యుల బాట నంటు పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో

subbarao చెప్పారు...

జారుల జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో
జారులలో గనంబడెను శారద మాతయె వారికప్పుడున్
బారము పొందగోరి యట భక్త జనంబులు మ్రొక్కి రయ్యెడన్
గోరిన వాంఛలన్ భువిని గూరిమి దోడన దీర్చు నామెయే

seethadevi gurram చెప్పారు...

కోరికదీరగా మిగుల గూరిమితోడను శాస్తదీక్షయం
దోరిమి శ్రద్ధలన్ నియమతోరణ పాలన జేయగాదగన్
వారపు పూజలన్ భజనపాటలు గూర్చుచు వేడ్కమీర పూ
జారులజూచి భక్తజన సంఘము మొక్కెను ముక్తికాంక్షతో!

Unknown చెప్పారు...

శ్రీరఘురామచంద్ర పదసేవకు పుష్పములన్ని గూడి నా
ధారపు దారమందుడిగి|దైన్యముచేతనువేడుచుండగా
మారని మానవాళి పరమార్థము వీడగ?పూలునవ్వె|పూ
జారులుజూచి|భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో


కంది శంకరయ్య చెప్పారు...

సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

sailaja చెప్పారు...

తీరుగ దేవదేవునకు దీపము ధూపము నారగింపులన్
సారము గల్గు మంత్రముల సన్నుతి జేయుచు బెట్టి భక్తులన్
పేరున గోత్రనామముల ప్రీతిగ బూజల నాచరించు పూ
జారుల జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో!!!

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

తీరగురూపుతోడ తనదేవి కెలంకున తేజరిల్లుచున్
తేరున దర్శనమ్మొసగు దేవుని తుష్టిగ నూరిలోన బా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
నీరజనేత్రుడైనహరి నేరుగతీర్చునటంచు కోర్కెలన్

కంది శంకరయ్య చెప్పారు...

సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

ఆరయు సద్గుణాన్విల హర్నిశలున్ హరిపాద సేవలో
తీరుగ మగ్నమై ఫలము తీర్థము పుష్పము పత్రితోడ నిం
పారగ దేవతార్చనను భక్తిగ జేసి తరించు నట్టి పూ
జారుల జూచి భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
వీటూరి భాస్కరమ్మ

Unknown చెప్పారు...

కోరికలేవి గోరకను కొమ్మలు రెమ్మలు పండ్లు,పూల నా
హారము బంచిబెంచ?నతియాశకులోబడి మానవాళియే
కూరిమినెంచి చెట్లు పడగొట్టుచు”దైవపు రూపుమాన్పి”పూ
జారులు జూచి భక్త జనసంఘము మ్రొక్కును ముక్తి కాంక్షతో|

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

భారపు శిష్ట రక్షణకుఁ బద్మదళాక్షుఁడు లోకనాథుఁ డా
శౌరి వచింపఁ బుణ్య జన సంచయ శోధన సక్త చిత్తులై
భూరి సురల్ చరింతు రట భూతల మందున దేవ లోకపుం
జారులఁ జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో

[చారులు =వేగులు]

seethadevi gurram చెప్పారు...

పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు!
మీ పూరణ యధావిధిగా అద్భుతము! చిన్న సందేహము:
భూరి సురల్ యనగా పెద్దసంఖ్యలో సురలు యనియేనా? వారు కనిపిస్తారా? పైగా చారులు కూడాను!! వారి చిత్రపటములకు మొక్కెనని భావించవలెనని యనుకొందును! పిచ్చి ప్రశ్నయని భావించిన మన్నించవలెను!

Unknown చెప్పారు...

తీరుగ,గుండుయున్,పిలక,దిద్దిన పుండ్రములున్ లలాటమ౦
దారయ,కుత్తుకన్ తులసి హారము,చేతుల కంచు తాళముల్
హారి,హరీ,యటంచు శకటారిని చింతన జేయు కృష్ణ పూ
జారుల జూచి భక్త జన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

బారులుతీరి సప్తగరి వాసుని దర్శన భాగ్యమున్ గొనన్
జేరిరి వారి కచ్చటను జిత్తము రంజిల జేయుచున్ సదా
కూరిమితోడ తోడ్పడెడి కోమల మానసులైన పూజ్య పూ
జారుల జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షకై

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డా. సీతా దేవి గారు భువిలో యేదీ పిచ్చిప్రశ్న కానేరదు. యాపిలు పైకి పోకుండా నేలమీదే యెందుకు పడిందన్న పిచ్చి ప్రశ్న యే gravitational theory కి దారి తీసింది కదా!

భూరి అధికులన్న భావములో వ్రాసాను. అజామిళునకు విష్ణు దూతలు మరణ సమయములో నారాయణ నామ స్మరణ కారణముగా కనిపించి రక్షించిన యుదంతము దృష్టిలో నుంచుకొని చేసిన పూరణ యిది.

“మరణపు వేళ నద్దనుజ మర్దను సంస్మరణంబుసేయఁ ద
త్పరిసర వర్తు లాత్మ పరిపాలకు నామము నాలకించి ని
ష్ఠుర గతి నేగు దెంచి పొడసూపి యదల్చిరి కాలు దాసులన్
ఖరతర భాషులన్ వికట కల్పిత వేషుల దీర్ఘ రోషులన్” భాగ. 6. 73.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆరితి తీరగా ప్రభుని యర్చన జేయఁగ నాలయమ్మునన్
తీరిన నేమి లాభమది దేవుఁడొసంగినఁ దావరమ్ములన్
వారలొసంగరంచు విని వారికి దక్షిణ లందజేసి పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
(సామెత ఆధారంగా వ్రాశాను. ఎవరైనా నొచ్చుకొంటే మన్నించ ప్రార్థన )

కంది శంకరయ్య చెప్పారు...

భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కామేశ్వరరావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

seethadevi gurram చెప్పారు...

పూజ్యులు కామేశ్వరరావు గారికి, సహృదయముతో మీరిచ్చిన వివరణకు ధన్యవాదములు నమస్సులు!🙏🙏🙏🙏

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...




ఉ:ధారుణి లోపలన్ సతము దైవమునే తలబోయుచుండి సం

    చారులగన్ చరింప హరుసంబున గాంచుచు భక్తులా సదా

  చారముపూర్తిగానరయ శక్తులు గాక కరంబు లెత్తి పూ

 జారుల జూచి భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో.


పౌరజనంబులున్ సతము పస్తులు నుండుచు దైవమున్ సదా

కోరికలన్ని వీడుచును కూరిమి తోడను కొల్చుచున్ గుడిన్

చేరగ నచ్చటన్ ప్రజల సేమము కూరుచు పూజచేయు పూ

జారుల జూచి భక్తజన సంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

చేరుచు నా 'బెలుం గుహల' చిత్ర విచిత్రములౌ శిలాకృతుల్
తీఱిన రూపముల్ గనుచు తృప్తిని పొందక ముందుకేగుచున్
కారి ఘనీభవమ్మునను కాలుని లింగములై తగన్, జలా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో.

పంచరత్నం వెంకట నారాయణ రావు చెప్పారు...

గురువు గారికి నమస్కారములు.నా పూరణయoదుగల దోషములను సరిచేయుము.
శ్రీరమణీయమౌ విభవ శ్రీహిత మారుని దీవెనల్ నిటన్
కోరుస మస్తలో కమున కున్ సహజoబగు మాrga మo దు సదా
భారతమoదునన్ వినయ భక్తుoడు సాoత్వన భాసురాసు పూ
జారుల జూచి భక్తజనసoghao మ్రొక్కెను ముక్తి కాoక్షతో
పర భాష అక్షరములలను వాడి నoదులకు క్షమిoపుము.

కంది శంకరయ్య చెప్పారు...

ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. కొన్ని లోపాలున్నవి. సమయాభావం వల్ల ఇప్పుడు వివరించలేను. తరువాత చూస్తాను.

gurram.jana@gmail.com చెప్పారు...

సారము తత్వమున్నెఱిగి చక్కగ పూజలు జేయు వారలున్
తీరుగ నొంటి పూటశన దీక్షయె బూనుచు నుండు వారలున్
కోరిక లన్నిటిన్నణచి కోవిదులై కడు వెల్గువారు పూ
"జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో"

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

కూరలు పండ్లు చాక్లెటులు కోరిన రీతుల స్మార్టుఫోన్లు బం
గారము వజ్రముల్ నగలు కందులు పప్పులు పంచదారయున్
చీరలు ధోవతుల్ దొరకు చెన్నయి సూపరు మాలుబిగ్గు బా
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో

Zilebi చెప్పారు...



చేరిరి వెంకటేశ్వరుని చేర్చిరి జోతల నెల్ల మేలుగన్
వారల వీరలన్ గనుచు భవ్యము గానట చక్క గాను పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తికాంక్షతో
కోరిరి వింత గాను శఠగోపము బెట్టగ అష్ట లక్ష్మినే !

జిలేబి