4, ఏప్రిల్ 2018, బుధవారం

సమస్య - 2641 (మల్లియ తీవియకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్"
(లేదా...)
"మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై"

139 కామెంట్‌లు:


 1. దేనికైనా కథ గట్టు జంబలకడిపెండ అన్నట్టు :)
  జిలేబి వారు కథ చెబితే ?


  అల్లికల జిలేబీ కథ
  చెల్లీ వినవమ్మ నీకు చెప్పెద నిపుడే!
  లొల్లి యిదికాదు సుమ్మీ
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్!

  జిలేబి

  రిప్లయితొలగించు


 2. అల్లన మెల్ల గాను మజ మాలిక లో కథ గట్టి వచ్చె తా
  మెల్లగ నిప్పుడే సుదతి మేలగు గాధ యిదే‌ మరొక్క మా
  రల్లె జిలేబి శంకరుని ప్రాంగణమందున గోల చేయుచున్
  "మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై"


  జిలేబి

  రిప్లయితొలగించు
 3. తెల్లని పూవులు పూచెను
  మల్లియ తీవియకు, గాసె మామిడి కాయల్
  కొల్లలుగను మా తోటన
  నల్లదివో కాంచరండి యబ్బుర మచటన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తోటను" అనండి.

   తొలగించు
 4. (చిన్నారిచెల్లి అన్నతో అంటున్నది)
  నల్లనివాల్జడన్ ముదమునందుచు నన్న!యలంకరింపగా
  కొల్లగ మల్లెపూలు కొనకుండగ పందిరికల్లుకున్న యీ
  మల్లియతీగకున్ గలిగె ; మామిడికాయలు నేత్రపర్వమై
  మెల్లగ వ్రేలుచుండె ; మనమిప్పుడు పచ్చడి కమ్మకిత్తుమా?

  రిప్లయితొలగించు
 5. మైలవరపు వారి పూరణ

  అల్లన మల్లెతీగ తనకందిన చూతమహీజమందు దా
  నల్లుకొనెన్ , నిదాఘసమయమ్మున బూలను బూచె , మావియున్
  పుల్లని కాయలన్ గలిగె పొల్పగు కొమ్మల , జూడఁ దోచెడిన్
  మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విల్లును దాల్చి యొక్కడు , వివేచననొక్కడు , కండపుష్టితో
   మల్లుడొకండు , వీరలసమానులు మువ్వురు, వీరిఁగన్న యా
   తల్లి యనంగఁ గోమలి లతాంగియె కుంతి , విచిత్రమౌ గనన్
   మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
  2. మామిడినల్లిన మల్లియు
   భామగు గుంతికి గలిగిన భాసుర పుత్రుల్
   ఏమా కృష్ణుని భావము
   యీ మాదిరి యొప్పెనిటుల యీర్ష్యయె గలుగన్!!

   తొలగించు
  3. మైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.
   *****
   విట్టుబాబు గారూ,
   పద్యం బాగుంది.
   'భావము + ఈ = భావ మీ' అవుతుంది. యడాగమం రాదు. "భావ। మ్మీ మాదిరి..." అనండి.
   పద్యం మద్యలో అచ్చులు రాకుండా చూడండి.

   తొలగించు
 6. చల్లని మునియాశ్రమమున
  పిల్లలు కుశలవులుకలిగె ప్రీతిగ కుజకై;
  చెల్లియ! యదియెట్లన్నన్
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్!

  🙏🙏🙏

  తప్పైతే క్షమించండి!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మున్యాశ్రయమున.. 👏🙏

   ...చిటితోటి విజయకుమార్

   తొలగించు
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కుశలవులు' బహువచనం. 'కలిగె' ఏకవచనం. ఆ పాదాన్ని "పిల్లలు కుశలవుల నందె ప్రీతగ కుజయే" అనండి.

   తొలగించు
 7. అల్లరి తనమును వీడిన
  పిల్లకు పరువాలు తెచ్చె వింతగు శోభన్
  కల్ల యనబోక గాంచుము
  మల్లియ తీవియకు గాసె మామిడి కాయల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
   "పరువమ్ము దెచ్చె..." అనండి.

   తొలగించు
  2. జిలిబిలి సొగసుల నడుమన
   మిలమిల మెరువంగ కన్య మేలగు రూపున్
   అలిబిలి విరించి పద్యము
   తొలితొలి పరువమ్ము బూని తోరణమాయెన్!

   తొలగించు
 8. తెల్లని మల్లెలు విరిసెను
  మల్లియ తీవియకుఁ , గాసె మామిడి కాయల్
  వెల్లువగ మురిసి తోటను
  కల్లయె గాదంచు కులికె గర్వము తోడన్

  రిప్లయితొలగించు

 9. కం

  కొల్లగ మామిడి తరువుకు
  నల్లుకొనెను మల్లె తీవియలు చిత్రముగన్
  కళ్ళకు నగుపించె నిటుల
  "మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్"


  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించు
 10. త్రుళ్ళె మది మొగ్గలను గని
  మల్లియ తీవియకుఁ,గాసె మామిడికాయల్
  పెల్లుగ , గృహమున గల పిక
  వల్లభమునకు మురియ హృది ఫలముల గనుచున్

  రిప్లయితొలగించు
 11. ఎల్లరు వినుడీ విషయము
  కల్ల యొకింతయునుగాదు కలకత్తాలో
  కొల్లగ ప్రయోగశాలను
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్.

  కల్లలు పలికెడి స్పర్ధను
  నెల్లారా వనెడి వ్యక్తి యిటులాడె భళా
  కొల్లలుగ మావనంబున
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. సుకవులు శ్రీ హవేంసనా మూర్తి గారూ ... మీ రెండు పూరణములు చాలా బాగున్నవి. అభినందనలు!

   తొలగించు
 12. డాబాపై హైడ్రోఫోనిక్కు డ్రాయింగ్ రూమ్ బోన్సాయి క్లిక్కు
  గాలిని తేలుతూనే దీని నిక్కు మహావృక్షముగ దాని టెక్కు
  విరిసె గుప్పున మల్లెపూలు ఏడాదిపొడుగునా మల్లియ తీగకున్
  గలిగె మామిడి కాయలు నేత్రపర్వమై మరుగుజ్జులకు
  చూడగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రమేశ్ గారూ ... మీ ఊహ చాలా బాగున్నది. దీనిని పద్యంలో రాస్తేనే బాగుంటుంది.

   దీనికి నేను చేసిన పద్యానువర్తనం...

   ఉల్లమెలర్పఁగాను కనియుంటిని మిద్దెన బోనసాయి రం
   జిల్లుచునుండఁ దేలుచును వృక్షము వోలెను టెక్కుఁజూపెఁ గో
   కొల్లలునైన మల్లెలవి; గుండ్రని మావులు! బోనసాయియౌ
   మల్లియ తీఁగకున్ గలిగె మామిడి కాయలు నేత్రపర్వమై!

   తొలగించు
  2. మధుసూదన్ గారూ,
   రమేశ్ గారి భావానికి చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.

   తొలగించు
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2641
  సమస్య :: *మల్లియ తీగకున్ గలిగె మామిడి కాయలు నేత్రపర్వమై.*
  మల్లె తీగ మామిడి కాయలను కాచింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి లక్ష్మణుడు, గర్భిణి ఐన సీతమ్మను అడవిలో వదలి వెళ్లిపోగా, తల్లడిల్లిపోతున్న ఆ జానకిని, వాల్మీకి మహర్షి చేరదీశాడు. సుమ సుకుమారి యైన ఆమె లవ కుశులనే కవల పిల్లలను ప్రసవించింది. అప్పుడు వారిని చూస్తే కన్నుల పండుగగా ఉంది, మల్లె తీగెకు మామిడి కాయలు కలిగినట్లుగా ఉంది చూడండి అని వర్ణించి చెప్పే సందర్భం.

  మల్లియ వంటి కోమలి, సుమంగళి, గర్భిణి, సీత కానలో
  తల్లడ మందు చుండ , ముని తల్లజు డామెను చేరదీయ, శో
  భిల్లు కుమారులన్, కవల పిల్లల దా ప్రసవించె, చూడుడీ
  *మల్లియ తీగకున్ గలిగె మామిడి కాయలు నేత్రపర్వమై.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-4-2018)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు


  1. చాలా బాగుందండీ !
   మీలావణ్యంబరుదు సుమీ శేఖరుగా
   రూ! లలిత పదమ్ములతో
   మాలిక నల్లిరి మనోజ్ఞ మై వెలిగెనయా !

   జిలేబి

   తొలగించు
  2. సహృదయులు శ్రీయుతులు అగు జిలేబి గారూ!
   మీకు హృదయపూర్వక ప్రణామాలండీ. పద్యరూపంలో ప్రశంస నందజేసినందులకు ధన్యవాదాలండీ. కోట రాజశేఖర్.

   తొలగించు
  3. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  4. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి హృదయ పూర్వక ప్రణామాలు. కోట రాజశేఖర్.

   తొలగించు
  5. మాన్యులు కోట రాజశేఖరావధానులవారూ... కుసుమ కోమల వల్లి వంటి సీతాదేవికి, ముద్దులు గారెడి మామిడి పండ్ల వంటి తేజోవంతులైన లవకుశులు జన్మించారనే మీ పూరణ మనోహరంగా ఉన్నదండీ! అభినందనలు!

   తొలగించు
 14. వెల్లువగ బూసె బూవులు
  మల్లియ తీవియకుఁ, గాసె మామిడి కాయల్
  కొల్లలుగా మాతోటను
  యుల్లము రంజిలును గనగ యుర్వీతలమున్!!!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తోటను + ఉల్లము = తోట నుల్లము, ..గనగ(న్) + ఉర్వీ = గనగ నుర్వీ' అవుతుంది. యడాగమం రాదు. "కొల్లలుగ తోటలో మన। యుల్లము... గనగ నుర్వీస్థలిపై" అనండి.

   తొలగించు
 15. కళ్ళకు సన్నగ కనబడు
  మల్లికకు గలుగ కవలలు మరదలు గనుచున్
  యుల్లాసించుచు నిట్లనె
  మల్లియ తీవియకుఁ గాసె మామిడి కాయల్!!!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మరదలు గని తా। నుల్లసమాడుచు నిట్లనె..." అనండి.

   తొలగించు
 16. చెల్లీ! మన పెరటిని పిక
  వల్లభ తరువునకు మల్లె వల్లరి పాకెన్,
  యెల్లరు ననుచుండె నిటుల
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ప్రాకె। న్నెల్లరు ననుచుండి రిటుల..." అనండి.

   తొలగించు
 17. చెల్లునుబో యతివరులకు
  కల్లలు గావివి వినంగ గారడి విద్య
  ల్లుల్లికి గాసెను మల్లెలు
  మల్లియ తీవియకు గాసె మామిడి కాయల్!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఉల్లికి పూసెను మల్లియ గా చదువ మనవి!

   తొలగించు
  2. గురుదేవులకు నమస్కారములు!
   ఇప్పుడే వడియాలు పెడుతూ ఉండగా క్రింది సమస్య తోచిందండీ! రోజూ వాతావరణ హెచ్చరికలు చూసి వడియాలు పెట్టే మా యిల్లాళ్ళ బాధలు అన్నీయిన్నీ కావండి!
   మన ఐఐటి మేధావులేమైనా మార్గం కనిపెడతారేమో నని ఆశతో ఈ సమస్య తోచిందండీ!

   “వడియము లెండెను ఘనముగ వానల లోనన్”

   పరిశీలించ గలరు! ధన్యవాదములు!🙏🙏🙏😊😊😊

   తొలగించు

  3. అమ్మాయ్!ఈపాటి దానికి ఐఐటీలు జీపీయెస్ లూ కావాలా ? మా లాంటి బామ్మలనడిగితే చెప్పరూ ?

   అడుగడుగునకున్ భళిభళి
   వడియము లెండెను ఘనముగ వానల లోనన్
   సడిజేయక మగడు జిలే
   బి, డిగనురుకుల దరిజేర పిరియము గానన్ !

   జిలేబి
   బామ్మ మాట బంగరు మూట :)

   తొలగించు
  4. సీతాదేవి గారూ,
   మీ గారడీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విద్యల్ + ఉల్లికి = విద్య లుల్లికి' అవుతుంది. ద్విత్వ లకారం రాదు. అది కేవలం ద్విత్వనకారానికే ఉంది. "గారడిలో వె।ల్లుల్లికి గాసెను..." అనండి.
   ఇక మీ సమస్య బాగున్నది.
   "వడియము లెండెను విడువని వాననలోనన్"
   (లేదా...)
   "వడియము లెల్ల నెండినవి వాన లవారిత రీతిగాఁ బడన్"
   (వీలైతే రేపే ఇస్తాను).

   తొలగించు
  5. జిలేబీ గారూ,
   మీ పూరణలో చివరిపాదం అర్థం కాలేదు.

   తొలగించు
  6. ధన్యవాదములు గురుదేవా! పద్యాన్ని సవరిస్తాను!
   సమస్య నచ్చినందుకు ధన్యవాదములు!
   కాలానుగుణ సమస్యలు. మల్లెలు, మామిడి, వడియాలూ! ఇంకెన్ని వస్తాయో!😊😊😊🙏🙏🙏

   తొలగించు
  7. చెల్లునుబో యతివరులకు
   కల్లలు గావివి వినంగ గారడిలో వె
   ల్లుల్లికి పూసెను మల్లెలు
   మల్లియ తీవియకు గాసె మామిడి కాయల్!

   తొలగించు
  8. సీతాదేవి గారూ ... గారడీ [ఇంద్రజాల మహేంద్రజాల గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల మహిమ] తో ఉల్లికి మల్లెలను పూయించి, మల్లెలకు మామిడులను కాయించిన మీ పూరణ మద్భుతముగా నున్నదండీ! అభినందనలు!

   తొలగించు
  9. ధన్యవాదములార్యా! మీ వంటివారి ప్రశంసలు మా వంటి విద్యార్ధులకు ప్రోత్సాహకరంగా ఉంటాయి! 🙏🙏🙏

   తొలగించు
 18. మెల్లగ పాకగ నొక్కటి
  మల్లియ తీవ పెనవేసి మామిడి చెట్టున్
  పిల్లలు గని పలికిరిటుల
  "మల్లియ తీవియకుఁ, గాసె మామిడి కాయల్"

  రిప్లయితొలగించు
 19. జల్లు గ వర్ష ము ల్ కురియ సౌరు గ గ న్పడ వృద్ది య య్యే గా
  నుల్లము రంజిల న్ కుసుమ కుంజ ము పూచె ప రీ మ ళ oబుతో
  మల్లియ తీగ కున్ ;గలిగె మామిడికాయ లు నేత్ర పర్వ మై
  చెల్లెను తోటలో తరు లు చెన్ను గ గ్రీష్మ ము నందు మెండు గ న్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  2. ఉల్లము - కుంజము - యతి తప్పింది గదా?

   తొలగించు
  3. రెడ్డి గారూ,
   నిజమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు.
   ఒక పద్యాన్ని పరిశీలిస్తున్నపుడు భావం మీద దృష్టి ఉన్నపుడు గణ యతి ప్రాసల మీద దృష్టి ఉండదు. అందుకోసం రెండవ సారి పద్యాన్ని చదవాలి.
   *****
   రాజేశ్వర రావు గారూ,
   ఆ పాదాన్ని సవరించండి.

   తొలగించు
  4. సవరించి న పద్యం
   జల్లు గ వర్ష ము ల్ కురియ సౌరు గ ప ల్ వి రి మొక్క లేపు గా
   నుల్లము రంజి ల న్ బె రి గెను జ్జ్వ ల మై వి రు ల ప్దువి చ్చేగా
   మ ల్లియ తీగ కున్ ;గలి గె మామిడి కాయలు నేత్ర పర్వ మై
   చెల్లేను తోట లో తరు లు చె న్నుగ గ్రీష్మ ము నందు మెండు గ న్

   తొలగించు
 20. అల్లన జవ్వని పైటను
  మెల్లగ తా సర్దుకొనుచు మీదకురాగా
  అల్లరిగా మగడిట్లనె
  'మల్లియ తీవియకుఁ, గాసె మామిడి కాయల్'

  రిప్లయితొలగించు
  రిప్లయిలు


  1. గోలీ వారివ్వాళ వేటూరి గా మారి పోయారు :)
   (హనుమంతుడు సుందర రామ మూర్తిని మదినెంచెన్ :))

   జిలేబి

   తొలగించు
  2. హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ శృంగార రసభరితమై మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  3. గోలి వారూ ... మీ పూరణ సరసముగా నున్నది. అభినందనలు!

   తొలగించు
  4. గురువర్యులకు, కవిమిత్రులకు ధన్యవాదములు.

   తొలగించు


 21. కల్లయు కాదు సుమ్మి సహకారము చేయు స్వభావ మయ్యెడి
  న్నల్లన పుష్ప మొక్కటి మనస్సున నెంచగ బంధమున్ మనో
  వల్లభుడాయె నాతడట వాసిగ బుట్టగ పుత్ర రత్నముల్,
  మల్లియ తీగకున్ గలిగె మామిడి కాయలు నేత్రపర్వమై

  జిలేబి

  రిప్లయితొలగించు
 22. కల్లయనుకొనగ రాదిది
  ఎల్లిన దినమందెమబ్బులేల జగనుజా
  బిల్లిజతచేయు గురుతుగ
  మల్లియతీవియకు( గాసె మామిడికాయల్

  ఎల్లి = ఱేపు
  జగను జాబిల్లి జతచేయు = కాంతిని జాబిల్లి యిచ్చు ( జగన్మోహన్ రెడ్డి చంద్ర బాబు జతకూడు)

  రిప్లయితొలగించు
 23. అల్లన పెరడున పూచిన
  తెల్లని మల్లెలను కోయ దిగ్భ్రమ పడితిన్
  పెల్లుగ పడె పండ్లు నిటుల్
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్ ౹౹

  రిప్లయితొలగించు
 24. మల్లియ తీవియ యొకచో
  నల్లుకొనుచు బ్రాకె నొక్క యామ్ర తరువునన్
  కల్లగ దోచె నొకడికిన్
  "మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్“

  రిప్లయితొలగించు
 25. చల్లని వేళలోమనసు సంతస మొందెను కాంచి పువ్వులన్
  మల్లియ తీగకున్, గలిగె మామిడికాయలు నేత్రపర్వమై
  వల్లభ పెంచినట్టి పికవల్లభ శాఖల పైన పెల్లుగా
  నుల్లము సంతసిల్ల సతి యూరి జనమ్ముల కిచ్చె పండ్లఁ దాన్

  రిప్లయితొలగించు
 26. తల్లియు నాటిన మల్లియ
  మల్లియు మామిడి నొకటిగ మాలిమి గూర్చే
  తొల్లియు పూచే పూతలు
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్

  Dr H Varalakshmi
  Bangalore

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మల్లియ మల్లియు'...? 'గూర్చే, పూచే' అన్నవి వ్యావహారికాలు.

   తొలగించు
 27. తల్లియు నాటగ మల్లియ
  మల్లియు నామ్రము నొకటిగ మాలిమి గూర్చే
  తొల్లియు పూచే పూతలు
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్

  Dr H Varalakshmi
  Bangalore

  రిప్లయితొలగించు
 28. తెల్లని మల్లెలు విరివిగ
  మల్లియ తీవియకు గాసె; మామిడి కాయల్
  యుల్లము రంజిల్లు నటుల
  వెల్లువగా కాసెను గద! వేసవి నందున్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కాయల్ + ఉల్లము = కాయ లుల్లము' అవుతుంది. యడాగమం కాని, లకార ద్విత్వం కాని రాదు. సవరించండి.

   తొలగించు
 29. అల్లదె చూడుము వింతగ
  నల్లుకొన రసాల శాఖ కందము లొలుకన్
  మల్లిక పెల్లుగ నచ్చట
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్


  బల్లిదు హస్త రాజితము బంగరు కింకిణు లుండ సుందర
  మ్మల్లియ తీఁగకుం గలిగె మామిడికాయలు నేత్రపర్వమై
  యుల్లము సంతసిల్ల రుచిరోస్ర కలాపము లీను చుండగం
  జల్లఁగ జాఱ గుండె లిఁక శాత్రవ కోటికి భీషణధ్వనిన్

  [సుందరమ్ము + అల్లియ = సుందరమ్మల్లియ; అల్లియ = వింటి నారి]


  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు
  3. సుకవులు పోచిరాజు వారూ ... కింకిణుల కల్లిన తీవలకు మామిడు లున్నవను మీ పూరణ మద్భుతమ్ముగ నున్నది. అభినందనలు!

   తొలగించు
  4. కవి పుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు.

   తొలగించు
 30. డా.పిట్టాసత్యనారాయణ
  తల్లికి గంఠ హారమని తండ్రియె నూరను స్వర్ణకారుచే
  నల్లిన రాగి తీగకు నవారిత కోమల పైడి జేర్చగన్
  చల్లనివాడె నాగడన జార్చిన భూషణ సత్య సంధతన్
  మల్లియతీగకున్ గనెను మామిడి కాయలు నేత్ర పర్వమై

  రిప్లయితొలగించు
 31. డా.పిట్టాసత్యనారాయణ
  కల్లయె బ్రహ్మంగారన
  మల్లియ తీగలకు గాసె మామిడికాయల్
  కొల్లలు "లిల్లీపుట్ల"కు
  చెల్లును నిచ్చెనలు వేయ చెలియా!వింటే!

  రిప్లయితొలగించు
 32. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


  ఒక వివాహ గృహము , కళ్యాణమంటపము రంగురంగుల దీపములతో

  సుగంధయుక్తమై - పుష్ప లతా ఫల భూషితమై విరాజిలు రీతి

  నలంకరించిరి . ఒక పిల్లవాడు ఆ అలంకరణ చూస్తూ అబ్బురం తో

  " నాన్నా అదేమిటి మల్లె తీగకు మామిడికాయ పుట్టింది ". అన్నాడు .


  ఎల్లి వివాహ మున్న దని యెంచి గృహంబును వర్ణదీపికా

  సల్లలితం బొనర్చిరి లసద్గతి | పంచసుగంధ యుక్త మై ,

  ఫుల్ల లతా ప్రసూన ఫల భూషిత మై , విలసిల్ల మంటపం

  బెల్ల , నలంకృతమ్ము ‌నొనరించిరి | శోభను గాంచి యిట్లనెన్ :

  బిల్ల డొకండు , తండ్రి గని , విస్మితితో యరెరే యిదేమి ? యా

  మల్లియ తీగకున్ గలిగె మామిడి కాయలు నేత్ర పర్వమై ! ! !

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మాన్యులు గురుమూర్తి గారూ... చాలా అద్భుతంగా ఉన్నదండీ ... పిల్లవాని మాటలలో... మీ పూరణము! అభినందనలు!

   తొలగించు
  2. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  3. గు రు మూ ర్తి ఆ చా రి

   సత్కవీశ్వరు లగు శ్రీ గుండు మధుసూదన్ గారికి మ రి యు


   గురువరేణ్యు లగు శ్రీ కంది శంకరయ్య గారికి = ధన్యవాదములు

   ఇరువురి పదపద్మములకు వందనములు

   తొలగించు

 33. ఏమండోయ్ కంది వారు

  విన్నపాలు

  వారానికి ఓ రోజు కొత్తదైన ఛందంతో సమస్య ఇవ్వ విన్నపాలు ! ఓ నాలుగు వారాలు అదే ఛందం ( వారానికొక్క రోజు మాత్రమే) ఆ తరువాయి పైనెలలో మరోకొత్త ఛందం ; ఇట్లా సంవత్సరం లో కొత్తదైన పన్నెండు ఛందముల నేర్చుకునే అవకాశం వస్తుంది

  విన్నపాలు వినవలె


  ఇట్లు
  ఛందోవిలాసిని
  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఇది విన్నపంలా కాక ఆజ్ఞలా ఉన్నది. సరే! ప్రయత్నిస్తాను.

   తొలగించు

  2. అబ్బే ! మా అయ్యరు గారితో కూడా "విన్నపాలు" ఇలానే వినిపిస్తామండీ ! వారూ మీ లానే ..
   :)


   జిలేబి

   తొలగించు


 34. కల్లా కపటంబెరుగడు
  పిల్లాడమ్మ కొమరుండు బేలమ్మా ! యా
  అల్లా! వత్సర మాయెన్
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్ ౹

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ!
   కల్లాకపటం ఎరుగని పిల్లవానికి, సంవత్సరానికి, మల్లెకు మామిడి కాయడానికి లింకు?

   తొలగించు
 35. ఎల్లరు సంతసించగను నేర్పుగ కూర్పుగజామచెట్టుకున్
  నల్లెనుయింటి యావరణ మందునబెంచినపూలమొక్కలే!
  కల్లయుగాదు జూచుటకు కల్పనరీతిగ గానుపించెగా
  మల్లియ తీగకున్ గలిగె మా_మిడికాయలునేత్రపర్వమై!
  మిడి=కాంతివంతమయిన

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చెట్టుకున్ + అల్లెను = చెట్టుకు నల్లెను' అవుతుంది కదా! అక్కడ "చెట్టుకే యల్లెను" అనండి.

   తొలగించు
 36. తొల్లియ నొక్క తల్కమున తోషణమొప్పు వసంత కాలమున్
  మల్లియ తీగలల్లుకొని మామిడి చెట్టును క్రమ్మివేయగన్
  భిల్లులు జూచి సంభ్రమము పెంపున బొందియు పల్కిరివ్విధిన్
  మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఫణికుమార్ తాతా గారూ... భిల్లుల సంభ్రమ వాక్కులతో మీ పూరణము ప్రశస్తంగా ఉన్నదండీ! అభినందనలు!

   తొలగించు
  2. ఫణికుమార్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'తొల్లియ' అని నిశ్చయార్థంలో చెప్పినపుడు "తొల్లియ యొక్క..." అవుతుంది. లేదా "తొల్లియు నొక్క..." అనండి.

   తొలగించు
  3. గురువుగారూ నమస్సులు. మీ సవరణకు ధన్యవాదములు.

   మధురకవులకు అభివాదములు. ధన్యవాదములు.

   తొలగించు
 37. మిత్రులందఱకు నమస్సులు!

  సల్లలితానురాగవతి "చంద్రిక" నామక కోమలాంగియే
  పల్లవ మట్టులం గనెను బాలికలం గవలం బ్రసూతిఁ; దాఁ
  బిల్లల నిద్దఱం గొసరి పిల్వ "మధూలి, మృషాలకా" యనన్,
  మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. అద్భుతమండీ మధుదూత మధుసూదన!


   జిలేబి

   తొలగించు
  2. జిలేబీల వంటి మీ యభినందనలు నాకుఁ గడుంగడు మధురముగఁ దోఁచుచున్నవండీ! నన్ను మధుదూతగఁ జేసినందులకు ధన్యవాదములు!

   తొలగించు
  3. అద్భుతమైన పూరణ మధురకవి గారూ!🙏🙏🙏🙏🙏

   తొలగించు
  4. కవి పుంగవులు వల్లి కే కాదు నామావలికి కూడ రసాల ఫలముల నాపాదించిన నిపుణులు. రసాలఫలరసాస్వాదనానుభూతి కలిగించారు. అభినందనలు.

   తొలగించు
  5. మధుసూదన్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   *****
   ఈరోజు మిత్రుల పూరణలపై స్పందించినందుకు ధన్యవాదాలు.

   తొలగించు
  6. మీ యభిమానమునకుం గృతజ్ఞుఁడనండీ పోచిరాజు వారూ! ధన్యవాదములు!

   తొలగించు
  7. ధన్యవాదాలండీ శంకరయ్య గారూ! మీ యభిమానమునకుం గృతజ్ఞుఁడను!

   తొలగించు
 38. తెల్లని పువ్వులు పూసెను
  మల్లియ తీవియకు,కాసె మామిడికాయల్,
  పల్లవి పాడుచు వేసవి
  మెల్లగ నెండలను,వేడి,మేదిని నింపన్.

  రిప్లయితొలగించు
 39. కందం
  తుల్లింతల రతికేళిని
  ఝల్లన జడమల్లె మాల చన్గవఁ జిక్క
  న్నల్లన సతిఁ గని మగఁడనె
  మల్లియ తీవియకుఁ గాసెమామిడికాయల్! 

  ఉత్పలమాల
  అల్లరి చిట్టి దుస్సలకు నట్టజడన్ దగ మల్లె పూలతో 
  నల్లగ గెంతుచున్ జనని యక్కున జేరఁగ చేయి జార్చుచు
  న్నల్లన దువ్వుచున్ జఘన మంటగ నాపగఁ గుంతి యిట్లనెన్
  "మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై!"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ముఖ్యంగా మొదటిది శృంగార రస బంధురమై మనోహరంగా ఉన్నది.
   రెండవ పూరణలో 'అట్టజడన్' అంటే?

   తొలగించు
  2. గురుదేవులకు ధన్యవాదములు. జడపొడవునా అట్టనుంచి దానినిండా పూలతో అల్లితే ఆ జడను పూలజడ అంటారు.

   తొలగించు
 40. అల్లన దర్శకేంద్రుడల!యల్లెను పాటను చిత్రమందునన్
  ఝల్లుమనంగ గుండియలు జార్చుచు నాయిక పై ఫలమ్ములన్
  ఘొల్లుమనంగ మన్మథుల కోరికలీరికలెత్త మింటికిన్
  మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై

  రిప్లయితొలగించు
 41. చల్లని జల్లులే కురియ చక్కని గాలులు తాకగా యెదన్
  మల్లెల వాసనే విరియ మన్నును తాకగ మామిడీ వనా
  నెల్లెడ పూతలే కనగ నేసిన మల్లెల తీగలేగ, నా
  మల్లియ తీఁగకుం గలిగె మామిడికాయలు నేత్రపర్వమై

  Dr H. Varalakshmi
  Bangalore

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తాకగా నెదన్... వాసనల్ విరియ (వాసన+ఏ=వాసనయే. అవుతుంది)... తాకగ చూతశాఖలే। యెల్లెడ... తీగలైన (కదా అనే అర్థంలో 'గ' ప్రయోగం సాధువు కాదు)..." అనండి.

   తొలగించు
 42. తెల్లని మల్లెలు పూసెను
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్
  పుల్లనివవికాసెను గను
  కొల్లలుగానిట తరువుకు కూర్మిని గొనుమా.

  అల్లన మల్లెలు పూసెను
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్
  నెల్లరు మెచ్చెడి రీతిగ
  పుల్లగ తియ్యగ తినగను భూరుహమునకున్.

  మల్లెలవెక్కడ పూయును?
  మల్లియ తీవియకుఁ గాసె మామిడికాయల్
  కొల్లగ నెక్కడ చెపుమా?
  కోల్లాపురమను పురమున కోకొల్లలుగాన్.


  తెల్లని మల్లెలు పూసెను
  మల్లియ తీవియకు కాసె మామిడి కాయల్
  మెల్లగ కోయుచు వానిని
  నుల్లము రంజిల్లు నట్లు నొప్పుగ తినుమా.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   విరుపుతో పూరణ చెప్పినప్పుడు ఆ విరుపు తరువాత కామా పెట్టండి. భావం సుగమమౌతుంది.

   తొలగించు
 43. ....సమస్య
  *మల్లియ తీవియకుఁ గాసె*
  *మామిడి కాయల్*

  సందర్భము: ఒక యింట్లో ఒక కన్న తల్లి. ఒక చిన్న పిల్ల. యిద్దరికీ తమ తమ పూజలమీదనే దృష్టి.
  *ఎవరి పూజ వారిదే* గదా!
  తెల్లని మల్లెలు పూచిన వని తల్లి సంతోషంతో అంటున్నది. పుల్లని మామిడి కాయలు కాసిన వని పిల్ల సంబరపడిపోతున్నది. మంచిదే గదా!
  ఆ యింట్లో మల్లె చెట్టు వుంది. మామిడి చెట్టూ వుంది. మల్లె చెట్టుకు మల్లె పూలు పూచినవి. మామిడి చెట్టుకు మామిడి కాయలు కాసినవి. విశేషమేమీ లేదు సుమా! ఉన్న విశేషమంతా వారి వారి పూజల్లోనే!
  ఆ పూజ లెలాంటి వంటారా! తల్లిదేమో దేవుని పూజ. పిల్లదేమో పొట్ట పూజ. అంతే తేడా..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "తెల్లని మల్లెలు పూచెను
  మల్లియ తీవియకుఁ;" "గాసె
  మామిడికాయల్
  పుల్లనివి చెట్టున" కనిరి
  తల్లియు పిల్లయును మురిసి
  తమ పూజలకై

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించు
 44. .....సమస్య
  మల్లియ తీగకున్ గలిగె
  మామిడికాయలు నేత్రపర్వమై

  సందర్భము: శ్రీ మైలవరపు వారిని శ్రీ కోట వారిని ఒకే దగ్గర కట్టివేస్తే ఎలా వుంటుందో చూద్దాం!
  మల్లియ.. అనే పద్యం (శ్రీ కోట వారిది)చూడండి. సీతాదేవి లవకుశులను కన్నది. అది త్రేతా యుగం.
  విల్లును.. అనే పద్యం(శ్రీ మైలవరపు వారిది.) కుంతీదేవి ధర్మజ భీ మార్జునులను కన్నది. అది ద్వాపరయుగం.
  మరి కలియుగంలో మల్లె తీగ యేది? మామిడి కాయ లేవి???........
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అల్లదె! సీతకున్ గలిగి
  రప్డు కుశుండు లవుండు త్రేతలో...
  తల్లియుఁ గుంతి కన్న దట!
  ధర్మజు భీముని బార్థు ద్వాపరన్
  *మల్లియ తీగకున్ గలిగె*
  *మామిడి కాయలు నేత్రపర్వమై*
  యిల్లిదె! మల్లె తీగ యెది??
  యెయ్యవి మామిడి కాయ లీ కలిన్??

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   చెల్లునె మీరలిట్లనఁగ శ్రీమతి ఇందిర నెహ్రు పుత్రియై
   యిల్లిదె పుత్రులిద్దరిని నింపగు రాజివు సంజయాఖ్యులన్
   మెల్లగ రాజకీయమున మిర్రుగ గాంచగ జన్మనీయఁగన్
   మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై!

   తొలగించు
 45. ..........🤷🏻‍♂సమస్య
  మల్లియ తీగకున్ గలిగె
  మామిడికాయలు నేత్రపర్వమై

  సందర్భము: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి చిన్ననా డొక లీలను చూపించినాడు. చిత్రావతీ నదికి పోవు దారిలో వున్న కొండపైకి భక్తులను సాయంకాల భజనకై తీసుకు పోయేవాడు.
  అక్క డొక చింతచెట్టుకింద అందరూ కూర్చుండగా యెవరి కే పండు కావాలో అడిగేవాడు. వారి కా పండు ఆ చింత చెట్టు కొమ్మలనుండియే కోసి యిచ్చేవాడు. వాటిల్లో మామిడి పండ్లు, సీమరేగు పండ్లు, కమలా పండ్లు, బత్తాయి పండ్లు, అత్తి పండ్లు మొదలైన వెన్నో వుండేవి.
  ఆ చింత చెట్టునే ఈనాడు *కల్పవృక్ష* మని పిలుస్తున్నారు. భక్తులు సందర్శిస్తున్నారు. సత్యం శివం సుందరం.. అనే గ్రంథం ప్రథమ భాగంలో 49 వ పుటలో చూడవచ్చు.
  మహాత్ములకు సాధ్యం కాని దేముంది? అటువం టప్పుడు మల్లె తీగకు మామిడి కాయలు కాయడం మాత్రం చిత్రమా!
  తింత్రిణి= చింత చెట్టు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  అల్లదె! *కల్పవృక్షము;* న
  గాగ్రపు తింత్రిణి; సత్య సాయి తా
  మెల్లగ బాల్య మిత్రులకు
  మే లగు పండ్లను దానినుండియే
  చల్లగఁ గోసి యిచ్చె నట!
  సద్రుచు లూరెడు వాని, చిత్రమే!
  మల్లియ తీగకున్ గలిగె
  మామిడికాయలు నేత్రపర్వమై

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించు
 46. మెల్లగ మెల్లగా దరికి మెచ్చుచు చేరుచు నచ్చినావు నీ
  తల్లికి సేవజేతునని తన్మయ మొందుచు నిందిరమ్మలోన్
  పిల్లడు పార్సి జాతుడట పిల్లను కూడగ హైందవమ్మునన్...
  మల్లియ తీగకున్ గలిగె మామిడికాయలు నేత్రపర్వమై!

  రిప్లయితొలగించు