30-3-2018 నాడు గద్యాలలో
'పరవస్తు చిన్నయసూరి సాహితీ సమితి' వారు నిర్వహించిన
'అవధాని భూషణ' శ్రీ ఆముదాల మురళి గారి
అష్టావధానం
1) నిషిద్ధాక్షరి (విద్యాన్ అవధానం సుధాకర శర్మ గారు)
అంశం - అవధానానికి ముందు జరిగిన యువకవి సమ్మేళనాన్ని చూసిన శారదాదేవి స్పందన....
(కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. (-) అన్నచోట నిషేధం లేదు. పృచ్ఛకులు ప్రాసతో పాటు రెండక్షరాలు వేసుకోమన్నారు)
సారా(చ)త్మ(-)క(హ)మై(-)వి(ద)శ్వా
(చ)ధారా(త)రా(జ)మ(మ)ంబు(-)వి(ద)ఘ్నద(ఘ్న)హ(మ)ర(త)మ్మై
(సమయాభావం వల్ల నిషేధం రెండు పాదాలకే పరిమితమయింది).
పూర్తి పద్యం....
సారాత్మకమై విశ్వా
ధారారామంబు విఘ్నదహరఘ్నమ్మై
మీరుచు నుండగ విద్యలు
శారద సంతుష్టి నందు సత్కవివర్యా!
2) సమస్య (కంది శంకరయ్య గారు)
"నంద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్"
పూరణ....
శైలనిభంపు గష్టముల సాహసవృత్తి భరించినారు, మీ
సాలను దువ్వకుండగనె శత్రుల గుండెలఁ జీల్చినారు, ప
ద్యాలను జెప్పినారు రసభావమనస్కులు; కారు కారు నం
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు, లవిజ్ఞులు, నీతిదూరులున్.
3) దత్తపది (విద్వాన్ బి.బి.బి.యస్. ప్రసాద్ గారు)
అంశం - మోది, రాహుల్, జగన్, చంద్ర పదాలతో ప్రత్యేకహోదాపై పద్యం.
పూరణ....
మనసుల్ ఛిద్రము జేసి మోదిరిట యాత్మానందసందోహముల్
గన శూన్యంబులురా హులక్కి యిట నిక్కంబైన శ్రేయంబులున్
మన మాశించుట నేరమా హృది జగన్మాత్రార్చనల్ సేయ మా
దినముల్ దగ్గిన చంద్రరేఖ యటు ప్రత్యేకం బిదే కోరమా?
4) వర్ణన (మాచిరాజు సుధీంద్ర కుమార్ గారు)
అంశం - ఇస్రో విజయాలు.
శ్రీహరికోట వేదికగఁ జేసిన కార్యము భారతావనిన్
లాహిరి వీడఁగా గురుబలంబును పొందఁగ జాతి మొత్తమున్
సాహసవృత్తి నేర్పినది చంద్రునిఁ జేరెడు శక్తి నిచ్చె ని
స్రో హరియించె గుండెలను శోభిలు మించఁగ విశ్వమంతటన్.
5) ఆశువు - (కె. మునికృష్ణ గారు)
౧)
ఫలిత మాశించి చేసెడి పనులవెంట
దుఃఖ మెప్పుడు విడువక దొరలుచుండు
యువత దీనిని గుర్తించి యున్నతముగ
గీత దాటక నడువంగ నూత మిడరె.
౨)
కనుపించు విశ్వ మెల్లను
ఘనమని మదినెంచువారు కర్మలు డుల్లన్
మననము శ్రీహరి నామము
పనుపుగ నొనరించు గాదె వైరాగ్యంబున్.
6) పురాణ పఠనం (విద్వాన్ వి. చెన్నకేశవయ్య గారు)
పృచ్ఛకులు పఠించిన రెండు పద్యాలకు అవధాని ఉనికిని చెప్పి వ్యాఖ్యానించారు.
7) వ్యస్తాక్షరి (అక్కిరాజు వరలక్ష్మి గారు)
పద్యపాదాన్ని వ్రాయడం మరచిపోయాను.
8) అప్రస్తుత ప్రశంస - (గంగుల నాగరాజు గారు)
మొదటిసారి అయినా నాగరాజు గారు చక్కగా, మనోరంజకంగా నిర్వహించారు.
రిప్లయితొలగించండివీడియో లింకు యూట్యూబు లింకు వుందాండి పూర్తి ప్రోగ్రాం కు ?
జిలేబి