3, అక్టోబర్ 2018, బుధవారం

సమస్య - 2807 (భీముని సతి తార...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"
(లేదా...)
"భీముని భార్య తార యని వేమన వ్రాసెను భారతమ్మునన్"

99 కామెంట్‌లు:

 1. ఏమని జెప్పుదు వింతను
  ప్రేమా పెళ్ళీ తెలియని వేదాంతి కటన్
  రామా యణమున రాజగు
  భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రేమయు పెండ్లియు తెలియని...' అనండి.

   తొలగించండి
  2. ఏమని జెప్పుదు వింతను
   ప్రేమయు పెండ్లియు తెలియని వేదాంతి కటన్
   రామా యణమున రాజగు
   భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్

   తొలగించండి
 2. మా మామ నుడివె వానర
  భీముని సతి తార యనుచు; వేమన వ్రాసెన్
  గోముగ నొక శతకమ్మున
  వేము తినగ తీపియనుచు వినరా మామా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చెప్పేది మామ కదా? మరి మామా అన్న సంబోధన?

   తొలగించండి
  2. మా మామ చెప్పగా: "వానర భీముని సతి తార" అని...నేను మా మామకు మారుమాటగా చెప్పాను: "వేమన వ్రాసెన్ ...వినరా మామా!" అని.

   తొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  వేమనపల్లె వాసియట ! వేమనయేనట పేరు కూడ, యే...
  వో మతి దోచినట్టి పలు యూహల పొత్తముగా రచించె శా...
  స్త్రామలబుద్ధిహీనుడు ,మదాంధుడు భారతమంచు , గాంచితో !
  భీముని భార్య తార యని వేమన వ్రాసెను భారతమ్మునన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రాశ్నికుని ఆరాటము..

   శ్రీమహితావధానములఁజేయుటచే ఘనకీర్తిఁబొందినా...
   డీ మురళీ యటందురిదె యిత్తును దారియు తెన్ను లేనిదౌ
   యీ ముడివిప్పరాని రసహీనసమస్యనటంచునిట్లనెన్
   భీముని భార్య తార యని వేమన వ్రాసెను భారతమ్మునన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మురళీకృష్ణ గారి కత్తికి రెండు వైపులా పదునే. అవధాను లనిపించుకున్నారు. పృచ్ఛకునకు ఒక చురక అంటించారు. అద్భుతమైన పూరణలు. అభినందనలు.

   తొలగించండి


  3. మైలవరపు వారు

   ఈ రామాయణాన్ని చదివి చూడండి :) సమస్యా పూరణలకు మా బాగా పనికొస్తుంది :)


   https://archive.org/details/ReamkerCambodianVersionOfTheRamayanaJudithJacobM.KuochHaksreaRoutledge_20180220_1521/page/n0

   Especially the second part :(


   జిలేబి

   తొలగించండి
  4. మురళీ కృష్ణ గారు మీ పృచ్ఛకుఁడు మీకు తెలియకుండగనే మిమ్ములను విమోహితుని జేసినాఁడు!
   తా నిచ్చిన సమస్య ముడి విప్ప రానిదిగాఁ దాను భావించుట యొప్పైన రసహీనమని భావించఁడు కదా! మీరనుకున్న సమంజసమే కాని యతఁ డనుకొనఁడు కదా!

   తొలగించండి
  5. మురళీ కృష్ణ యని సమసించి నపుడు లేక సంబోధనలోను మురళీ యని దీర్ఘము రావచ్చును గాని మురళి యటందు రనిన తత్సమ రూపమే రావలెను గదా? సందేహ నివృత్తి చేయ గలరు.

   తొలగించండి
  6. గురుతుల్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు... నా పద్యము మీ సమీక్షకు నోచుకొనుట నా భాగ్యము.. తమరు సందేహించిన ఆలోచింపవలసినదే.. దానిని ఈ విధముగా సవరించెదను...

   ఈ మురళీ వరుండితనికిత్తును....

   ఇక సమస్య రసహీనమైనదయితే అవధానికి పూరించుటకు కష్టమగునని కూడా పృచ్ఛకుడే అలా వాక్యనిర్మాణం చేసినాడని అవధాని గ్రహించినాడు... అని నా భావన.... నమోనమః 🙏🙏🙏

   తొలగించండి
 4. ఏమనగా దగు ద్రౌపది?
  సోముని ప్రియసఖి యెవరని సురలూహించెన్ ?
  కామమె దుఃఖము నిడునని
  భీముని సతి;తారయనుచు;వేమన వ్రాసెన్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   'సురలు' బహువచనం. ఊహించెన్ ఏకవచనం. అక్కడ "సుర లనుకొనిరో" అనండి.
   మొన్న కోట వారి పుస్తకావిష్కరణ సభకు మీరు వెళ్ళారా?

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! మొదట సురలనుకొనిరో యనే వ్రాసి యెందులకో మార్చితిని!
   కోటవారి సభకు నేనుకూడ వెళ్ళలేక పోయితిని.ప్రస్తుతము అమెరికాలో మా అబ్బాయి వద్ద ఉన్నానుకదా! నవంబరులో ఇండియాకు వస్తాను!

   తొలగించండి


 5. కామంచిని కోరెనెవతె ?
  రామాయణమందు వాలి రమణియెవతయో ?
  రామ వినునాటవెలదిని ?
  భీముని సతి; తార; యనుచు వేమన వ్రాసెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. రాముని రిపు దశకంఠుని

  హామిక వాలి యణచి మరి ఖ్యాతిని పొందెన్

  సోమము మిక్కిలిగల యా

  భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్

  # ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 7. క్రమాలంకారం లో ____
  కామిని హి డ oబియెవ్వరు ?
  ఏమని పిలిచె ను సుర గురువి ల్లాలి ని ? యో
  వేమా మకుటమెవ రి దో ?
  భీముని సతి ; తార యనుచు ; వేమన వ్రాసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఎవ్వరు + ఏమని' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "హిడంబి యెవ్వతె। యేమని..." అనండి.

   తొలగించండి
 8. సమస్య :
  భీమునిభార్య తారయని వేమన వ్రాసెను భారతమ్మునన్

  ("భారతం "అనే తరగతి గదిలో "భామతి "
  అనే టీచరు " వేమన " అనే విద్యార్థి నడిగింది )

  భామతి వేమన న్నడిగె భారతనామక
  మందిరమ్మునన్ -
  "లేమ హిడింబ యెవ్వరుర ? లెస్సగు వీరుడు
  వాలి భార్యయో?
  ఈ మన బోర్డు మీద మరి యేమియు తప్పులు
  లేక వ్రాయరా ! "
  "భీమునిభార్య " "తార " యని వేమన వ్రాసెను
  భారతమ్మునన్.

  రిప్లయితొలగించండి
 9. నా మగని మతి చలించెన్,

  భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్

  భామా యనుచు తెలుపగన్

  నామతి పోయెనని యొకతె నవ్వు చు బల్కెన్

  రిప్లయితొలగించండి
 10. వేమన యని పేరిడగా
  సోమయ కవి తన కొడుకుకు చోద్యమ్మయెగా!
  యేమనెద విధి విలాసము?
  భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అయె' అన్న రూపం సాధువు కాదు. "చోద్యమ్మయ్యెన్" అనండి.

   తొలగించండి
 11. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2807
  సమస్య :: భీమునిభార్య తార యని వేమన వ్రాసెను భారతమ్మునన్.
  సందర్భం :: మన భారతదేశంలో పతివ్రతలను గుఱించి తెలియజేస్తూ పంచకన్యలుగా ప్రసిద్ధికెక్కిన వారి పేర్లను స్మరిస్తే పాపములు నశిస్తాయి అనే విషయాన్ని ఈ క్రింది శ్లోకం ద్వారా వింటూ ఉంటాం.

  అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తథా।
  పంచకన్యాః స్మరే న్నిత్యం మహాపాతకనాశనమ్।।

  ఈ శ్లోకంలోని భావాన్ని తెలియజేస్తూ మన భారతదేశంలో అపర వేమన అని పేరుగన్న ఒక కవి “శ్రీమతులైనా కన్యలుగా ఉండి తమ పేరును స్మరించినవారి పాపములను నశింపజేయగలవారు *గౌతమ మహర్షిభార్యయైన అహల్య, రావణుని భార్యయైన మండోదరి, శ్రీరామునిభార్యయైన సీతాదేవి, భీమునిభార్యయైన ద్రౌపది, వాలిభార్యయైన తార అని విశదీకరించే సందర్భం.

  వేమన యన్నచో నపర వేమన, భారతమన్న దేశమౌ,
  శ్రీమతులైన కన్యలను జెప్పుచు పాపము పోవునట్లుగా
  నీ మహిలో “ నహల్య, గణియింపగ రావణుభార్య, సీతయున్,
  భీమునిభార్య, తార “ యని వేమన వ్రాసెను భారతమ్మునన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (3-10-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ,
   పంచకన్యలను ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 12. కామేశుని మేనల్లుడు
  వామన రావు తనయుండు వ్రాసె పరీక్షన్
  రాముని తమ్ముండగు బల
  భీముని సతి తారయనుచు వేమన వ్రాసెన్

  రిప్లయితొలగించండి
 13. ఏమార్చె నెవరు కీచకు ? ఏమని తాపిలుచు వాలి యింపుగ భార్యన్? నేమము తో వ్రాసె నెవరు? భీముని సతి, తారయనుచు, వేమన వ్రాసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. వేమన యన్న ఛాత్రుఁ డొక వేకువజామున ప్రశ్న వేయగా
  నా మునితుల్యుఁ డొజ్జ కడు నాదర మొప్పఁగఁ జెప్పె నిట్టు లౌ
  రా "మహనీయ వ్యాసుఁడు బృహస్పతి దానవశాస్తృ శుక్రహృత్
  భీముని భార్య తార యని వేమన! వ్రాసెను భారతమ్మునన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆమె సురభి యనెడు గృహిణి
   యామెను గని మగఁడు సెప్పె నతి వేడుక "నో
   భామా! యర్ధాంగీ! సుర
   భీ! ముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"

   తొలగించండి
  2. శుక్రహృద్భీముని గా బృహస్పతిని వర్ణించుచుఁ జేసిన మీ పూరణ మధ్బుతము గురు వరేణ్యా!

   తొలగించండి

 15. ఇదేమి సమస్య రా బాబోయ్ :)


  రాముని గాధ వెల్గె పలు రాజ్యములన్ జన నాడిలో కతల్
  పాముకొనంగ మారె పలు పాటకచేరుల నట్టి గాధయే
  తామరతంపరై తెలుగు తాతకు లభ్యమవన్ జిలేబి,"యా
  భీముని భార్య తార" యని వేమన వ్రాసెను భారతమ్మునన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నిజానికి షెడ్యూల్ చేసిన సమస్య..."భీష్ముని సతి సీత యనుచు వేమన వ్రాసెన్" (లేదా...) "భీష్ముని భార్య సీత యని వేమన వ్రాసెను భారతమ్మునన్". కాని నిన్న రాత్రి పడుకోబోతూ 'ష్మ' ప్రాస ఇబ్బంది కరమని భావించి, సీత వంటి పవిత్ర వ్యక్తులను కించపరచే విధంగా సమస్యులు ఇవ్వవద్దని పెద్దలు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి భీష్ముని భీమునిగా, సీతను తారగా మార్చాను.

   తొలగించండి
 16. గోముగ పలికెను బాలుడు
  " వేమన సతి తార యనుచు వేమన వ్రాసెన్"
  'రాము'ని జిలిబిలి పలుకులు
  ప్రేమగ విని నవ్వె తాత వింతగఁదోపన్.

  రిప్లయితొలగించండి
 17. వేమన మా కవి మిత్రుడు,
  భీముని రాక్షసి వరించె , వెంటాడె శశిన్
  కాముకి గురుపత్ని , ఘనుల్
  భీముని సతి, తార యనుచు వేమన వ్రాసెన్.
  (క్రమాలంకారాదుల జోలికి పోకుండా పూరించే ప్రయత్నం. ఈ వేమన మాత్రం ఆ వేమన కాదు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భీముని రాక్షసి వరించె... భీముని సతి' ఇక్కడ కొంత అన్వయలోప మున్నది.

   తొలగించండి
  2. భీముని సతి (రాక్షసి హిడింబ) తార లిద్దఱు ఘనులని వారి భావ మనుకుంటాను. అన్వయ భంగము లేదనుకుంటాను.

   బుధగ్ర హావిర్భావార్థము విధి ప్రేరిత వర్తనమది. అంతియ కాని యామె కాముకి కాదు. “భామిని గురు పత్ని” యన్న బాగుండు నని నా యభిప్రాయము.

   తొలగించండి
 18. ఏమని చెప్పితీవు? సముదీర్యవిధానజగద్విచిత్రసం

  భ్రామకచిత్తసంచలనభావము, నెట్లు? సమస్య పూరమౌ?,

  వేమన యేడ? తార యొకొ భీముని భార్య?; యటైన వాలిని

  ర్భీముని భార్య తార యని వేమన వ్రాసెను భా రతమ్మునన్.

  భా - కాంతి యందు, రతమ్మనన్ - కోరికతో.  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   అధిక్షేపాత్మకమైన మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 19. శ్రీమాన్శకారు డా! ర
  మ్మా!మా కందివరులకు సమస్యను నిమ్మా
  రోమాంచితమైనదొకటి !
  "భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కానీ... క్రీ.పూ. నాలుగవ శతాబ్దానికి చెందిన శూద్రకుని నాటకంలోని శకారుడు మొన్నమొన్నటి వేమన గురించి ఎలా చెప్తాడు?

   తొలగించండి

  2. అయ్యబాబోయ్ కంది వారు లాజికల్ బ్రెయిన్ పని చేస్తోందంటే జ్వరం వదిలినట్లే అన్న మాట :)


   నెనరులు

   మా శకారుడు భూత భవిష్యద్వర్తమానముల తెలిసిన త్రికాల జ్ఞాన సిద్ధుడు.

   అపసవ్య వ్యాసుడు :)


   జిలేబి

   తొలగించండి
 20. ఏమనియంటిరిసామీ!
  భీమునిసతితారయనుచువేమనవ్రాసెన్
  వేమనశతకముజదివితి
  నీమాదిరివాక్యమటనునెచటనులేదే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. సుబ్బారావు గారా మజాకాయా :)

   నో ప్రూఫ్ నో ఏక్సెప్ట్ :)


   జిలేబి


   తొలగించండి
  2. సుబ్బారావు గారూ,
   మీ సహజధోరణిలో ఉన్న పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 21. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  భీముని భార్య తారయని వేమన
  వ్రాసెను భారతమ్మునన్
  ==========================
  భీముని భార్య తార అనటం ఒక అసంబ
  ద్దత,ఆ విషయమును భారతమున వేమన
  వ్రాసి చూపెననుట రెండవ అసంబద్దమైన
  మాటగా ఇచట మనకు సమస్య
  ===========================
  సమస్యా పూరణం- 273
  ==================

  చూడ మనుషులు సురలు అసురులు-
  మడతలు విప్పగ తలలో కురులు
  కనబడు బయట రంగుల విరులు-
  త్రవ్వి చూడగ ఊరును మరులు
  బహు భర్తృక కథనపు వానర బల-
  భీముని భార్య తారయని
  వేమన వ్రాసెను భారతమ్మునన్-
  కలదు కద ద్రౌపదిగా నని

  (భీముడు =ఒక రాజు/ధర్మరాజు సోదరుడు/
  భయంకరుడు)

  ====##$##====

  పంచ మహా పతివ్రతలు:- సీత, మండోదరి
  ================== తార, అహల్య
  ద్రౌపది.

  నాటి ధర్మము, ధర్మ సూక్ష్మములను
  అనుసరించి పై ఐదుగురిలో ఒక్క సీతను
  మినహాయించి మిగతా నలుగురు బహు
  భర్తృకలే.

  ( మాత్రా గణనము- అంత్య ప్రాస)
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 22. భీమునిభార్యతారయనివేమనవ్రాసెనుభారతమ్మునన్
  నేమిదివింత?యీపలుకులిట్టులుబల్కుటభావ్యమేన?యో
  మామకవంశభూషణ!మామిడిశంకర!నీవజెప్పుమా
  భీమునిభార్యయెవ్వరికవేమనవ్రాసినబొత్తమేదియో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భారతమ్మునన్ + ఏమిది = భారతమ్మున నేమిది' అవుతుంది.

   తొలగించండి


 23. భామామణి ద్రౌపది యా
  భీముని సతి,తార యనుచు వేమన వ్రాసెన్
  వ్యోమము నవెలుగు పంచెడి
  సోముని చూచుచు ముదమున సులభపు రీతిన్.

  2.కోమలి కృష్ణెవ్వరిసతి?
  సోముని సతియెవ్వరటంచు సూటిగ చెపుమా
  భామల నిరసించుచు కవి
  భీముని సతి,తార యనుచు వేమన వ్రాసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   విరుపుతో మొదటి పూరణలో పూర్వార్ధం బాగున్నా, ఉత్తరార్ధంలో అన్వయలోపం ఉన్నది.
   రెండవ పూరణలో 'కృష్ణ + ఎవ్వరి' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. రెండవ పాదంలో గణదోషం. "సతి యెవ రటంచు" అనండి.

   తొలగించండి
 24. ఈమహి హిడింబి యెవ్వరు?
  తామసుడగు వాలి సతిని తలచెద రెటులన్"
  పామరులెరిగెడు రీతిగ?
  భీముని సతి ,తార యనుచు, వేమన వ్రాసెన్!!!

  సామీరి దెలిపె వానర
  భీముని సతి తార యనుచు, వేమన వ్రాసెన్
  నీమముగ నాటవెలదిని
  పామరులకు దెలియురీతి పద్యమ్ములనే!!!

  రిప్లయితొలగించండి
 25. భీముఁ డను వాఁ డొకఁ డలరి
  యా మానినిఁ దార యనఁగ నడరెడు దానిన్
  వేమన గనన్ వరించఁగ
  భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్


  రామ కథావృత ప్రవిమల స్తుత కావ్యమునం గవీశ్వరుం
  డా ముని శేఖరుండు దమి నంచిత రీతిని నింద్ర దత్త స
  ద్దాముఁడు వానరేంద్ర జిత దైత్యగణాధిప వాలి యమ్మహా
  భీముని భార్య తార యని వే మన వ్రాసెను భారతమ్మునన్

  [భీముని = భయంకరుని; వే = శీఘ్రముగ; మన (న్) = మనుటకు; భారతమ్మునన్ = భారత దేశములో]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇష్మ పికాభ గాత్రుఁడు మునీంద్రుఁడు నెమ్మిని హవ్య భుక్ప్రకా
   శోష్మ శరీరుఁ డా దశర థోత్తమ సూను తటిల్లతా విభా
   శుష్మ ముఖారవిందు రిపు సూదను దైత్య నికాయ హృచ్చల
   ద్భీష్ముని భార్య సీత యని వే మన వ్రాసెను భారతమ్మునన్

   తొలగించండి
  2. దోష మనఁగ రాదించుక భాష తెలియ
   విశ్రుతమ్మె సుమ్మిద్ధాత్రి భీష్ముని సతి
   సీత యనుచు వేమన వ్రాసె నాతత నుత
   వాక్య మత్తరి భూతల వాసు లెఱుఁగ

   [భీష్ముడు = శివుడు; సీత =గంగా దేవి]

   తొలగించండి
  3. 8-6-2016 నాటి సమస్యాపూరణము:

   శుష్మం బొప్పు ధనంజయోగ్రపు ధనుస్సుం జూచి విభ్రాంతులై
   శ్లేష్మంబందునఁ బడ్డ యీగలన నిశ్చేష్టాంతరంగంబునన్
   గ్రీష్మంబంది ధరేశులుంజనిన సత్కీర్తిన్ నరుండుం దనన్
   భీష్మాచార్యుఁడు, పాండవుల్ వొగడఁగాఁ, బెండ్లాడె పాంచాలినిన్

   [శుష్మము = తేజస్సు]

   తొలగించండి
  4. కామేశ్వర రావు గారూ,
   మీ వైదుష్యాన్ని ప్రశంసించడానికి నాకు మాటలు చాలడం లేదు. పైన పేర్కొన్న పూరణలు దేనికదే ప్రత్యేకత గల్గిన వజ్రాలు. ఒక్కొక్కటి వైవిధ్యంగా, శబ్దవైదగ్ధ్యంతో ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  5. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ధన్యోస్మి.

   తొలగించండి
 26. "వాలికి సతి తారయనుచు వాల్మికి వ్రాసెన్ "
  అని ముద్రించమంటే ...టైపు పొరపాటున పేర్లు మారి అర్థరహిత పాదమగుట.

  కం.
  ఆముద్రణ లోపమ్మున
  భీముడు పడె వాలి బదులు, పేర్లే మారెన్
  వేమన వాల్మీకి బదులు
  భీముని సతి తారయనుచు వేమన వ్రాసెన్ .

  రిప్లయితొలగించండి
 27. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  రామునిపై జిలేబి యొక రమ్య సమస్యను కూర్చబోవగా...
  దోమలగూడలో మురియు దోమలు పీకగ పారిపోవుచున్...
  చీమలు కుట్టగా కసిరి చీమలడొంకను తిట్టిపోసుచున్...
  పాములపట్టణమ్ము నహ! పాచిక లాడగ తోచె నివ్విధిన్: 👇
  "భీముని భార్య తార యని వేమన వ్రాసెను భారతమ్మునన్"

  ("చీమలడొంక" కంది వారి సృష్టి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఈ పద్యంలో మీ విదూషక పాత్రను చక్కగా పోషించారు. బాగుంది. అభినందనలు.
   "తిట్టిపోయుచున్" టైపాటనుకుంటాను.

   తొలగించండి

  2. పాముల పట్టణము - శంకరాభరణము :)
   దోమల గూడ - మాలిక అగ్రిగేటరు :)
   చీమలడొంక చీమలు - జిలేబి పద యా ను లు
   పాచిక లా డు - permutation and combination :)


   నారదాయనమః

   జిలేబి

   తొలగించండి
 28. భామిని 'హిడింబ'యెవ్వతె?
  యేమని యనవచ్చు మింటయే గల చుక్కన్?
  సామాజిక స్ప్రహతో సుద్దుల
  భీముని సతి ;తార యనుచు ;వేమన వ్రాసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మింటనే గల... సామాజికతో సుద్దుల (మీ పాదంలో గణదోషం)" అనండి.

   తొలగించండి
 29. కౌముది వెలుగున నభమున
  సోముని తారల నడుమన చూడగనె సుధా
  ధాముడు నిశీతిని తిమిర
  భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిశీధిని' టైపాటు.

   తొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  "భీముని సతి తార యనుచు
  వేమన వ్రాసెన్"

  సందర్భము: వేమన వ్రాసుకున్న ప్రతి ఒకటి దొరికిం దట! అదీ సంబరం.
  అయితే అది శుద్ధ ప్రతి కాదు. చిత్తు ప్రతి. చింపి వేయడానికి మరచిపోయి ఉంటాడు పాపం!
  ఆ చిత్తుప్రతి మా మామయ్యకు దొరికిందని ఒకడు చెబుతున్నాడు. ఏ మనుకొని వ్రాశాడో యేమో గాని ఆ చిత్తుప్రతిలో యిలా వ్రాశాడు.
  "భీముని సతి తార"
  (అంటే అతని దృష్టిలో సందేహాస్పదమే!)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  వేమన చిత్తు ప్రతి యొకటి
  మామయ్యకు దొరికె.. చింప
  మరచెనొ యేమో!
  ఏ మని వ్రాసెనొ! ఏమో!
  "భీముని సతి తార" యనుచు
  వేమన వ్రాసెన్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  3.10.18
  -----------------------------------------------------------
  శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో
  .......................

  2 వ పూరణము...

  సందర్భము: వేమన చిన్నప్పుడే ఏవో పద్యాలు వ్రాసేవాడు. బడి చదువుల లోనే తోటి విద్యార్ధుల మన్ననలు చూరగొన్నాడు.
  వేమన క్లాస్ మేట్లు సోమన భీముడు తార. ఒకసారి సోమన టీచర్ లేనప్పుడు బ్లాక్ బోర్డ్ మీద "భీముని సతి తార" అని గిలికినాడు. ఈలోపల హెడ్ మాస్టర్ రానే వచ్చాడు. గద్దించి అడిగాడు
  "ఎవడురా ఇలా వ్రాసింది!" అని..
  సోమన భయపడిపోయి ఇలా అన్నాడు.
  "నేను కాదు సార్! వేమన వ్రాశాడు."
  బోర్డు = బ్లాకుబోర్డు
  పెద సారు= హెడ్ మాస్టర్
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  సోమన గిలికెను బోర్డున
  "భీముని సతి తార" యనుచుఁ..
  బెద సా రడుగన్
  సోమన వణకుచు ని ట్లనె..
  "భీముని సతి తార యనుచు
  వేమన వ్రాసెన్"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  3.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ రెండు పూరణలు మనోరంజకంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 31. రోమను నుండి వచ్చెనట రోహిణి గారపు బిడ్డడాతడే
  వేమన, మామకూతురును బెండిలి యాడదలంచి కోరగా
  నా మహి లో పురాణముల నాణ్యత తెల్పు పరీక్ష పెట్టగా
  భీముని భార్య తారయని వేమన వ్రాసెను భారతమ్మునన్

  రిప్లయితొలగించండి

 32. భామిని 'హిడింబ'యెవ్వతె?
  యేమని యనవచ్చు మింటనే గల చుక్కన్?
  సామాజిక స్ప్రహతో సుద్దుల
  భీముని సతి ;తార యనుచు ;వేమన వ్రాసెన్

  రిప్లయితొలగించండి
 33. కందం
  ఏమట విద్యదమరికకు
  దోమల బాధకు చదివిన దోషమదేమో?
  నా మనుమడు చెప్పె నిటుల
  "భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్ "

  ఉత్పలమాల
  వేమరు జెప్పిజూచినను విజ్ఞతతో పఠియించ మంచు నే
  నేమరకన్ పరీక్షలకు, నింటను విద్యుదమర్పుభంగమై
  దోమలుఁ గుట్టుచుండ నట తూలుచు గోకుచుఁ జెప్పె వాడిటుల్
  " వేమన భార్య తార యని వేమన వ్రాసెను భారతమ్మునన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'విద్యుదమరికకు' టైపాటు!

   తొలగించండి
  2. విద్యుదమరిక, విద్యుదమర్పు లవగతము కాలేదు. కొంచెము వివరించ గలరా?
   విద్యుత్తమరిక , విద్యుత్తమర్పు లనియా మీ భావము?

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ :

   కందం

   ఏమటఏవిద్యుదమరికకు
   దోమల బాధకు చదివిన దోషమదేమో?
   నా మనుమడు చెప్పె నిటుల
   "భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"

   తొలగించండి
  4. శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు. విద్యుదమరిక మరియు విద్యుత్తమర్పు అనియే నా భావన. ఆమోదయోగ్యమో కాదో వివరించ ప్రార్థన.

   తొలగించండి
  5. విద్యుత్ సంస్కృతపదము. అమరిక, అమర్పులు దేశ్యములు. రెంటికి సంధి కుదరదు. మొదట సంస్కృత పదమును దత్సమముగా మార్చి తదుపరి యాచ్ఛికముతో సంధి చేయవలెను.

   తొలగించండి
  6. విద్యుదలబ్ధత, విద్యుదకాలహీనతన్ సాధువులు.
   ఏమట విద్యుత్తెడలగ కూడ సరి పోవును.

   తొలగించండి
 34. వేమన పద్యములఁ జదివి
  యేమని యర్థములఁ గొనుచు నేమనుకొనిరో!?
  ఈ మాటయె సత్యమ? యెట
  *"భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"*

  రిప్లయితొలగించండి
 35. శిష్యునితో......తప్పుగా వ్రాసిన పద్యపాదాన్ని సరిచేయమంటున్న గురువుగారు:

  ఏమా విరుద్ధ భావన!
  ధీమాగా పాదమందు తీర్చితివేలా?!
  పో! మార్చుము సరిజేయుము
  "భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్!"

  రిప్లయితొలగించండి
 36. భామ హిడింబ యెవ్వరుర? భార్యను ముద్దుగ వాలియేమనెన్?
  వేమన పద్యముల్ నెవరు వేడుక మీరగ నేమిచేసెరా?
  భీముడు నెద్ది కావ్యమున వీడక జంపె సుయోధనుండనున్?
  భీముని భార్య;..తార యని;...వేమన వ్రాసెను;...భారతమ్మునన్!

  రిప్లయితొలగించండి