26, మే 2020, మంగళవారం

సమస్య - 3380

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దీనెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే"
(లేదా...)
"దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే"
(డా. జి. సీతాదేవి గారికి ధన్యవాదాలతో)

77 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    లావుగ గబ్బిలమ్ములను లాగుచు కుమ్ముచు, చీనివాసులే
    దీవెనలిచ్చి పంపగను తీరిచి దిద్దుచు భారతావనిన్
    కోవిడు వైరసున్, జడిసి కోవెల ద్వారము మోడి మూయగా
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    కుమ్ము = మెక్కు

    రిప్లయితొలగించండి
  2. కం//
    తావున నుండగ నీయక
    నావిధి వక్రించె నేడు నానారీతుల్ !
    కావగ దేవుడె రానన
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే !!

    రిప్లయితొలగించండి

  3. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    నాడు...నేడు:

    కోవెల లోన కాపురము కొండొక రీతిని చక్కబెట్టుచున్
    కావలి కాచి దేవునకు గౌరవ మొందుచు నడ్డపంచెతో
    పావుల బేడ గైకొనుచు పండులు తీర్థము గోపురమ్ముతో
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    రిప్లయితొలగించండి
  4. (ద్వారకామాయిలో దీపావళికోసం నూనె పోయమని వచ్చిన
    సాయిబాబాతో "పోయ"మని నిరాకరించిన షిరిడీ వర్తకులు )
    పావనమూర్తి ;యాపదల
    బాపెడి సాయియె దీపపంక్తులన్
    నేవముతోడ వర్తకుల
    నిండుగ నూనెను గోరి ముందటన్
    దీవెన లిచ్చువాడె కడు
    దీనత "దేహి"యటంచు నిల్చెనే !
    "పోవుము నీవు సాయెబువు ;
    పోయము పోయ" మటంచు బల్కిరే !!
    (నేవము -నెపము ;సాయెబు -మహమ్మదీయుడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      'పోవుము' శబ్ద సాధుత్వంపై సందేహం.

      తొలగించండి
    2. బాల. క్రియా. 98.
      పోవునకు దుఙ్ముత్తులు ముఙ్ఙుం బరంబులగునపుడు వులోపంబుం, బొద పద లును విభాష నగు.
      పోదురు - పోవుదురు, పోఁడు - పోవఁడు, పోవుము - పొదము, పదము - పొమ్ము.

      పొద యగుట విభాష కనుక పోవుము సాధువే యగును.

      తొలగించండి
  5. అందరికి నమస్సులు🙏
    నా పూరణ యత్నం ..

    *కం||*

    నీవిక తెలుసుకొనుమునిది
    భావము బోధపడగనిక భక్తిగ జూడన్
    ఆ వారణాసి తల్లిని
    *"దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      వాట్సప్ వ్యాఖ్యను చూడండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారూ 🙏🙏

      *సవరణతో*

      నీవిక *తెలుసుకొనుమ్మిది*
      భావము బోధపడగనిక భక్తిగ జూడన్
      ఆ వారణాసి తల్లిని
      *"దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే"*

      🙏🙏

      తొలగించండి
  6. అందరికీ నమస్సులు 🙏🙏

    నా పూరణ యత్నం ..
    (అగ్రరాజ్యాలు HCQ మందు కొరకై)

    *ఉ*

    దేవుడు మేములే యనుచు దెల్పిరి లోకము కెప్పుడో గదా
    బ్రోవగ నెల్లరున్ విసిగి యోపిక తగ్గగ శాంతితో నిలన్
    జీవన భారమున్ గనిరి చీకటి రాజ్యము నేలగా నహో
    *"దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😊🙏

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ లక్ష్మీ నారసింహాయనమః.
      మహోదయులకు ఉషోదయ నమస్సులతో,

      నేటి సమస్యాపూరణాల యత్నం-

      ఈవి గలవాడు హరియే
      ఈ వామనుడై కరముల నీవిధి చాచన్
      ఈ వేళకు నా భాగ్యము!
      దీవెన లిడువాడె నేడు దేహీ యననే!!

      ఈ వటు డా హరీ!? జగతి కాంక్షల పూజల కాద్యుడెప్పుడుం
      వేవురి ధర్మముం గరుపు వేదము నిచ్చిన
      దివ్యుడెప్పుడున్
      సేవకుడై మునీశ్వరుల శ్రేయము గాంచెడి వాడు, భక్తికిన్
      దీవెన లిచ్చువాడు, కడుదీనత దేహియటంచు నిల్చెనే.

      తొలగించండి

  8. తండోప తండాలు గా వచ్చేవారు వరదా అని ! చూడ్దానికి సమయం లేక పోయె! ఒక్కడూ ఇప్పుడు రాడే!


    రావా! దేవా! మము కన
    రావా ! పడిగాపులు పడి రయ్యా భక్తుల్
    ఆ వరదుడిపుడు వేచెను
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. కోవెలలు మూసి వేసిరి
    ఆ వైను దుకాణములన నాత్రము గనుచున్
    హావడి దలబోయుచు నా
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే

    రిప్లయితొలగించండి


  10. కందోత్పల


    నియతులుగా వేచిరి వె
    న్కయ! దీవెన లిచ్చువాఁడె కడు దీనత దే
    హి యటంచు నిల్చె నేడయ!
    భయమున్ గొల్పెడు కరోన వలన కదయ్యా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. నీవారమేమి తినిరో
    కావేవీ వేలమేయ కలియుగమందున్
    దేవునిభూముల నమ్మగ
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే.

    నీవారము -గడ్డి

    రిప్లయితొలగించండి
  12. భావమునందు శుద్ధిగని పల్కెను రాక్షసరాజు విన్ము నీ
    వీవిధి దెల్పుచుంటి వదియేల గురూత్తమ! విష్ణు డీతడా?
    కావలె నట్టులైన నిక కల్గును సద్గతి నాకు, నన్నిటన్
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే"

    రిప్లయితొలగించండి
  13. ఈ వేళల సంపాదన
    కోవిడు వలన పనిలేక గుంటుపడుటచే
    కావుమనగ కాసులొసగి
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. దేవేంద్రునితోఁ గర్ణుడు
      దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనె, నే
      నీవేళ ధన్యుడ నయితి
      నీ వర్మము గుండలముల యీగిఁ గొనుమనెన్!

      తొలగించండి
    2. (ఇచ్చిన సమస్యలో దీ"నె"న అని టైపాటు)

      తొలగించండి
    3. నీవాకిటఁజేరి శివుడు
      దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే!
      రావమ్మ!యన్న పూర్ణా!
      నీవే తగు నతని కిడగ నిత్యము భిక్షన్!

      తొలగించండి
  15. కావర మూని దానవుడు క్ష్మాపతి యా బలిచక్రవర్తియే

    దేవతలందరిన్ ఋషుల దీవ్రము హింసొనరింప,గావగా

    పావన విష్ణుమూర్తి నిజ వామను డైబలి చెంతకేగియున్

    "దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే!"

    రిప్లయితొలగించండి
  16. కావర మము దేవర యని  
    కోవెల జనులు మొరలిడ కొలువగ రారే
    వేవేలుగ రావలెగా   
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే

    రిప్లయితొలగించండి
  17. రావలదనిభక్తులనన్
    కోవెల(దలుపులు దెరువక కోవిడనందున్
    దేవర పూజలు సలుపుచు
    దీవెన లిడువాఁడె, నేఁడు దేహీ యనెనే

    రిప్లయితొలగించండి
  18. కోవెలతలుపులు మూసిరి
    పావనమౌ భవునిసేవభాగ్యముపోయెన్
    పోయెను భ్రుతి పూజారికి
    దీనవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోవెలతలుపులు మూసిరి
      పావనమౌ భవునిసేవభాగ్యముపోయెన్
      పోయెనుభృతి పూజారికి
      దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే

      తొలగించండి
  19. మైలవరపు వారి పూరణ

    నా వచనమ్ములన్ వినుము., నమ్మకు చేటుల మాట., నొక్కటే
    పూవన పారిజాత., మది పొందగ కోరుదువేని వృక్షమే
    నీ వనమందు నిల్పెదను., నెచ్చెలి! నీ విభుడార్తకోటికిన్
    దీవెన లిచ్చువాఁడె ! కడు దీనత దేహి యటంచు నిల్చెనే!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  20. పావనమై వెలుగొందుచు
    గోవిందా యన్న వారి కోర్కెలు దీర్చే
    దేవుడు లాక్ డౌన్ వలనను
    దీవెన లిడు వాడె నేడు దేహీ యనెనే

    రిప్లయితొలగించండి
  21. * శంకరాభరణం వేదిక *
    26/05/2020 .మంగళవారం

    సమస్య
    ****

    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    నా పూరణ. ఉ.మా.
    **** **** ***

    వావిరి తాపమీయ భువివల్లభుడా బలిచక్రవర్తియే

    బ్రోవుమటంచు ఖేచరులు పూజ్య ధరాధరధారి వేడ;నౌ

    రా! వటుడౌచు మూడడుగులన్ బలి గోరగ వాణ్ణి జేరలే?

    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే"



    -- 🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి


  22. కావుము వేంకటేశ యని కన్నులు కాయలు కాయ వేచు వా
    రే! వరదా యటంచును నిరీక్షణ యే తమ గీటురాయిగా
    సేవకు లే పదండి యని చేరియు చేరక పూర్వమే వెసన్
    త్రోవను చూపుచున్ తరుము తొట్టువ గల్గిన దేవుడాతడే
    దీవెన లిచ్చువాఁడె, కడు దీనత దేహి యటంచు నిల్చెనే
    జీవిత మే కరోన సహజీవన మాయెను తాత రాతగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. నావంశము నిలుపునితడు
    నావాడని ప్రేమబెంచ నందనుడంతన్
    సేవాశ్రమమున జేర్చగ
    దీవెన లిడువాడె నేడు దేహీయనెనే?

    పావనమైన శీలమున భారతభూమిని పూజనీయులై
    కోవిదులై సురార్చనల గూర్చుశుభంబు ప్రజాళికెప్పుడున్
    లావగు వ్యాధిమూలమున లగ్నములన్నియు వ్యర్ధమవ్వగా
    దీవెనలిచ్చువాడె కడుదీనత దేహియటంచు నిల్చెనే!

    రిప్లయితొలగించండి
  24. గురువు గారికి నమస్సులు.
    శ్రీవారునాడుయగణిత
    దీవెనలిడువాడె,నేడుదేహీయనెనే?
    రావే సోముని సుధవై
    నీవే భవితపుయువరాణీనలరమిటన్.

    రిప్లయితొలగించండి
  25. పావనుడైన శ్రీధరుడు వామనుడై చనుదెంచ, కాంచి యా
    పావక తేజుడై వెలుగు బాలకునిన్ బలిచక్రవర్తి తా
    సేవలసల్పి కోరికను చెప్పమనంగను కోరె నిశ్చలన్
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    రిప్లయితొలగించండి
  26. కావగ వచ్చిన సాయీ
    దీవెన లిడువాడె,నేడు దేహీ యనెనే
    బ్రోవ జనుల,బాపములన్
    క్రోవగ పరిశుద్ధ పరుప,గోరెనె బిక్షన్.

    రిప్లయితొలగించండి
  27. శీవమె పానుపుగ గలిగి
    పావనికే జన్మనిచ్చు పదములు గల యా
    పావనుడా శ్రీహరియే
    దీనెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే

    రిప్లయితొలగించండి
  28. రావలె!పౌరోహితుడయి
    దీవెన లిడువాఁడె, నేఁడు దేహీయనెనే
    దేవముని వేడ హరియును
    పావనుడనుబిరుదుబోవు!పంకజనాభా!

    రిప్లయితొలగించండి
  29. ఈ వెతలెట్లు దీరు నిల నివ్విధి బట్టె కరోన భూతమై
    సేవలు జేయ దేవళము జేర నశక్యము గడ్డు కాలమున్
    లేవుగ వేరు దారులు బరీక్షగ మారె కుటుంబ భారమున్
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    రిప్లయితొలగించండి
  30. కోవిడు భయమున జనములు
    కోవెల కేగుట యుమాన క్రుంగుచు వెతచే
    దేవుని తీర్థ మొసంగుచు
    *దీవెన లిడువా డెనేడు దేహీ యనెనే*

    రిప్లయితొలగించండి
  31. కోవిదు లై పరాత్పరుని కొల్చుటె వృత్తిగ గల్గినట్టి యా
    దేవకు డే కరోన కడు తీవ్రపు రూపము దాల్చి మూయగా
    కోవెలలన్ని, రాబడియె కోతబడంగనె పొట్ట కూటికై
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    రిప్లయితొలగించండి
  32. ౧.

    సేవలుగొనినిందాకను
    కోవెలలోకోట్లకొలది కోశము నిండన్
    కోవిదు వచ్చిన తరుణము
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే!!

    ౨.

    కోవెల నిండగన్ ప్రజలకోర్కెల దీర్చగ వచ్చెనో యిలన్
    త్రోవల గూడిరే జనులు త్రొక్కిస లాడువిధంబునన్ గదా
    లేవట నేడివేవియును లేవు కరోనయె రాగ దర్శణాల్!!
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే!!

    రిప్లయితొలగించండి
  33. ఆవులు నగ్రహారములు హాలిక వృత్తియు దూరమయ్యె వే
    దావని యందు బ్రాహ్మణులకన్నము బుట్టెడి దిక్కులేక నే
    డీ వరుసన్ సమాజమున హీనపరిస్థితులావహించగా
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    రిప్లయితొలగించండి
  34. భావోద్రేకమ్ము లలర
    నావే శాతిశయ చిత్తుఁ డర్చక వరుఁడే
    కోవెలలో మోక్షార్థము
    దీవెన లిడువాఁడె నేఁడు దేహీ యనెనే


    ఆ వనజాసన ప్రకటి తాసహ నిశ్చయ ఫాల లేఖ నో
    పావృత మెంచ శక్యమె యవాంతర ముండదు దాని కెన్నడుం
    బావన భస్మ దేహి మును భస్మ నిశాచర భీతిఁ బాఱుచున్
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    రిప్లయితొలగించండి
  35. ఉ:

    కోవెల లోన భక్తులకు కోరిన కోర్కెలు దీర్చనెంచనై
    దేవుని చెంత నిల్చి కడతేర్చుము కష్టములంచు నర్చకుల్
    భావుక లందజేయగల వారును కోవిదు పుణ్యమా యనన్
    దీవెన లిచ్చు వాడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    భావుక=శుభము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  36. ఈవింతనువేజూడుము
    దీవెనలిడువాడెనేడుదేహీయనెనే
    కోవెలయందలియర్చకు
    డేవేడదొడగెధనమునునీయగదనకున్

    రిప్లయితొలగించండి
  37. కోవెలకేగగానచటకూరిమితోడనుహస్తముంచుచున్
    దీవెనలిచ్చువాడెకడుదీనతదేహియటంచునిల్చెనే
    కోవిదురాకతోజనులుగోలుకొనంగనుదారిలేకవా
    రేవిధమైనవృత్తులనుజేయకయింటినినాశ్రయించుటన్

    రిప్లయితొలగించండి
  38. కందం
    పావని సీత వెదుక సు
    గ్రీవుని సాయమ్ము కోరె శ్రీరాముండే
    దైవమ్మై భృత్యలకున్
    దీవెనె లిడువాఁడె నేఁడు దేహీ యనెనే!

    ఉత్పలమాల
    పావన వంశ శేఖరు నిబద్ధతఁ గల్గిన సత్యసంధునిన్
    సేవకు భంగి జేసుకొని చిక్కులపాలొన రించ కౌశికుం
    డావల కాటికాపరిగ నాలిని తాళిని కోరెఁ బ్రేమతో
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే!



    రిప్లయితొలగించండి
  39. పావన ధర్మమూర్తి జనవంద్యుఁడు శాంతగుణాభిరాముఁడున్
    ధీవర చక్రవర్తులు సుధీనివహంబులు జేరిగొల్వఁగా
    కోవిదుఁడైన ధర్మజుఁడు కోరివిరాటుని చెంతఁజేరెపో
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే

    రిప్లయితొలగించండి
  40. పావననాముడై పతిత పావనుడైభవనాశకుండునై
    దీవెన లిచ్చువాఁడె కడు దీనత దేహి యటంచు నిల్చెనే
    పావనమూర్తియైనహరి వామనుడై బలియాహవంబునన్
    భావనచేసిచూడహరిభక్తవశంకరుడెల్లవేళలన్

    రిప్లయితొలగించండి
  41. దాన ధర్మములెన్నియో మానవతగ
    బంచి? పరమాత్ముడనియెంచు భాగ్యదాత
    నేటియుకరోన లాక్డౌను చాటగానె
    దీవెనలిడు నేడుదేహీయనెనె!

    రిప్లయితొలగించండి
  42. మిత్రులందఱకు నమస్సులు!

    [అర్జున విజయార్థ మింద్రుఁడు, తన కవచకుండలములను యాచించుటకై, బ్రాహ్మణవేషమున నేఁగుదెంచఁగాఁ గర్ణుఁడు తనలో తాననుకొనిన సందర్భము]

    "దేవతలెల్లఁ గొల్వ, ఘనధీరత వేలుపుఁబ్రోలు నేలుచున్,
    వేవుర సత్కృతిన్ గొనెడు వృత్రవిరోధి మహేంద్రుఁడే, సుతున్
    గావఁగ వచ్చెనే కవచకర్ణవిభూషణముల్ గొనంగఁ దా!

    దీవెన లిచ్చువాఁడె, కడు దీనత, ’దేహి’ యటంచు నిల్చెనే!!"

    రిప్లయితొలగించండి
  43. దేవా!నిన్నందురుగద
    దీవెనలిడువాడె;నేడు దేహీ యనెనే
    నీవే దన నేలికనెడు
    నీవాడు,కరుణనిడగదె నీ దాసునకున్!

    రిప్లయితొలగించండి