24, జనవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 206 (మత్తెక్కిన భద్రగజము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్.
ఈ సమస్యను పంపించిన రామమోహన్ అందవోలు గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. క్రొత్తల పండుగ కొరకై
    దుత్తను బెట్టిన పలలము దొంగిలి తిని; మే
    నత్తకు జెప్పెను మావటి
    "మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్".

    రిప్లయితొలగించండి
  2. పై పద్యం అర్థం కానివారికోసం వివరణ:

    రైతులు పంట నూర్పిళ్ళు జరిగినాక, ఇంటికి తెచ్చే ముందు పొలంలోనే చిన్న పండగ (క్రొత్తలు) చేస్తారు. క్రొత్త బియ్యంతొ పసుపన్నం వండి, మాంసంతొ గ్రామ దేవతకు ముందు నైవేద్యం పెడతారు. ఆ క్రమంలోనే ఒకావిడ నైవెద్యంకోసం మాంసం, అన్నం వండి, ఏదో పని రావడంతో పొలంలోకి వెళ్ళింది. ఈలోపు మావటిగా పని చేసే మేనల్లుడు ఏనుగెక్కి అటుగా వచ్చాడు. మాంసం వాసన చూసేసరికి తినాలనే ఆశ పుట్టి, మొత్తం తినేశాడు. ఇంతలో అత్త రానేవచ్చింది. సమాధానం ఏం చెప్పాలో తెలియని అల్లుడు చివరికి పై విధంగా తిక్క సమాధానం చెప్పాడు!

    రిప్లయితొలగించండి
  3. హరి గారూ,
    చమత్కార భరితమై అలరిస్తున్నది మీ పూరణ. అభినందనలు.
    వివరణ ఇవ్వకున్నా భావం అర్థమౌతున్నది.

    రిప్లయితొలగించండి
  4. 'ఉత్తిత్తి వాడు ' దలపగ
    ఎత్తుల పైయెత్తు వేసి యెగసెను పీవీ
    చిత్తయె గాంధీ కూటమి
    మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్ !

    రిప్లయితొలగించండి
  5. పోతన ఫాంట్ లో ౘ, ౙ వ్రాయచ్చు. కానీ వాటి గుణింతాలు మాత్రం సరిగా రావట్లేదు.
    ౘా , ౙి ఇలా వస్తాయి . మిత్రులెవరికైనా తెలిసి ఉండవచ్చు.

    రిప్లయితొలగించండి
  6. ముత్యమ్ములు గలవని,యను
    నిత్యమ్మును మావటియుననియె ! దన నుడువుల్,
    సత్యమ్మే నని దెలియగ
    మత్తెక్కిన భద్ర గజము మాంసము దినియెన్!!!

    రిప్లయితొలగించండి
  7. అత్తెరగున మృతి నొందెను
    మత్తెక్కిన భద్రగజము; మాంసముఁ దినియెన్
    కత్తులఁ బోలు నఖమ్ముల
    సత్తువఁ ఛిన్నంబు జేసి శార్దూలమ్మున్.

    రిప్లయితొలగించండి
  8. చిత్తును చేయగ వైరుల
    యెత్తున్ కనరాక కేంద్రమెంపిక చేసెన్
    తొత్తగు గవర్నరును కదె
    మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్.

    రిప్లయితొలగించండి
  9. హరి గారి పూరణను నేను ప్రశంసించే లోపలే గురువు గారు ప్రశంసించారు. హరిగారూ చాలా బాగుంది. రవి గారూ, మిస్సన్న గారి సాంకేతికతను మీరు పట్టేసారు. చాలా అందంగా ఉంది. మిస్సన్నగారూ దంచేసారు. ఈ అవినీతి సంద్రములో ఎవ్వరినీ నమ్మలేము.ఉన్నత పదవులకు వెళ్ళాలంటే ఎంత మంది శిరస్సుల మీంచి దాటాలో,ఎంతమంది పాదాలకు శిరస్సు వంచాలో !

    రిప్లయితొలగించండి
  10. సత్తువఁ గలిగిన సూమో,
    చిత్తగు నెవరైన, వాడు చేవకు గజమే,
    బిత్తర పాటునఁ జూచితి
    మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్.

    రిప్లయితొలగించండి
  11. చిత్తుగ త్రాగిన దనుజులు
    మత్తుగ మైమరచి పడిరి మరు భూములపై !
    కుత్తుకలు వ్రేటు పడినచొ
    మత్తెక్కిన భధ్రగజము మాంసముఁ దినియెన్ !

    రిప్లయితొలగించండి
  12. తత్తర పాటును జెందక
    సత్తా గల సింహ మొక్క చప్పున దూకెన్
    యెత్తైన కుంభ తలమున
    మత్తెక్కిన భధ్రగజము మాంసముఁ దినియెన్.

    రిప్లయితొలగించండి
  13. చిత్తము మంత్రుల కెప్పుడు ,
    విత్తము నందే తిరుగును వివరణ లేలా !
    ఉత్తమ ఐరా వతములె ?
    మత్తెక్కిన భద్ర గజము మాంసము దినియెన్!

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    రవి గారూ,
    మిస్సన్న గారూ,
    జిగురు సత్యనారాయణ గారూ,
    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ మీ పూరణలను చదివాను. అందరి పద్యాలూ బాగున్నాయి. అభినందనలు. "వారాంతపు సమస్యా పూరణల" సమీక్ష తోనే పుణ్యకాలం గడచి పోయింది. ఇప్పటికే రెండు గంటలు నెట్ సెంటర్ లో గడిచి పోయింది. బహుశా ఈరోజు మా ఇంటికి నెట్ కనెక్షన్ రావచ్చు. అది వస్తే తీరిగ్గా మీ పూరణలను వ్యాఖ్యానించే సౌలభ్యం ఏర్పడుతుంది. ఇప్పటికి నన్ను మన్నించండి.

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి.
    01)
    ___________________________________

    01)
    వృత్తా కారము దిరుగుచు
    మొత్తుచు మోదుచు గరమున - ముక్కోపమునన్
    చిత్తము చోక్షము దప్పిన
    మత్తెక్కిన భద్ర గజము - మాంసము దినియెన్
    ____________________________________

    రిప్లయితొలగించండి
  16. 02)
    ______________________________________

    చిత్తము వచ్చిన రీతిని
    క్రొత్తగ బన్నులు విధించి - ఘోరము జనులన్
    నెత్తిన నొత్తెడు నృపుడే
    మత్తెక్కిన భద్ర గజము ! - మాంసము దినియెన్ !
    ______________________________________

    (నృపుడు = 5 నెలల్లో 6 సార్లు పెట్రోలు ధర పెంచిన ప్రభుత్వం)
    ______________________________________

    రిప్లయితొలగించండి
  17. వసంత్ కిశోర్ గారూ,
    "లాస్ట్ బట్ నాట్ లీస్ట్" అన్నట్టున్నాయి మీ పూరణలు. ఆలస్యంగా అందినా అలరించాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మత్తేభము శార్దూలము
    సత్తువలో పోలియుండు సవరణ జేయన్
    క్రొత్త కవికి మత్తెక్కగ:
    "మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్"

    రిప్లయితొలగించండి
  19. చిత్తుగ నోట్లను పంచగ
    క్రొత్తది సింహమ్ము వోట్లు కోరుచు నడవిన్
    చెత్తగ మద్యము గ్రోలుచు
    మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్

    రిప్లయితొలగించండి