2, జూన్ 2016, గురువారం

సమస్య - 2052 (శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్”
లేదా...
“శ్రీకృష్ణునిఁ జూచి సీత సిగ్గిలి పాఱెన్”

66 కామెంట్‌లు:

  1. శుభోదయం !

    స్వామిని రుక్మిణి చూడటానికి శ్రీకారం సీత రాముని చూచిన తరుణం అన్న అర్థం లో


    శ్రీకాంతా మణి రుక్మిణీ హృదయ సుశ్రీనాధుడా స్వామి లీ
    లాకారంబును సిగ్గుతోడ గనె ఆ లావణ్య మూర్తీ మణీ
    శ్రీకృష్ణున్; గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్
    శ్రీకారంబది! విష్ణువున్ పురుష సుశ్రీమూర్తిగా జూడగన్ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వహ్వా! శార్దూలాన్ని కూడా చెవులు పట్టి లొంగదీసుకున్నారు. సంతోషం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఆ లావణ్యమూర్తిన్ హరిన్| శ్రీకృష్ణున్...’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. ధన్య వాదాలండీ కంది వారు !

      మీ సవరణ లతో సెహ భేషు !

      మొత్తం మీద రెండు గంటలు పట్టింది వ్రాయటానికి :)

      (शुरू में ऐसा ही होता है , I suppose :)

      మీ ప్రోత్సాహమే పూర్తి బలం ! నెనరస్య నెనరః !

      ఇట్లా మీరు ఓ నెల పాటు శార్దూలాన్ని ఆవిష్కరిస్తే సమయం తగ్గుతుందను కుంటా పూర్తి చేయడానిక్ :)



      చీర్స్
      జిలేబి

      తొలగించండి

  2. శ్రీ కాంతు సతియు నామెయె
    భూకాంతుడు రామమూర్తి పోలిక జూడన్;
    యాకాంత రుక్మిణియె ; మరి
    శ్రీ కృష్ణుని జూచి సీత సిగ్గున పాఱెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...జూడన్+ఆకాంత’ అన్నపుడు యడాగమం రాదు. ‘పోలిక గనగా| నాకాంత...’ అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారూ...మీ ఆరోగ్యం అలా నున్నది....

      తొలగించండి
    3. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నీరసంగా ఉంటున్నది. బ్లాగులో ‘పద్యరచన’ శీర్షిక కనబడినప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడి నయ్యానని అర్థం.

      తొలగించండి
  3. శ్రీకంఠకార్ముకమ్మును
    బ్రాకటముగ విఱిచినట్టి రామున్ హితునిన్
    లోకాతీతపరాక్రము
    శ్రీకృష్ణునిఁ జూచి సీత సిగ్గిలి పాఱెన్. (కృష్ణుఁడు = నల్లనివాఁడు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరుగూడ నల్లని వానిగా శ్రీరామ పరముగ నద్భుతమైన పూరణ నిచ్చారు. చాలా బాగుంది.

      తొలగించండి
    2. ఇబ్బంది లేదండీ. మొల్లరామాయణంలో కూడా ఒకసందర్భంలో రావణుడినోట మొల్ల కృష్ణుడని సంబోధన వినిపిస్తుంది. అక్కడ 'నల్లనివాడు' = శ్రీరాముడు అన్న అర్థం తీసుకోవాలి.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. శ్రీకాకుత్స్థ కులాభి రాముడు జనశ్రేయోభిలాషుండునున్
      రాకాచంద్ర నిభాననుండు విలసద్రాజాంగ సంశోభితున్
      లోకైకారి వరాంతకుండు రఘువీరున్ మేఘవర్ణుం, దను
      శ్రీ, కృష్ణుంగని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్
      [కృష్ణుడు = నల్లని వాడు]

      పరమేశ్వరుని జటాజూటమునుండి గంగా దేవి ప్రవహిస్తున్న సందర్భము:
      నాకప్రపాతమున్ సలి
      లాకరము నుమేశ మూర్ధ రంజిత మతియున్
      కాకోలగ్రీవు, నుత
      శ్రీకృష్ణునిఁ జూచి సీత సిగ్గిలి పాఱెన్
      [సీత = గంగ]

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  5. లోకైక మూర్తి కలలో
    ప్రాకటముగ రుక్మిణి యని ప్రక్కకుఁ జేరన్
    వేకువఁ దన రామునిలో
    శ్రీకృష్ణునిఁ జూచి సీత సిగ్గిలి పాఱెన్!

    రిప్లయితొలగించండి
  6. ఆకాంతరుక్మిణి మురిసె
    శ్రీకృష్ణుని జూచి, సీత సిగ్గిలి పాఱెన్
    రాకాసితాటకినణచి
    ప్రాకటముగ వచ్చినట్టి రాముని జూడన్!!!

    రిప్లయితొలగించండి
  7. శ్రీకృష్ణార్జున,భీమ,కర్ణు డనగా?జేజేలె వేషంబునన్
    ఆకృష్ణుండిట రామ వేషమున వహ్వా యన్నరూపంబునన్
    “శ్రీకృష్ణా|నినుజూడ సిగ్గనుచు విశ్లేషించి మోహంబునన్
    శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడి బాఱెన్ సీత పూదోటలోన్”. {నాటకకంపెనీయందు ప్రేమసన్నివేశము}
    2.ఆకృతిలోరాముండే
    శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పాఱెన్
    సాకృతి గూర్చిన ప్రేమే
    ఆకృతి లాహనుమయెదనునగుపించె గదా| {శ్రీకృష్ణార్జునయుద్దమున హనుమయెదలోరాముడు కృష్ణుడుఒక్కరే అన్నసత్యముతోసీతరుక్మిణి నొక్కరేఅన్నభావన}

    రిప్లయితొలగించండి
  8. శ్రీ కర రూపము గలయా
    శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పాఱె న్
    రాకా చంద్రుని బోలిన
    యా కృష్ణుడె తనదు భర్త యనుకొని మదిలోన్

    రిప్లయితొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    శ్రీకృష్ణు౦ డధిక౦బుగా వలచె నా " సీతాఖ్య "

    . యైనట్టి గో

    పీ కా౦తన్ | గత జన్మ బ౦ధ మెపుడున్

    . విస్పష్టమౌ ! మాయునే ?

    శ్రీకృష్ణు౦ గని సిగ్గు తోడ వడి బారెన్ సీత ,

    . పూ దోట లో

    నే - కౌతూ హల మార నాత డటు

    . యత్ని౦పన్ రసక్రీడకున్

    { సీత + ఆఖ్య = సీత యను పేరు గల స్త్రీ .
    రసక్రీడ = రాస క్రీడ . }

    రిప్లయితొలగించండి
  10. ఆ కృష్ణ వర్ణుడంతట
    శ్రీకంఠుని చాపమెత్తి ఛేదింపగనే
    యా కమలాక్షుని సద్గుణ
    శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పాఱెన్

    రిప్లయితొలగించండి
  11. ప్రాకారంబుల దాటి వచ్చె నడవిన్ గాధేయువెన్వెంటగా
    శ్రీకారంబిడె మర్దనంబు దరివచ్చే తాటకిన్ జంపుచున్
    ప్రాకాశ్యంబును జేసి విల్లు విరిచెన్ ప్రాజ్యంపు ఘోషంబునన్
    శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్

    గురుగుగారూ, కృష్ణుడు అంటే నల్లనివాడు అని మిమ్మల్నే అనుసరించాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వచ్చే’ అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. ప్రాకారంబుల దాటి వచ్చె నడవిన్ గాధేయువెన్వెంటగా
      శ్రీకారంబిడె మర్దనంబు చనుదెంచే తాటకిన్ జంపుచున్
      ప్రాకాశ్యంబును జేసి విల్లు విరిచెన్ ప్రాజ్యంపు ఘోషంబునన్
      శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్

      గురువుగారూ, ధన్యవాదములు. సవరించాను.

      తొలగించండి
  12. చక్రిన్ దల్చుచు నిద్రకేగ కలగాంచన్ జూచె నోయింతి యా
    శ్రీకృష్ణున్ ; గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ ; సీత పూఁదోటలోన్
    వక్రించెన్ దన జీవితమ్మనుచు సంభావించి యేకాకియై
    యాక్రందించుట కేగినంతట కవల్లానంద మందించరే !

    విక్రమ మడగెను రుక్మికి
    శ్రీకృష్ణునిఁ జూచి ; సీత సిగ్గిలి పాఱెన్
    సక్రమముగ విలుగదిపి ప
    రాక్రమమును జూపినంత రాముడు సభలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      సంయుతాసంయుత ప్రాస వేశారు. సాధ్యమైనంతవరకు ఇటువంటి విశేషప్రాసల జోలికి పోకుంటే మంచిది.

      తొలగించండి
  13. శ్రీకాంతురూపులెన్నియొ
    యేకాంతకునెట్లు దలప నీప్సితమట్లే
    భూకాంతరాము దలచుచు
    శ్రీకృష్ణుని జూచి సీతసిగ్గిలి పాఱెన్.

    రిప్లయితొలగించండి
  14. ఏకాంతవిహారమునకు
    రాకాంతాయనుచు బావ రమ్మని బిలువన్
    రాకాశశి యుండెననుచు
    శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పాఱెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ యీ పూరణను ముందే చూసి ఉంటే క్రింది పూరణ చేయకపోయేవాణ్ణి.

      తొలగించండి
  15. ఆ కంసుడు భీతిల్లెను
    శ్రీకృష్ణుని జూచి. సీత సిగ్గిలి పాఱెన్
    శ్రీకంఠ చాప ఖండన
    రాకేoదు యశో విశాలు రాముని జూడన్

    రిప్లయితొలగించండి
  16. ఆకారంబది మార్పుగాని కనినన్నర్చావతారుండుగా
    శ్రీకారంబుననిల్చియుండు జగతిన్ శ్రీవేదసంకాశుడై
    రాకాచంద్రునిబోలు రామవిభునిన్ రమ్యాతి రమ్యంబుగా
    శ్రీకృష్ణుంగని సిగ్గు తోడ వడిబాఱెన్ సీత పూదోటలోన్

    రిప్లయితొలగించండి
  17. శ్రీ కృష్ణునున్గ ని సిగ్గుతోడ వడి బాఱెన్సీ త పూదోట లోన్
    రాకాచంద్రుని బోలు గృష్ణు గని యా రాముండు నా భావనన్
    లౌక్యంబు న్నిసుమంత లేక తనుగా లోలాయ మా నంబునై
    నాకారంబును జూచి యామె యపుడ ట్లున్జే సెన్గదా మరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      చివరిపాదంలో గణదోషం, యతి దోషం. సవరించండి.

      తొలగించండి
  18. నాకీతండు వరాల బావ యని కృష్ణారావుఁ దా నెంచియున్
    రాకాపూర్ణసుధాకరానన కడున్ రమ్యమ్ముగా నెచ్చెలుల్
    జేరన్ కేళుల దేలియాడు తఱి వచ్చెన్ మన్మథాకారుఁడై
    శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కాబోయే వధువంతరంగములోని మధుర భావాన్ని నావిష్కరించుచున్న పూరణ యద్భుతముగా నున్నది. "వరాల నాధుడని" యనిన నెట్లుండును? వరసకి బావలుండవచ్చుగద. నాధుడొక్కడే.
      మూడవ పాదములో ప్రాస మర్చిపోయారు.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు. ‘వరాల నాథు’ డన్న మీ సవరణ బాగుంది.
      మూడవపాదంలో ప్రాసను నేను గమనించలేదు. మన్నించండి. సవరిస్తాను.

      తొలగించండి
    3. సవరించిన నా పూరణ....

      నాకీతండు వరాల నాథుఁ డని కృష్ణారావుఁ దా నెంచియున్
      రాకాపూర్ణసుధాకరానన కడున్ రమ్యస్థలం బంచుఁ దా
      నేకాంతంబునఁ జేరి సంతసిలఁగా నేతెంచె నచ్చోట నా
      శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా సవరణ నామోదించిన మీ సహృదయమునకు జోహార్లు. మన్నించండన్న మాట మీరనకూడదు మేము వినకూడదు.
      మీ సవరణ చాలా బాగుంది. కానీ చెలికత్తెలతో గూడి యాడుతుండగ నన్న మీ మొదటి మనోహర సన్నివేశము ప్రాస గురించి పోగొట్టుకున్నాము. మీ మూడవ పాదమునకు నా యీ సవరణ ను పరిశీలించ గోర్తాను.

      నాకీతండు వరాల నాధుడని కృష్ణారావుఁ దా నెంచియున్
      రాకాపూర్ణసుధాకరానన కడున్ రమ్యమ్ముగా నెచ్చెలుల్
      వే కన్యామణు లంద రాడు తఱిఁ దా విచ్చేయ మారున్ వలెన్
      శ్రీకృష్ణుం గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్.

      తొలగించండి
  19. నాకున్ జూడగ నంతు పట్టదు గదా నాతండ్రి యీరీతి నా
    శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్
    యాకౌసల్యా వరపుత్రుడౌ రఘువరు౦ డౌ రాముడే యంచు నా
    వీకన్ చీకటిలోన తత్తరపడన్ వీరంగ రంగ స్థలిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పూఁదోటలోన్+ఆ కౌసల్య..’ అన్నపుడు యడాగమం రాదు. ‘పూఁదోటలో| నాకౌసల్యా...’ అనండి. ‘వీడంగ’.. ‘వీరంగ’ అయినట్టుంది.

      తొలగించండి
  20. శ్రీకంఠున్ ధనుసెక్కుపెట్టి తరుణిన్ స్వీకారమొందంగనా
    ప్రాకారమ్మును దాటివచ్చు ఘనుడౌ రాముండనే గాంచి యా
    లోకాలేలెడు నీలవర్ణుడిట భూలోకమ్మునే జేరెనో
    శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడి బాఱెన్ సీత పూదోటలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ధను వెక్కుపెట్టి’ అనండి.

      తొలగించండి
  21. ఆ కృష్ణు బోలు నల్లని
    రాకేషును సీత వలచె రంజిలుచుండన్!
    చేకొని మనువాడెడు తన
    శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పాఱెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      ‘రాకేశును’ అనండి. (రాకేష్, రమేష్, సురేష్... అని వ్రాస్తుంటారు కాని అవి రాకేశ్, రమేశ్, సురేశ్.. అని వ్రాయాలి)

      తొలగించండి
  22. గోకులములోన ముదమున
    రాకాచంద్రుని వెలుగున రాధను కూడన్
    తాకుచు తా పాదములను
    శ్రీకృష్ణునిఁజూచి సీత సిగ్గిలి పాఱెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకీ పారిపోయిన సీత ఎవరు? ఒక గోపస్త్రీయా?

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. సీత అంటే గంగ అనే అర్థంతో వ్రాశాను. విష్ణువు పాదములనుండి గంగ పారుతుందు కదా ? పారే గంగ కృష్ణుని లీలలను జూసి సిగ్గుపడిందని

      తొలగించండి
  23. గురుదేవుల సూచనమేరకు సవరించిన పద్యము
    నాకున్ జూడగ నంతు పట్టదు గదా నాతండ్రి యీరీతి నా
    శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలో
    నా కౌసల్యా వరపుత్రుడౌ రఘువరు౦ డౌ రాముడే యంచు నా
    వీకన్ చీకటిలోన తత్తరపడన్ వీడ౦గ రంగ స్థలిన్

    రిప్లయితొలగించండి
  24. ఆకృతి నీవని వలచితి
    నీకృపచే యాదరించ నిన్నేగొలువన్
    సుకృతి తనదని పొంగుచు
    శ్రీకృష్ణునిఁ జూచి సీత సిగ్గిలి పాఱెన్
    ---------------------
    అమ్మో నావల్లగాదు

    రిప్లయితొలగించండి
  25. శా . శ్రీకాంతున్ పతిసేయమన్న వలదీజిష్ణుండుఫోలోనికిన్
    నీకాఛేడినృపుండెదిక్కనియనన్, నిన్నేమనంబెంచితిన్
    నీకైవేచితిశౌరియీశ్వరికృపన్చేగొన్మ యన్వేడ యా
    శ్రీ, కృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్.

    గమనిక. ఇక్కడ శ్రీ అంతే లక్ష్మి లేదా రుక్మిణి యని సీత యనగా చల్లని అని వాడడం జరిగినది అంటే ఆ లక్ష్మి దేవి కృష్ణుని గాంచి చల్లని పూదోటలో పరుగిడింది అని భావన.

    రిప్లయితొలగించండి
  26. గురువర్యులకు నమస్సులు. సీత అంటే గంగ అనే అర్థంతో వ్రాశాను. విష్ణువు పాదములనుండి గంగ పారుతుందు కదా ? పారే గంగ కృష్ణుని లీలలను జూసి సిగ్గుపడిందని

    రిప్లయితొలగించండి
  27. అక్రూరుడు సంబర పడె
    శ్రీకృష్ణుని జూచి సీత సిగ్గిలి పారెన్
    కోకను చేతను చుట్టుచు
    రాకాశశి వోలె వెలుగు రాముని గనుచున్.

    రిప్లయితొలగించండి
  28. ఏకాంతమున సతి పలికె
    శ్రీకృష్ణుని జూచి:సీత సిగ్గిలి పారెన్
    యాకౌసల్యాత్మజుడగు
    యాకాకుత్స వరుని గని హర్షము తోడన్/హర్షంబొదవన్

    రిప్లయితొలగించండి

  29. ఆకాననమున గోపక
    మూకాభినయమ్ము "రామమూర్తీ సీతల్ "
    మ్రాకునచాటుకు రమ్మను
    శ్రీకృష్ణుని జూచి 'సీత' సిగ్గిలి పాఱెన్.

    రిప్లయితొలగించండి
  30. బాకాలూదుచు స్వాగతం పలికెదన్ బంగాలు రక్షించుమో!
    కాకా పట్టెద సీబియైను నిక చీకాకున్ను తప్పించనిన్
    మోకాల్ నొప్పులు సైచుచున్ మమత శ్రీమోడిన్ గనెన్నివ్విధిన్:👇
    శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్ :)

    రిప్లయితొలగించండి