12, డిసెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2544 (రమ్ముఁ గ్రోల జబ్బు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి"
(లేదా...)
"రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్"
(శారదా విజయోల్లాసం వారికి ధన్యవాదాలతో...)

124 కామెంట్‌లు:

  1. ఎరుక లేకపోయి ఎన్నెన్నొ బాధల
    బడగ నేలనోయి పద్మరావ?
    ఒక్కమాట వినుము;ఉసిరికరస మిదిగొ;
    రమ్ము గ్రోల;జబ్బు రాదు దరికి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. 'వినుము+ఉసిరిక' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. 'రమ్మున్' అని సమస్య భావం. "ఒక్కమాటను విను ముసిరి రసపు సా।రమ్ముఁ గ్రోల..." అందామా?

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. బాపూజీ గారికి నమస్సులు. ఇచ్చిన సమస్య “రమ్ముఁ” మీరు రమ్ము అని పిలుపు రూపమున ప్రయోగించారు. ద్రుతం తీసి రమ్ము గా వ్రాయవచ్చునా తెలుప మనవి.

      తొలగించండి
  3. వమ్ము మందులన్ని వ్యర్ధమ్ము వినుమయ్య!
    సొమ్ము ఖర్చు తక్క సున్న ఫలము
    నమ్మకమ్ము తోడ నల్లని గోవు మూ
    త్రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి!

    ప్రాస :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారికి నమస్సులు. సంధివశాత్తు కలిసిన ర కారం చెల్లును కాని పద మధ్యస్థ రకారముతో పూరణ చేయవచ్చునా! తెలుప మనవి.

      తొలగించండి
    2. 🙏🙏🙏

      అయ్యా! నాకేమియును తెలియదు. ఏదో వ్రాసితిని. గురువు గారు స్పందిస్తారుగా!

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      ప్రాసతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      *****
      బాల సుబ్రహ్మణ్యం గారూ,
      అవధానాలలో అటువంటి పూరణలు చేసిన దాఖలాలున్నవి. (రాముడు రంభ గూడె - సుత్రాముడు రంభ గూడె..., చినవాడా - కూల్చినవాడా).

      తొలగించండి
  4. పోత పాలు బోసి పోషింప పిల్లల
    పుష్టి కలుగ దోయి పూర్తి గాను
    పాప లెపుడు మిగుల పాలను దల్లియు
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      తల్లిపాలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పాలు వోసి/ పాలఁ బోసి' అనడం సాధువు.

      తొలగించండి
  5. ఎవరు జెప్ప నేఱ రెలనీటి మహిమను
    మధుర మైన నీరు మనసు దోచు
    ఔషదీయ గుణము లన్ని గలుగునుగా
    "రమ్ము ! గ్రోల జబ్బు రాదు దరికి"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గుణములన్ని గలుగును నీ।రమ్ముఁ గ్రోల..." అనండి.

      తొలగించండి

  6. "రమ్ము ! క్రోల జబ్బు రాదు దరికి" అనియన వచ్చునా?
    కానిచో మరో పూరణ కొఱకు ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ నమస్సులు. నాకు తెలిసి వ్రాయరాదండి. మనల్ని test చేయడానికే సమ్స్య ఇస్తారు. ఇమ్దులో litigation ఏమిటంతే “రమ్మున్ అంటే గణం కుదరదు కనుక “రమ్ముఁ” అని వ్రాస్తాము. రమ్మున్ కి రమ్ము కి చాల తేడా ఉందిగా. ఆ అరసున్న లేకపోతే ఇది సమస్యే కాదు. కనుక మరొకటి వ్రాయండి “రమ్ముఁ” అని ఉండేలా.

      తొలగించండి
    2. తోపెల్ల వారూ,
      సమయోచిత వివరణకు ధన్యవాదాలు!

      తొలగించండి
  7. కాంతులీను చర్మ మంతటన్ పూసినన్
    గట్టిపడును పళ్ళు ఘనము బూయ
    స్వానుభవముఁ బొంది చాటె మొరార్జి “మూ
    త్రమ్ము గ్రోల జబ్బు రాదు దరికి” ౹౹

    రిప్లయితొలగించండి
  8. పాలు పెరుగు నేయి పంచితమును పేడ
    పంచ గవ్యమనగ వాసికెక్కె|
    కలత యేల? టీలు కాఫీలు వీడి క్షీ
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిగురు సత్యనారాయణ గారూ,
      చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
      ఈ పూరణ చెప్పింది జిగురు సత్యనారాయణ గారా? మంతెన సత్యనారాయణ గారా? అన్న అనుమానం వచ్చింది సుమా!

      తొలగించండి
  9. తుమ్ముల్ వచ్చిన మాత్ర| దగ్గుకును సూదుల్ గ్రుచ్చి హింసింపరే|
    కమ్మంగాఁ దిన తేన్పు రాగ యలుగుల్ కాయంబునన్ దింపరే|
    వమ్మౌనే పెదవారి పల్కు| తులసీపర్ణంబులం దెచ్చి సా
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్||

    రిప్లయితొలగించండి


  10. కమ్మనిది పదపడి కాగబెట్టిన కారు,
    రమ్ముఁ, గ్రోల జబ్బు రాదు దరికి,
    నమ్మ దగు జిలేబి నాటి పెద్దల మాట
    లమ్మ పట్టు గొమ్మ లవియె ససికి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌👌👌

      ఇకపై మీ పద్యాలతో పాటు టీకా, తాత్పర్యం, ప్రతిపదార్ధం, దండాన్వయం వగైరాలు ఇవ్వండోయ్! ప్లీజ్ !!! నాకోసం...

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కారురమ్ము'...?

      తొలగించండి

    3. జీపీయెస్ వారికి కంది వారికి


      కారు - కషాయము - ఒగరు గలది

      రమ్ము - రమ్మా !

      తొలగించండి
    4. ముసిలి వాడను... మాటి మాటికీ ఆంధ్రభారతి విప్పలేను. మాకు కఠినమైనవి, మీ పూరణలకు ప్రత్యేకమైనవి, ఒకటో రెండో, మూడో పదాలకు అర్ధాలు మీరే సూచిస్తే బాగుంటుంది కదా! మున్ముందు శంకరాభరణం బ్లాగు లోని అన్ని పూర్వ పుటలూ చదువబోయే నాలాటి ఔత్సాహికులకు కూడా తేలిక అవుతుంది. మీ పద్య కుసుమాల ఉద్యానవనమునకు ప్రవేశ రుసుముతో మీరే కంచె వేయడం ఎందుకండీ?

      ప్లీఈఈఈజ్!

      తొలగించండి


    5. చోద్యంబగు పదములకు
      న్నద్యతనీయ పదములకు నర్థము తెలుపన్ :)
      పద్య కుసుమమ్ము లకు మీ
      వుద్యానవనమున కేల రుసుము జిలేబీ :)

      నమో నమః :)

      జిలేబి

      తొలగించండి
    6. నిజమే జిలేబిగారూ! మీ పద్యాలలో తెలుగు కొత్తపోకడలు పోతున్నది!ఋవివరణ తప్పక అవసరమే!

      తొలగించండి

    7. నమో నమః సీతాదేవి గారు

      జిలేబి

      తొలగించండి


  11. నిమ్మాటాయిగ దీర్చునోయి మన మేనిన్ తీరుగా గాచుచున్,
    నమ్మమ్మా మన భారతీయ ససి వైనమ్ముల్, నిదానమ్ములన్ ,
    బామ్మల్నేర్పిన యింటివైద్యము జిలేబమ్మా కషాయమ్ము ! సా
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిమ్మాటాయిగ... భారతీయ ససి...'?

      తొలగించండి


    2. కంది వారు నమో నమః !


      నిమ్మాటాయి - గట్టి శరీరము గలవాడు

      ససి - ఆరోగ్యము

      ఆంధ్రభారతి ఉవాచ

      సరియేనా ?

      జిలేబి

      తొలగించండి
  12. సార హీనమంచు సంసార జలధిలో
    మునిగి కుందనేల మోక్షద మయి
    రమ్య కావ్యమైన రామవృత్తాంతసా
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి.

    నమ్మం జెల్లును సారహీనమనుచున్ నానాప్రకారంబుగా
    నమ్మో! దుస్తర మెట్టులో యని భువిన్ హర్షంబు కోల్పోవుచున్
    వమ్ముంజేయగనేల జన్మము సదా వాల్మీకి సత్కావ్యసా
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. నిత్య జీవితమ్ము నియమాను సారమై
    ధ్యాన విద్య నెఱిగి మౌని వలెను
    తనువు పులకరించ దైవ నామఁపు మధు
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి


    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    తనువు బిగువు దగ్గునని చంటిబిడ్డకు
    పాలు గుడుపఁ జింత యేల ! తరుణి !
    నిజము శిశువులకును నిజమాతృ దుగ్ధ సా...
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిమ్మెన్ శ్రీహరిపాదజన్యమగుచున్ , చేరెన్ మహేశున్ , పవి
      త్రమ్మై శీతనగమ్మునన్ దుమికి పారన్ జేరె ధాత్రీస్థలిన్ !
      క్రమ్మన్ దైవికశక్తి దేహము పయిన్ రక్షించు , గాంగేయ నీ...
      రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్ !


      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. క్రమం తప్పకుండా మదీయ పద్యములను బ్లాగులో ప్రకటించి సాహాయ్యమందించుచున్న శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి నమోవాకములు........ మురళీకృష్ణ

      తొలగించండి
    3. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. (అందుకే కదా శాస్త్రి గారు ఇక్కడ క్రమం తప్పకుండా ప్రకటిస్తున్నారు). అభినందనలు.
      రెండవ పూరణ 'ఆకాశంబుననుండి శంభునిశిరం బందుండి..' పద్యాన్ని గుర్తు చేసింది.

      తొలగించండి
  15. తల్లి పాలె మిగుల దారుడ్ య మును బెంచు
    న నె డు మాట నం ద రా ద రించి
    పోత పాలు మాని పుష్టి కై బిడ్డ క్షీ
    రమ్ము గ్రోలజబ్బు రాదు దరి కి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దారుడ్యము' అన్న పద్యం లేదు. అక్కడ "దార్ఢ్యమ్మునే పెంచు" అందామా?

      తొలగించండి
  16. విస్కి సేవనమ్ము వేదనల్దీర్చును,
    రమ్ము గ్రోల జబ్బు రాదు దరికి,
    దమ్ము తోడను కవనమ్ము వచ్చు,రమణీ!
    యనుచు త్రాగు బోతు యనెముదమున

    త్రాగుడు వలదు అన్న భార్య మాటలకు అర్ధము చెప్పు చున్న త్రాగుబోతు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'త్రాగుబోతు+అనె' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "త్రాగుబోతె యనె..." అనండి.

      తొలగించండి
  17. విష్ణు పాదయుగళివిమలముగాఁబుట్టి
    శంభు శిరమునెక్కి జలధిదూకు
    గంగ నీరు ధీర గంభీర మధుర పూ
    రమ్ముఁగ్రోల జబ్బు రాదు దరికి

    రిప్లయితొలగించండి
  18. చలికి వణకుచున్న సయచిన్ను సైనికా!
    ఓల్డు మాంకు మిన్న గోల్డు కన్న
    త్రిబులు ఎక్సు తులసి తీర్ధమ్ము నమ్ముమా!
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి!

    సయచిన్ను = Siachin Glacier
    ఓల్డు మాంకు = Old Monk Brand
    త్రిబులు ఎక్సు = XXX Brand



    మైలవరపు వారి సవరణతో


    🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      త్రిబులెక్స్ రమ్ముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  19. సవరణతో :
    ఎవరు జెప్ప నేఱ రెలనీటి మహిమను
    మధుర మైన నీరు మనసు దోచు
    కల్ల గాదు నిజమెగా !యీసుధా మధు
    "రమ్ము గ్రోల జబ్బు రాదు దరికి"

    రిప్లయితొలగించండి
  20. గాలి నీరు నేల కలుషితమ్మైపోయె
    పట్టణాలలోన,పల్లెలందు
    చెఱువు లన్ని నిండి చెలిమలోనీరూరె
    రమ్ము ,గ్రోల జబ్బురాదుదరికి !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చెలిమల నూరు నీ।రమ్ముఁ గ్రోల..." అంటే బాగుంటుంది. రమ్ము తరువాత అరసున్నా ఉన్నది కనుక దానిని రమ్మని పిలిచే అర్థంలో స్వీకరించరాదు.

      తొలగించండి
  21. అరయ భూమిజనుల కందరికి నెపుడైన
    జబ్బుగల్గు నదియె జగతినీతి
    నిబ్బరంబుగల్గ నిగమాంత వాక్యసా
    రమ్ముగ్రోల జబ్బురాదు దరికి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర గణదోషం. "జనుల కందర కెపుడైన" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! సవరిస్తాను!

      తొలగించండి


  22. ఇమ్ము గన్ జపమ్ము యీశుని యక్షస
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి,
    వమ్ము కాని దమ్మ వరమగు నమనము
    సొమ్ము లవియె మనకు సొబగు గూడ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. కొమ్మా యిమ్మొక ముద్దు నీవు కసరన్కోల్పోదునానందమున్
    నెమ్మోమున్ యిటు తిప్పరాదొకొ చెలీ నీరేజపత్రేక్షణీ
    రమ్మా చెంతకుచేరుమా వలపు నేరమ్మా చూడగన్ బ్రేమసా
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మోమున్+ఇటు' అన్నపుడు యడాగమం రాదు. "నెమ్మోము న్నిటు/ నెమ్మోమీ దెస ద్రిప్ప" అనండి. మూడవ పాదంలో గణదోషం. "నేరమ్మా గనన్ బ్రేమసా..." అనండి.

      తొలగించండి
  24. మధుర మధుర మైన మన మాతృభాషయే
    తీపిదనము నిచ్చు తేనెయూట
    తనర నెల్లవారు తల్లిభాషల తుషా
    రమ్ముగ్రోల జబ్బురాదు దరికి!

    రిప్లయితొలగించండి
  25. ప్రతిభ పెంచి మెదడు పదను పెట్టు నిదియె
    జీర్ణ శక్తి కెపుడు సిరుల గూర్చు
    వృద్ధులైన గాని పిన్నలైన నిట క్షీ
    రమ్ము గ్రోల జబ్బు రాదు దరికి!

    గురువర్యులకు నమస్సులు. నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.

    ఎన్నగ చీకటి రేయిని
    వన్నెల దీపాల కాంతి వర్ధిల జేయన్
    కన్నులు మిఱుమిట్లు గొనగ
    పున్నమి దినమయ్యెను! శశి పొడగట్టడుగా!

    క్రమ్మగ నాంగ్లపు మోహము
    కమ్మని తెలుగు విడ నేడు గౌరవ మనగన్
    మమ్మిని జేయుచు తల్లిని
    యమ్మా యని పిలువని సుతుడతి పూజ్యుడగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ అన్ని పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పదను' అంటే తడి. అక్కడ 'పదును' అనండి.

      తొలగించండి
    2. క్షమించాలి. పదను, పదును రెండింటికీ తడి, వాడి అన్న అర్థాలున్నవి.

      తొలగించండి
  26. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: *బిడ్డ తల్లికి చేసే హితోపదేశం.*

    అమ్మా! ఈర్ష్యను అసూయను ద్వేషాన్ని పెంచుతూ కుట్రలను నేర్పే టీవీ సీరియల్స్ ని నీవు ఇమ్ము (ఇంపుగా ఉంది) అని అనుకొంటూ ప్రతిరోజూ చూస్తూ ఉన్నావు. అందువలన నీకు హైబీపీ వస్తూ ఉంది. గుండెపోటు కూడా వస్తూ ఉంది. ఇలాగే చూస్తూ ఉంటే నీ జీవితం వమ్ము (నాశనం) ఐపోతుంది. కాబట్టి భక్తిని బోధించే కార్యక్రమాలుండే టీవీ కార్యక్రమాలను మాత్రమే కోరుకొని మరీ చూడు. అలా చూస్తే వేద సా *రమ్ము* ను గ్రోలి నట్లవుతుంది. ఇక నీ దగ్గరకు ఏ రోగాలూ రావు. నీవు ఆరోగ్యంతో వర్ధిల్లుతావు. అని బిడ్డ తల్లికి హితోపదేశం చేసే సందర్భం.

    అమ్మా! వచ్చును గుండెపోటు, కలుగున్ హై బీపి నిత్యమ్ము, నీ
    విమ్మంచున్, పలు కుట్రలన్ దెలుపు టీవీ సీరియల్ జూచినన్,
    వమ్మై పోదువు ; భక్తి బోధకములన్ వాంఛన్ గనన్, వేద సా
    *రమ్మున్ గ్రోలిన , రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్.*

    కోట రాజశేఖర్ నెల్లూరు

    రిప్లయితొలగించండి
  27. అమ్మాగంగమతల్లినిన్నుమదినారాదింతుముప్పొద్దులన్
    మమ్ముంబ్రోవగశంభునిన్విడిచిహేమాద్రీనివాసంబుగా
    చిమ్మెన్ నీజలధారజేయభువినేశ్రీమంతమున్ నీదు సా
    రమ్ముంగ్రోలినరావురోగములికన్
    రాజిల్లునారోగ్యమున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "మది నే నర్చింతు ముప్పొద్దులన్" అనండి. అలాగే "హేమాద్రిన్ నివాసంబుగా" అనండి.

      తొలగించండి
  28. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    అ౦దరు రమ్ము త్రాగాలని నేను హితోపదేశము నిస్తున్నాను .
    --------------------------------------------------------------------------------

    అయితే , అమ్మ తోడు ! నేను అసలు ముట్టను .
    ------------------------------------------------------------------

    రమ్ము౦ గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యము + ఆ

    రమ్ము౦ బాపుచు శా౦తము న్నొసగి బుర్రన్ శుధ్ధి గావి౦చు | గా

    రమ్ము౦ , బెద్దరికమ్ము గల్లి కడు మర్యాదస్థడౌ | క్లబ్బు లో

    రమ్ము౦ గ్రోలుచు ముద్దుగుమ్మల బరీర౦భమ్ము న౦దు౦చి , యా

    రమ్ము౦ జవి జూచుచున్ గరుగు సౌలభ్య౦బు లభ్య౦బగున్ |

    రమ్ము౦ ద్రాగెడు నట్టి సజ్జనులు - పౌరశ్రేష్ఠులే ద్రవ్య భా

    రమ్ము౦ బాపుదు రా ప్రభుత్వమునకున్ లాభాలు చేకూర్చి | యా

    రమ్ము౦ గ్రోలని వాని జీవితము వ్యర్థ౦బౌ గదా మిత్రమా !

    రమ్ము౦ ద్రావిన ని౦టికిన్ జనక , భార్యన్ వీడి స౦సార భా

    రమ్ము౦ దప్పుకొన౦గ వచ్చు , సుఖుడై - ర౦జిల్లగా వచ్చు | వై


    రమ్ము౦ గల్గిన వ్యక్తి c జూడగనె దూరన్ వచ్చు పెన్ బూతులన్ |

    రమ్ము౦ ద్రాగుచు గూడు మెక్కక మిగుల్చన్ వచ్చు ధాన్య౦బికన్ |

    రమ్ము౦ గ్రోలిన తూలి ప౦ది వలె పొర్లన్ వచ్చు దా రొ౦పిలో |

    రమ్ము౦ ద్రావిన లోకమున్ విడిచి స్వర్గ౦ బేగ వచ్చున్ ద్వరన్ |

    రమ్ము౦ ద్రాగిన బొ౦దవచ్చును సహస్ర౦బైన లాభమ్ములన్ |

    రమ్ము౦ ద్రాగని వాని జీవితము వ్యర్థ౦ బౌ గదా మిత్రమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ శార్దూలమాలికా రూపమైన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ఐదవ పాదంలో గణదోషం. "రమ్ముం దా జవి జూచుచున్..." అనండి.

      తొలగించండి
  29. తండ్రి కొడుకుకు సుందరాకాండ పారాయణము గూర్చి చెప్పుట

    శుభము నిడును మనకు సుందరాకాండ పా
    రాయణమ్ము, బ్రహ్మ రసపు సమము,
    మాస రమ్ము, కలికి, మంజువు ,బహు సుంద
    రమ్ము, గ్రోల జబ్బు రాదు దరికి,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బ్రహ్మరససమమ్ము' అంటే వినసొంపుగా ఉంటుంది.

      తొలగించండి
  30. చింత యేల నీకుఁ జెప్పిరి మన పూర్వు
    లెల్ల మంచి మందు నివ్వసుధను
    హాయి నిచ్చు భృశము నష్టాంగ వేద సా
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి


    నమ్మంజాలరు మానవాధికులు విన్నానుల్ వచింపంగ దో
    షమ్మీ శాస్త్రము నర్ధ హీనము సుమీ చాలంచు రోషిల్లి వే
    దమ్మే సుమ్మిది ధాత్రి నందు మిరియాల్ దట్టించి పానమ్ము తో
    రమ్ముం గ్రోలిన రావు రోగము లిఁకన్ రాజిల్లు నారోగ్యమున్

    రిప్లయితొలగించండి
  31. .కవులుజెప్పకున్న?కారుకూతలు విని
    రమ్ము గ్రోల జబ్బురాదు దరికి
    యన్న వైద్యులెవరు?నారోగ్యమన్నది
    వారినడవడికన దారిజూపు|
    2.ఆలిని విడచివెలయాలి పొందునసుఖ
    మనుచు వ్యసనమందు మనుగడందు
    రమ్ము గ్రోల జబ్బురాదు దరికియన?
    సుఖము లందె జబ్బు శోకమిడును|
    .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'దరికి నన్న వైద్యులెవ్వ రారోగ్యమన్నది... దరికి నన' అనండి.

      తొలగించండి
  32. తల్లి ,దండ్రి,గురువు, దైవమ్ము తానయై
    సంస్కరించు జదువ సకలజనుల
    భువిని గిరిధరుండు బోధించు గీత సా
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి!!!

    రిప్లయితొలగించండి
  33. గు రు వు గా రి పా ద ప ద్మ ము ల కు న మ స్కృ తు లు . మ రి యు

    ధ న్య వా ద ము లు .

    రిప్లయితొలగించండి
  34. పొమ్మన్నన్ మరి యేమి చెప్పుదును బాబూ పెద్దలే చెప్ప భ
    ర్మమ్ము న్నౌషధ మందు భస్మముగ జేర్చన్ మేలగున్ సత్యమే

    నమ్మంగా దగు నీదు రుగ్మతకు నెన్నన్ మందుతో గూడు చం
    ద్రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్.

    రిప్లయితొలగించండి
  35. తల్లిగర్భమందునుల్లసముగ పెర్గి
    పదినెలలసమయము పదిలముగను
    భువినిఁ బుట్టినట్టి బుడతడు తల్లి క్షీ
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  36. పాలసంద్రము జిలుక ప్రభవించి నట్టి య
    మృతము కంటె మించు మేటి మందు
    సర్వరోగములకు సంజీవిరా యిది,
    రమ్ము,గ్రోల జబ్బు రాదు దరికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ 'రమ్ము' ఏ అర్థంతో ప్రయోగించారు?

      తొలగించండి
    2. గురుదేవులకు వందనములు 'రమ్ము'పదమును నామవాచకముగాను,
      క్రియ గాను ఉపయోగించాను. అన్వయముకుదురుతుందని నాభావన.

      తొలగించండి
  37. *అమ్మా! పుట్టిన వెంటనే శిశువుకైయాహార మందింపుమా*
    *రొమ్ముల్నిండినముఱ్ఱుపాలనటులాలోచింపకన్ శీఘ్రమై*
    *క్రమ్మన్ వ్యాథులనాపగాగలుగుచున్ రక్షించు నీ తల్లి క్షీ*

    *"రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్"*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  38. సమ్మోహంబును వీడి భక్తి పరుడై సంసార మందుండియున్
    సమ్మోదంబున సంవిధాన గరిమన్ శాస్త్రంబుఁ బాటించి ధ్యా
    నమ్ముం జేయుచు శంభు గొల్చి యిలలో నైవేద్యమర్పించి క్షీ
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్

    రిప్లయితొలగించండి


  39. 1పనికి రాని యట్టి పలుమాట లవియేల

    భక్తి తోడ కొలువ ముక్తి దొరకు

    ననెడి మాటనమ్మి యచ్యుతు కథలసా

    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి.


    2.ముక్తి కోరి జనులు ముక్కు మూసుకొనుచు

    తపము చేయు చుంద్రు ధరణి యందు

    ఇంటియొద్ద నుండి నింపుగ గీతసా

    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి.


    3.భాగవతము చదువ బాధలు తొలగును

    భక్తి ముక్తి కలుగు వసుధ యందు

    ననెడి మాట నమ్మి నలయకుండనిరంత

    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి.


    .4.రుజలు వచ్చెనంచు రుసరుసలవియేల

    మూడపూటలందు ముచ్చటగను

    మంచి బలమునిచ్చు మకరంద మిశ్రనీ

    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి.


    5.అనుదినమ్ము జనులానంద హృదయులై

    భక్తి ముక్తి నొసగు భారతాది

    గ్రంథములను చదివి కథలలో నున్నసా

    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఐదవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "అనుదినమ్మును జను లానంద..." అనండి.

      తొలగించండి
  40. మైలవరపు వారి మరో పూరణ

    ధనము నాశమగును , తప్పక గల్గురా
    రమ్ము గ్రోల జబ్బు , రాదు దరికి
    భార్య యైన , కడకు బానిసవౌదువు
    దేవదాసు వోలె నీవు మరల !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  41. కొమ్మల్లార యెఱుంగుడమ్మ నిజమున్ కొంచెమ్ముగా వచ్చు దు
    గ్ధమ్మేబిడ్డలకిచ్చుచిక్కులనుచున్ తర్కించుచున్ ముఱ్ఱుఁబా
    లమ్మల్ పోనిడుచుండిరద్ది పొరపాటమ్మా!తొలిన్ వచ్చు క్షీ
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్

    రిప్లయితొలగించండి
  42. అద్భుతంబు సురస యౌషద గుణములు
    తులసి దళము మహిమ తెలుసుకొనుము!
    కలతచెందుటేల తులసిదళరస సా
    రమ్ము గ్రోల జబ్బు రాదు దరికి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆకుల శాంతిభూషణ్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సురస+ఔషధ' అన్నపుడు వృద్ధిసంధి జరుగుతుంది. యడాగమం రాదు. "అద్భుతంబు రసమయౌషధ గుణములు" అంటే సరి!

      తొలగించండి
    2. ధన్యవాదములండీ...
      మీ స్వాగత సత్కారములకు సాష్టాంగ నమస్కారములు...

      తొలగించండి
  43. గురుదేవులకు వినమ్రవందనములు

    మధుర మైన ద్రాక్ష మామిడిపండ్లను
    కోరి తినవలయును కొదవ లేక
    గొప్ప బలము నిచ్చు గోమాతల దధి, క్షీ
    రమ్ము గ్రోల జబ్బు రాదు దరికి!

    రిప్లయితొలగించండి
  44. విరహమనెడిజబ్బు ప్రేమవైరసుతెచ్చు
    నిదురరాదు మనసు నిలువదెచట
    వదలకుండ చెలిని ప్రణయశాస్త్రాల సా
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి

    రిప్లయితొలగించండి
  45. నీలగళు శిరమున నిలయమై యున్నట్టి
    జాహ్నవీజల కడు జాత్యమగును
    సకల వ్యాధులణచు చక్కని సురల నీ
    రమ్ము గ్రోల జబ్బు రాదు దరికి

    రిప్లయితొలగించండి
  46. ఎన్నని యూసులుఁ జెప్పిన
    నన్నిల దుష్యంతరాజు నమ్మిక తోడ
    న్నెన్నఁగ గాంధర్వమునన్
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్!

    రిప్లయితొలగించండి
  47. శార్దూలవిక్రీడితము
    నమ్మండోయ్ సతిఁ గౌగిటన్ గొనుచు ప్రాణమ్మామెగా మోవి సా
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్!
    నమ్మండోయ్ పరమాత్మ నామ జప పానమ్మన్ సుధాస్రావ క్షీ
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్!

    రిప్లయితొలగించండి
  48. వమ్మైపోవును సొమ్ములన్ని, వినుమా! వందల్గ వేలల్గ, నీ
    రమ్మున్ వోలుచు కారిపోవు వడిగా రాబోవు రుగ్మమ్ములన్
    నమ్మంజాలనినాదు సూత్రమిదియే! నారాల గోవిచ్చు మూ
    త్రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్

    రిప్లయితొలగించండి
  49. రమ్ముంగ్రోలిన వచ్చు వాంతులును నారాటమ్ము పెంపొందురా
    తమ్ముండా యిక బీరు గ్రోలినను వాతంబొందు నీ బొజ్జరా
    కమ్మంగుండుచు నాల్క పై రుచికి హైక్లాస్ యాకువాగార్డు నీ
    రమ్ముం గ్రోలిన రావు రోగము లికన్ రాజిల్లు నారోగ్యమున్

    రిప్లయితొలగించండి