23, డిసెంబర్ 2017, శనివారం

సమస్య - 2554 (బారనంగ మురిసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బారనంగ మురిసె బాపనయ్య"
(లేదా...)
"బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా"
(ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు)

150 కామెంట్‌లు:

 1. రోజు రోజు చారు భోజనమ్మున గాంచి
  విసుగు పుట్టి నసిగి కసురుచుండ
  నేడు చూడు మగడ! వేడి మునగల సాం
  బారనంగ మురిసె బాపనయ్య!

  రిప్లయితొలగించండి
 2. కాశియాత్ర జేయ కామేశమయ్యరు
  రైలుబండియెక్కి డాబుగాను
  ఢిల్లిజేరగానె డిన్నరునందు సాం
  బారనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రైలుబండినెక్కి రాజసముగ గా సవరణ

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   ఉత్తర భారతంలో సాంబారుతో భోజనం దొరకడం మురిసిపోయే విషయమే (స్వానుభవం మరి!). సవరణతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 3. బాపడొకడు వెడలె పరిణయ విందుకు
  ముద్ద పప్పు కనియు మూతి తిప్పె!
  వంకలెన్నొ పెట్టె వంకాయకి;మరి సాం
  బారనంగ మురిసె బాపనయ్య!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పరిణయ విందు' అనడం దుష్టసమాసం. "బాప డొకడు పిలువబడె పెండ్లి విందుకు" అందామా? "వంకాయకు" అనండి.

   తొలగించండి
 4. కోకు గోల్డు స్పాటు గొప్పగా లేవని
  సీమ సరుకు మిగుల సేమ మనుచు
  స్కాచి విస్కి రమ్ము చల్లదన మునిచ్చు
  బార నంగ మురిసె బాప నయ్య


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ అమెరికా బాపని గురించి చెప్పినట్టున్నారు. బాగుంది మీ పూరణ.
   స్కాచు విస్కి రమ్ములు చల్లదనాన్ని ఇవ్వవు. అవి చల్లగా లోపలికి వెళ్ళి వేడిని పుట్టిస్తాయి.

   తొలగించండి
  2. గురువు గారు అక్క గారికి ఆ విషయములు తెలియవు గదా గాభరా బెడుతున్నారు

   తొలగించండి
 5. (కృష్ణుని దర్శించి తిరిగి వచ్చిన కుచేలుని భాగ్యవతి యైన భార్యామణి గజరాజు నధిరోహించమనే సందర్భం)
  జారని సఖ్యభక్తి దన చక్కనిమిత్రుడు నందనందనున్
  జేరిన వేదతేజుడు కుచేలుడు గౌరవమంది యేమియున్
  గోరక యింటికేగ ; సతి కుందనభూషణ "యెక్కు డేనుగం
  బా" రని చెప్పగానె విని బాపడు సంతసమందె జూడుమా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంచి సమన్వయమైన పద్యం... చక్కగా ఉందండీ... నమోనమః..... మురళీకృష్ణ

   తొలగించండి
  2. బాపూజీ గారూ,
   చక్కని పూరణ. కాకుంటే అది అంబారి. 'అంబారి+అని' అన్నపుడు యడాగమం వస్తుంది. 'అంబారు'కు అన్యార్థం (ధాన్యపురాశి) ఉంది.

   తొలగించండి
 6. భజనసంఘమందు బాణీల బారులు
  వేదపఠనమందు విప్రబారు
  విందునందమరిన పిండివంటలబారు
  బారనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
 7. వయసుమీరిపోయి వధువుగానగలేక
  తగినశుల్కమీయ తావులేక
  చౌకధరకుబొంద చక్కనిసతి మల
  బారనంగ మురిసె బాపనయ్య
  ఒకప్పుడు పాల్ఘాట్ లో ఆడపిల్లలనమ్మేవారు చౌకగా!

  రిప్లయితొలగించండి
 8. బ్రాహ్మణుడు తన కుమారుని విద్యాపాటవమును పరీక్షించుట:-

  మీరిన ప్రేమతో సుతుని మేలుగ జేర్చెను పాఠశాలలో
  సారమెఱుంగ బాలకుని సన్నిధి జేరగఁ బల్కె గోముతో
  ఔరస| చెప్పుమెన్ని నిగమాంగములన్న సవాలుకున్ జవా
  బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా||


  జవాబు + ఆరు + అని = జవాబారని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీయుతులు జిగురు సత్యనారాయణ గారూ! ప్రణామాలు.
   జవాబు+ఆరు+అని= జవాబారని
   సమస్యకు పరిష్కారం విలక్షణమైనదిగా , ఇతరులకు మార్గదర్శకంగా ఉందండీ. హృదయపూర్వక ధన్యవాదాలు . కోట రాజశేఖర్

   తొలగించండి
  2. పద్యం చాలా బాగుందండీ.. అభివందనములండీ.... నమోనమః... మురళీకృష్ణ

   తొలగించండి
  3. సత్యనారాయణ గారూ,
   అద్భుతమైన పూరణ. అభినందనలు.
   'జవాబు' అన్నది అన్యదేశ్యమైనా జనసామాన్యంలో ప్రచుర పొందింది కనుక, సమస్యాపూరణం కనుక దోషం లేదు.

   తొలగించండి
  4. గురువు గారికి, కోట రాజశేఖర్ గారికి, మురళీకృష్ణ గారికి
   ధన్యవాదములు

   తొలగించండి
 9. వారము సోమవా రమని భర్గుని దర్శన మెంచగా మదిన్
  ఏరున కేగిస్నా నమన నీచలి కాలము నందు కష్టమౌ
  నీరము జల్లుకొంటి నని నేర్పుగ భక్తిని కేలుమోడ్చ గా
  బారని చెప్పగానె విని బాపఁడు సంతస మందెఁ జూడుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగుంది. కాని పూరణ అర్థం కాలేదు.

   తొలగించండి
  2. నమస్కారములు
   గుడికి వెడదామని, చలికి స్నానం చేయలేక నీళ్ళు జల్లుకుని ,చివరకు మత్తులో గుడి అనుకుని బారుకు వెళ్ళాడట . అదన్నమాట అసల్ సంగతి

   తొలగించండి
 10. అంబరమునుతాకు నధిక ధరలతోడ
  అలసి సొలసి పోయె అయ్య వారు;
  "సంతలోన దొరకు సరుకెంతయో చౌక
  బా" రనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీనాథ్ గారూ,
   చౌకబారు సరుకులతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 11. వేడి వేడి గాను వేయనిడ్డలియు, సాం
  బారనంగ మురిసె బాపనయ్య,
  ఔర! పొద్దు పొడిచె ! అయ్యరు హోటలు
  లోన భళి జిలేబు లూరె సూవె !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   క్రియాపదం తర్వాత గసడదవాదేశం రాదు. "జిలేబు లూరెఁ జూవె" అని ఉండాలి.

   తొలగించండి
 12. పాలకూర పప్పు వంకాయ బరితమ్ము
  దొండ వేపుడుండె బెండ పులుసు
  కమ్మదనము నిచ్చు ఘనమైన మునగ సాం
  బారనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మునగ సాంబారుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వంకాయ బరితమ్ము'...?

   తొలగించండి
 13. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  . సమస్యాపూరణ :: నేటి సమస్య (2554)
  *బారని చెప్పగానె విని బాపఁడు సంతస మందెఁ జూడుమా*

  సందర్భం :: వేదాలను నేర్చుకోవాలనే కోరికతో ఒక విద్యార్థి ఒక బ్రాహ్మణోత్తముని గురువుగా భావించి అతని దగ్గరకు వెళ్లగా, ఆ గురువు ఆ విద్యార్థిని పరీక్షించేందుకు *షడంగములను గురించి చెప్పు* అని అన్నాడు. ఆ విద్యార్థి వెంటనే *’’ శిక్ష ,వ్యాకరణము ,ఛందస్సు ,జ్యోతిషము ,నిరుక్తము ,కల్పము అనేవి షడంగములు , ఇవి ఆరు ‘’* అని జవాబు చెప్పగానే విని ఆ బ్రాహ్మణోత్తముడు ఎంతగానో సంతోషపడ్డాడు అని చెప్పే సందర్భం.

  కూరిమి వేదముల్ జదువు కోరిక , విప్రవరేణ్యు సద్గురున్
  జేరగనే, *షడంగముల జెప్పు* మనెన్ గురువర్యు డంత తా
  నారయ *శిక్ష , జ్యోతిషము , వ్యాకరణమ్ము , నిరుక్త కల్ప ఛం
  దో రమలున్ షడంగములు దోచెడి, సంఖ్య వచింపగా జవా
  *బా రని చెప్పగానె విని , బాపఁడు సంతస మందెఁ జూడుమా.*
  కోట రాజశేఖర్ నెల్లూరు. (23.12.2017)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ,
   షడంగాలను చక్కగా ఛందోబద్ధం చేసిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   'జవాబు' అన్యదేశ్వమైనా స్వీకృతమే.

   తొలగించండి

 14. కారుమొగిల్పసౌ యొడలు! కమ్మగ వేణువు నూదు వాడటన్
  మేరుసమానుడాతడయె! మేమరుగాయెను గొల్ల పల్లికిన్
  వారధి యయ్యెగాద సయి వర్ధిల నెల్లరు! "కృష్ణ! బేగనే
  బారని" చెప్పగానె విని బాపఁడుసంతసమందెఁ జూడుమా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   'బేగనే బారని'.. ఇవి కన్నడ శబ్దాలవలె ధ్వనిస్తున్నాయి. అర్థం ఏమిటి? పూరణ బాగున్నది. అభినందనలు.
   'కారుమొగిల్పసౌ నొడలు..' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి

  2. అవునండి కన్నడమే !

   కృష్ణా నీ బేగనే బారో అన్నది వ్యాసరాయర వారి అత్యద్భుత కృతి - రాగం యమునాకల్యాణి.


   జిలేబి

   తొలగించండి
  3. "చిన్ని కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ , కృష్ణుడిని రమ్మని పిలిచే వ్యాసతీర్థుల వారు రచించిన ఈ కన్నడ సంకీర్తన యేసుదాస్ గారి గొంతులో ఎంత హృద్యం గా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకుందామా ! మరీ ముఖ్యం గా "నీ బెగనే బారో " ఇక్కడ బారో అని పలికేచోట ఆయన గొంతులోని మాధుర్యం విని తీరాల్సిందే ."

   http://sravyav20202.blogspot.in/2011/04/blog-post_24.html?m=1

   తొలగించండి
  4. అవును సుమా రాజకుమారు గారు పాడిన పాట బారో బంగార బాయితూ (రాఘవేంద్ర స్వామి పై) దాంట్లో కూడా బారు ఉంది శాస్త్రి గారు

   తొలగించండి
 15. క్రమాల oకార oలో
  బుద్ది మంతు లె వ రు బో నే ర రె చ టి కీ ?
  సజ్జ నాళి తి నె డు సాత్వికoపు
  టో గి రం బు గన గ నుత్సహించి రెవరు ?
  బారనం గ ; మురిసె బాపన య్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈరోజు ఆకాశవాణిలో వినిపించిన 'కరణం రాజేశ్వర రావు' మీరేనా?

   తొలగించండి
 16. రాయలేగుదెంచె రమ్ము దారిద్ర్యంబు
  తీరగలదు నీకు తివిరి కైత
  చెప్పి నట్టులైన చెంత గలదు దరు
  బారనంగ మురిసె బాపనయ్య


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   దరుబారుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  సమాజంలో పురోహితులకు పిల్లనిచ్చుటకు వెనుకాడుతున్న దుస్థితి నెలకొంది.. అందరి చూపూ ఉద్యోగస్థులవైపే... ఈ నేపథ్యం గా పూరణ ... పౌరోహిత్యం కూడా జీవనాధారమైన వృత్తిగా గుర్తింపబడాలని సదాశయంతో...

  పిల్లనిత్తురంట ! పేరేమొ సూరమ్మ !
  సుగుణవతియె ! రంగు చూడ నలుపు!
  వంట వచ్చునంట ! వాల్జడ మాత్రము
  బారనంగ మురిసె బాపనయ్య !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పేరుకె వారు ముస్లిములు , పిల్చిరి పంతులునొక్కచోటికిన్
   భారతదేశమందలి వివాహపు పద్ధతి నచ్చి పెండ్లికిన్ !
   పేరును కోరగా, వధువు బేగమనెన్ , వరుడంత దాను జ...
   బ్బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారూ,
   బారుజడ, జబ్బారులతో మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. నీవు దేవదాసు ! నిన్నీమె వలచెనుఁ
   బారనంగ మురిసె బాపనయ్య !
   అక్కినేని నేను నామె సావిత్రియౌ
   ననుచు దేలి ముదమునంది మిగుల !!

   ( వలచెను +పారు( పార్వతి) +అనంగ )

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 18. తెగబారెడు వెంట్రుకలు సోమిదమ్మకు అని విన్నాను.
  బారు పదంలో చమత్కారం మనోజ్ఞమండీ అవధాని మైలవరపు మురళీకృష్ణ గారూ! ప్రణామాలు.

  రిప్లయితొలగించండి
 19. నీకొక శుభవార్త నిగమ శర్మాయది
  ప్రభువు కొలువు నందు పదవి దక్కె
  నేగు మచటి కిపుడె స్వాగతమొసఁగు ద
  ర్బారనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
 20. పేదరికపు బాధ పెల్లుగా బాధింప
  చింతలందు మున్గి కొంతయైన
  మేలుఁగల్గు నదియె మేటియౌ రాజ ద
  ర్బారనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
 21. ఆ.వె.
  అడవి లోన కాలి నడకన జనుచును
  విప్రు సంధ్య వార్చ వేగపడగ
  నడుగ బాటసారిఁ నదిగోనట నదియుఁ
  "బారనంగ మురిసె బాపనయ్య"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విశ్వనాథ శర్మ గారూ,
   మీ పూరణ అర్థం కాలేదు. వివరించండి.
   బాటసారి తర్వాత అర్ధానుస్వారం అవసరం లేదు.

   తొలగించండి
  2. నదియుఁ + పారు + అనంగ = నదియుఁ బారనంగ ?

   తొలగించండి
 22. ఈరోజు ఆకాశవాణి, హైదరాబాదు వారి సమస్యాపూరణం కార్యక్రమంలో 'శంకరాభరణం' సమూహానికి చెందిన క్రింది కవిమిత్రుల పూరణలు చదువబడ్డాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
  ౧) ఆకుల శాంతిభూషణ్ గారు
  ౨) విరించి గారు
  ౩) గుఱ్ఱం జనార్దన రావు గారు
  ౪) బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ గారు
  ౫) హనుమకొండ లక్ష్మణిమూర్తి గారు (?)
  ౬) చంద్రమౌళి సూర్యనారాయణ గారు
  ౭) వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారు
  ౮) గుఱ్ఱం సీతాదేవి గారు
  ౯) చంద్రమౌళి రామారావు గారు
  ౧౦) జిలేబీ గారు
  ౧౧) తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష గారు
  ౧౨) కరణం రాజేశ్వర రావు గారు (?)
  ౧౩) అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
  ౧౪) కొనకళ్ళ ఫణీంద్ర రావు గారు
  ౧౫) మాచవోలు శ్రీధర రావు గారు
  ౧౬) బండకాడి అంజయ్య గౌడ్ గారు
  ౧౭) గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు
  ౧౮) వి.యస్.యన్. మూర్తి గారు
  ౧౯) డా. బల్లూరి ఉమాదేవి గారు
  ౨౦) గండూరి లక్ష్మినారాయణ గారు
  ౨౧) కె. ఈశ్వరప్ప గారు.
  .......................................అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య..........
  "చదివిన జ్ఞానమంతయును చప్పున పోవు నదేమి చిత్రమో"
  మీ పూరణలను వచ్చే గురువారం లోగా padyamairhyd@gmail.com కు పంపండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. మదిని మధింప గన్నెలమి మన్నిక గాంచి జిలేబులూరగన్
   చదివిన జ్ఞానమంతయును చప్పున పోవు నదేమి చిత్రమో
   విదురుడ! పల్కులన్నియును వింగడమాయె, నుదర్చి పల్కు గన్
   పదునకొనంగనౌ పటిమ పాటవ మై వెలసెన్ మహాశయా

   జిలేబి

   తొలగించండి

  2. ధన్య వాదాలండి కంది వారు

   ఆకాశవాణి కార్యక్రమం రికార్డింగ్ ఏదైనా లంకె వుందాండి‌

   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   చంద్రమౌళి సూర్యనారాయణ గారు ఆ కార్యక్రమాన్ని రికార్డు చేసి శంకరాభరణం వాట్సప్ సమూహంలో పెట్టారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ వాట్సప్ నెం. ఇవ్వండి. దానికి ఫార్వర్డ్ చేస్తాను.

   తొలగించండి
  4. నమస్కారములు కంది శంకరయ్య గారూ...
   నా whatsapp నెం 9440837440 ...
   దయచేసి december 23 నాటి పూరణ "లేదను వాడె దాత.." రికార్డింగ్ లింక్ నాకు పంపగలరని ప్రార్థన...

   తొలగించండి
 24. ధన్యవాదములు గురువర్యా!అంతా మీ శిక్షణాఫలితమే!వందన శతములు!!

  రిప్లయితొలగించండి
 25. విందుభోజనము పసందుగొలుపుచుండ
  వడ్డనమ్ముఁ జేయు వారు తెచ్చె
  బక్కెటులను పంక్తి వద్దకు వచ్చి సాం
  బారనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యనారాయణ గారూ,
   మీ సాంబారు పూరణ బాగున్నది. అభినందనలు.
   'వారు' బహువచనమై 'తెచ్చె' ఏకవచనమయింది. "వడ్డనమ్ముఁ జేయువాఁడు తెచ్చె" అనండి.

   తొలగించండి
 26. నీదు గుడి లోన నింగి సిగ యొక్కడే,
  వెలుగు చుండె నచట వేడి కంటి
  వివిధ కొలత లందు, నవ కోటి లింగాల
  బారనంగ మురిసె బాపనయ్య

  కోటి లింగాల ప్రతిష్ట చేసిన ప్రదేశము చూడమని విప్రునికి స్నేహితుడు తెలుపు సందర్భము

  రిప్లయితొలగించండి
 27. "కూరది యేమి జేసితివి కోమలి!నేడ'ని పృఛ్ఛ సేయగన్
  దారయె సంతసించి తను తక్షణమే బదులిచ్చె నిట్లుగా
  "మీరది మాటిమాటికిని మెచ్చుచు తృప్తిగ గ్రోలునట్టి సాం
  బార"ని చెప్ప గానె విని బాపడు సంతస మందె జూడుమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'కోడల!'అని కదా ఉండాలి. ...టైపాటు

   తొలగించండి
 28. డా.ఎన్.వి ఎన్.చారి
  పెరిమి నడ్గగా సకల విద్యల సారము జెప్పుధక్షుడై
  శారద పుత్రుడై తనరి సాగర పుత్రిక దూరమౌట,సం
  సారము నీడ్వలేని తరి స్వాగత పత్రిక వచ్చె, రాజ ద
  ర్బారని చెప్పగానె
  విని బాపడు సంతస మందె జూడుమా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   లక్ష్మి దూరమైనవానికి రాజదర్బారునుండి పిలుపు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
   కొన్ని టైపు దోషాలున్నవి. (పేరిమి, దక్షుడై)

   తొలగించండి
 29. నేరిచి వేదవిద్యలను నేరుపు నంది పురోహితుండుగన్
  మీరిటఁ జెప్పు జోస్యములుమేలొనరించగ మెచ్చి పెక్కురున్
  జీరుచు మీ యమూల్యమగు సేవల నిల్చిరి బైట వారిదో
  బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా! 

  రిప్లయితొలగించండి
 30. తద్దినమ్ము నందు తనివిపడు నటుల
  నన్ని భక్ష్యములిడి యాదరమున
  భోజనమ్ము నందు ముఖ్యపు వంట సాం
  బారనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి


 31. పూజచేసినంత పులకించియజమాని
  పూలహారమేసిపొగిడిపొగిడి
  పట్టుధోవతొకటిపెట్టి కాదుచవక
  బారనంగమురిసెబాపనయ్య!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పీతాంబర్ గారూ,
   చవకబారు ధోవతి కాదన్న మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 32. సారెకు భోజనమ్మునును సంతసమందుచు బొజ్జ నిండుగన్
  గారెలు బూరెలన్నమును కంఠముదాక భుజించు విప్రుడా తీరున భార్యగాంచి రుచి తీరు నడంగగనామె నేడు సాం
  బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా!

  రిప్లయితొలగించండి
 33. అరయ మిత్రుడైన యవధాని తాబల్కె
  మనల రమ్మటనుచు బనిపె రాజు
  చనిన గౌరవించు చక్కగా రాజద
  ర్బారనంగ మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
 34. తనదు యాలి వండు మునగ కాయగల సాం
  బారనంగ మురిసె బాపనయ్య!
  బారు, బీరు, పరుల వంట వలదను నీ
  మాచవోలు వాడు మంచి వాడె!
  గురువు గారికి నమస్సులు, ఈ పద్యాన్ని ఇలా సరదాగా పూరించినందుకు మన్నించండి.
  నిన్నటి సమస్యకు చంపకమాలలో నా పూరణను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదాలు.

  తెలుగను పేరు గన్న లిపి తేనెల వానల యాడి నంతట
  న్నిలనమృతమ్ముతో కలిసెనేమొ యనంగ తెనుంగు శబ్దముల్
  మలచ బడంగ నా కవన మాధురి గ్రోలగ భారతమ్మతో
  తెలుగు బఠించు వారలిక దేహి యటంచును జేయి జాపరే

  రిప్లయితొలగించండి
 35. సూరుల నందరిన్ బిలిచి సొంపుగ నొక్కటఁ జేర్చి యిచ్చతో
  తీరుగ గౌరవించెడి ప్రదేశము విస్తృతమైన రాజ ద
  ర్బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా
  తీరును కోర్కెలంచుఁ గడుఁ దృప్తిగ నేలికొసంగు ముల్లెతో

  రిప్లయితొలగించండి
 36. తాత లెల్లఱు ఘన వీతిహో త్రోపాస
  కు లఁట జపము లందు వలపు మెండు
  కనఁగ నింటి పేరు గస్తూరి వింతగఁ
  గోపనంగ మురిసె బాపనయ్య

  [బారనంగ మురిసె బాపనయ్య]


  సూరజుఁ గుంభ సంభవునిఁ జూడమె పూర్వము మాంస భోజనున్
  తూరుపు ఱేఁడు కశ్యప సుతుండు సురా రతుఁడై చెలంగఁడే
  ధారుణి వింత లన్ని విన దత్తర పాటు సెలంగ నిక్కమే
  వారుణిఁ జెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా

  [బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దూరమ యంచు నెంచకయె తూర్ణమ వచ్చి మదీయ యాగమున్
   భారము నీ భుజమ్ములను బన్నుగ నుంచి యొనర్చి నంతటం
   గోరిన నీకు నిచ్చెదను గూర్మిని నిచ్చట నున్న మేటి యం
   బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ మొదటి పూరణ అర్థం కాలేదు. మిగిలిన రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   సదాచార సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుఁ డొకఁడు కోపు (మద్యము) నారగించు చున్నాడని నా భావము. ఇంటి పేరు కస్తూరి, యారగించేది కల్లు!!!

   తొలగించండి
 37. రసముతోడవిసిగివేసారచూడుసాం
  బారనంగమురిసెబాపనయ్య
  పిల్లపెద్దలందరుల్లమలరదిని
  బ్రేవుమనుచుదేల్చెబెండ్లియందు

  రిప్లయితొలగించండి
 38. వంట బ్రాహ్మణుండు వర్ణించి చెప్పుచు
  పప్పు తోడ మంచి వంగ, దోస,
  దనుసు గడ్డ లున్న ఘనరుచి కలుగు సాం
  బా రననంగ మురిసె బాపనయ్య
  (టైపింగ్ తప్పులు సవరించిన పూరణ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధనికొండ వారు నమస్కారము దనుసు గడ్డ లా లేక గనుసు గడ్డ లా తెలియ జేయ మనవి

   తొలగించండి
 39. కోరినవెంటనేముదితగొప్పగజేతునునిప్పుడేనుసాం
  బారనిచెప్పగానెవినిబాపడుసంతసమొందెజూడుమా
  దూరముగాదలంచకనుదోరముసంతసమొప్పగాదగ
  న్గూరలుగాయలున్గొనగగూరిమితోడననేగెసంతకున్

  రిప్లయితొలగించండి
 40. పనసపొట్టుకూర వంకాయపచ్చడి
  ఆలుగడ్డతోడ తాలిదమ్ము
  ముద్దపప్పు నేయి పులిహోర మునగసాం
  బారనంగ మురిసె బాపనయ్య!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   అన్ని వడ్డించాక మురియకుండా ఉంటారా? చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించండి
 41. తిరువనంతపురపు దేవదేవు౦డైన
  పద్మనాభస్వామి బరగు నాడు,
  గురుపవనపురపు గోపుడు గల మల
  బారనంగ,మురిసె బాపనయ్య

  రిప్లయితొలగించండి
 42. .నగర వాసు డైన నాగరికు డొకడు
  మిత్రులంత గలువ?మిడిసి బడుచు
  విందుకంటె ముందు వేడి వేడిడ్లిసాం
  బారనంగ మురిసెబాపనయ్య|

  రిప్లయితొలగించండి
 43. మీదు ముచ్చటయిన, మేలుగా వ్రాసిన
  పద్య పూరణంబు పంపమనుచు
  కంది శంకరయ్య గారిచ్చటిచ్చిరి
  "బారనంగ మురిసె బాపనయ్య"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పంపు మనుచు' అనండి.

   తొలగించండి
 44. ఉత్పలమాల
  తీరెద రుక్మిణీ వధువు తెల్పిన రీతిగ భూసురోత్తమా!
  తేరున వచ్చి రాక్షసపు తీరు వివాహమునంద నొప్పెదన్
  మీరిక కాన్కలన్ గొనఁగ మేలుగ వేచిన దయ్య మాదు ద
  ర్బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా!

  రిప్లయితొలగించండి
 45. అబ్బ ఇవాళ శంకరాభరణము సాంబారు వాసన తో ఘుమ ఘుమ లాడు చున్నది

  రిప్లయితొలగించండి
 46. ఆ శరత్తు లోన ఆకులన్నియు పండ
  బారనంగ మురిసె బాపనయ్య
  రండు చూతమంచు రయమున వెడలెను
  తూర్పమెరిక జూడ దర్ప మడర ౹౹
  (దర్పము = ఉత్సాహము)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   పండబారిన ఆకులతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 47. భార్య నడి గె భర్త వంటే మి ట ని యంచు
  మరు లు తోడ పలికె మగ ని కిట్లు
  వండి నాను గుత్తి వంకాయ వేసి సాం
  బారనంగ మురిసె బా ప నయ్య

  రిప్లయితొలగించండి

 48. 1.పచ్చడన్నము తిని వాయి చెడగ సతి
  వేడియన్నమందు వేగిరముగ
  రసనకు హితమనుచు రసమును తోడ సాం
  బారనంగ మురిసె బాపనయ్య"*

  2.సతము ఘృతముమరియు శర్కర కలిపిన
  యట్టి వస్తువులను నారగించి
  విసుగు పుట్టగ సతి వేడిచేసితిసాం
  బారనంగ మురిసె బాపనయ్య.

  3.పెళ్ళి విందు నందు పేరు తెలియనట్టి
  తిండి వస్తువులను తేరిపార
  జూసి పస్తులుండ .సుదతి, గలదిట సాం
  బారనంగ మురిసె బాపనయ్య.

  4.గౌరవింతురయ్య కవియగు నిన్నా ద
  ర్బారనంగ మురిసె బాపనయ్య
  కవులకిలను కలుగు ఘనతను గాంచంగ
  మనసది పులకించు మహిని నేడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   నాలుగవ పూరణ మొదటి పాదం చివర గణదోషం. "నిన్ను ద..." అనండి.

   తొలగించండి
 49. చక్కనయ్యజెప్పు చక్రవర్తులసంఖ్య?
  ఇంద్ర గణములెన్ని? ఋతువులెన్ని?;
  మూట నొక్క మాట ముద్దుగా నే జవా
  బారనంగ మురిసె బాపనయ్య.

  రిప్లయితొలగించండి
 50. నమస్కారములు కంది శంకరయ్య గారూ...
  నా పేరు ఆకుల శాంతి భూషణ్...
  నా whatsapp నెం 9440837440 ...
  దయచేసి december 23 నాటి పూరణ "లేదను వాడె దాత.." రికార్డింగ్ లింక్ నాకు పంపగలరని ప్రార్థన...

  రిప్లయితొలగించండి

 51. సందర్భము: సాధకుడైన ఒక బ్రాహ్మణుడు సద్గురువును ప్రశ్నించినాడు 'మోక్ష సౌధానికి మొట్టమొదటి మె ట్టేది?' అని.. అప్పు డా గురువుగారు 'నాయనా! కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యా లనే అరిషడ్వర్గాన్ని జయించడమే! వాటి సంఖ్య 6' అని చెప్పాడు. అది విని సాధకుడైన ఆ బ్రాహ్మణు డెంతో సంతోషపడ్డాడు.

  పారుడు సాధకుం డొకడు
  ప్రశ్నను వేసె గురూత్తమున్ గృపా
  మేరుని "ముక్తి మేడ తొలి
  మె ట్టెది?"యంచును- "వత్స! గెల్వుమీ!
  లో రిపులైన కామమును,
  క్రోధము, లోభము, మోహమున్, మదం,
  బారయ మత్సరంబును ర
  యంబున- సంఖ్య వచింపగా జవా
  బా" రని చెప్పగానె విని
  బాపడు సంతస మందెఁ జూడుమా!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి
 52. సందర్భము: చైనా టౌన్ అనే హిందీ సినిమాలో బార్ బార్ దేఖో.. హజార్ బార్ దేఖో.. అనే పాట వుంది. హిందీ పాట లంటే చెవి కోసుకొనే ఒక బ్రాహ్మణుడు బార్ బార్ దేఖో.. అని ఆ పాట మొద లవగానే.. హజార్ బార్ దేఖో అని పాట ఎత్తుకుంటా డట!

  "బారు బారు దేఖొ" పాట రాగానే "హ
  జారు బారు దేఖొ" చదువు నతడు-
  "హింది పాట లెంత యిం" పనంగా "బారు
  బా" రనంగ మురిసె బాపనయ్య..

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి

 53. సందర్భము: భార్య పేరు "బారని" భర్త పేరు "బాపడు". ఆమె సాహితీ పరిజ్ఞానానికి అతడు సంతోషించినాడు.

  "చా రిక పోయవే!"యనెను
  సాధువు "బాపడు" భార్య "బారని"న్
  "చారులు బోలెడన్ని మడి
  చా,రరిచార్,పొడిచారు నింక నే
  చా?" రనె, నామె సాహితి వి
  చారము గల్గిన దౌట నీ గతిన్
  "బారని"చెప్పగానె విని
  "బాపడు"సంతస మందెఁ జూడుమా!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి

 54. సందర్భము: "బాపడు"అనే భక్తునికి "బారని" అనే దేవత ప్రత్యక్షమైనది. ఆమె సంభాషణకు అతడెంతో సంతోషించినాడు.

  "బారని" దేవతా లలన
  "బాపడు"భక్తుడు మంత్ర సాధనన్
  "బారని" యేమి చెప్పినదొ
  "బాపడు"సంతస మెందు కందెనో
  యేరు వచింపలే రనిన
  నియ్యది బ్రహ్మ రహస్యమే యగున్
  "బారని"చెప్పగానె విని
  "బాపడు"సంతస మందెఁ జూడుమా!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి
 55. సందర్భము: "బాపడు"అనే భక్తునికి "బారని" అనే దేవత ప్రత్యక్షమైనది.ఏ సమస్యయైనా పూర్తి చేయగల వని వర మిచ్చినది. అతడెంతో సంతోషించినాడు.

  "బారని!" బారనీ!" యనుచు
  "బాపడు"తీవ్ర తపం బొనర్పగా
  "బారని" దర్శనంబు నిడి
  భక్తుని కిచ్చి వరంబు- ని ట్లనెన్-
  "తీరని యే సమస్యయును
  దివ్యముగా నెరవేర్తు వింక పో!"
  "బారని"చెప్పగానె విని
  "బాపడు"సంతస మందెఁ జూడుమా!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి
 56. వారము వర్జ్యమున్ననుచు పాయలు నుల్లివి త్రోసివేయుచున్
  కారము తీపియున్ విడిచి కాయలు నాకులు వండుచుండగా
  కోరిన బంధువుల్ కలియ కొబ్బరి లడ్డులు చేమదుంప సాం
  బారని చెప్పగానె విని బాపఁడు సంతసమందెఁ జూడుమా

  రిప్లయితొలగించండి