31, మే 2018, గురువారం

ఆముదాల మురళి గారి శతావధానము – 2వ భాగము


దత్తపది
1) "ఆది - సోమ - మంగళ - బుధ" అవధాన విద్యా వికాసం.
(డా. అమళ్ళదిన్నె వేంకట రమణ ప్రసాద్ గారు)
.        ఆదిన మాడభూషి మహితాన్వయమూర్తి మహత్తు చేత సం
పాదిత సోమరేఖ యొక మచ్చ నెఱుంగని పూర్ణచంద్రుఁడై
వేదవధానవిద్య ప్రభవించెను మంగళరూపసంపదల్
మోదముఁ గూర్చెఁ దెల్గునకు మూదలగా బుధవర్గ మంతటన్.

2) "తల - మెడ - కడుపు - నడుము" శ్రీవేంకటేశ్వర స్తుతి.
(మైలవరపు మురళీకృష్ణ గారు)
చం.    తలఁపుల బోడి సేసి నను దగ్గరఁ జేర్చుము మోక్షసిద్ధికిన్
బల మెడఁబాసి వృద్ధుఁ డగుపట్టున వత్తునె గొల్వ ముందు బా
ముల నొనరించినా నొకడు పుణ్యముఁ బాపము నేరనయ్య నా
తలఁపుల నిల్చి గావు వరదా! నడు ముందు కటంచుఁ ద్రోసి నన్.

3) "సుమిత్ర - కైక - తార - సీత" భారతార్థంలో...
(M.S.V. గంగరాజు గారు)
ఉ.     మీరు సుమిత్రబాంధవులు మీరు మహాత్ములు మీరు కేశవా!
పోరునకై కరం బిడరె పొమ్మని చెప్పక భక్తరక్షకా!
తారలు రాలునట్లుగ నధర్మపరాయణు లాహవంబునన్
జేరియుఁ జంపకుండిన నిసీ తలవ్రాతలు మారబో వికన్.

4) "వాన - ముసురు - జల్లు - జడి" వేసవిలో జనుల స్థితి.
(కంది శంకరయ్య గారు)
తే.గీ. మండుటెండల మధువాన మనసు గల్గు
కోరిక ముసురుఁ జెమ్మటల్ గారుచుండు
దుమ్ము వెదజల్లు నెండలు దమ్ముఁ జూపు
జడిసి బయటకు రాఁబోరు జనులు చూడ.

5) "గగగ - ననన - మమమ - లలల" స్వేచ్ఛాంశం...
(మాధవ రెడ్డి గారు)
తే.గీ. సాగ గగనధుని యగుచు సరసకవిత
చాన ననఁబోడి సాహిత్యచారుమూర్తి
భామ మమతల గుడియైన పద్యవిద్య
బాలల లలితవాక్యమౌఁ బరమసుఖము.

6) "అగ్నిగర్భ - కనులముందు - శిలాయజ్ఞం - గంధకుటి" భారతార్థంలో...
(డా. కలువగుంట రామమూర్తి గారు)
ఉ.     విజ్ఞత లేక ధూర్తపృథివీపతి ద్రౌపది నగ్నిగర్భఁ దా
నజ్ఞత నీడ్చె నీ సభకు నందరి కన్నులముందు పెద్దలున్
బ్రాజ్ఞులుఁ బల్కరైరి యిది పాప మటంచును భీమవాక్శిలా
యజ్ఞము వీరగంధకుటియై మిముఁ గాల్చును కౌరవేశ్వరా!

7) "పాలు - పెరుగు - వెన్న - నేయి" కురు పాండవుల ఆస్తి పంపకాలు.
(సుబ్బ రాఘవ రాజు)
ఉ.     కౌరవరాజ! పాలు నిడఁగా నినుఁ గోరిరి పాండవేయులున్,
గౌరవ మెంతయో పెరుగుఁ గానఁ బ్రసన్నుఁడవై ముదంబునన్
జేరఁగఁ బిల్చి భాగములు చేసి యొసంగుము, వెన్న రాసినన్
మీరలు వాఁతఁ బెట్టినది మేలగునే? యిలుఁ జేరఁ బోయెదన్.

8) "నీరు - మీరు - బారు - బీరు" పద్మావతీ స్తుతి...
(డా. మన్నవ గంగాధర ప్రసాద్)
తే.గీ. కారు కన్నీరుఁ దుడువవే కమలనయన!
మేర మీరు కష్టమ్ముల దారిఁ జూపి
తుమ్మెదల బారు వేనలితోడ నొప్పు
వేంకటేశదయిత! నేను బీరుఁ డమ్మ!

9) "శవము - పాడె - చితిమంట - తర్పణము" పెండ్లి వేడుక...
(టెంకాయల దామోదరం)
తే.గీ. శైశవము దాఁటి పెండ్లాడు సమయమయ్యెఁ
బాట పాడె సువాసిని పరిణయమునఁ
గంటిరెప్పగాఁ బెంచితి మంట లేక
బ్రతుక నన్నసంతర్పణవ్రతముఁ జేతు.

10) "కందు - సందు - మందు - విందు" భాగవతార్థంలో...
(డా. మాలేపట్టు పురుషోత్తమాచారి గారు)
ఉ.     కందుకమయ్యెఁ గొండ, యురగం బొక రంగము నాట్యమాడఁ,
న్విందునుఁ గూర్చు మోము, నునువెచ్చని మాట పసందుఁ జూడ నే
మందును? ముగ్ధలార! యతఁ డాంతరబాహ్యజగంబు లంత టా
నందమయుండుగా వెలుఁగు నందకుమారుఁడె నిందఁ జేయఁగన్?

11) "తల - వల - జల - కల" గురుశిష్య సంబంధం...
(విద్వాన్ జి. గోవిందయ్య గారు)
ఉ.     చేఁతల దిద్దు దేశికుఁడు శిష్యుల వ్రాతలు మారునట్లుగన్
బూఁత మెరుంగు రీతి వలపున్ సరి జేయును గుండెలందునన్
నీతులు నూరిపోయుఁ దటినీజలతీర్థము లందియిచ్చుచున్
చేఁతలు మాట లొక్కటిగఁ జేయును పోకల రాకలందునన్.

12) "కట్టు - గట్టు - పట్టు - రట్టు" ద్రౌపది మాతృహృదయం...
(శ్రీరాములు గారు)
ఉ.     కట్టుదు రేల వీని శిశుఘాతకుఁ డంచును భర్తలార! రా
గట్టుకుమారి లీలలివి గర్భము క్రుంగెడుఁ గన్నతల్లికిన్
పట్టును వీడుఁడింకఁ బసిపాపలఁ జంపినవాని శత్రువున్
రట్టుగఁ జేయనేల? యిది బ్రాహ్మణహత్యకు దారిఁ దీసెడున్.

13) "తాపము - పాపము - కోపము - లోపము" స్త్రీలు లోకకళ్యాణ కారకులు...
(డా. వి. జయమ్మ గారు)
ఉ.     తాపము జాతికెల్లఁ బరితాపము నొందిన భారతావనిన్
బాపము నెంచకుండఁ బలు బాధలు పెట్టిన నాదిశక్తియై
కోపముఁ బూనె నా కుసుమకోమలి కన్నుల నెఱ్ఱఁ జేసినన్
లోపము గల్గు భాగ్యములు లోకము లెల్లను భస్మమయ్యెడిన్.

14) "మమత - సమత - నవత - ఘనత" దేశాభివృద్ధిలో మహిళ పాత్ర...
(డా. మస్తానమ్మ గారు)
తే.గీ. ప్రేమ మతమును బ్రతుకులోఁ బెంచువార
లసమతత్త్వంబుచే దుఃఖ మనుభవించి
నవతరంబును దీర్చెడి నవ్యమతులు
ఘనత నిత్తురు స్త్రీలు ప్రగతుల నొసఁగి.

15) "మొల్ల - ఎల్ల - కల్ల - చల్ల" రామాయణార్థంలో...
(డా. పి.సి. వెంకటేశ్వర్లు గారు)
ఉ.     మొల్లలు మాలఁ గూర్చి మునుముందుగ వచ్చిరి పౌరులందరున్,
ఎల్లలు లేని సంతసము హెచ్చెను రాజుకు, దాసి పుష్పముల్
చల్లఁగ వచ్చె రాముఁడు, పిశాచము మందర కైకఁ జేరి తా
కల్లరిమాటలం బలుకఁ గానల కేగెను రాముఁ డంతటన్.

16) "వడ - పూరి - దోస - ఉప్మా" భారతార్థంలో...
(కత్తి మమత గారు)
మ.    వడఁకెం గౌరవసైన్యమంత ననిలోఁ బార్థుండు విల్లందఁ గృ
ష్ణుఁడు పూరించెను పాంచజన్యమును బంధుప్రీతితోఁ బోరఁ గ
వ్వడితోఁ బోరినవారి కెల్ల గలిగెం బంచత్వ మౌరౌర దో
సెఁడు రారాజు యశోవికాసమునకై చీ యుప్మనెన్ వంశమున్.

17) "వారేవా - తూరేతూ - పీరేపీ - జారేజా" రామాయణార్థంలో...
(మాధవీలత గారు)
శా.    వారే వారిధి దాఁటి వచ్చిరిక భవ్యంబైన యీ లంక పెం
పీరేపీడ్వడు గాన రాము నొక రాజేంద్రుండుగా నెంచ సం
తూరే తూలము గాగ గాలి కెగురున్ దుఃఖంబు గల్గున్ దలల్
జారే జాజులు గాగ రావణ! మహాశస్త్రాగ్నిలోఁ జిక్కెడున్.

18) "క్రీస్తు - ఏసు - మేరి - సిలువ' భాగవతార్థంలో...
(డా. నెమిలేటి కిట్టన్న గారు)
మ.    "హరి! చక్రీ! స్తుతియింతు నీదు పదముల్ ధ్యానింతు నీరూపమున్
సరియే సుస్థిరమోక్షరాజ్యమునకున్ సంసారసౌఖ్యంబు? నా
తరమే రిత్త జగంబు దాట" నని సంధానించెఁ జిత్తంబు లా
పరమాత్మన్ భజియింప భాసిలు వచోభానుండు ప్రహ్లాదుఁడున్.

19) "బడి - ఒడి - గుడి - మడి" ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ...
(యువశ్రీ మురళి గారు)
చం.    బడి గుడి యంచు నెంచి మన పాలకు లెల్లరు చిత్తశుద్ధితో
నొడి నిడి నేర్పగావలయు నుద్ధతిఁ జూపెడి లేమి పోవగా
గుడిసెలు పోయి యుండుటకు గూడును కూడును గల్గ విద్యయ
న్నుడి మడి దున్నగావలయు నూత్నజగంబుల సృష్టిఁ జేయఁగన్.

20) "లవరు - కవరు - పవరు - ఎవరు" దాంపత్య జీవనం...
(డా. నాదెండ్ల శ్రీమన్నారాయణ గారు)
చం.    లవ రుష గల్గినంత ననురాగము వీడుట పాడి యౌనొకో
సవరణ చేసుకోక వరుసన్ బరుషంబుల దంపతీజనుల్
శివముల నాడరాదు గుణశీలురు పాపవరుల్ ముదాన లే
రెవరు జగంబునం చనుచు నెల్లరుఁ గీర్తన సేయుచుండఁగన్.

21) "కొట్టము - గొట్టము - చుట్టము - మట్టము" రాయబారానికి వెళ్ళుచున్న కృష్ణునితో ధర్మరాజు పలుకులు...
(గంగుల నాగరాజు గారు)
ఉ.     కొట్టము రాజ్యలోభమునఁ గూరిమి నిచ్చిన నైదు గ్రామముల్
గొట్టమువంటి శూన్యమునకున్ తపియించుట గాదు దాయలున్
జుట్టములే కదా పొడుచుచుండినఁ కత్తులు యుద్ధమందునన్
మట్టము గావె వంశములు మాధవ! యుద్ధము మాన్పి రమ్మికన్.

22) "నిండ - ధూస్ర - ష్ఠుల్మి - బూసు" తెలుగు భాషయొక్క ఔన్నత్యం...
(మల్లిపూడి రవిచంద్ర గారు)
తే.గీ. గుడులు గట్టియుఁ గొల్వరే గుండెనిండ
ప్రియవధూస్రక్తరాంతఃపరీమళంబు
గలుగు వాక్యము శ్రేష్ఠు ల్మిగుల హసించి
యొంటికిన్ బూసుకొనియెడు సెంటు తెలుఁగు.

23) "గంగ - గంగ - గంగ - గంగ" ఎక్కడా 'నీరు' అనే అర్థం రాకుండా గంగావతరణ వర్ణన...
(తారకరామ్ గారు)
మ.    తపముం జేయ భగీరథుండు వనికిన్ తా నిష్ఠ సాగంగ స
త్కృపతో వే యొసగంగ బ్రహ్మ వరమున్ గీడెంచి శీర్షంబునన్
జపలన్ శంకరుఁ డడ్డుకట్టి వదలెన్ జహ్నుండు ద్రాగంగ స్వ
ర్గపదంబందున నుండి వచ్చె భువికిన్ గంగమ్మ వేగం గదా!

24) "వనిత - లలిత - అనిత - మమత" రామాయణార్థంలో...
(సాత్పాటి సురేశ్ గారు)
తే.గీ. వనిత సీతమ్మ చూచెను వనములోన
లలితలతలందు బంగారు లక్షణముల
ననితరంబైన జింక తా నడిగినంత
రాముఁ డరిగెను మమతతో రయముగాను.

25) "మూర - బార - చేర - మేర" రామాయణార్థంలో...
        (విద్వాన్ బి. కన్నయ్య గారు)
చం.    పురహరుభక్తునిన్ గపిచమూరణతంత్రవినూత్నరీతి సం
బరములు మేర మీర వడిఁ బారఁగఁ జేసిన వైన మెన్నఁగా
స్థిరతర రామమంత్రకృతిచే రహియించెను గాక గెల్వ వా
నరులకు శక్యమే రణమునన్ దితిపుత్రుని రావణాసురునిన్.

5 కామెంట్‌లు:

  1. మహాద్భుతముగా వున్నాయి. బ్రహ్మశ్రీ ఆముదాల మురళి గారికి నమస్సుమాంజలి, అభినందనలు,

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    అన్నిపద్యములు అద్భుతముగా నున్నవి .మాకందించిన గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  3. మురళి గారి పూరణలు మాకు ప్రేరణలు అందించిన గురువర్యులకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి