1, మే 2018, మంగళవారం

సమస్య - 2665 (తండ్రులకు మ్రొక్కెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు"
(లేదా...)
"మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

135 కామెంట్‌లు:

 1. ప్రొద్దు పొడుచుట ముందుగ ముద్దుగాను
  మేలుకొలుపులు పాడగ మేలుకొనుచు
  లక్ష లక్షలు మ్రింగిన శిక్ష కొరకు
  పాఠశాలకు బోవుచు వడిగ, తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు :)

  రిప్లయితొలగించండి
 2. డా.పిట్టానుండి
  ఆర్యా, ఇదివకటిదే ఈ సమస్య.

  రిప్లయితొలగించండి
 3. మునుపటి పూరణ:


  G P Sastry (gps1943@yahoo.com)సెప్టెంబర్ 09, 2017 12:26 AM

  మునుల సేవించి వనముల తనివి తీర
  కర్మకాండల ఫలముల మర్మ మెరిగి
  ధర్మరాజు గంగానది తటము జేరి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాస్త్రి గారూ! మీ పూరణను గతంలో నేను చూడలేకపోయాను. నేనప్పుడు పూరణ చేయలేకపోయాను సమయంలేక! ఇప్పుడు మీ పూరణ చూడడం జరిగింది. సంతోషం.

   మీ యీ పూరణ కూడా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి

 4. పెండ్లి చూపుల తరువాయి మా అయ్యతో మా బామ్మ పలుకులు :)  మన జిలేబికి చూచిన మగడు, తల్లి
  తండ్రులకు మ్రొక్కెను! పతివ్రతా సుతుండు
  జూచు కొనె వారి నెల్లర సుఖము గాను
  మేలుబంతియొజ్జయు!నిత్తుమీమె నయ్య :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొక్కడమే కాదు చక్కగా చూచుకోవడం ప్రధాన మని చెప్పినట్లైనది.👌🙏🏼

   ...డాక్టర్ వెలుదండ్ల సత్యనారాయణ

   తొలగించండి
  2. వినయవంతుఁడు దొరికాడు! సందేహించడానికి తావులేదు. ఒప్పేసుకొన్నారు.

   జిలేబీ గారూ! మీ పూరణ బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
  3. పద్యం బాగుందండీ 👌👏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి

  4. గుండు వారికి మైలవరపు వారికి శ్రీమాన్ జీపీయెస్ వారికి

   నమో నమః

   నెనరులు !


   జిలేబి

   తొలగించండి

  5. అవునండోయ్ ! వెలుదండ వారిని వదిలేసా !


   నెనరులు వెలుదండయ్యా!
   మునుకడ వినియుంటి మీ సమున్నత ధారన్
   కనకపు ధారన్ తెనుగున
   మననము జేయ సులభతరమైన రచనగన్!

   జిలేబి

   తొలగించండి
  6. జిలేబీ పద్య మందించిన శాస్త్రి గారికి...
   జిలేబీ గారికీ.. ధన్యవాదాలు.. నమస్సులు.👌🏽🙏

   ...డాక్టర్ వెలుదండ్ల సత్యనారాయణ

   తొలగించండి
 5. అక్క,బావల,కమ్మమ్మ లందరు పిన
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు
  తల్లి,నాన్న,కు తాతయ్య,దైవమునకు,
  తరలి,యుద్యోగమునఁజేరు తరుణమందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాదరావు గారూ!
   వినయవంతుడైనవాడు ఉద్యోగానికి వెళ్ళుతూ పెద్దలందఱకు మ్రొక్కినట్లుగా చేసిన మీ పూరణము బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
  2. ధన్యవాదములు మధుసూదన్ గారూ!

   తొలగించండి
 6. ద్రోణుడల్లిన వ్యూహమున్ దుత్తునియలు
  సలుప నెంచుచు పసివాడు సాగు వేళ
  ధర్మరాజుకు భీముకున్ తదుపరి పిన
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించిగారూ!
   పద్మవ్యూహంలో ప్రవేశించనున్న అభిమన్యుని భక్తిప్రపత్తులను గూర్చిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
 7. డా.పిట్టానుండి
  ఆర్యా, ఇదివకటిదే ఈ సమస్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అవును! ఇప్పుడు మీకు వృత్తాన్నిస్తున్నాము అదనంగా! పూరించగలరు.

   తొలగించండి
 8. గణము లకాధి పత్యము గణుతి జేయ
  పలికె ముక్కంటి తనయుల భక్తి తెలుప
  తనరి ముమ్మారు గణపతి దరిని తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు
  ---------------------------
  ఇతర దేశము పోవగ వెతను బడుచు
  అయిన వారిని విడువంగ నసలు బాధ
  బరువు గుండెను బిగబట్టి యరట , తల్లి
  దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యగారూ!
   మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు!
   మొదటి పూరణలోని మొదటి పాదంలో "గణములకు నాధిపత్యము..." అనండి.

   తొలగించండి
 9. మైలవరపు వారి పూరణ

  విద్యాదాత... జనిత... కన్యాదాత....వీరెల్లరు తండ్రులే

  చక్కని విద్యనేర్పిన విశాల యశోనిధి గాధిపుత్రు , నా
  ప్రక్కనె కన్నతండ్రి యగు పంక్తిరథున్, మిథిలేశుఁ జేరియున్
  మిక్కిలి యాదరమ్మున వినీతుడునై రఘురామచంద్రుడున్
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపువారూ!
   (జనితా చోపనేతా చ, యస్తు విద్యాం ప్రయచ్ఛతిI
   అన్నదాతా భయత్రాతా, పంచైతే పితర: స్మృతా:II...శ్లోకార్థాన్ని జ్ఞప్తికి తెస్తూ) విద్యాదాత... జనిత... కన్యాదాత....వీరెల్లరు తండ్రులే యను భావనతో వినయశీలి శ్రీరామచంద్రుని గూర్చిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు!

   తొలగించండి
  2. అవధానులిద్దరూ ఒక్ పంధాలో నడిచారు! 👌👌👌🙏🙏🙏

   తొలగించండి

  3. సీతాదేవిగారు

   ఏమంటున్నారేమంటున్నారు ? రామయణ భారత కాలాన్ని వదిలి ముందుకు రావటంలేదంటున్నారా అవధానులిరువురూ ? :)


   నారాయణ
   జిలేబి

   తొలగించండి
 10. కనగ ప్రత్యక్ష దైవాలు కన్న వారె
  కలుగు వారి దీవెన తోడ కార్య సిద్ధి
  తప్పక యని తలచి మది తల్లియు మఱి
  "తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దనరావుగారూ!
   తల్లిదండ్రులపై భక్తినిగూర్చిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
 11. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఇది గతంలో 9-9-2017 నాడు ఇచ్చిన సమస్యయే. మతిమరుపు ఎక్కువైపోతున్నది.
  సాధారణంగా నేను మిత్రులు పంపిన సమస్యలను 'నోట్‍పాడ్'లో భద్రపరచుకొని, అవకాశాన్ని బట్టి ఇస్తూ, ఇవ్వగానే దానిని అక్కడినుండి తొలగిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు అలా తొలగించక మళ్ళీ ఎప్పుడో దానిని చూచి, గతంలో ఇచ్చిన విషయం మరిచిపోయి ఇస్తూ ఉంటాను. ఇలా చాలాసార్లు జరిగింది.
  ఇప్పటికే బ్లాగులోను, వాట్సప్‍లోను పూరణలు వచ్చాయి కనుక తొలగించలేను.
  అయితే ఆనాడు కేవలం తేటగీతి పాదాన్నే ఇచ్చాను. ఈరోజు వృత్తపాదం కూడా ఉంది కనుక మిత్రులు సమస్యను వృత్తంలో పూరించండి.

  రిప్లయితొలగించండి
 12. శశిని తను చేపట్ట చేసె ప్రతిన లక్ష్మణ కుమారు
  లక్షణంబుగ
  పాండవులకదె కాదు కౌరవుల కోడలిగ చేతుననె
  పౌరుషంబుగ
  బలరాముని పిలుపు మేర శశిని చూడ బయలెల్లె
  క్షాత్రమొప్పగన్
  మ్రొక్కె బతివ్రతా సుతుడు పూజ్యులు తండ్రులకెల్ల
  భక్తితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. చక్క ప్రతిజ్ఞ చేసెను సుసాధ్యము చేతును శౌరి పుత్రికన్
   ప్రక్కన నాదు గాదిలిగ పాటిగ నిల్పెద లక్ష్మణుండనే!
   తొక్కెద పాండుపౌత్రునిక దొమ్మిని మేలుగ గెల్తు భార్యగన్
   మ్రొక్కె బతివ్రతా సుతుడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్!

   జిలేబి

   తొలగించండి
 13. నిన్న తప్పని పరిస్థితుల్లో మిత్రునితో ఎండలో తిరిగి మళ్ళీ అస్వస్థుడనయ్యాను. ఈరోజు మిత్రుల పూరణలను సమీక్షించగలనో లేదో?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూర్తిగా విశ్రాంతి తీసుకొనండి! ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రయాణాలు పెట్టుకోకండి! మందులు సమయానుకూలంగా వేసుకొనండి! సాయంత్రం వరకు మామూలుగా అవుతారు!

   తొలగించండి
  2. గురుదేవులకు నమస్సులు! ఇదివరలో కూడ విజ్ఞప్తి చేసి ఉన్నాము! వయసును, ఆరోగ్యాన్ని, కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు చెయ్యండి! మీ శిష్యుల, మిత్రుల కొరకు!🙏🙏🙏🙏

   తొలగించండి
 14. మిత్రులందఱకు నమస్సులు!

  స్రుక్కఁగఁజేయఁ బాండవుల, ద్రోణుఁడు నిల్పెను తమ్మిమొగ్గర;
  మ్మొక్కఁడె దాఁ నెఱింగె నని, పుత్రుఁడునౌ నభిమన్యుఁ గోర, నా
  చిక్కినయట్టి సందుఁ గొని, చేయఁగ యుద్ధము, సమ్మతించియున్
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్!

  [తమ్మిమొగ్గరము = పద్మవ్యూహము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ముందు చిన్న వివరణము నిచ్చుట మఱచినాను.

   [ద్రోణుఁడు పన్నిన పద్మవ్యూహముం దెలిసిన ముగ్గురిలో, నర్జునుఁడు, శ్రీకృష్ణుఁడు సంశప్తకులతోడి యుద్ధమందుంటచే, మిగిలిన యభిమన్యునిఁ బద్మవ్యూహమును ఛేదింపఁగోరఁగా నతఁడు పెదతండ్రులకును, బినతండ్రులకును నమస్కరించి, యాశీస్సులందిన సందర్భము]

   స్రుక్కఁగఁజేయఁ బాండవుల, ద్రోణుఁడు నిల్పెను తమ్మిమొగ్గర;
   మ్మొక్కఁడె దాఁ నెఱింగె నని, పుత్రుఁడునౌ నభిమన్యుఁ గోర, నా
   చిక్కినయట్టి సందుఁ గొని, చేయఁగ యుద్ధము, సమ్మతించియున్
   మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్!

   [తమ్మిమొగ్గరము = పద్మవ్యూహము]

   తొలగించండి
  2. మీ పద్యము మనోహరము. అద్భుతము.
   👌🏻👏🏻💐

   తొలగించండి
 15. గ్రక్కున తమ్మిమొగ్గరము గందరగోళము సల్ప నేటికిన్
  దక్కెను భాగ్యమంచు కడు ధైర్యము తో నభిమన్య వీరుడే
  చక్కగ విల్లునంబులను చంకన బెట్టిచు సిద్ధమై వడిన్
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హర్షశ్రీ గారూ!
   తమ్మిమొగ్గరముం జేరఁగ సిద్ధమైన యభిమన్యుని యుత్సుకతనుం గూర్చిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు!

   తొలగించండి
  2. శ్రీహర్ష గారూ..బ్రహ్మాండం
   👌🏻👏🏻💐

   తొలగించండి
  3. మిమ్మల్ని హర్షశ్రీ అని సంబోధించినందులకు మన్నించండి శ్రీహర్షగారూ!

   తొలగించండి
 16. స్వల్పమార్పు (చేర్పు)తో:
  కనగ ప్రత్యక్ష దైవాలు కన్న వారె
  కలుగు వారి దీవెన తోడ కార్య సిద్ధి
  తప్పక యని తలచి మది తల్లియు మఱి
  "తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు"
  (వీరు డభిమన్యు డానాడు వింత యేమి?")

  రిప్లయితొలగించండి
 17. రామకార్యార్ధియై కపి రంకెవేసి
  లంక జేరను లంఘింప లవణజలము
  కొండ శిఖరము పై నుండి గొప్పగాను
  కార్య సఫలత కై తన కండగుండ
  తండ్రులకు మొక్కెను పతివ్రతా సుతుండు!

  శివునికి, సమీరునికి, కేసరికి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవిగారూ!
   కార్యసఫలతకై పితరులను మ్రొక్కిన యాంజనేయునిం గూర్చిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
  2. ధన్యవాదములు కవివర్యా! వమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించండి
  3. మైలవరపువారి సూచనతో చిరు సవరణ

   రామకార్యార్ధియై కపి రాజు వేగ
   లంక జేరను లంఘింప లవణజలము
   కొండ శిఖరము పై నుండి గొప్పగాను
   కార్య సఫలత కై తన కండగుండ
   తండ్రులకు మొక్కెను పతివ్రతా సుతుండు!

   శివునికి, సమీరునికి, కేసరికి!

   తొలగించండి
  4. చిఱు సవరణ తదుపరి మఱింతగా శోభిస్తున్నదండీ మీ పూరణ! అభినందనలు!

   తొలగించండి
 18. నిత్య సంధ్యను వార్చియు నిర్మలముగ
  నిత్య పూజలు చేయుచు సత్యమెఱిగి
  నిత్య భోజన విధులను నీమముగను
  "తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు"

  తండ్రులు = పితృ దేవతలు

  రిప్లయితొలగించండి
 19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2665
  *మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్.*
  పతివ్రత కొడుకు తన తండ్రుల కందఱికీ నమస్కారం చేశాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: అన్నదాత, భయమును పోగొట్టి రక్షించే భయత్రాత, విద్యాదాత, పుట్టుకకు కారణమైన జన్మదాత, ఉపనయనం చేసిన ఉపనేత ఈ ఐదుగురు తండ్రులుగా చెప్పబడుచున్న శ్లోకమును పెద్దలద్వారా వినియున్నాము కదండీ.
  అన్నదాతా భయత్రాతా
  విద్యాదాతా తథైవ చ ।
  జనితా చోపనేతా చ
  పంచైతే పితరః స్మృతాః ।।
  పతివ్రతయగు కుంతీదేవి కుమారుడు సవ్యసాచి అగు అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు విజయాన్ని కోరుకొంటూ తన తండ్రికి , తండ్రితో సమానమైన పెద్దలకు , గురువులకు భక్తితో మ్రొక్కిన సందర్భం.

  చక్కగ నన్నదాత, యనిశమ్ము భయమ్మును ద్రుంచు త్రాతయున్,
  జిక్కుల దీర్చు విద్యనిడు జీవనదాతయు, జన్మదాతయున్,
  నిక్కము మంత్రదాత యుపనేతయుఁ దండ్రులు ; సవ్యసాచి తా
  *మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (1-5-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ!
   పంచ పితరులకు వినమ్రుడై సవ్యసాచి మ్రొక్కినట్లుగా చేసిన మీ పూరణము అద్భుతంగా ఉన్నది. అభినందనలు!

   తొలగించండి
  2. అద్భుతము కోటావారూ
   👌🏻👏🏻🙏🏻💐

   తొలగించండి
  3. నాపై అభిమానంతో నా పద్యాన్ని గొప్పగా ప్రశంసించిన మధురకవి శ్రీ గుండు మధుసూదన్ గారికి, సహృదయులు శ్రీ విట్టు బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

   తొలగించండి
  4. బాగున్నది. అభినందనలు!
   పాఠాంతరమ్;(రెండవ పాదం)
   "యస్తు విద్యాం ప్రయచ్ఛతి"

   తొలగించండి
  5. అవధానులిద్దరిదీ ఒకే పంధా! 👌👌👌🙏🙏🙏

   తొలగించండి
  6. మరొక శ్లోకంలో జ్యేష్ఠభ్రాతను, కన్యాదాతను కూడా పితృసమః అని చెప్పియున్నారండీ
   శ్రీ జనార్దన రావుగారూ! నమోనమః

   తొలగించండి
  7. చాలా సంతోషమమ్మా
   శ్రీమతి సీతాదేవి గారూ! ప్రణామాలమ్మా.

   తొలగించండి


 20. జిలేబిని కోరి కపటాంజలి జీపీయెస్ వారి ఆలోచన

  గ్రక్కున కాళ్ల పైన బడి, గాలము వేయ జిలేబికిన్ భళా
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్
  మిక్కిలి మోద మున్ గనెను మేవడి చూడన, బామ్మ చెప్పెగా
  చక్కటి యొజ్జ యీతడుసజావుగ నీతని కిత్తుమయ్యరో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ!
   కపటాంజలితో జిలేబీకి గాలం వేయాలనుకొనే పెండ్లికొడుకు వినయం నిజమైనదిగా భావించిన బామ్మ సమ్మతించి చెప్పిన మాటలుగా గూర్చిన మీ పూరణము చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
  2. 👌👌👌. కపటాంజలి బామ్మను మోసం చేయవచ్చునేమో గాని జిలేబిగారిని చేయ సాధ్యమా!! 😜😜😜

   తొలగించండి

  3. విట్టుబాబు గారికి గుండు వారికి నెనరులు

   సీతాదేవి గారు

   సాధ్యమై జంబునాథన్ కృష్ణస్వామి అయ్యరుగారు మమ్మల్ని మరీ సాధించేస్తున్నారండీ మరీనూ యాబ్గై సంవత్సరాల పై‌బడి ది ఒన్ అండ్ ఓన్లీ హౌస్ బ్రాండ్ గా :)


   నెనరులు

   జిలేబి

   తొలగించండి
 21. డా.ఎనన్.వి.ఎన్.చారి
  అక్కున జేర్చుకొంచుతగు నాశ్రయ మిచ్చి యనాధ పిల్లలన్
  చక్కగ తామెతండ్రులుగ సాకెడి సోదర బృందమున్ సదా
  మిక్కిలి భక్తి భావమున మేలొనరించిన వారిపాదముల్
  మ్రొక్కె పతివ్రతాసుతుండు పూజ్యులు
  తండ్రులకెల్లభక్తితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ!
   చాలా బాగున్నదండీ మీ పూరణ. అభినందనలు!
   యనాథ (పొట్టలోఁ జుక్క), సుతుఁడు (సుతుండు కాదు) ... అనండి.

   తొలగించండి

 22. తే.గీ.

  తలచి కోదండ రాముని తండ్రి గాను,

  జనకుని సుత సీతమ్మని జనని గాను

  రామ పాదాలు గైకొని రాజ్యమేలు

  టకు వెడలు సమయమునను సకల సుగుణ

  రాశి భరతుండు మిగుల భార హృదిని తలి

  దండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు


  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ!
   భరతుడు తల్లిదండ్రులకు మ్రొక్కెనన్న మీ పూరణ బాగున్నదండీ. అభినందనలు!
   ౧. దండ్రి గాను...
   ౨. జనక సుతను సీతమ్మను..
   ౫. భరతుడు మిగుల భారహృదిని...
   అని సవరించండి.

   తొలగించండి
 23. పెద్ద చదువుల కొఱకునై పేరి శాస్త్రి
  పితరు డాదిగా గలయట్టి ,పెద్దలైన
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు
  దాను బోవుచు నమెరికా తదియ నాడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావుగారూ!
   పెద్దలైన పితరులకు మ్రొక్కి, అమెరికాకు బోయెనని చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
 24. ఉత్పలమాల

  అక్కున జేర్చి ముద్దులిడి యార్తిని బెంచిన కైక మాతయే
  దక్కెడు పీఠమున్ విడచి దావము నేగగ తండ్రి మాటనన్
  నిక్కముఁ దెల్సి రాముడట నీమముఁ దల్చుచు వంశపెద్దలన్
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుందండీ! చక్కని పూరణ! 👏👏👏🙏🙏

   తొలగించండి
  2. సహదేవుడు గారూ!
   శ్రీరాముని పరంగా నొనర్చిన మీ పూరణము చాలా బాగున్నదండీ! అభినందనలు!
   వంశపెద్దలు దుష్టసమాసము. వంశవృద్ధులన్, (తర్వాత కామా) అనాలి.

   తొలగించండి
  3. ఆర్యా!ధన్యవాదములు. తమరి సవరణ శిరోధార్యం.

   సవరించిన పూరణ :

   అక్కున జేర్చి ముద్దులిడి యార్తిని బెంచిన కైక మాతయే
   దక్కెడు పీఠమున్ విడచి దావము నేగగ తండ్రి మాటనన్
   నిక్కముఁ దెల్సి రాముడట నీమముఁ దల్చుచు వంశవృద్ధులన్,
   మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్.

   తొలగించండి
  4. వారి మరో సవరణతో:

   అక్కున జేర్చి ముద్దులిడి యార్తిని బెంచిన కైక మాతయే
   దక్కెడు పీఠమున్ విడచి దావము నేగగ తండ్రి మాటనన్
   నిక్క మెఱింగి రాముడట నీమముఁ దల్చుచు వంశవృద్ధులన్,
   మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్.

   తొలగించండి
  5. సవరించిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
 25. గ్రక్కున పార్థ సూను డు పరాక్రమ శాలి గ సిద్ద మ య్యేగా
  నిక్కపు వీరు డై వె డ లె నేరుపుమీర గ సంగరం బు న న్
  చక్కని నైపుణీ పర త సాగెద ట oచు విన మ్ర శీలి యై
  మ్రొక్కేప్త తి వ్రతా సు తు డు పూజ్యులు తండ్రుల కె ల్లభక్తి తో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర్ రావు గారూ!
   అభిమన్యుని పరాక్రమముతోడి, వినయగుణాన్ని వర్ణిస్తూ చేసిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
 26. తేటగీతి
  తీర్థయాత్రల నలరించు దీక్షతోడ
  కన్నవారికి కావడి మిన్న యనుచు
  నవని శ్రవణ కుమారుడు నంధ తల్లి
  దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి సూచిత సవరణతో :

   తీర్థయాత్రల నలరించు దీక్షతోడ
   కన్నవారికి కావడి మిన్న యనుచు
   కోరి శ్రవణ కుమారుడు గ్రుడ్డి తల్లి
   దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

   తొలగించండి
  2. సహదేవుడు గారూ!
   శ్రవణకుమారుని పితృభక్తిని ప్రకటించుచు చేసిన మీ తేటగీతి పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ!
   గణపతిని గూర్చిన మీ పూరణము బాగున్నది. అభినందనలు!
   మొదటి పాదంలో గజముఖుడే ఘటికుడన, సు ...అనండి.
   రణమనన్ శివనామ శరణని తల్లి/దండ్రులకు ... అనండి

   తొలగించండి
 28. సత్కులాభిజాతుఁడు వర సద్గుణుండు
  వేద విధ్యాధ్యయన సువివేక సుప్ర
  భావిత మనస్కుఁ డంత సద్భక్తిఁ దల్లి
  దండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు


  చిక్కఁగ సింధు రాజునకుఁ జేవ కృశించ శివప్రదద్యుతిం
  జక్కఁగ వేఁడఁ బాండవులు సమ్మతిఁ దెల్పి రయమ్ము భక్తినిం
  బ్రక్కన నిల్చి వీరుఁ డభిమన్యుఁడు వ్యూహ విభేద నార్థి యై
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 9/9/2017 నాటి పూరణ:

   ఉత్తరా దిశా గత గజాస్యోత్తమమ్ము
   ప్రీతి నతికించి బ్రతికించి శీత గిరి త
   నయకుఁ బ్రీతి జేయ హర తనయుఁడు తల్లి
   దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

   తొలగించండి
  2. సుకవి మిత్రులు పోచిరాజువారూ!

   మీ మూడు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు!
   రెండో పూరణలో కొంత అన్వయ క్లిష్టత ఉన్నట్టుగా ననిపిస్తున్నది. బహుశః నా అవగాహనా లోపమే కావచ్చును!

   తొలగించండి
  3. కవి పుంగవులు మధుసూదన్ గారు నమఃపూర్వక ధన్యవాదములు.
   శివప్రదద్యుతిం - సింధు రాజునకుఁ- చిక్కఁగ - బాండవులు జేవ కృశించ - వేఁడఁ - జక్కఁగ నభిమన్యుని .. అని నా భావమండి.

   తొలగించండి
 29. ఓనరు, ప్రిన్సిపాలు, టీచరు (ముగ్గురు "తండ్రులు"):

  చెక్కును లాగుకొంచొకడు చెంతను దాచుచు సీటునివ్వగా
  ముక్కును పట్టుకొంచొకడు ముప్పది గుంజిలు తీయరాయనన్
  గ్రక్కున ఛందమున్ గరపి కందము సీసము వ్రాయుమోయనన్
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్

  రిప్లయితొలగించండి

 30. గణ పదవికి నర్హుడు, మన గజముఖుడు,సు
  గుణ మయుడు మయూఖుడు చిరుగోమున ,మరి
  రణమన, శివపార్వతి చరణముల, తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ!
   మూడో పాదంలో గణభంగం అలాగే ఉన్నది.
   "ననిని శివపార్వతుల చరణముల, దల్లి" అనండి (అఖండయతి)

   తొలగించండి
 31. ఈరోజు మిత్రుల పూరణలను సమీక్షించిస్తున్న మధురకవి గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అంతా మీ దయ! అంతా మీదయ!
   మీ అనారోగ్యం పుణ్యమా అని నాకు నేఁడు శంకరాభరణ పూరణలను సమీక్షించే భాగ్యం దక్కింది.
   మీ దయ నా ప్రాప్తం!
   ధన్యవాదాలు!

   తొలగించండి
 32. పార్వతీ,సుందర సుతపంపాపతినిచ
  దువుటకొరకు పట్నానికిదూరమంప
  తీరికగ నేర్చి ప్రథమ నుత్తీర్ణుడవగ?
  అవ్వ,తాతకు,గురువుకు నచటితల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతి-వ్రతాసుతుండు (పంపాపతి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్పగారూ!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు!
   సమస్యలో విఱుపు అవసరం లేదనిపిస్తున్నది.

   తొలగించండి
 33. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  ధిక్కరి జీల్చు కేసరి గతిన్ రిపువర్గ విదారణమ్ము నే

  నొక్కడనే యొనర్చెద , మహోజ్జ్వల సాయక వహ్ని చేత | బ

  ల్మక్కవ గల్గి నాపయి , దురంబున కంపగ జంకవద్దు | స్వ

  ర్దృక్కుని పౌత్రుడన్ | గనుక , దీవెన లిచ్చుచు నన్పు మంచు తా

  మ్రొక్కెను పెద్దతండ్రికిని | మ్రొక్కెను మోద మెసంగు చుండ నా

  ప్రక్కన పిన్నతండ్రులకు , పార్థసుతుం డభిమన్యు డెంతయున్ |

  " మ్రొక్కె పతివ్రతా సుతుడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తి తోన్ "


  { స్వర్దృక్కు = ఇంద్రుడు }


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్త్యాచారిగారూ!
   అభిమన్యుని అవక్రపరాక్రమమును, వినయసంపదను వెలార్చు మీ పూరణ మద్భుతముగ నున్నది. అభినందనలు!

   మ్రొక్కెను పెద్దతండ్రులకు అంటే బాగుంటుందేమోనండీ! ఎందుకంటే ఇద్దఱు పెదతండ్రులున్నారు గదా!

   తొలగించండి
  2. గు రు మూ ర్తి ఆ చా రి
   ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


   మధురకవి గారికి పదనమస్కృతులు ధన్యవాదములు

   మీసూచన మేరకు సవరణ


   ధిక్కరి జీల్చు కేసరి గతిన్ రిపువర్గ విదారణమ్ము నే

   నొక్కడనే యొనర్చెద , మహోజ్జ్వల సాయక వహ్ని చేత | బ

   ల్మక్కవ గల్గి నాపయి , దురంబున కంపగ జంకవద్దు | స్వ

   ర్దృక్కుని పౌత్రుడన్ | గనుక , దీవెన లిచ్చుచు నన్పు మంచు తా

   మ్రొక్కెను పెద్దతండ్రులకు | మ్రొక్కెను మోద మెసంగు చుండ నా

   ప్రక్కన పిన్నతండ్రులకు , పార్థసుతుం డభిమన్యు డెంతయున్ |

   " మ్రొక్కె పతివ్రతా సుతుడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తి తోన్ "


   { స్వర్దృక్కు = ఇంద్రుడు }

   తొలగించండి
  3. ఆచారి గారూ! సవరణ పిదప మీ పూరణము అద్భుతంగా ఉన్నదండీ! అభినందనలు!

   తొలగించండి


 34. రమేశు గారి భావనకు


  చక్క ప్రతిజ్ఞ చేసెను సుసాధ్యము చేతును శౌరి పుత్రికన్
  ప్రక్కన నాదు గాదిలిగ పాటిగ నిల్పెద లక్ష్మణుండనే!
  తొక్కెద పాండుపౌత్రునిక దొమ్మిని మేలుగ గెల్తు భార్యగన్
  మ్రొక్కె బతివ్రతా సుతుడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 35. తేటగీతి
  జానకీ స్వయంవరమున మౌనిఁ జూచి
  శివుని విలుఁ ద్రుంచ రాముఁడుచిరునగవుల, 
  సిగ్గుపడెడు సీత దరికి చేరు తల్లి
  దండ్రులకు మ్రొక్కెను పతివ్రతాసుతుండు

  రిప్లయితొలగించండి
 36. ఒక్కడు బోవగా నిటలి యొండొరులేరినిసంప్రదించకే
  యక్కడ మంచిగా జదువు నాయతరీతిని సాగుకోరికన్
  మిక్కుటమైన ప్రేముడిని,మీరక హద్దులు నిండు భక్తితోన్
  మ్రొక్కెను బతివ్రతాసూనుడుాపూజ్యులు తండ్రులకెల్ల భక్తితోన్

  రిప్లయితొలగించండి
 37. గ్రక్కున ద్రోణు పన్నగము గందర గోళము జేయుభాగ్యమే
  దక్కెను నాకనంచు కడు ధైర్యము తోడను ముందుకేగగన్
  మక్కువ జూపుచున్న యభిమన్యుడు ముందుగ జేరి శ్రద్ధతో
  మ్రొక్కె బతివ్రతాసుతుడు పూజ్యులు తండ్రులకెల్ల భక్తితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించిగారూ!
   అభిమన్యుని ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
 38. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దశరధాస్త్రమునకు జిక్కి తనువు వీడు
  సమయమందు సద్గతులొందు చవిని గూడి
  శ్రావణుడు భక్తితోడ యుల్లమున తల్లి
  తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడివారూ!
   శ్రవణ కుమారునిం గూర్చిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

   తొలగించండి
 39. సుయోధనుడు కర్ణునకు అంగరాజ్యమొసంగి తమ వంశములో దైవసమానులైన వారి ప్రతిమల జూపు సందర్భము...

  ఉత్పలమాల
  నిక్కకు సూతపుత్ర! యిట నిల్వ ననర్హుడ వన్న, పెద్దలున్
  బిక్కమొగమ్ము వేయ కురువీరుడు నంగదఁ గర్ణుడేలగన్
  దక్కఁగఁ జేసి, చూపగను దైవసమానుల వంశమూర్తులన్
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ!
   కర్ణుని ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగున్నదండీ! అంగద అనకుండా అంగను అంటే అర్థం స్పష్టంగా కుదురుతుంది. అభినందనలు!
   అరసున్నాలు వాడినందులకు సంతోషమగుచున్నది. మీ పూరణములోనే మఱికొన్నిచోటులందు నవసరము! పరిశీలింపుఁడు.

   నిక్కకు సూతపుత్ర! యిట నిల్వ ననర్హుఁడ వన్న పెద్దలున్
   బిక్కమొగమ్ము వేయఁ గురువీరుఁడు నంగనుఁ గర్ణుఁడేలఁగన్
   దక్కఁగఁ జేసి, చూపఁగను దైవసమానుల వంశమూర్తులన్
   మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్~!

   ఎక్కడెక్కడ అరసున్నాలున్నాయో గమనించి, అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇకముందు చక్కగా వ్రాయగలుగుతారు.

   స్వస్తి

   తొలగించండి
  2. ఆర్యా! ధన్యవాదములు. ఇంత శ్రమ తీసుకుని సమీక్ష చేసినందులకు నుతులు మరియు నతులు.
   🙏🙏🙏

   తొలగించండి
  3. మరింత బాగుంటుందని శ్రీమైలవరపు వారి కామెంట్ చూచిన తర్వాత చేయాలనిపించిన సవరణతో:

   కవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారి సూచిత సవరణలతో

   నిక్కకు సూతపుత్ర! యిట నిల్వ ననర్హుఁడ వన్న పెద్దలున్
   బిక్కమొగమ్ము వేయఁ గురువీరుఁడుఁ గర్ణున కంగరాజ్యమున్
   దక్కఁగఁ జేసి, చూపఁగను దైవసమానుల వంశమూర్తులన్
   మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్!

   తొలగించండి
 40. అనారోగ్యం కారణంగా రోజంతా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఇప్పుడే మొదటి సారిగా నా అంకోపరిని తెరిచాను. మిత్రుల పూరణలు కొన్ని చదివాను. గుండు మధుసూదన్ గారు, మిగిలిన మిత్రులు పూరణలను సమీక్షించి, సాహితీ చర్చలు చేసినందుకు ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. రేపటికి నా ఆరోగ్యం కుదుటపడుతుందని భావిస్తున్నాను. దేవుని దయ, మీ శుభకామనలు!

  రిప్లయితొలగించండి

 41. .. ..సమస్య
  మ్రొక్కెఁ బతివ్రతా సుతుఁడు
  పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్

  సందర్భము: అందరూ పుట్టిన తర్వాత యుద్ధ విద్య లభ్యసిస్తే తల్లి గర్భంలో వుండగానే తమ్మి మొగ్గరం కకావికలు చేయడ మెలాగో నేర్చుకున్న జన్మతః వీరుడు అభిమన్యుడు. కాబట్టి అతని కున్న ఆత్మ విశ్వాసం సామాన్యమైన దేమీ కాదు.
  ఐతేనేం సూటిగా పోయేవాడే తప్ప అసూయా ద్వేషాలతో అక్కసుతో మోస పూరితంగా శత్రువులు కుమ్మక్కై మట్టుపెట్టుతా రన్న విషయం యెఱుగని యమాయకుడే!
  అతడు యుద్ధ రంగానికి బయలుదేరుతూ తండ్రులకు నమస్కరించినాడు.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  చక్కని వాడు.. జాబిలికి..
  చల్లదనాలు బహూకరించు వా..
  డొక్కడె తమ్మి మొగ్గరము
  నొప్పుగఁ జీలుప నేర్చికొన్న వా..
  డక్కసు లెట్టివో యెఱుగ..
  డర్భకు.. డాజికి సిద్ధ మాయెనే!
  మ్రొక్కెఁ బతివ్రతా సుతుఁడు
  పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 42. డా. వెలుదండ వారూ,
  మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 43. ప్రక్కన తమ్ములుండగను రాజ్యము వీడి యుధిష్ఠురుండటన్
  గ్రక్కున జేరుచున్ యమున కర్మలు జేయుచు శాస్త్రరీతినిన్
  మ్రొక్కెఁ బతివ్రతాసుతుఁడు పూజ్యులు తండ్రుల కెల్ల భక్తితోన్;...
  చక్కగ జేసి పూరణను చల్లగ నిత్తరి నిద్రవోయెదన్ :)

  రిప్లయితొలగించండి