7, ఆగస్టు 2016, ఆదివారం

పద్మావతీ శ్రీనివాసము - 22




పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
పంచమాశ్వాసము (81-100)

వన మందు మము జేరి పల్కెను వకుళ
తన నామ మని వనిత మిము నడుగగ                                81

వేంకట గిరివాసి వేగ మిచ్చటికి
పంకజాక్షీ గొని వచ్చితి మమ్మ                                            82

ఇద్దేవి నిచటకు నీప్సిత మేమి
యిద్ద చరిత్రకు నీవ యడుగుము                                        83

వారి మాటలు విని వసుధాసతి గని
వారిజాక్షిని దగఁ బల్కె నీ రీతి                                              84

ఎవ్వరి దానవు హిత మేది నీది
యవ్వ వచింపు సత్యము దీర్చెద నన                                  85

వకుళ నా నామంబు వసుధేంద్ర పత్ని
సకలము నుడివెద సత్యము వినుము                                 86

వేంకటాద్రి నివాసి విభుడు మా కతడు
పంకజాక్షుడు శ్రీనివాసుండు ఘనుడు                                  87

వేటకై యొకనాడు విపినమ్ము వెడలె
పాటవమ్మున శ్వేత వాహమ్ము నెక్కి                                  88

మృగ గజ సింహాది మేటి జంతువుల
సొగసైన కలకంఠ శుక సంచయముల                                 89

కాంచుచు మాస్వామి గజరాజు ననుస
రించుచు నుండె కరేణు సహితను                                       90

వన వనము లరిగి వనజాక్షు డంత
కనె శంఖణ నృపతి ఘన తాపసునట                                  91

శ్రీభూసహితముగ స్థిరముగ నిల్పి
భూభృత్తు నందు నింపుగ జనార్దనుని                                 92

చారు సరస్సది శంఖనాగ బిల
మారామ శోభిత మాతటి యందు                                      93

అర్చన లొనరించు నా భూపతిఁ గని
చర్చిత గాత్రుడు సైంధవము దిగి                                        94

రాజ వేషమున నారాజు నడిగె వి
రాజమాన నృప వరా భూధరమున                                    95

నీ చేయు పని యది నే నెరుగంగ
వాచాతిశయముల పల్కగ రాదె                                         96

నావిని యనె శంఖణ నృపుండు నంత
నావిభు శ్వేత మహారాజు సుతుడ                                      97

హైహయ దేశమ్ముహరిభక్త వరుడ
నాహవ నమ్ముల నాచరించితిని                                        98

మిక్కుటముగ భక్తి మీరంగ నేను       
మక్కువ తోడఁ గమల నాధునిఁ గన                                   99

విష్ణు దర్శన కాంక్ష విస్తృత మయ్యె
తృష్ణ తీరగ నోచఁ గృపఁ జూడడాయె                                     100

2 కామెంట్‌లు:

  1. పోచిరాజు కామేశ్వరరావు గారు మీ ద్విపద కావ్యం పద్మావతీ శ్రీనివాసం చాలా బాగుంది ధన్య్యవాదములు -వడ్డూరి రామకృష్ణ

    రిప్లయితొలగించండి