4, ఆగస్టు 2016, గురువారం

పద్మావతీ శ్రీనివాసము - 19పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
పంచమాశ్వాసము (21-40)

హయమున వేగ దివ్య రమణి వోలె
నయనమ్ములకు నింపన దయ జేసితివి                               21

నావిని పల్కె నానందము గల్గ
నే వేంకటాచల నిలయమ్ము దాన                                        22

వకుళ నామంబునఁ బరగుదేను బెద
రక సుంత యాకాశ రాజు దేవేరి                                           23

ధరణీ సతిఁ గన కదలి వచ్చి తిటకు
నరయ గలనె నేను నాదేవి నిపుడు                                     24

వనిత మాటలు విని వారిజాక్షులు
వినయముగ ననిరి వీలగు నంచు                                      25

పల్కి యివ్విధి వా రవనిపతి గృహము
కల్కి వకుళ గూడి కదలి జేరంగ                                          26

పుర వీధి గుంజా విభూషిత శబరి
చరియించ వీపునఁ జంటిపాప నిడి                                      27

సోది చెప్పెద నంచు సుదతి భాషింప
నాదరమ్మున పిల్చె నా రాజ పత్ని                                     28

రాజ సౌధమునకు రమణి చెంచితను
భాజనీ యాపర్ణ వర శూర్ప మందు                                    29

ముత్తూము ముత్తియములఁ బోసి సోది
కత్తియఁ జూచి నిక్కము సెప్పు మనియె                             30             

చేటలోఁ బోసిన చెన్ను ముత్యముల
సూటిగ మూడు రాసులు సేసి  రాణి                                  31

జరుగఁ బోయెడి వాని జక్కగఁ జెప్పు
తరుణీ యనంగ మధ్యపు రాసినిఁ గద                               32

నీవు దలచితివి నీరజాక్షి యన
భావము సెప్పుము పడతి నిజమది                                33

ధన రాసు లిత్తు సుదతి నీకు నిజము
ను నుడివిన నన మానుగఁ బల్కె శబరి                            34

తల్లి మరి శిరో రత్న మది నీయఁ గదె
కల్ల కాదు సుమి వక్కానింతు నిజము                              35

నావిని రాణి మీనాక్షి పాయసపు
సౌవర్ణ పాత్రను శబరికి నిచ్చె                                            36

క్షీరాన్నము తినిపించి సుతున కంత
ధారాళముగను సత్యము చెప్ప దొడగె                               37

భవదీయ నందన పద్మావతీ
నో వాంఛ నెరుగంగ నోడఁ జింతితవు                                  38

తన యాకులతకు సంతాపమ్ము వలదు
వనమందు గాంచెను వర పురుషు ఘను                          39

వేంకటాద్రి నివాసు విష్ణు సన్నిభుని
సంకట హరణుండు శార్ఙ్గ ధరుండు                                    40

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి