పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
పంచమాశ్వాసము
(61-80)
ధరియింత్రు పండ్రెండు ధవళ పుండ్రముల
పరి తుష్టులితరులు భాగవతులును 61
కేశవ నామ సంకేతము లవియ
నాశన మొనరించు నానాఘములను 62
ఫాలము నుదరము వక్షము కంఠ
నాళము జఠరము నడుమ పార్శ్వముల 63
భుజ యుగమును గళపు వెనుక తటిని
భుజముల పైన నింపుగ ద్వాదశములు 64
నామము లెల్ల దనర నడి నెత్తి
పైమరి వాసుదేవ యన నుతింత్రు 65
నిత్యాగ్నిహోత్రులు
నిజ భాగవతులు
సత్య సంధులె యనిశము భాగవతులు 66
నిజదార రతు లవనిని భాగవతులు
సుజనాళి సుముఖులు సుమ భాగవతులు 67
పరదారలం దలుపరు భాగవతులు
నిరతాధ్యయను లవనిని భాగవతులు 68
పర నిందలను సలుపరు భాగవతులు
పర ధన మపహరింపరు భాగవతులు 69
భూత గణ హితు లెపుడు భాగవతులు
వీత రోషులును భువిని భాగవతులు 70
మూల మంత్రమ్మును బురుష సూక్తంపు
జాలము పిమ్మట జాతవేద మను 71
ఘన మంత్రము పఠించి క్రమముగ భక్త
జనులెల్ల ధరియింత్రు శంఖ చక్రములు 72
బాగవతుల యంద పరమాత్ము డుండు
నా గరుడ గమను నంద లగ్నంబు 73
నాదు చిత్తము దల్లి నారాయణ సుమ
పాదము లింపుగ బడయఁ జింతింపు 74
శ్యామల వర్ణుని స్మరియింతు నతని
నామమ్ము దలతు నన్య నరుల నొల్ల 75
నాపల్కి యంబుజానన మిన్నకుండె
వేపమాన హృదయ విహ్వల గాత్రి 76
నావిని హరి దర్శన విధి యెయ్యదని
భావించ సాగెను వసుధాసతి మది 77
అంత సద్విజులు శివార్చనఁ జేసి
చెంతఁ జేరంగఁ బూజించి సద్విధుల 78
దీటైన ధనమిచ్చి దీవన లంది
బోటుల చెంత పూబోడినిఁ గాంచి 79
రాజ కన్నియల నరసి రాజ పత్ని
పూజార్హ మైన యిప్పొలతి యెవ్వ రన 80
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి