పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
షష్ఠాశ్వాసము
(21-40)
విభు చెంత కేగియు పెండ్లికై తరలి
విభవమ్ము తోడ రా వివరించ మనియె 21
నాపల్కి మరి రాజనందన కీర
మా పడతికి దూత యన నిచ్చి పంపె 22
తదుపరి క్ష్మాపతి తనయునిఁ బంపె
త్రిదశాధినాధుఁ దోడ్తేరగఁ బ్రీతి 23
విశ్వకర్మను బిల్చి పృధ్వీ విభుండు
విశ్వాసమున పుర వీధుల నెల్ల 24
శోభాయ మానము సుందర తరము
వైభవోపేతము వఱుపంగఁ బనుపె 25
వసుమతీశునిఁ దనుపగ విశ్వకర్మ
వెస నలంకరణము వీటినిఁ జేసె 26
పురుహూతు డొసగెను బుష్ప చయమ్ము
సుర కన్య లాడిరి సుందరముగను 27
ధనదుండు వంపెను ధన ధాన్యములను
యిన సుతుం డింపుగ నిచ్చె నరుజము 28
వరుణుండు వంపెను బద్మరాగముల
సుర లెల్ల జని రంత సుమహాద్రి వృషము 29
రాజానుమతిఁ బొంది రయమున కీర
రాజముతో వకుళ హయ మెక్కి సనె 30
ఆ వృషభాద్రి నాహ్లాద ముప్పొంగ
దేవాలయమ్మున దేవదేవుఁ గని 31
సానుకూలము లాయె సకల కార్యములు
వీనుల విందుగ వినిపించు శుకము 32
పరిణయ విషయ మీ పతగ రాజమ్ముఁ
గరుణను వినుమనె కలికి యా హరిని 33
అనవుడు శ్రీహరికనియె నా చిలుక
వినయమ్ము లొలుకంగ వినతులు జేసి 34
అతివ పద్మావతి యాడిన నుడులు
సతతమ్ము నీ నామ సంకీర్తనమ్మె 35
తలతును నిత్యము తమరూప మేను
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 36
వెలయు నా దేహమ్ము విహిత పుండ్రముల
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 37
కొలుతు నీ భక్తులఁ గుశలమ్ము నరసి
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 38
సలలిత పంచ సంస్కారులఁ గొలుతు
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 39
మెలగెద నెప్డు నీమెచ్చు కార్యముల
నలినాక్ష కరుణించి నను స్వీకరించు 40
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి