16, ఆగస్టు 2016, మంగళవారం

పద్మావతీ శ్రీనివాసము - 30




పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
సప్తమాశ్వాసము (61-74)

మామగారిని జూచి మహనీయు డంత
ప్రేమగ నడిగె ధాత్రీపతి కోర్కి                                                                 61

నిశ్చల భక్తియ నీరజాక్షు పయి
నిశ్చయముగ వేడె నృపతి వరుండు                                                    62  

కరుణించె వరమును కరుణా మయుండు
ధరణీపతికి యంత దామోదరుండు                                                     63

ఆమంత్రణము నంది యబ్ధి శయనుడు
సామరావళి వృషభాద్రి తటమున                                                       64  

దేవేరు లరిగిరి దివ్య ధామంబు           
దేవ దుందుభు లంత దిశలెల్ల మ్రోగ                                                    65

పరమేష్ఠి ముగియించి వైవాహికమ్ము
కరమొప్ప కీర్తించె గరుడ వాహనుని                                                   66

వాసవాది యమర వరులెల్ల వొగడ
వ్యాససుత శుక సంయమి నుతియింప                                             67  

శ్రీభూజ సహితము సింహాసనమున
వైభవ మొప్పంగ వైకుంఠు డుండె                                                      68

సత్కారములు సేసి శౌరి నాకౌక
సోత్కరముల చన నొసగె ననుమతి                                                   69

సేవింప కందుడు శ్రీనివాసుడు
థా విధి విహరించె తద్గిరి తటిని                                                         70

వేంకట గిరి యందు వెలసి నిత్యమ్ము
సంకట హరణమ్ము సలుపు భక్తులకు                                                71  

విన్నను జదివిన వేంకటేశు కథఁ
గ్రన్నన శుభములు కల్గు నెల్లరకు                                                     72

దురితమ్ము లన్నియుఁ దొలగు నిక్కముగ      
పరఁగును సిరులెల్ల భాసురముగను                                                  73

పద్మావతీ శ్రీనివాస పాపహర
పద్మనాభా పరాత్పర పద్మ నయన                                                   74

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన
పద్మావతీ శ్రీనివాసమున  సప్తమాశ్వాసము.
పద్మావతీ శ్రీనివాసము సంపూర్ణము.

6 కామెంట్‌లు:

  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఆంధ్ర భాషా ప్రాభవ కాంక్షమాణాభిమాన చేతస్కులు నౌత్సాహిక కవిచయ ప్రోత్సాహక మానసులునై నిస్వార్థ నిరపేక్ష హృదయులునై పద్మావతీ శ్రీనివాసమును మనోహర ధారావాహికగ ప్రచురించిన మీ మహోన్నత వ్యక్తిత్వమునకు శత సహస్రాధిక కృతజ్ఞతాభివందనములు.
    సప్తాంబోధిపరీతమైన భూవలయ ప్రజానీకమును, విశేషించి మన కవిపుంగవ కుటుంబములను కరుణా కటాక్ష వీక్షణములతో తరింప జేయవలెనని సర్వాంతర్యామియైన పద్మావతీ శ్రీనివాసుని వేడుకొంటున్నాను.
    ఈ ద్విపద కావ్యము లోని గుణములను స్వీకరించి దోషములున్న తెలియ పరచవలెనని కోరుకుంటున్నాను.
    భవదీయుడు
    పోచిరాజు కామేశ్వర రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మావతీ శ్రీనివాసం ద్విపద రమణీయముగా నున్నది.. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారు పరిపూర్ణ శ్రీనివాస కృపా సంపన్నులు.. మరిన్ని కృతి సుకృతాలతో శ్రీ పదార్చన చేయగలరని అభిలషిస్తూ... మురళీకృష్ణ

      తొలగించండి
    2. పద్మావతీ శ్రీనివాసం ద్విపద రమణీయముగా నున్నది.. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారు పరిపూర్ణ శ్రీనివాస కృపా సంపన్నులు.. మరిన్ని కృతి సుకృతాలతో శ్రీ పదార్చన చేయగలరని అభిలషిస్తూ... మురళీకృష్ణ

      తొలగించండి
    3. ధన్యవాదములండి మురళీకృష్ణ గారు.గారు . రామచంద్ర శతకము, పోచిరాజ శతకము లను వ్రాసితిని. నా బ్లాగు లో చూడ గలరు.

      తొలగించండి
  2. శ్రీయుత కామేశ్వర రావు గారికి నమస్సులు...మీ ధారావాహిక అద్భుతంగా సాగిపోయినది... అభినందనలు...మరిన్ని కృతులు మీనుండి అందుకోగలమని ఆకాంక్షిస్తున్నాను...

    రిప్లయితొలగించండి