పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
చతుర్థాశ్వాసము
(81-100)
మృగముల జూచుచు మృగశాబనయన
మృగరాజులను ఖడ్గమృగముల కపుల 81
గోమాయు భల్లూక కుంజరములను
భీమశరభములఁ బెద్ద పులులను 82
సారస పిక శుక చక్రవాకముల
గారవ మొప్పంగఁ గాంచుచు నంత 83
స్వర్ణముఖరిఁ గుంభసంభవుఁ గొల్చి
పర్ణశాల సదాశివ భజన జేసి 84
శుక వనమున వ్యాససూనుఁ బూజించి
బకరిపు బలరామ పదములు మ్రొక్కి 85
పద్మసరోవర వనములఁ దోగి
పద్మములఁ గొని యబల సేద దీరె 86
దినమంత పయనించి దినకరు డలసి
వనజములు గుములఁ బశ్చిమాద్రి సనె 87
కలువలు వికసించెఁ గాంతు శశి గని
సలిపె నృత్యమ్ములు చక్రవాకములు 88
శార్వర మూనె దిశల సద్దు మణిగె
సర్వులు సుఖనిద్ర సల్పిరి జగతి 89
చక్కగ తెలవారె శార్వరి గడువ
కొక్కురో యంచు కుక్కుటములు గూయ 90
అరుణ కాంతులు వనమంత విరిసెను
తరుణి వకుళ యంత త్వరపడి సాగె 91
దివ్య సతి వకుళా దేవి వేగముగ
భవ్యారణీ నది పశ్చిమ తటిని 92
చేరి కాంచె నపుడు శృంగార వతుల
భూరి రాజ ద్వారము వెడలివేగ 93
దైవ సన్నిధికి నేతెంచిన వారి
వైవిధ్య సద్దామ వస్త్రాభరణుల 94
ఎవరు మీరలు కార్యమెయ్యది సదమ
ల వదనులార నెలవది యేది యని 95
వారలఁ బ్రీతి నవ్వనిత యడిగిన
గారవ మొప్ప నా కన్యక లనిరి 96
ఆకాశ రాజగృహ నివాసులము స
దాకార సుమతి పద్మావతీ దేవి 97
రాజ నందన సఖురాండ్రము మేము
రాజోపవనమున రాజీవ నయన 98
కుసుమాపచయము సంకోచము లేక
మసలి సలుపుచు విమలమతి నుండె 99
అపచయ మింపుగ నాచరించు సఖి
ని పదిలముగఁ జూచు నేర్పున నుండ 100
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి