9, ఆగస్టు 2016, మంగళవారం

పద్మావతీ శ్రీనివాసము - 24
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు

షష్ఠాశ్వాసము (1-20)

శ్రీమత్స్య కూర్మ సువరా
హామల రూపా ఘన నరహరి వేష ధరా
వామన భార్గవ రామా
రామ సుగుణ కృష్ణ బుద్ధ లాలిత కల్కీ                                1
                                               
వెదకెడు లత కాలు వెనగిన రీతి
సుద తీప్సి తమ్మిక సుకరంబు నయ్యె                               2

కమలాలయను జేరి కాంతునిఁ బిలిచి
సుమతులు మంత్రులు సూచుచు నుండ                          3

తరలాక్షి ధరణి సంతసమున వకుళ
మురిపెంపు పల్కుల ముచ్చటించంగ                               4

ధరణి పల్కులు మహదానంద మీయ
ధరణి విభుం డమాత్య పురోహితులను                            5

సాదరముగఁ జూచి సద్గుణ రాశి
మాదు తనయను బద్మావతీ దేవి                                   6

కమలాలయ సదృశ కమలను గోరె
నమర సన్నుతు డసహాయ శూరుండు                           7

వేంకట గిరి వాస వేద వేద్యుండు
సంకట హరణుండు చక్రాయుధుండు                               8

శ్రీనివాసుం డని చెప్పి క్షితిపతి
మానుగ నడిగె సమ్మతి వారి నెల్ల                                  9

ధన్యుల మైతిమి ధరణీశ మనము
కన్యను నిచ్చినఁ గళ్యాణ మగును                                 10

శుభకర మైనట్టి సుముహూర్తము జగ
దభిరామమౌ వివాహమ్మున కెంచ                               11

రావింపు రాజ సుర గురువు నిపుడు
దేవి పద్మావతి దేవేశు కీయ                                       12

సుఖియించును గమలాక్షుని కర మంది
యఖిలాండ నాధుని యా రమ తోడ                            13

వారి మాటలు విని పార్థివు డంత
కూరిమిని దివిజ గురువును బిలిచి                             14

మృగశిర మాకన్య మేలైన తార
తగ శ్రవణము వరు తార గురువర                               15

యోగ్యంపు లగ్నము నొడగూర్చు దేవ
భాగ్య కరంబయి పరగంగ నిపుడు                               16

ఉత్తర ఫల్గుణ ముత్తమ మయ్య
యిత్తరి పెండ్లికి నింపుగఁ జూడ                                    17

వైశాఖ మాసము పరిణయమునకు
కౌశలమునఁ బల్కె క్ష్మాపతి కిట్లు                                18

గురువు బృహస్పతి కూరిమి పల్కు
లరసి పూజించి సురాచార్యు బంపి                              19

వకుళ మాలికఁ జూచి వసుధాధి నేత
ప్రకటించి లగ్నము వైశాఖ మందు                             20             

2 వ్యాఖ్యలు:

  1. ఆర్యా కృతజ్ఞతలు ద్విపద కావ్యం గాధకు సరి తూగుతున్నది రంగనాథ రమాయణం వలె ప్రసిద్ధం ఔతుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. గురువర్యులు శ్రీ కామేశ్వరరావు గారు మీ ద్విపద కావ్యం పద్మావతీ శ్రీనివాసం చాలా బాగుంది మీ ప్రయత్నం అభినందనీయం పద్మావతీ శ్రీనివాసుల కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ప్రసరించును అభినందనలు

    ప్రత్యుత్తరంతొలగించు