పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
సప్తమాశ్వాసము
(1-20)
శ్రీ సప్తగిరి నివాస వి
లాస విభవ భక్త జన వరప్రద వినుతా
భాసిత పుండ్రాభయకర
వాసవముఖ సురవరగణ వందిత దేవా 1
కీరమ్ము సనుదేర కేశవు డంత
శ్రీరమను బిలిచి స్నేహమ్ము తోడ 2
ఏమేమి వలయునొ యెరిగింపు చెలియ
ప్రేమగ నీవింక పెండ్లికై నిపుడు 3
పనుపుము సకియలఁ బన్నుగనీవు
నొనగూర్చఁ బనులెల్ల నుత్సాహముగను 4
అనవుడు శ్రీదేవి యానంద మొప్ప
ననిపెను బనులకు ననుగుంజెలులను 5
శ్రీసతి పనుపునఁ బ్రీతియను సఖి
వాసన లీనెడు వర తైల మిచ్చె 6
పట్టు వస్త్రము లిచ్చె వనజనేత్ర శృతి
దట్టంపు నగలిచ్చె తమ్మికంటి స్మృతి 7
అద్దమ్ము సమకూర్చె నందాల ధృతియె
ముద్దుగఁ గస్తూరి ముద్దియ కాంతి 8
జవ్వాది నొసగెను జవరాలు హ్రీయె
యవ్వనవతి కీర్తి యమర మకుటము 9
ఛత్రము నిచ్చెను శక్రుని భార్య
గోత్ర నందన యిచ్చె గురు చామరమ్ము 10
అబ్జ జాంగన యిచ్చె నన్య చామరము
నబ్జ వదనులు జయ విజయ లంత 11
వ్యంజనములను నీయంగ శ్రీలక్ష్మి
కంజదళాక్షి వేగఁ బతినిఁ జేరి 12
తైలమ్ము శ్రీహరి తలను బంకించి
మేలైన నలుఁగులు మేనున రుద్ది 13
కలశ శతమ్ములు గంగా జలముల
కలబోసి పరిమళ కర్పూరములను 14
ఒక్కొక్కటిగ తీసి యొయ్యార ముగను
జక్కగ శ్రీరమ స్నాతునిఁ జేసి 15
పొలుపుగ సాంబ్రాణి పొగవేసి తలకు
చెలువంపు కురులకు చిక్కులు దీసి 16
కౌశేయ వస్త్రమ్ము కట్టించి యింతి
లేశము మైపూత లీలగ నలది 17
కనకాభరణములు కమనీయముగను
తనువెల్ల తొడగెను దరలాక్షి పతికి 18
అద్దము జూపించె నందాల భామ
ముద్దుగ దిద్దెను బుండ్రము శౌరి 19
కళ్యాణ తిలకమ్ము కాంతుని నుదుట
కళ్యాణవతి లక్ష్మి కనువిందు జేసె 20
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి