పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
సప్తమాశ్వాసము
(41-60)
లాజహోమాదులు రమ్యమై యొప్ప
భాజనీయమ్ముగ వ్రతములఁ దనిపి 41
నళినజు డింపుగ నవ దంపతులను
సలలిత వృత్తిని శయనింప జేసె 42
దివ్యమై పరగెను దిన చతుష్కములు
భవ్యంపు పెండ్లి సంబరములు జరుగ 43
రాజానుమతిని సర్పారి వీపు పయి
భూజరమాయుత పురుషోత్తము నిడి 44
ఋషులును సురలు కీర్తింప హర్షించి
వృషభాద్రి యందరు వెడలెడు తరిని 45
సంతోషము గలుగ సంతాప మడర
నింతి పలికె సుత నీక్షించి ధరణి 46
పోయిరా సుఖముగఁ బోయిరా తల్లి
వేయేండ్లు వర్ధిల్లు విభుఁ గూడి తల్లి 47
పతియింట నెప్పుడు పలుకు రానీకు
పతిమాట కెప్పుడు బదులాడ బోకు 48
శయనింపఁ దగదమ్మ సంధ్య వేళలను
దయజూడఁ దగునమ్మ దైన్యుల నెపుడు 49
పరుషంపు మాటలు పలుకంగ రాదు
గరువమ్ము నెప్పుడు కలుగంగ రాదు 50
నడయాడు సల్లగ నట్టింట నెపుడు
వెడసేయ కెప్పుడు పెనిమిటి నీవు 51
నాబల్కి ధరణి తనయను వీడ్కొలిపె
దోబూచు లాడంగ దుఃఖము సతికి 52
ఆనంద ముప్పొంగ నాకాశ రాజు
కానుక లిచ్చె నింక వధూవరులకు 53
భూరి భాండ సహితంబుగ తండులములు
భూరి సంఖ్యల భీమ ముద్గ భాండములు 54
దధి ఘృత క్షీర శత సహస్ర పాత్ర
లధికాయతమ్ములు నమల తరములు 55
నారికేళ కదళీ నవ చూతములును
దారపు పణస చిత్రామలకములు 56
కౌశేయ వాస నికాయములును ప్ర
కాశమాన సువర్ణ ఘన భూషణములు 57
దాస దాసీ జన దళములును సిత
గోసహస్రములును గోవృషభములు 58
ధవళాశ్వములును వేదండ శతములు
నవరస కోవిద నర్తకీ మణులు 59
బహుమానముల నిచ్చి పార్థివోత్తముడు
సహన శీలి నిలిచె శౌరి సముఖము 60
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి