17, ఆగస్టు 2016, బుధవారం

శివ కళ్యాణము - 1* శివ కళ్యాణము *
రచన : గురుమూర్తి ఆచారి
ప్రథమ భాగము
(పార్వతి పరమేశ్వరుని గూర్చి తప మాచరి౦చుట. పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఆమెను పత్నిగా స్వీకరి౦చుటకు సమ్మతి౦చుట. పరమేశ్వరుని పిలుపు మేరకు సప్త ఋషులు అరు౦ధతీ సమేతులై కైలాసము చేరుట. ఈశ్వరుడు వారిని పె౦డ్లి పెద్దలుగా హిమవ౦తుని చె౦త క౦పుట. సప్తర్షులు, హిమవ౦తుని చె౦త కరిగి "సర్వలోకైక పూజ్యుడైన మహేశ్వరునికి నీ కూతురగు పార్వతి నిచ్చి వివాహము చేయు" మని అడుగుట)

శ్రీ కైవల్య వరప్రదాయక! శివా! లీలోద్ధితాకార! ఈ
శా! కారుణ్యపయోనిధీ! భయహరా! చ౦ద్రార్ధమౌళీ! హరా !
సాకల్యామర మౌనివ౦ద్యసుగుణా! సద్భక్త చి౦తామణీ!
శ్రీ కైలాసనివాస! సర్వభువన క్షేమ౦కరా! శ౦కరా! (1)

పర్వత రాజ పుత్రిక తప౦బొనరి౦చె నకు౦ఠ దీక్షతో
శర్వుని గూర్చి; దర్శన మొస౦గిన చ౦ద్రకళావత౦సు   డా
పార్వతి వా౦ఛిత౦ బెరిగి, పత్నిగ గైకొన సమ్మతి౦పగా
సర్వ సుపర్వ మౌని తతి స౦తస మొ౦దెను విశ్వమ౦దునన్ . (2)

హర్షాల౦కృత మానసాలయమున౦ దాశూలి కోరన్, సము
త్కర్ష౦ బార సమస్త దివ్యగణముల్ కైలాసము౦ జేరె; స
ప్తర్షుల్ జేరి రరు౦ధతీ సహితులై తారాద్రికిన్; జాహ్నవీ
శీర్షున్  స్తోత్రము జేసి  యెల్లరును స౦సేవి౦చి  రాసక్తితో. (3)
{  తారాద్రి = కైలాస శిఖరము }

అనిమిషులున్ మహర్షులు మహాశివు గా౦చి వచి౦చి రిట్లు "పా
వనగుణధామ! మా విమల భక్తియు మా తపముల్ ఫలి౦ప ద
ర్శనము నొస౦గి తీవు; శివశ౦కర! మమ్ము దల౦చి తేల? యే
పని నొనరి౦పగా పిలువ  బ౦పితి?  వాజ్ఞ నొస౦గు మో  ప్రభూ" (4)

ముసిముసి నవ్వు లొల్క ఫణిభూషణు డివ్విధి పల్కె, "వేల్పులా
ర! సత మొనర్చెదన్ భువన రక్షణ; లోక శుభ౦కరార్థ మే
ను సతిగ స్వీకరి౦చెద,  విను౦డు, ధరాధర పుత్రిఁ బార్వతిన్;
పొసగు వివాహ మారసి  ప్రమోదము జె౦ది చను౦డు మీరలున్! (5)

విను డా శీతమహీధరు౦ డఖిల పృథ్వీభార సద్ధూర్వహు౦,
డనఘాత్ము౦డు, ఘను౦డు, మత్  శ్వశురుడౌ  నర్హు౦డు; కన్యార్థమై
చనుడో స౦యములార! దోహద మొనర్చ౦ గల్గు  కళ్యాణ శో
భన కార్యమ్ములలో నరు౦ధతియు వే బాటి౦పు డీ యానతిన్. (6)

మునివరేణ్యులార! కడు సమ్మోద మెసగ
మా కొరకు మీరు నేడు హిమగిరికి  చను;
డిదియె శుభముహూర్థ౦ బాలసి౦చ వలదు;
జరుగు యుష్మద్ఘటిత కార్య స౦వరములు. (7)

ఆకాశ౦బున ను౦డి డిగ్గి ఋషివర్య శ్రేణి చేర౦గ భూ
లోక౦బున్, గిరిరాజు వారి నిక నాలోకి౦చి, సౌధానకున్
గైకొ౦చు న్నుచితాసనమ్ము లిడి, కై౦కర్యమ్ములన్ సల్పి, మీ
రే  కార్యార్థము వచ్చినారలని ప్రశ్ని౦చెన్ వినమ్రాత్ముడై. (8)ఎవ్వాని యాకార మీశ్వర౦బై, నామ
మో౦కార నాదమై యుజ్జ్వలి౦చు
ఎవ్వాని పదముల నెల్ల వేల్పులును సే
వి౦చి పూజి౦చి తరి౦చ గలరు
ఎవ్వాని దర్శి౦ప నెల్ల యోగీశ్వరుల్
జపతప యజ్ఞముల్ సలుపుచు౦ద్రు
ఎవ్వాని కరుణచే నెల్ల విశ్వమ్ములు
వర్ధిల్లు చు౦డును ప్రత్యహ౦బు
అట్టి శ౦భు౦డె యిచ్చటి క౦పె మమ్ము;
నీకు జామాత యగుట క౦గీకరి౦చె
కు౦భినీధర రాజ!  నీ  కూతు నిమ్మ
భాగ్యవ౦తుడ వీవయ్య వసుధ లోన
మేము పె౦డ్లిపెద్దలమయి మీ కడ కిటు
వచ్చితి" మని మునీ౦ద్రులు పలికి రపుడు. (9)

15 వ్యాఖ్యలు:

 1. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  గు రు వ ర్యు లై న

  శ్రీ క ౦ ది శ ౦ క రా ర్యు న కు

  పా ద న మ స్కా ర ము లు అ ర్పి ౦ చు

  చు న్న వి ధే యు డు గు రు మూ ర్తి ఆ చా రి
  …………………………………………………………

  నే ను వ్రా సి న * శి వ క ళ్యా ణ ము *

  ప్ర థ మ భా గ ము వే సి న ౦ దు కు


  " ధ న్య వా ద ము లు "

  :::::::::::::::::::::::::::::::

  ప్రత్యుత్తరంతొలగించు
 2. గు రు మూ ర్తి ఆ చా రి గారు శివస్తోత్ర శ్రీకారము తో సాగిన మీ శివ కళ్యాణ కావ్యరచన మనోహరము గానున్నది. అభినందనలు. ముహూర్తము ముద్రణ దోషము గమనించండి. "ప్రత్యహ౦బు / నట్టి శ౦భు౦డె' అంటే బాగుంటుందను కుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. " శి వ క ళ్యా ణ ము "

  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  శ్రీ యుత పోచిరాజు కామేశ్వర రావు గారికి
  వినయపూర్వక నమస్కారములు

  నా పద్యాలను సమీక్షి౦చిన మీకు ధన్యవాదములు .


  " ముహూర్థము" అని పొరపాటున టైపు చేశాను .

  సీస పద్యాన౦తరము ,
  (వాక్యావసానమయినది కదా) య ని తే " గీ " పద్యమును అచ్చు తో ప్రార౦భి౦చాను .

  సీ. ...................................................
  ......................... ప్రత్యహ౦బు •

  తే . గీ . అట్టి శ౦భు౦డు ...................

  అని అన్నాను .

  నా శి వ క ళ్యా ణ ము రె ౦ డ వ భా గ ము కూడ మీరు చదువ వలసి౦దని మనవి చేసు
  కు౦టున్నాను .

  న మ స్తే

  ప్రత్యుత్తరంతొలగించు
 4. గు రు మూ ర్తి ఆ చా రి గారు తప్పక చదువుతాను. పద్య పఠనమున నాకాసక్తి మెండు. ధన్యవాదములు.
  మీరన్నది నిజమే కాని సీసము తర్వాతి తేటగీతిగాని, యాటవెలదిగాని సీసములో భాగమే. అందుకే రెంటినీ కలిపి యొక పద్యము గానే గణియింతురు. అంతే కాదు సీసము లోని చివరి పాదము చివరి మాటను తేటగీతి లో పూర్తి చేస్తారు కూడా. ఉదాహరణకీ క్రింది పోతన గారి పద్యమును చూడండి.
  ...
  వినుత విద్యా తపో విత్త వయో రూప కులములు సుజనులకును గుణంబు

  లివియ కుజనుల యెడ దోష హేతుకంబు
  ...

  సాహిత్యాభిలాషతోనే యీ చర్చ యని తలుప ప్రార్థన. అన్యథా భావించవలదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పోచిరాజు వారు,
   మీ రన్నది నిజమే కావచ్చు. పరిశీలన చేయాలి. మంచి ప్రశ్న లేవనెత్తారు. కాని మీరు చూపిన ఉదాహరణలో సీసంలో చివరి మాట గుణంబులు ఎత్తుగీతి ఇవియ అన్న మాటతో‌ ప్రారంభం. అచ్చుకు ఈ‌ గుణంబులు లోని చివరి లు కాస్తా ఎత్తుగీతిలోనికి చొచ్చుకొని వచ్చినప్పటికీ, ఎత్తుగీతిలో భాగంగా దాని పరిగణించము. ఎందుకంటే అక్కడ యతిస్థానంలోని అక్షరంగా ఇవియ లోని ఇ లెక్కకు వస్తుంది. యతిమైత్రిస్థానంలో ఉన్న హేతు అన్న పదంలోని ఏ కారంతో దానికి యతి చెల్లింది. హ-కారానికి అకారపుస్థాయి ఇక్కడ కాబట్టి ఇబ్బంది లేదు యతిమైత్రికి మొదటను ఉన్న ఇ తో. మాటవరసకు అక్కడ రీ అని ఉంటే దానిలోని ఈ కారం తో యతి చేయలేము - హల్లు ర-కారం అడ్డం వస్తుంది. సరే, శాఖాచంక్రమణం వదిలితే పిండితార్థం, ఇక్కడ ఎత్తుగీతిలో మొదటి అక్షరం ఇ అనే లెక్క. లి కాదు.

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  3. శ్యామల రావు గారు మీరు చెప్పినది నిజమే. ఎత్తుగీతి ఇవియ అని "ఇ" తోనే ప్రారంభమయినది. కాని "గుణంబులు" మాటలో లు ను అక్కడి నుండి తేటగీతికి తీసుకు వచ్చి సంధి చేశారు కదా. ఆవిధముగా మాటను విరిచి నట్లే కదా. "గుణంబులు" పూర్తి పదము సీసములో ఉన్న గణభంగము కదా.
   నా ఉద్దేశము రెండు ఒక్క పద్యము గానే భావించి తేటగీతి మొదటి పదము విసంధి గా వ్రాయరాదని. .

   తొలగించు
  4. శ్యామల రావు గారు మరియొక యుదాహరణ దొరికింది పరిశీలించండి.
   ......
   సభ్య నియుక్తులై చతురత నుత్తమ శ్లోకుని గుణము లస్తోక భూ ప్ర

   సిద్ధములు గాన సన్నుతి సేయుఁ డజుని
   ...

   ఉపసర్గ తో గూడి ప్రసిద్ధము స్వతంత్ర పదమేకద. యర్థభేదమున "ప్రసిద్ధము" "సిద్ధము" పదమునక న్యమే కదా.

   తొలగించు
  5. మంచి ఉదాహరణ ఇచ్చారు. అభినందనలు. మీ పక్షం స్థాపితమైనది.
   ఒక్క విషయం తరచుగా ప్రస్తావిస్తూ ఉంటాను. విసుక్కోకుండా మరొకసారి దయచేసి వినండి. వృత్తాల్లో మాత్రమే పాదోల్లంఘనం గుణం. దేశీఛందస్సుల్లో పాదాంతవిరామం బాగుంటుంది. అలా అభ్యాసం చేయండి. పూర్వకవులు కూడా దేశీఛందస్సుల్లో పాదాంతవిరామం సరిగా పాటించనే లేదన్నది వాస్తవమే. పైపద్యం కూడా ఒక ఉదాహరణయే అ మాటకు. అలాగే వృత్తాల్లో ఏగణానికి ఆగణం విడివిడిపదాలుగా ప్రచురంగా రావటం ఒకదోషం. ఐతే దేశిఛందస్సులో అలా రావటం‌ మాత్రం సుగుణం! తెలుగులో వృత్తాల్లో యతిమైత్రితో పాటు పదవిరామం అక్కర్లేదు. కాని దేశిఛందస్సుల్లో యతిమైత్రిస్థానంలో క్రొత్తపదం‌మొదలు కావటమే సొగసు. ఇలా కొన్ని బేధాలు చక్కగా తెలిసి అభ్యసించి వ్రాసినప్పుడు ఛందస్సులూ పద్యాలూ కూడా బాగా కళకడతాయి. ఐతే పూర్వకవుల్లో అనేకులు కథాకథనంలో వ్రాసే అనేక మ్రొక్కుబడిపద్యాల్లో ఇటువంటివి పెద్దగా పట్టించుకోలేదు.చేయితిరిగిన కవి అప్పుడప్పుడు నియమోల్లంఘనం స్వేఛ్చగా చేసినా ధారను కొనసాగించగల ప్రతిభ కలిగి ఉంటాడు. మనం ఆ స్థాయికి వచ్చినప్పుడు సరే, అంతవరకూ, మనం సాధనలో మాత్రం కలగాపులగం చేయకుండా ఈ‌నియమాలతో అభ్యాసం చేస్తే మంచి ధార సిధ్ధిస్తుంది. అంతవరకూ అ పైన మిత్రుల అభిరుచి ఎలాగైతే అలానే కానివ్వండి. ఇబ్బంది లేదు.

   తొలగించు
  6. శ్యామల రావు గారు మీతో నే నేకీభవిస్తున్నాను. పద్యాలలో సాధ్యమైనంతవరకు నిట్టి నియమాలు పాటించడమే మేలు. ధన్యవాదములు.

   తొలగించు
 5. గురుమూర్తి ఆచారి గారూ మీ పద్యములు చాలా బాగున్నాయి..... అభినందనలు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. గురుమూర్తి ఆచారి గారూ మీ పద్యములు చాలా బాగున్నాయి..... అభినందనలు

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి

  గురుమూ ర్తి ఆచారి నమస్కరి౦చి =

  స౦దేహ నివృత్తి చేసిన మీకు
  ధన్యవాదములు

  ి

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శ్రీ S . శర్మ గారికి నమస్కరి౦చి

  గు రు మూ ర్తి ఆ చా రి :---

  ధ న్య వా ద ము లు శ ర్మ గా రూ

  న మ స్తే

  ప్రత్యుత్తరంతొలగించు
 9. అహా ! ఇప్పటిదాకా శ్రీనివాసుడి పెండ్లి ఇప్పుడు మన శివయ్య పెండ్లి ..... బ్లాగుకి కొత్త శోభ , మాలాంటి పాఠకులకు అధ్యాత్మిక , సాహిత్య , మనో వికాసములు ... ధన్యావాదములు

  ప్రత్యుత్తరంతొలగించు