పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
పంచమాశ్వాసము
(101-130)
అంత బల్కెను బ్రీతి నాకాశ వాణి
వింతైన సుద్దుల వేదన తీర 101
దర్శన మీరాదు ధరణీశ పుత్ర
కర్శితు డవనేల గలత జెంది యిట 102
అట జని నారాయణాద్రి సద్భక్తి
పటుతర తపము సల్పగఁ గోర్కి తీరు 103
దివ్యవాణి వలుక దేశమ్ము వదలి
భవ్యముగ నిచట బరమాత్ము నిలిపి 104
దేవు నగోచరు తేజు నర్చింతుఁ
బావ నాగస్త్యు దీవనల నిత్యమ్ము 105
అనవుడు మాస్వామి హాస్య ముప్పొంగ
ననె చను నారాయణాద్రి నృప వర 106
పయనించి గిరి నెక్కి పశ్చిమ దిశకు
ప్రియమైన న్యగ్రోధ వృక్ష మూలమున 107
బాలునిఁ జూచి విష్వక్సేను నచట
కేలు మోడ్చినతనిఁ గీర్తించి యంత 108
స్వామి పుష్కరి ణట స్నానమ్ము సేసి
భూమీశ పుత్ర నింపుగ నపర దిశ 109
చని కను మశ్వత్థ సాల రాజమ్మ
వని పతి నందన వల్మీక మచట 110
రమణీయ ధవళ వరాహ మచ్చోట
కమనీయ మగు ననఘ మతుల కెల్ల 111
తప మాచరించు సద్భక్తి నచ్చోట
కృపఁ జూచు నిన్నట నృపరాజ పుత్ర 112
ఆదేశ మిచ్చుచు హయ రాజ మెక్కి
మోదమ్ము తోడ నమ్ముగ్ధ మోహనుడు 113
వన వనాంతరములు వన మృగయార్తి
వనజాక్షు డరిగి స్రవంత్యరణిఁ గని 114
ముదముగ వారువముం దిగి నవ కు
ముద కువలయ వృతమ్ము వనజాకరము 115
శీతల వాయు నిషేవితుం డగుచు
వీత దంతావళ వీక్షణార్తుండు 116
విహరించు చుండగ విరుల దునుము ద
రహసిత వదనులు లలనలఁ గాంచె 117
తనర వారి నడుమ తరలాక్షి మేఘ
జనితస్వన విలసచ్ఛంపాలత నిభ 118
శ్రీసతీ సమ సురుచిర రూప కనక
భాసిత దేహ సువర్ణ నీక్షించి 119
మోహించి వారిని ముదమార యడిగె
నా హరి యెవ్వరీ యలివేణి యంచు 120
ఈ కన్యలు పలికి రిట్లు యిభ్భామ
యాకాశరాజు మహాబలు పుత్రి 121
ఆ మాటలను విని యశ్వంబు నెక్కి
దామోదరుం డంతఁ దనకొండ జేరె 122
పదపడి చనుదెంచి స్వామిపుష్కరణి
మృదువుగ ననుబిల్చి మేదినీశుండు 123
అతివ నీవేగి వియద్రాజ పురము
సతి ధరణిఁ గని కుశలము నడిగియు 124
రాజ ప్రియతనయ రాజీవ నయన
భాజనీయ వదన వధువుగ నడుగు 125
రాజాభిమతమును రమణి నీవడిగి
సౌజన్య మొప్పంగఁ జనుదెంచు మనియె 126
మావిభు నాజ్ఞను మన్నించి నేను
దేవి నీచెంతను దెలియ జేసితిది 127
రాజును మంత్రుల రాకుమారి విని
రాజపత్ని తగు కార్యమ్ము దెలుపుమ 128
వకుళ మాటలు విని వసుధేంద్ర పత్ని
వికసిత వదన సంప్ర్రీత చిత్తాయె 129
భక్తజనసురభి పాపవినాశ
ముక్తిప్రదాయక పుండరీకాక్ష
130
ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన
పద్మావతీ శ్రీనివాసమున పంచమాశ్వాసము.
గౌ.శ్రీ కమేశ్వర రావు గారికి అభినందనలు
రిప్లయితొలగించండిమీ చేనాశ్వాసములు మరికొన్ని అందజేయగలరు.శైలి హర్షదాయకంగా ఉన్నది.ఈ ఛందము ఆదరణీయము.