3, జనవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 189 (చెల్లి యని పతి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చెల్లి యని మగఁడు పిలువఁగా చెలియ మురిసె.
మంద పీతాంబర్ గారి పూరణ చూసినప్పుడు తెలిసింది. "చెల్లి యని మగఁడు పిలువఁగా చెలియ మురిసె" అన్నప్పుదు గణదోషం దొర్లింది. దానిని ఇలా సవరించాను.
చెల్లి యని పతి పిలువఁగా చెలియ మురిసె.

17 కామెంట్‌లు:

  1. ఇందు వదనయు నొక్కతి విందు నందు
    చెంత చేరుచు నొలికింప వింత వగలు
    చెల్లి యని మగడు పిలువ చెలియ మురిసె
    పరవసమ్మున స్వాధీనపతిక యగుచు !

    రిప్లయితొలగించండి
  2. కలికి కన్నులు ఐశ్వర్య కనుల మించ,
    చెలిమి జేసెను ,జేపట్టె ,వలపు పెరిగి,
    తల్లి దండ్రికి జూపెట్ట తనను, రంభ
    చెల్లి యని,మగడు పిలువ(గా) చెలియ మురిసె!!!

    రిప్లయితొలగించండి
  3. అక్క చెల్లెండ్రు పాడిరి నొక్క పాట
    చెల్లి మగని వారడిగిరి చివర గాను
    గొప్పగాపాడె నెవ్వరో చెప్ప మనుచు
    'చెల్లి' యని మగఁడు పిలువఁ చెలియ మురిసె.

    రిప్లయితొలగించండి
  4. అమ్మ! నీకోడ లీబొమ్మ నరయ రమ్మ!
    ఆడుబిడ్డవు! దొరికె నీతోడు రమ్ము
    చెల్లి! యని మగఁడు పిలువఁగా చెలియ మురిసె
    తనదు భాగ్య విధాతలౌ తరుణుల గని.

    రిప్లయితొలగించండి
  5. అంతే కదండీ మరి మైత్రేయి గారూ!
    పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడబిడ్డను అక్కున చేర్చుకోవాలన్నా
    ఆరళ్ళు బెట్టాలన్నా అత్తాడ పడుచులకే కదా అధికారం?

    రిప్లయితొలగించండి
  6. కల్ల గాదిది జాబిల్లి, కల్పవల్లి,
    పాలవెల్లి మా నట్టింట, బావ నీదు
    చెల్లి యని మగఁడు పిలువఁగా చెలియ మురిసె
    భర్త ప్రేమకు నానంద భరిత యగుచు.

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అమృత భాండముల వలె
    అలరారు చున్నవి.
    _________________________________________
    01)
    అవతారిక :
    విజితులై , దుష్ట ద్యూతము !- వెరగు జెంది !
    విడిది , విడిముడి , విడిపడి - విడిని వీడి
    పాండవులు కాననము పాల - బడిన వేళ !
    ద్వారకను జేరెను సుభద్ర - తనయు తోడ !

    వ : ఆమెను గాంచిన యంత శ్రీకృష్ణుడు :

    వెలుగు జీకట్లు ! వెను వెంట - మగుడు చుండు !
    పుడమి , సత్యంబు , ధర్మంబు - పూను వారి
    నెపుడు విజయమ్ము వరియించు ! - నిశ్చయముగ
    నిజము , నిజమిది ! నా మాట - నిజము ! నమ్ము !

    పూరణ :

    మరల , మహరాణి వలె , నీవు - మసల గలవు !
    వెతలు దీరును ! నీపతి - విజయు డౌను !
    ఓర్మి వహియించు , మందాక - ఊరడిల్లు
    చెల్లి ! యని మగడు పిలువ ! చెలియ మురిసె!
    ________________________________________
    మగడు = రాజు(యాదవ రాజు - శ్రీకృష్ణుడు)
    చెలియ = వనిత (సుభద్ర)
    ________________________________________

    రిప్లయితొలగించండి
  8. శ్రీ వసంత కిషోర్ గారు ,మీ పద్యాలు చదువుతూ ఉంటే భారతం లోని పద్యాలు చదినట్టే ఉన్నాయి .బాగున్నాయి

    రిప్లయితొలగించండి
  9. పీతాంబర ధరా!
    వందనములు.
    ధన్యవాదములు.
    అంతా మీ వాత్సల్యం , ప్రోత్సాహం
    గురువు గారి ఆశీర్వాదం.

    రిప్లయితొలగించండి
  10. పేరు పెన్నిధి రమయౌట పెద్ద దాని
    చెల్లి యని మగడు పిలువ చెలియ మురిసె
    హాయి గొల్పెడి నవ్వుల నక్కు జేర
    శ్రీనివాసుడు కులికెను, సిరిని గూడి

    రిప్లయితొలగించండి
  11. శ్రీ పీతాంబర్ గారూ కిశోర్ గారికి శైశవ దశ తీరిందని నిన్న డాక్టరు గారు ధృవీకరించారు. ఇక అర టిక్కట్టుతో ఆయన రైలెక్కీడము కుదరదు. పద్యాలు దంచుతున్నారేం !

    రిప్లయితొలగించండి
  12. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పరకాంతను మగడు "చెల్లీ!" అని పిలిస్తే భార్య సంతోషిస్తుందని చక్కగా చెప్పారు. బాగుంది. అభినందనలు.
    మీ పూరణలోను సమస్యలోని గణదోషాన్ని సవరించారు. నేను ముందు గమనించలేదు. ధన్యవాదాలు.
    ఇక మీ రెండవ పూరణ అదిరింది.

    మంద పీతాంబర్ గారూ,
    గణదోష సవరణను సూచించినందుకు ధన్యవాదాలు.
    మీ పూరణా చాలా బాగుంది. అభినందనలు.

    హరి గారూ,
    మీ పూరణ చమత్కార భరితమై సంతోష పెట్టింది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    మైత్రేయి గారూ,
    మిస్సన్న గారి పూరణలోని చమత్కారాన్ని పట్టుకున్నారు. కొత్త కోడలి భాగ్య విధాతలు అత్తా, ఆడపడుచులే కదా! ధన్యవాదాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    అందరూ చెప్తున్నట్లుగా మీ శైశవ దశ గడచిపోయింది. డా. విష్ణు నందన్ గారి "సర్టిఫికెట్" దొరికింది కదా! ఇక మీకు తిరుగు లేదు.
    "దుష్ట్ ద్యూతము" అన్నప్పుడూ "ష్ట" గురువు అవుతుంది. "ద్యూతమందున" అంటే సరిఫోతుంది.

    రిప్లయితొలగించండి
  13. మొదటి పద్యం మీరు వివరణ ఇచ్చాకే అర్ధం అయింది. ఛాలా బాగా పూరించారు. thank you.

    రిప్లయితొలగించండి
  14. విద్యాసాగర్ అందవోలుఆదివారం, జనవరి 30, 2011 10:02:00 PM

    శంకరయ్య గారూ ,
    ఇది ఎప్పుడో ఇచ్చిన సమస్య అయినా, నా పూరణ ఇప్పుడు పంపుతున్నాను, (Better late than never!)
    ఒక రకంగా 'అయిపోయిన పెళ్ళికి బాజాలు' అనమాట.
    అన్న ఏమను తన కన్న చిన్న దైన?
    సిగ్గు లెప్పుడు నాతికి మొగ్గ లేయు?
    చెలియ నవ్విన నేమని చెలుడు తలచు?
    చెల్లి యని, మగడు పిలువ, 'చెలియ మురిసె'

    రిప్లయితొలగించండి
  15. విద్యాసాగర్ అందవోలుమంగళవారం, ఫిబ్రవరి 01, 2011 9:02:00 AM

    కిశోర్జీ,
    ఇన్ని రోజులైపోయిన తరువాత ఎవరూ చూడరేమో అనుకుంటూ నా పూరణని పంపించాను.
    మీరు చూసినందుకు, మీకు నచ్చినందుకు సంతోషం.
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి